Thirunelveli Temples

                            తిరునల్వేలి దివ్య దేశాలు   


కాంచీపురం తరువాత ఎక్కువ సంఖ్యలో శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులు ఉన్న మరో జిల్లా తిరునల్వేలి. జిల్లాలో మొత్తంగా పదకొండు దివ్య దేశాలు ఉన్నాయి. తమిళనాడు  దక్షిణ భాగాన మదురై, కన్యాకుమారి, రామేశ్వరం మరియు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మధ్యలో ఉంటుందీ జిల్లా. రాష్ట్రంలో ఆరో పెద్ద నగరంగాను, దక్షిణ భాగాన ముఖ్య వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి తిరునల్వేలి పట్టణం.
త్రవ్వకాలలో లభించిన వస్తువుల ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రిందట నుండి జనజీవనం,  నాగరికత వెల్లివిరుస్తోందని తెలిపారు.
తిరునల్వేలి జిల్లా పర్యాటకులకు కావలసిన అన్ని రకాల ఆకర్షణలను కలిగి ఉన్నది. పురాతన కట్టడాలు, విశేష ఆలయాలు, జలపాతాలు,  పర్వత ప్రాంత విడిది కేంద్రాలు, అభయారణ్యాలు ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇరవై ఒక్క చిన్నా పెద్ద  నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో తమిర పారాణి నది దాని ఉప నది అయిన చిత్రానది ముఖ్యమైనవి. తిరునల్వేలి నగరం మరియు ముఖ్య ఆలయాలు పర్యాటక కేంద్రాలు తమిరపారాణి నదీతీరం లోనే ఉంటాయి. 
నగరంలో శ్రీ వినాయక, శ్రీ వరదరాజ, శ్రీ అయిరతాంబాల్ ఆలయాలు సందర్శనీయాలు. అద్భుతమైన శిల్పాలు, సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలతో పాటు మరెన్నో విశేషాల నిలయం అయిన  శ్రీ కాంతి మతి దేవి సమేత శ్రీ నెల్లియప్పార్ ఆలయ సందర్శన మరిచిపోలేని అనుభం. శ్రీ  నెల్లియప్పార్ కొలువైనందునే ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది.
తమిళ నాడులో ఉన్న అయిదు నాట్య సభలలో రెండు ఈ జిల్లాలో నెలకొని ఉన్నాయి. శ్రీ నెల్లియప్పార్ ఆలయంలో ప్రత్యేక కలప తో రమణీయంగా మలచిన శిల్పాలతో దర్శనమిచ్చేది తామ్రసభ.
 నవ కైలాసాలుగా పిలవబడే తొమ్మిది విశేష శివాలయాలు మరియు శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు గా పేరొందిన తొమ్మిది దివ్య దేశాలు ఈ జిల్లాలో తమిరపారాణినదీ తీరంలో ఉండటం మరెక్కడా కనిపించని విశేషంగా పేర్కొనవచ్చును. 
ఇంకా జిల్లాలో తెన్ కాశి శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం,  శంకరన్ కోవిల్,  కృష్ణా పురం శ్రీ మేళ వేంకటా చలపతి ఆలయం,  ఆరుపాడై వీడుల్లో  సముద్ర తీరంలో నెలకొన్న ఒకేఒక్క క్షేత్రం తిరుచ్ఛెందూరు ముఖ్యమైనవి. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. 
జిల్లా మొత్తం పర్వతాలు పచ్చని అడవులతో నిండి ఉన్నందున ప్రకృతి విశ్వరూపాన్ని కనులారా వీక్షించవచ్చును. పాపనాశనం,  బాణ తీర్థం,  కుర్తాళం ఎన్నో జలపాతాలకు నిలయాలు. ముఖ్యంగా కుర్తాళం లోనే చిత్రానది ఎనిమిది జలపాతాల రూపంలో నేలకు జాలు వారుతుంది. శ్రీ  కుర్తాళ నాధర్ కొలువైన ఈ క్షేత్రం మరో నాట్య సభ. వందల సంవత్సరాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించిన శివ లీలా చిత్రాలు నేటికి చెక్కు చెదరకుండా ఉండటం ఈ చిత్రసభ ప్రత్యేకత . ఈ జలపాతాల నీటిలో వేలాది వనమూలికల సారం ఉన్నదని తెలియడంతో ఎందరో నరాల బలహీనత, చర్మ వ్యాధుల,  పక్షవాత రోగులు నియమంగా ఈ జలపాతాల నీటిలో స్నానం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో జులై నెలలో ఎనిమిది రోజుల పాటు "సరళ విళ" అన్న పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. లక్షలాది మంది ప్రజలు ఈ సందర్భంగా ఇక్కడికి వస్తుంటారు. కుర్తాళం లో తప్పక చూడాల్సినది " మౌన స్వామి" (కుర్తాళ పీఠం )ఆశ్రమం. 
పాపనాశనం కూడా ఎన్నో జలపాతాలకు నిలయం. బాణ తీర్దం, అగస్త్య జలపాతాలు మరియు శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఇక్కడి ఆకర్షణలు. 
కుర్తాళం సమీపంలో పంచ ధర్మశాస్త ఆలయాల్లో ని అచ్చం కోయిల్ మరియు ఆరియంగావు కలవు. శ్రీ   కుమార స్వామి కొలువైన మరో  విశిష్ట  తిరుమలై కుమారస్వామి ఆలయం కూడా ఇక్కడికి దగ్గర లోనే ఉన్నది. 
కొద్దిగా వెనక్కి వెళ్ళి నవ కైలాసాల గురించి మరియు నవ తిరుపతుల గురించి తెలుసుకొందాము. నవ తిరుపతులు అన్ని తూర్పు వైపున ఉంటాయి. నవకైలాసాలు కొన్ని పడమర వైపు మిగిలినవి తూర్పు వైపున ఉంటాయి. 
ఎంతో పౌరాణిక ప్రాశస్థ్యం గల ఈ ఆలయాల్లో నవ తిరుపతులు ఇవి. శ్రీ వైకుంఠం, తిరువరగుణ మంగై, తిరుప్పులింకుడి, తిరుకుళందాయ్,  తిలుతులై విల్లం మంగళం,  తెందురుపెరయ్,  తిరుక్కోలూర్,  తిరుకుగునూర్. 
వీటిలో తిరుకుగునూర్  (ఆళ్వారుతిరునగరి ) పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వారు జన్మస్థలం. ఈయన కృప వలననే నాదముని"నళయర దివ్య ప్రభంధం" లోకానికి అందించారు. తిరుక్కోలూరు నమ్మాళ్వారు శిష్యుడైన మరో ఆళ్వారు అయిన మధుర కవి జన్మస్ధలం.  
ఇక నవ కైలాసాలు ఏమిటి అంటే పాపనాశనం,  చేర న్ మహదేవ, కొడకనల్లూరు, కున్నత్తూరు,  మూరప్పన ఆడు,  శ్రీ వైకుంఠం,  తెందురుపెరయ్,  రాజపతి , ఛందమంగళం. ఈ తొమ్మిది స్ధలాలు నయన్మారులు గానం చేసిన పాటికాల కారణంగా "పడాల పేట్రస్ధలాలు" గా  గుర్తింపు పొందాయి. 
జిల్లాలో ఉన్న మరో రెండు దివ్య దేశాలు అయిన "తిరుక్కురన్ గుడి మరియు వనమామలై" కన్యాకుమారికి వెళ్లే దారిలో ఉన్నాయి. వీటితో కలిసి జిల్లాలో మొత్తంగా పది దివ్య తిరుపతులు కలవు.
తిరునల్వేలి జిల్లాలో గల ముందతురాయ్,  కాలకాడు ప్రముఖ అభయారణ్యాలు. న్యప్రాణి సంరక్షకకేంద్రాలు.  పెద్ద పులి, చిరుతపులి లాంటి క్రూరమృగాలతో పాటు అంతరించిపోతున్న అనేక జాతుల పక్షులు,  అడవి జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. కూన్థకుళం అనేక రకాల దేశవిదేశ పక్షుల నివాసం. మణిమత్తూరు జలపాతం వద్ద నిర్మించిన ఆనకట్ట సమీపంలోని "మన్ జోలామ్" పర్వత ప్రాంత విడిది కేంద్రాలు. 
వెరసి తిరునల్వేలి జిల్లా అందరి అభిరుచులకు తగిన ఆకర్షణలను కలిగి ఉన్నది.
తిరునల్వేలి వాసులు పర్యాటకులకు ఇచ్చే సలహ ఒకటున్నది. అదేమిటంటే కుర్తాళం జలపాతాలలో జలకాలడటం, ఇక్కడి మధురమైన హల్వా, అరటికాయ చిప్స్ ఆరగించడం చేయకపోతే తిరునల్వేలి పర్యటన అసంపూర్ణం అని. 
నగరంలో జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద అందుబాటు ధరల్లో అద్దెకు వసతి గృహలు లభిస్తాయి. రుచికరమైన భోజన ఫలహరాలు లభిస్తాయి. 
జై శ్రీ మన్నారాయణ! !!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore