24, మార్చి 2020, మంగళవారం

Veda Vyasa

                       మహాభారతం పుట్టింది ఇక్కడేనట !


"వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి " అన్నది తెలుగునాట బాగా ప్రాచుర్యంలో ఉన్న నానుడి. పంచమ వేదంగా పరిగణింపబడే మహాభారతంలో లేనిది లేదు అంటారు పండితులు. అన్ని యుగాలకు, కాలాలకు అందరికీ వర్తించే మహాకావ్యంగా పేర్కొంటారు.
తొలుత "జయ" అన్న పేరుతొ, ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలతో రచించబడిందిట. తదనంతర కాలంలో కొత్తగా చేరిన కొన్ని వృత్తాంతాలు, వాఖ్యలు జతపడి చివరకు పద్దెనిమిది పరువాలతో, లక్ష శ్లోకాలతో "మహా భారతం"గా మనకు అందుబాటు లోనికి వచ్చింది.
ఈ ఇతిహాసం లోని సంఘటనలు, పాత్రలు నేటికీ మనకు ఎక్కడొక్కడ, ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంటాయి. సత్కర్మ, దుష్కర్మల ఫలితాలను తప్పక అనుభవించాలని ఎన్నో ఘటనల, పాత్రల ద్వారా సవివరంగా తెలియజేస్తుంది.
















పరాశర మహర్షి కుమారుడైన "కృష్ణ ద్వైపాయనుడు". వేదాలను వర్గీకరించడం వలన "వేద వ్యాస"గా ప్రసిద్ధి చెందారు. అష్టాదశ పురాణాలను మనకు అందించినది వ్యాసుడే ! ఆయన స్వయంగా విరచించిన మహాభారతంలో ఆయనది  కీలక పాత్ర.  కురువంశ ఆవిర్భావానికి దారి తీసిన ఘట్టాల నుండి లక్షలాది మంది మరణానికి దారి తీసిన కురుక్షేత్రం వరకు జరిగిన విషయాలను అక్షరీకరించాలని తలంచారు వ్యాస భగవానుడు. తగిన లేఖరి కొరకు ముల్లోకాలను గాలించి చివరికి విఘ్ననాయకుడు వినాయకుని ఎన్నుకొన్నారట.
అంగీకరించిన గణేశుడు ఒక షరతు విధించారట. అదేమిటంటే ఆయన ఘటం ఆగకుండా కావ్యాన్ని విరచించాలని. సమ్మతించిన వ్యాసుడు గంగా ప్రవాహంలా ఒక పర్వం తరువాత మరో పర్వాన్ని అనర్గళంగా వివరించారట. అలా తెలిపినా "జయ" పూర్తి కావడానికి మూడు సంవత్సరాల కాలం పట్టిందిట. రచనా కాలం క్రీస్తు పూర్వం అయిదు నుండి మూడు శతాబ్దాల మధ్య కాలానికి చెందినది అని అంటారు ఆంగ్లేయ పరిశోధకులు. కానీ హిందువులు మాత్రం కావ్యరచనా కాలం అంతకన్నా ముందు నాటిదని విశ్వసిస్తారు. ఏది ఏమైనా హిందువులకు పరమ పవిత్ర పఠనీయ గ్రంధం మహా భారతం.
మరి వ్యాస గణపతులు కావ్యాన్ని రచించిన ప్రదేశం ఏది ? ఎక్కడ ? ఆ ప్రాంతాన్నే ఎంచుకోడానికి     కారణం ఏమిటి ?  ఆ పావన క్షేత్రం విశేషాలు ఏమిటి ?  ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రెండు ప్రదేశాలు భారతావనిలో ఉన్నాయి అని తెలుస్తోంది. రెండూ కూడా పవిత్ర నదీతీరాలే ! సంగమ క్షేత్రాలే ! ప్రశాంతతకు నెలవులు ! ఈ ప్రదేశాలను ఎంచుకోడానికి కారణంగా భావించవచ్చును. రెండూ కూడా దర్శనీయ స్థలాలే కావడం విశేషం.

వేద వ్యాస 

"కోయిల్" మరియు "సరస్వతి" నదులు బ్రాహ్మణి నదిలో సంగమించే పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతం. నలువైపులా ఏపుగా పెరిగిన వృక్షాలు. స్వచ్ఛమైన గాలి. శబ్ద వాయు కాలుష్యాలు కానరావు. అంతటా ప్రశాంతత. మధ్యమధ్యలో  ఆధ్యాత్మిక భావాలను  పెంపొందించేలా మ్రోగే గుడి గంటలు. ఇవీ "వేద వ్యాస" సహజ అందాలు. 
నిత్య జీవితంలో నిరంతరం పరుగులు పెడుతూ అలసి పోయిన మనస్సు, శరీరం రెండూ ఇక్కడ సేదతీరుతాయి. సుందర శాంటా ప్రకృతి మాయలో మమేకమైపోతారు ఎవరైనా ! ఒడిషా రాష్ట్రంలో పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందినది "రూర్కెలా". ఈ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేదవ్యాస. ఇక్కడే వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారన్న నమ్మకంతో ఆయన పేరుతోనే పిలుస్తున్నారు. 
నదీతీరంలో చిన్న పర్వతం. పైకి వెళ్ళడానికి అనువుగా సోపాన మార్గం ఉంటుంది. కొండ చిన్నది అయినా మూడు అంతస్తులుగా విభజించబడినది. ఎన్నో చిన్న పెద్ద మందిరాలతో నిండి ఉంటుంది.
పర్వత పాదాల వద్ద శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి, శ్రీ హరినామ సంకీర్తనా మండపం కనపడతాయి. పంతొమ్మిది వందల తొంభై వ సంవత్సరం నుండి ఇక్కడ నిరంతరాయంగా హరినామ సంకీర్తన జరుగుతోంది. అభినందనీయం. మండపంలో శ్రీ రామ మరియు శ్రీ కృష్ణ విగ్రహాలను  అఖండ జ్యోతి వద్ద ఉంచారు. మెట్ల మార్గంలో తొలి అంతస్తుకు చేరుకొంటే శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ హనుమాన్ సన్నిధులు, ఎన్నో పురాతన లింగాలు మరియు నంది విగ్రహాలు కనపడతాయి. ఇవి ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది అని తెలుపుతాయి. రెండో అంతస్థులో కొండా రాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ ఉంటుంది. ఇక్కడే శ్రీ వ్యాస మహర్షి జయ కావ్యాన్ని శ్రీ పార్వతీనందనుని చేత లిఖియింపచేశారు అని చెబుతారు. గుహ పైన హిందీ మరియు ఒడియా భాషలలో అదే విషయాన్ని రాశారు. గుహ ప్రవేశ మార్గం వద్ద శ్రీ వ్యాసుని, మూషిక వాహనుని విగ్రహాలను ఉంచారు. గుహ వద్ద చలువ రాళ్లను పరచి సుందరంగా శుభ్రంగా మలచారు. ప్రతి నిత్యం పూజలు జరుగుతాయి. ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.















అన్నిటికన్నా పై అంతస్థులో శ్రీ తరణి మాత, శ్రీ హనుమాన్, శ్రీ కైలాసనాథర్, శ్రీ పార్వతి చిన్న చిన్న మందిరాల్లో దర్శనమిస్తారు. విశాలమైన మండపంతో  నిర్మించబడిన మందిరంలో శ్రీ రామచంద్రుడు, శ్రీ జానకీ మాత , శ్రీ హనుమాన్ తో పాటు భారత, లక్ష్మణ, శత్రుఘ్నులతో కలిసి కొలువై ఉంటారు. దశరధ నందనులంతా ఒకే చోట దర్శనమిచ్చే ప్రదేశాలు చాలా అరుదు. అలాంటి వాటిల్లో వేదవ్యాస ఒకటి.
శిఖరాగ్రం నుండి చూస్తే దూరంగా నిశ్శబ్దంగా ప్రవహించే నది, భక్తి విశ్వాసాలతో స్నానాలు ఆచరించే భక్తులు. సంగమ క్షేత్రంలో పితృ కార్యాలు చేస్తే గతించిన పెద్దలకు ముక్తి కలుగుతుంది అన్న విశ్వాసంతో పిండ ప్రదానం చేసే వారసులు. నలువైపులా పచ్చదనావు. చల్లని స్వచ్ఛమైన గాలి. అంతటా పరిపూర్ణ విశ్వాసంతో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం. సందర్శకుల మనస్సులను కట్టి పడేస్తుంది.
ప్రతి రోజు వందలాది పర్యాటకులు వేదవ్యాస వస్తుంటారు. రూర్కెలా రైల్వే స్టేషన్ నుండి ఆటోలు లభిస్తాయి.

మనా గ్రామం 

మన దేశానికి ఉత్తర దిశన సరిహద్దు హిమాలయ పర్వతాలు. హిందువులకు పరమ పవిత్రమైనవి. సర్వసంగ పరిత్యాగానికి చిరునామాలు. ముముక్షువులకు శాశ్విత నివాసాలు. ఎన్నో పావన క్షేత్రాలకు నెలవు. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే జరిగే చార్ధామ్ యాత్రలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. గంగ, యమునా లాంటి పవిత్ర నదుల జన్మస్థానం హిమాలయాలే !ఎన్నో నిఘాఢ రహస్యాలు ఈ పర్వతాల సొంతం. గంగా యమునాలతో పాటు సరస్వతి నది   అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు. నేడు పూర్తిగా అదృశ్యమైనది అని చెప్పే ఈ  నది కూడా హిమాలయాలలోనే జన్మించినది. 
ఈ నదీ తీరంలోనే ఉంటుంది మన దేశానికి ఆఖరి గ్రామం అయిన "మనా గ్రామం". ఇక్కడికి కొద్దీ దూరంలోని మనా పాస్ దాటితే టిబెట్ దేశ భూభాగం లోనికి ప్రవేశిస్తాము. మనా కి సమీపంలో రెండు కొండల మధ్య ఉన్న గుహ నుంచి ప్రవహిస్తుంది సరస్వతి. కానీ ఈ ప్రవాహం ఎక్కువ దూరం కనిపించదు. మాయమవుతుంది. అక్కడి నుండి అలకనంద తో కలిసి పోతుంది అని చెబుతారు. సరస్వతి నది అంతర్ధానానికి సంబంధించిన పురాణ గాధ ఒకటి స్థానికంగా వినపడుతుంది. ఎన్నో నదులుండగా తన తీరానే శ్రీ మహావిష్ణువు అవతారంగా పేర్కొనే శ్రీ వ్యాసుడు, ఏకదంతుని సహకారంతో జయ ను అక్షరీకరించడానికి ఉపక్రమించడంతో కొంత గర్వం తలెత్తినది సరస్వతిలో. అహంతో అట్టహాసంగా ప్రవహించసాగిందట. ప్రవాహ వేగం తాలూకు శబ్దం లంబోదరుని ఏకాగ్రతకు భంగం కలిగించసాగిందట. ఆగ్రహించిన గజముఖుడు నదిని అదృశ్యం కమ్మని శపించారట. శరణు కోరిన నదీమ తల్లిని క్షమించి, గంగ, యమునాలతో కలిసి అంతర్వాహినిగా ప్రవహించామని తరుణోపాయం తెలిపారట. ఒక్క మనా గ్రామం వద్దనే భక్తులకు సరస్వతి నది జలాన్ని సేవించే అదృష్టం దక్కుతుంది. గుహ వద్ద ఉన్న స్వరస్వతి మూర్తికి పూజలు చేసి నీటిని పవిత్ర తీర్థంగా స్వీకరిస్తారు. 
పక్కనే వ్యాస మరియు గణేష గుహలుంటాయి. ఈ గుహల లోని లోపలి భాగం లోని రాళ్లు పుస్తకాల దొందరను పోలి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వ్యాస గుహలో వినాయక, వ్యాస, శుక మహర్షి మరియు వల్లభాచార్యుల విగ్రహాలుంటాయి. ప్రత్యేకంగా చేసిన అద్దాల  పెట్టెలో ఉంచిన  తాళపత్రాలను వ్యాసుడు చెబితే గణపతి లిఖించిన జయ తాలూకువి అని అంటారు. 
నిత్య పూజలు జరుగుతుంటాయి. 
మనా ప్రత్యేకతలు ఇంతటితో ఆగిపోలేదు. రాజ్యాన్ని పరిక్షిత్తుకు అప్పగించిన పాండునందనులు సతీమణి ద్రౌపది దేవి తో కలిసి స్వర్గారోహణ ఆరంభించింది మనా గ్రామం నుండే అని నమ్ముతారు. సరస్వతి నదీ ప్రవాహం మీద ఆ ఒడ్డు  నుండి ఈ ఒడ్డు కు వంతెనలా వేసిన ఏకరాతిని చూపుతారు. దీనిని భీమసేనుడు ద్రౌపది దేవి నదిని దాటడానికి వీలుగా పరిచారట. రాతి మీద ఉన్న నొక్కులను వాయునందనుని హస్త ముద్రలని భావిస్తారు. మనా గ్రామం దాటినా తరువాత ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురు సోదరులు, సతీమణి దేహత్యాగం చేశారట. 
ఇలా అనేక విశేషాలతో పురాణ ఘటనలతో ముడిపడి ఉన్న మనా గ్రామా శ్రీ బదరీనారాయణ క్షేత్రం అయిన బద్రీనాథ్ కు సమీపంలో ఉంటుంది. నడిచి వెళ్లాల్సి వస్తుంది. చార్ధామ్ యాత్రలో భాగంగా సందర్శించుకోవచ్చును.





ఈ వ్యాసం ముగిస్తుండగా ఒక మిత్రులు మరో వ్యాస గుహ గురించి చెప్పారు. అది హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో ఉన్నదట. అక్కడ ఉన్న గుహలో వ్యాస భగవానులు మహా భారత రచన చేసారని స్థానిక గాధలు తెలుపుతున్నాయి. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవు హిమాచల్ ప్రదేశ్. 
అసలు భగవాన్ శ్రీ వేద వ్యాసుడు వక్రతుండునితో కలిసి ఎక్కడ మహాభారతాన్ని రచించారు అన్న చర్చకు వెళ్లకుండా చూస్తే ఈ ప్రదేశాలు విశేషమైనవి. ప్రకృతి సౌందర్యానికి , ప్రశాంతతకు చిరునామాలు. పావన నదీ తీరాలు. విశిష్ట పౌరాణిక, చారిత్రిక ఘట్టాలకు కేంద్రాలు.  ఒక జీవిత కాల అనుభూతులను అందించే ఆధ్యాత్మిక ప్రదేశాలు. అన్నింటికీ మించి తప్పక సందర్శించవలసిన క్షేత్రాలు. 

   

















                                 


    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...