24, మార్చి 2020, మంగళవారం

Thirunelveli Temples - 1


                           తిరునెల్వేలి దివ్యదేశాలు             

 



శ్రీ వైకుంఠం - సూర్య క్షేత్రం 

నవతిరుపతి ఆలయాలు అన్ని తిరునల్వేలి కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ వరుసగా చూడటానికి కుదరదు. కారణం ఏమిటంటే ఆలయాల దర్శన సమయాల్లో తేడా ఉండటమే! ఏ ఆలయం ఏ సమయానికి తీస్తారు, ఏ ఆలయం తరువాత ఏ ఆలయానికి వెళ్లాలి అన్నది ఇక్కడి అద్దె కార్ల వాళ్ళకి బాగా తెలుసు. సమయాల ప్రకారం దర్శనాలు చేయిస్తారు. అందువలన కారు తీసుకుని వెళ్లడం ఉత్తమం. అన్ని ఆలయాలను చూడవచ్చును శ్రమ లేకుండా!
నవతిరుపతులతో పాటు అందుబాటులో ఉన్న నవకైలాస ఆలయాలను, ఆరుపాడై వీడుల్లో ఒకటి సముద్ర తీరంలో శ్రీ సుబ్రమణ్యస్వామి కొలువైన తిరుచ్ఛెందూరు కూడా సందర్శించుకోవచ్చును.
పూర్వం ఈ ప్రాంతం పాండ్య రాజుల పాలనలో ఉన్నది. అందువలన పాండ్య నాడు అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న పది దివ్య దేశాలను పాండ్య నాడు క్షేత్రాలు అని నిర్ణయించబడింది. ఈ తొమ్మిది స్ధలాలు శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు. ఒక్కో క్షేత్రం ఒక్కో గ్రహ స్ధలంగా గుర్తించబడినది. 
నవతిరుపతులలో మొదటిది శ్రీ వైకుంఠం. ఇది సూర్య  క్షేత్రం. 

ఇక్కడొక విశేషం గమనించాలి. తమిళనాడు లోని క్షేత్రాల ముందు తిరిగి అనే గౌరవ వాచకం ఉంటుంది.  అలా కాకుండా శ్రీ తో ఆరంభమయ్యే  దివ్య దేశాలు రెండే! ఒకటి శ్రీ వైకుంఠం కాగా రెండవది శ్రీ విల్లిపుత్తూరు. 
తిరునల్వేలి కి  ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వైకుంఠం ఆలయాన్ని తొలుత పాండ్య రాజులు కట్టించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. అనంతరం చోళ, విజయ నగర,  నాయక రాజులు ఆలయాభివృద్దికి భూరి విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 
సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే కొలువు తీరిన క్షేత్రమని భక్తులు విశ్వసిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్ర గాధ కూడా విశేషమైనదే! శ్రీహరి లోకకళ్యాణార్దం ధరించిన దశావతారాలలో  మొదటిదైన మత్య్సావతారంతో ముడిపడి ఉన్నది. 

పురాణ గాధ

జలప్రళయానికి పునఃసృష్టికి మధ్య ఉన్న సంధి కాలంలో సృష్టికర్త విశ్రమించారట. యోగనిద్రలో ఉన్న ఆయన వద్ద నుండి "సోమకుడు"  అనే అసురుడు వేదాలను అపహరించాడట. మేలుకొని విషయం తెలుసుకొన్న విధాత శ్రీ మహవిష్ణువు తప్ప అన్యులు తనను కాపాడలేరని భావించారట. ఆయన అనుగ్రహం కొరకు భూలోకం లోని పావన తమిరపారాణి (తామ్రపర్ణి )నదీతీరం లో తపస్సు చేశారట. దర్శనమిచ్చినగంగాధరుడు మత్య్స రూపం దాల్చి రాక్షసుని అంతం చేసి సృష్టికి మూలమైన వేదాలను హంసవాహనునికి ఇక్కడ అందించారట. చతుర్ముఖుని కోరిక మేరకు ఈ క్షేత్రంలో కొలువైనరట. తొలి ఆలయాన్ని బ్రహ్మ ఆదేశం మేరకు దేవ శిల్పి విశ్వకర్మ నిర్మించారట. 
కాలం ఎవరి కోసం ఆగదుకదా! విశ్వకర్మ కట్టిన ఆలయం కనుమరగైనది. స్వామి చుట్టూ పుట్టలు పుట్టాయి. నిత్యం రాజుగారి పశువుల మంద మేతకు ఈ ప్రాంతానికి వచ్చేవట. వాటిలోని ఒక ఆవు ఈ పుట్టల వద్దకు వెళ్లి ధారగా క్షీరాన్ని తన పొదుగు నుంచి వదిలేదట. అది గమనించిన గో పాలకుడు పాండ్య రాజు వద్దకు వెళ్లి విషయాన్ని విన్నవించుకొన్నాడట. ఆపుట్టలలో ఏదో మహత్యం ఉండి ఉంటుంది అని గ్రహించిన రాజు జాగ్రత్తగా తవ్వించగా నీలమేఘ శ్యాముడైన శ్రీ వైకుంఠనాధుడు విగ్రహ రూపంలో దర్శన మిచ్చారట.ఆనందపరవశుడైన పాండ్యుడు పునః ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించారట. గోవు చేసిన పాలాభిషేకం కారణంగా దర్శనం ఇచ్చారు కనుక స్వామిని "పాలపాండ్యన్" అని పిలుస్తారు. అర్చనామూర్తికి ప్రతి నిత్యం పాలతోనే అభిషేకం చేస్తారు.
విశాల ప్రాంగణంలో  నిర్మింపబడిన ఈ ఆలయం చక్కని ఆకట్టుకునే శిల్పాలతో అలరిస్తుంది. భాగవత, విష్ణు లీలా విన్యాసాలు, చిత్ర విచిత్ర జంతువులు, లతలు పూలు చెక్కిన రాతి శిల్పాలు కనువిందు చేస్తాయి. రెండు వేల సంవత్సరాల నాటిదిగా చెప్పబడే చెక్క గరుడ వాహనం మరో ఆకర్షణ.
చాలా లోపలికి కొద్దిగా లోతులో ఉండే గర్బాలయంలో మూలవిరాట్టు శ్రీ వైకుంఠనాధుడు ఆదిశేషుని పడగ ల క్రింద తూర్పు ముఖంగా స్థానక భంగిమలో గదాయుధం ధరించి దర్శనమిస్తారు. శ్రీ మహవిష్ణువు అలంకారప్రియుడు. దానికి తగనట్లుగా రమణీయ పుష్పాలంకరణ చేస్తారు. అమ్మవార్లు అయిన శ్రీ వైకుంఠ వల్లి, శ్రీ చోరనాయకి విడిగా కొలువు తీరి ఉంటారు. ఉపాలయాలలో శ్రీ నరసింహ, శ్రీ వేణుగోపాల, శ్రీ ఆంజనేయ, శ్రీ మానవళమహర్షి దర్శనమిస్తారు. ప్రధాన ఆలయం వెలుపల తిరుమల వాసుడు కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఒక ప్రత్యేక ఆలయం కలదు. 
శ్రీ దేవి, భూదేవి సమేతంగా పూజలందుకొనే ఉత్సవమూర్తిని "కాలాపిరన్ లేదా చోరనాధన్ " అని పిలుస్తారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. అది శ్రీ వైకుంఠనాధుని భక్తవత్సలతను లోకసంరక్షణాసక్తిని తెలియజేస్తుంది.

శ్రీ కాలాపిరన్ 

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే పాండ్యరాజు భోగలాలసుడై  ప్రజాసంక్షేమం పట్టించుకొనేవాడు కాదట.దానితో రాజ్యంలో అరాచకం, అవినీతి, అక్రమాలు, దొంగతనాలు పెరిగిపోయాయట. "కాలదోషకుడు" అనే వాడు పెద్ద దొంగల ముఠాకు నాయకుడు. రాజ్యంలో జరిగే అధికశాతం దొంగతనాలు ఈ ముఠా సభ్యులే  చేసేవారట. దొంగ అయినా కాలదోషకుడు శ్రీ వైకుంఠనాధుని భక్తుడు. చోరీ చేయడానికి ముందు స్వామికి పూజలు చేసి తన కార్యం సఫలమైతే సగభాగం లక్షీనాధునికి సమర్పించుకొంటానని మొక్కుకొనేవాడట. అదే విధంగా లభించిన దానిలో అర్థభాగం ఇచ్చేవాడట. అలా కాలం సాగిపోతున్నది. పెరుమాళ్ కాలదోషకునికి,  రాజు కి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనది అని తలంచి తన మాయను ప్రసరింప చేశారట.
దాని వలన కాలదోషకుని మదిలో అహం పెరిగి రాజుగారి ఖజానాని దోచుకోడానికి పధకం రచించాడట. అదృష్టం తారుమారవడంతో ముఠా సభ్యులు అందరూ రాజ భటులకు దొరికిపోయారట. కాలదోషకుడు ఒక్కడూ తప్పించుకొని దిక్కు తోచక శ్రీ వైకుంఠనాధుని శరణుకోరాడట.ఒక ముదుసలి రూపంలో దొంగల నాయకునికి అభయమిచ్చి తాను అతని వేషంలో రాచకొలువుకు వెళ్ళారట. 
తన దాకా వస్తే గానీ తెలియదన్నట్లుగా ఖజానా చోరీ విషయాన్నిపరువు సమస్యగా తీసుకొన్న రాజు ఆగ్రహంతో "ఎవరు నువ్వు? "అని ప్రశ్నించాడట. నవ్వి " నా పేరు కాలాపిరన్. ఊరు శ్రీ వైకుంఠం." అని బదులిచ్చారట.
"దొంగతనం నేరమని తెలియదా! " అన్నాడట పాండ్యుడు. సూటిగా రాజు వంక చూస్తూ "మరి నువ్వు చేస్తున్నది ఏమిటి ?" అని ఎదురు ప్రశ్నించారట దొంగ రూపంలో ఉన్నపెరుమాళ్.  
ఆయన చూపులకు, ప్రశ్నకు తన తప్పులను తెలుసుకొన్న రాజు కైమోడ్చాడట.  నిజరూప దర్శనమిచ్చి  జనరంజకంగా పాలించమని ఆదేశించారట. జరిగింది తెలుసుకొన్న కాలదోషకుడు నాటితో దొంగతనాలు మానేసి శ్రీ వైకుంఠనాధుని సేవ చేస్తూ ముక్తి పొందాడట. తన పేరు కాలాపిరన్ అని స్వామి స్వయంగా చెప్పినందున ఉత్సవ మూర్తిని అదే పేరుతో పిలవసాగారు.

సూర్యాభిషేకం 

స్వామి వారికి రోజూ క్షీరాభిషేకం జరుగుతుంది అని తెలుసుకొన్నాము కదా! అది కాకుండా మరో అభిషేకం కూడా జరుగుతుంది. అది సంవత్సరంలో రెండు సార్లు. ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయణంలో మరోసారి. అదే ప్రత్యక్ష నారాయణుని కిరణాభిషేకం.
ఏంతో లోపలికి ఉండే గర్భాలయానికి ఉదయారుణ  కిరణాలు ఆ రెండు రోజుల్లో మాత్రమే ప్రవేశించి మూలవిరాట్టు ను నేరుగా తాకడం నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
నియమంగా రోజుకి నాలుగు పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రత్యేక విశేష ఉత్సవం గరుడ సేవ.
అన్ని పర్వదినాల లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వైకుంఠనాధుని దర్శనం చేసుకొంటారు.
పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వారు శ్రీ వైకుంఠనాధుని కీర్తిస్తూ రెండు పాశురాలను గానం చేశారు.
మరో విశేషం ఏమిటంటే నవకైలాస క్షేత్రాలలో ఒకటి ఇదే ఊరిలో ఉండటం. అలా హరిహర క్షేత్రం గా శ్రీ వైకుంఠం అందరికీ పవిత్ర దర్శనీయకేద్రంగా పేరొందిన ది.


జై శ్రీ మన్నారాయణ! ! ! ! 

తిరుకుళందై  (పెరుంగుళం ) శని క్షేత్రం 

తమిరపారాణి నదికి ఉత్తరం పక్కన శ్రీ వైకుంఠానికి పన్నెండు కిలోమీటర్ల దూరం, తిరుప్పులింకుడి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుకుళందై. నవతిరుపతులలో నాలుగోది. శని క్షేత్రం. స్ధానికంగా పెరుంగుళం అని పిలుస్తారు.
దీనికి కారణమేమంటే పురాణ కాలంనాటి ఆలయ కోనేరు కాలగతిలో అదృశ్యమైనదిట. దానిని తిరిగి నిర్మించడానికి కొన్ని వాస్తు శాస్త్ర అంచనాల ప్రకారం లెక్కలు వేసారట. గతంలో పుష్కరిణి ఉండిన స్ధలాన్ని గుర్తించారట.అలా ప్రస్తుతం మనకు కనిపించే కోనేరును పునః నిర్మించారట. అప్పట్లో దాని పేరు పెరుంగుళం. నేడు ఊరు కూడా అదే పేరుతో ప్రసిద్ధి చెందింది.
శ్రీ వెంకట వణ్ణన్ పెరుమాళ్  శ్రీ అలిమేలుమంగ తాయారు శ్రీ కుళందైవల్లి తాయారులతో కలిసి కొలువైన ఆలయం పెద్దదే. కానీ విశేష శిల్పకళ కనపడదు.ఇది కూడా పాండ్య వంశీయుల నిర్మాణమే!  
మూలవిరాట్టు స్ధానిక భంగిమలో చతుర్భుజాలలోని వెనుక హస్తాలతో శంఖు చక్రాలను ధరించి ముందు కుడి చేతిని వరద హస్తంగా, ఎడమ హస్తాన్ని నడుము పైన ఉంచుకొని విశేష పుష్పాలంకరణతో ప్రత్యేకంగా  కనిపిస్తారు. 
ఈ క్షేత్రంలో జగన్నాధుడు దేవ గురువు బృహస్పతి కి దర్శనమిచ్చారని తెలుస్తోంది. ఆలయం గురించి అనేక పురాతన గ్రంధాలలో ఉదాహరించబడినా ప్రత్యేకముగా  పురాణ గాధ గురించిన వివరాలు ఏవీ కనిపించవు. కానీ శ్రీ వెంకట వణ్ణన్ పెరుమాళ్ భక్తవత్సలుడని నిజ భక్తులను, ఆర్తితో అర్ధించిన వారిని కాపాడుతారని తెలిపే గాధలు చాలా స్థానికంగా వినబడతాయి. వాటిల్లో ముఖ్యమైనది "వేదసారన్" కధ. 

వేదసారన్ కధ  

వేదసారన్ , కుముదవల్లి అనే దంపతులు శ్రీ వెంకట వణ్ణన్ భక్తులు. నిర్మలమైన భక్తితో స్వామిని ఆరాధించేవారట. వారి ఏకైక కుమార్తె కూడా తల్లితండ్రుల బాటలో నడుస్తూ తిరుకుళందై నాధర్ ని ఆరాధించేదట. వయస్సుతో పాటు ఆమె భక్తి కూడా పెరిగిపోయిందిట. 
గోదాదేవి మాదిరి ఈమె కూడా శ్రీవారిని నాధునిగా చేసుకోవాలని తలపోసిందట. పెద్దలు అది సాధ్యం కాదని నచ్చచెప్ప ప్రయత్నించారట. కానీ బాలిక వారి అనుమతితోనే తీవ్ర తపస్సు చేసిందట. ఆమె భక్తికి సంతసించిన గరుడ వాహనుడు దర్శనమిచ్చి ఆమెకు తన హృదయంలో శాశ్విత స్థానం అనుగ్రహించారట. శ్రీ వెంకట వణ్ణన్ మూలవిరాట్టు వక్షస్థలంలో కౌస్తుభ మణితో పాటు ఈమె రూపాన్నిచూడవచ్చును. 
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అల్లుడయ్యాడని ఆనందంతో జీవితాన్ని ఆయన సేవలో గడుపుతున్న వేదసారన్ దంపతులకు అనుకోని ప్రమాదం ఎదురైనదట. "అసంసారన్" అనే అసురుడు విష్ణు ద్వేషి. విష్ణు భక్తుల పట్ల అకారణ ద్వేషం కలవాడట. 
వేదసారన్ కుమార్తె గురించి విని వారిని వేధించాలని తలచి కుముదవల్లిని  అపహరించుకొని పోయాడట. దిక్కు తోచని వేదసారన్ స్వామిని శరణు కోరాడట. ప్రజలకు రాక్షస బాధ తొలిగించాల్సిన సమయం ఆసన్నమైనది అని తలచిన జగద్రక్షకుడు గరుడ వాహనం మీద తరలి వచారట. అసురుని అంతం చేసి అతని దేహం మీద మహోగ్రనాట్యం చేశారట. ఈ కారణంగా ఉత్సవమూర్తిని రాక్షసుని మీద తాండవం చేసిన వాడు అని అర్ధం వచ్చేలా "మాయా కూతన్" అని పిలుస్తారు. శ్రీదేవి, భూదేవిల మధ్య చిద్విలాసంగా దర్శనమిస్తారు మాయాకూతన్. 

వినతా తనయుని విశేషం  

పై రెండు సంఘటనలలో పెరుమాళ్ గరుడుడిని అధిరోహించి వచ్చారు. అందువలన స్వామి వారు ఎప్పుడు ఏ భక్తుని కాపాడటానికి బయలుదేరుతారో అన్నది తెలియదు.  కనుక "నిత్య సూరి" అన్న తన పదవి, బిరుదును సార్ధకం చేసుకొంటూ గరుత్మంతుడు తన రెక్కలు చాపి ఎగరడానికి సిద్ధం అన్న భంగిమలో కనపడతాడు. వినతాసుతుని ఇలాంటి భంగిమలో మరెక్కడా చూడము. మిగిలిన  అన్ని చోట్లా ధ్వజస్థంభం వద్ద ముకుళిత హస్తాలతో ఉంటాడు. 

శని క్షేత్రం 

పెరుంగుళం శ్రీ వైష్ణవ శని క్షేత్రం. గర్భాలయానికి ఉత్తర భాగంలో సూర్య సుతునకు ప్రత్యేక స్థానం కేటాయించారు. మందగమనుని అనుగ్రహం కొరకు భక్తులు చేయించుకునే జపాలు, పూజలు, శాంతులు, దానాలు జరుపుతారు. ఇక్కడ నిర్వహించే శాంతి పూజలకు విశేష ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. ఇలాంటి ఏర్పాటు మనం ఈశ్వరాలయాలలో కూడా చూడలేము. 

ఆలయ విశేషాలు 

ఇది కూడా పాండ్య రాజుల నిర్మాణమే ! తూర్పున ఉన్న రాజా గోపురాన్ని కలుపుతూ ఎత్తైన రాతి ప్రహరీని నిర్మించారు. పెద్ద ప్రాంగణంలో ఉన్నా ఆలయం సాదాసీదాగా ఉంటుంది. ఎలాంటి శిల్పకళా కనపడదు. ఉపాలయాలు కూడా ఉండవు. ప్రధాన ఆలయానికి వెలుపల శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకట నాథన్ ఆలయం ఉంటుంది. 
తిరుకుళందై శాశ్విత దివ్య దేశ హోదా పొందడానికి కూడా శ్రీ నమ్మాళ్వార్ గానం చేసిన పాశురాలే కారణం.
" గొప్పవారమని గంభీరోపన్యాసాలు చేసే గౌరవనీయులు కాలాన్ని అశాశ్వితమైన ఇహలోక సుఖాలతో కాలక్షేపం చేస్తారు. జీవిత చరమాంకంలో తమ తప్పిదానాలకు చింతిస్తారు. పశ్చాత్తాపం చెందుతారు. దానికన్నా పరమాత్ముని దివ్యచరణాల వద్ద శరణాగతిని కోరుకొంటే అంతకన్నా అనిర్వచనీయమైన సుఖం మరియు సంతోషం ఉండవు. పెరుమాళ్ళు మాయాకూతన్ సమస్త రాక్షసులను, అన్ని దుష్ట శక్తులను అంతం చేసేవాడు" అని తన పాశురంలో పేర్కొన్నారు నమ్మాళ్వార్.
అప్పటికీ ఇప్పటికీ ఆయన చెప్పినదే జరుగుతున్నది కదా ! అందుకే ఆళ్వార్ పాశురాలను ద్రావిడ వేదం అని పేర్కొంటారు భక్తులు.


జై శ్రీమన్నారాయణ !!!


తిరువరగుణమంగై (నాతం)- చంద్ర గ్రహ క్షేత్రం 

నవతిరుపతులలో ఇది చంద్రగ్రహ క్షేత్రం. ఉండటానికి శ్రీ వైకుంఠానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆలయ సమయాలలో తేడా వలన వెంటవెంటనే దర్శించుకోడానికి కుదరదు. 
పురాతన గ్రంధాలలో, పాశురాల్లో " తిరువరగుణమంగై" అని పేర్కొన్నా స్థానిక నామం మాత్రం "నాతం". శ్రీ విజయాసన పెరుమాళ్ కొలువైన ఈ ఆలయాన్ని కూడా పాండ్య రాజులు నిర్మించారని శాసనాలుతెలుపుతున్నాయి. 
తమిరపారాణి నదీ తీరంలో ఈ ఆలయ పరిసరాలలో " శ్రీ రోమశ మహర్షి" తపస్సు చేసుకొనేవారట. ఆయన ఇష్టదైవం శ్రీ విజయాసనుడే ! మహర్షి మూలంగా ఈ క్షేత్రం మహరాజుల ఆదరణకు నోచుకొన్నది అని అంటారు. ఇంతకు మించి పురాణ గాధ అంటూ ప్రత్యేకంగా అందుబాటులో లేదు. 
అగ్నిదేవుడు శాపవిమోచన కొరకు పన్నగ శయనుని గురించి ఈ క్షేత్రంలో తపమాచరించి విముక్తి పొందారట. ఆయన నిర్మించినందున ఆలయ కోనేరును "అగ్ని పుష్కరణి" అంటారు. 
నాతం మోక్ష స్థలం. ఎవరైతే శ్రీ విజయాసన పెరుమాళ్ ని సేవించుకొంటారో వారికి పునర్జన్మ ఉండదని స్థానికులు విశ్వసిస్తారు. అలానే తిరువరగుణమంగై సర్వసిద్ది స్థలం కూడా ! ఆలయంలో స్వామి వారి ఎదుట నేతి దీపం వెలిగించి మదిలోని కోరిక విన్నవించుకొంటే తప్పక సిద్ధిస్తుంది అని క్షేత్ర మహత్యం తెలుపుతోంది అంటారు. ప్రతి నిత్యం ఎందరో భక్తులు వచ్చి దీపాలు వెలిగిస్తుంటారు. 
నాతం చంద్ర గ్రహ పరిహార స్థలం. జాతకరీత్యా చంద్ర గ్రహ దోషాలను ఎదుర్కొంటున్నవారు గ్రహ శాంతికి నిర్ణయించిన పూజలు, శాంతులు జరిపించుకొంటుంటారు. 
ఆలయ రాజ గోపురం దూరానికి ఎత్తుగా రంగురంగుల శిల్పాలతో ఆకర్షిస్తుంది. దాని మీద భాగవత, విష్ణు లీలా విన్యాసాలను రమణీయంగా మలచారు. మిగిలిన ఆలయం పెద్దదే కానీ మరెలాంటి శిల్పాలు కనిపించవు. 
గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ విజయాసన పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో ఇరుపక్కలా శ్రీదేవి, శ్రీ వరగుణ వల్లి తాయారులతో వెన్నెలకు ప్రతిరూపమైన వెండి ఆభరణాల అలంకరణలో నయనమనోహరంగా దర్శనమిస్తారు. శ్రీవారు  ఒక చేత్తో రమ్మని పిలుస్తూ, మరో చేత్తో పాదాలను చూపిస్తూ " శరణాగతే శరణ్యం " అన్న సందేశానిస్తుంటారు.  
నమ్మాళ్వార్ గానం చేసిన పాశురం వలన ఈ క్షేత్రం కూడా దివ్య తిరుపతుల జాబితాలో చేరింది. "శయన భంగిమలో తిరుపుళింగుడి లో, ఉపస్థిత భంగిమలో తిరువరగుణమంగై లో, స్థానిక భంగిమలో శ్రీ వైకుంఠంలో కొలువైన నీవు నా బాధలను దూరం చేసావు. నీ దయతో నన్ను నీ దాసుడను చేసుకున్నావు. నీ దరహాసం వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం మీది మెరుపు. ఓ దేవా నిరంతరం నిన్ను దర్శిస్తూ ఆనంద నృత్యాలు చేస్తూ మమ్ములను తరించేలా ఆశీర్వదించు" అంటూ భక్తులందరి తరుఫునా శ్రీహరికి విన్నవించుకొన్నారు ఆళ్వార్. 


 తిరుప్పులింగుడి - బుధ గ్రహ క్షేత్రం 


పాండ్య నాడులోని నవతిరుపతులలో మూడవది అయిన ఈ క్షేత్రం తమిరపారాణి నదికి ఉత్తర తీరాన తిరువరగుణమంగై కి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా సమయాల ఇబ్బంది ఉన్నది. ఒకేసారి దర్శించుకోడానికి వీలుకాదు. 
బుధ గ్రహ పరిహార క్షేత్రముగా పేరొందిన ఈ స్థలములో పరమాత్మ కొలువు తీరడానికి సంబంధించిన గాఢ సృష్ట్యాది కి చెందినదిగా తెలుస్తోంది. 

పురాణ గాధ 

లక్ష్మీనాధుడు దేవేరితో కలిసి గరుడవాహనం మీద విహరిస్తూ ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైనారట. భువికి దిగి నదీతీరంలో వనాలలో విహరించసాగారట. వారి అన్యోన్యతకు, ఆనందానికి అసూయా చెందిన భూదేవి అలిగి భూలోకానికి వెళ్లిపోయిందట. 
దానితో లోకాల్లో అంధకారం అలముకొన్నదట. తల్లడిల్లిన జనులందరూ జనార్ధుని శరణు కోరారట. భువనపాలకుడు పాతాళానికి వెళ్లి భూదేవిని బుజ్జగించి తీసుకొని వచ్చారట. లోకాలలో వెలుగు తిరిగివచ్చినదట. అలా అమ్మవారిని తిరిగి తీసుకొని వచ్చినందున  అందరూ " శ్రీ భూమిపాలక పెరుమాళ్" అని కీర్తించారట. నేటికీ అలానే పిలుస్తారు.  భూమిని పాలించేవాడు అని అర్ధం వచ్చే ఈ సంస్కృత నామాన్ని నమ్మాళ్వార్ తమిళంలో " కైశిన వేందన్" అని పేర్కొంటూ రెండు అర్ధాలలో ఈ పేరును తన పాశురంలో వాడారు. రెండో అర్ధానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. 
దేవేంద్రుడు జింకల రూపంలో క్రీడిస్తున్న ముని దంపతులను తెలియక వేటాడి చంపారట. దాని వలన ఆయనకు బ్రహ్మ హత్యాపాతకం సంక్రమించిందిట. దానిని తొలగించుకోడానికి బృహస్పతి సలహా మేరకు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకొని కలిగిన పాతకాన్ని తొలిగించుకొన్నాడట. దానికి కృతజ్ఞతగా శ్రీహరిని సంతుష్టి పరచడానికి ఒక యజ్ఞం చేయ సంకల్పించాడట. కానీ దానికి దాపున ఉన్న అడవిలో నివసించే అసురుడొకడు ఆటంకాలు కలిగించసాగాడట. యాగ దీక్షలో ఉన్న ఇంద్రునికి దిక్కుతోచక దేవాధినాధుని ప్రార్ధించారట. ఆగ్రహించిన గరుడవాహనుడు సుదర్శన చక్ర ప్రయోగంతో రాక్షసుని అంతం చేశారట. తమిళంలో "కేశిన" అంటే కోపం. "వేందన్" అంటే సంహరించినవాడు. కోపంతో అసురుని సంహరించినవాడు అన్న అర్ధంలో ఆళ్వార్ ఈ పదాలను వాడారు. ఇలాంటి పద ప్రయోగం వలననే నమ్మాళ్వార్ గానం చేసిన పాశురాలు నేటికీ జనబాహుళ్యంలో విశేష ఆదరణ పొందుతున్నాయి. 

ఆలయ విశేషాలు 

పాండ్య నిర్మాణమైన ఈ చిన్న ఆలయంలో ఉన్న ఒకే ఒక్క విశేషం శ్రీ కేశిన వేందన్ పెరుమాళ్. 
అంత ఆకర్షణీయంగా నిలువెత్తు రూపంలో  విశేష అలంకరణలో శయనభంగిమలో ఉంటారు మూలవిరాట్టు. శేషతల్పం మీద విలాసంగా పవళించిన స్వామి పాదాలకు ఇరుపక్కలా తయారులు శ్రీ దేవి, భూదేవి ఉపస్థితులై ఉంటారు. ఈ భంగిమలో స్వామి సుందర ముఖారవిందాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోగలరు. కానీ అర్చనామూర్తి పాదదర్శన చేయనిదే సందర్శనా ఫలితం దక్కదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువలన బ్రహ్మ కడిగిన పాదాలను భక్తులు దర్శించుకోడానికి ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. 
భూమిపాలక పెరుమాళ్ సున్దర వదనాన్ని దర్శించుకున్న భక్తులు గర్భాలయానికి ప్రదక్షణ చేస్తూ ఉత్తరం పక్కన ఏర్పాటు చేసిన కిటికీ గుండా ముల్లోకాలను కొలిచిన పాదాలను దర్శించుకొంటారు. ఇలాంటి ఏర్పాటు, విశేషం మరొక  దివ్య దేశంలో కనిపించదు. 
తిరుప్పుళింగుడి  బుధ గ్రహ పరిహార క్షేత్రం. దోషనివారణ పూజలు, జపాలను పెద్ద ఎత్తున జరుగుతుంటాయి ఇక్కడ. 
నమ్మాళ్వార్ తన పాశురంలో " ఆగ్రహంతో గరుత్మంతుని మీద కూర్చొని నీవు ఓ కేశినవెంద పెరుమాళ్ మాలి, సుమాలి లాంటి అసురులను సంహరించావు. ఆ సమయంలో నీ రూపం బంగారు వర్ణంతో శోభించే మేరు పర్వత శిఖరాన్ని ఆక్రమించిన కాలమేఘంలా దర్శనమిచ్చినది. రత్నఖచిత కిరీటంతో సహా అనేకానేక స్వర్ణాభరణాలను అలంకరించుకొని, పంచాయుధాలను ధరించి  తిరుప్పుళింగుడి లో కొలువైన నీవు నా ఇహలోక కష్టాలను దూరం చేసి నిరంతరం నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించు" అంటూ స్వామివారిని ప్రశంసిస్తూనే మదిలోని కోరికను విన్నవించుకొన్నారు ఆళ్వార్. 

రాహు కేతు స్థలం - ఇరట్టై తిరుపతి 

ఇరట్టై అంటే రెండు. రెండు ఆలయాలు పక్కపక్కనే ఉన్నందున ఈ క్షేత్రానికి ఈ పేరొచ్చినది. ఉండటానికి రెండు అయినా వీటిల్లో ఒక్కటే దివ్యదేశం. కానీ ఒక ఆలయం రాహు, మరో ఆలయం కేతు పరిహార స్థలాలుగా ప్రసిద్ధి.
తిరుప్పులింగుడి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో దక్షిణ పక్క ఉన్న ఆలయంలో  దేవేరులు శ్రీ దేవి, శ్రీ కరుణ తాండన్ నాంచారీలతో శ్రీ అరవిందలోచన పెరుమాళ్, ఉత్తరం పక్క ఉన్న దానిలో శ్రీ దేవపిరన్ పెరుమాళ్ కొలువై ఉంటారు.
నమ్మాళ్వార్ శ్రీ అరవిందలోచన పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశురగానం చేశారు. అందువలన ఆ ఆలయమే దివ్యదేశం. రెండు ఆలయాలలో రాహుకేతు గ్రహ శాంతి జపాలు, పూజలు జరుగుతుంటాయి.
రెండూ చిన్న ఆలయాలే ! శ్రీ దేవపిరన్ ఆలయంలో స్వామి ఒక్కరే కొలువై ఉంటారు. అమ్మవార్లు ఉండరు.  ఈ క్షేత్రానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది.

పౌరాణిక గాధ 

సుప్రభ మహర్షి శ్రీ లక్ష్మీనారాయణుని దర్శనం అపేక్షించారట. శ్రీహరిని సంతృప్తి పరచడానికి తపస్సు చేయ నిర్ణయించుకున్నారట. దానికి తగిన స్థలం పవిత్ర తమిరపారాణి నదీతీరంలోని ఈ క్షేత్రం తగినదిగా తలంచారట. 
యజ్ఞగుండం తవ్వే క్రమంలో ఒక విల్లు, ఒక త్రాసు బయల్పడినాయట. మహర్షి వాటిని తాకిన మరుక్షణం త్రాసు సుందర యువతిగా , విల్లు అందమైన యువకునిగా మారిపోయారట. మహామునితో వారు  తాము గంధర్వులమని, ఇక్కడ సరససల్లాపాలలో మునిగి తేలుతూ కుబేరుని'రాకను గమనించక ఆయన శాపంతో ఇలా మారి పోయామని తెలిపారట. ఒక మహర్షి చేతి స్పర్శతో శాపవిమోచనం లభిస్తుంది అని అన్నారట కుబేరుడు. సుప్రభునికి కృతఙ్ఞతలు తెలుపుకొని వారు వెళ్లిపోయారట. అలా ఈ క్షేత్రానికి " తులం (త్రాసు), విల్లి (విల్లు) మంగళం" అన్న పేరొచ్చినది. కానీ రెండు ఆలయాలు ఉండటం వలన ఇరట్టై తిరుపతిగానే ప్రసిద్ధి. 
మహాముని తలపెట్టిన యాగం దిగ్విజయంగా పూర్తి అయినదట. సాక్షాత్కరించిన వైకుంఠనాధుడు ఇక్కడ " శ్రీ దేవపిరన్" గా కొలువుతీరారట. 
ప్రతి నిత్యం మహర్షి దాపున ఉన్న కోనేటి నుండి కలువ పూలను సేకరించి స్వామిని అందంగా అలంకరించేవారట. ఆ పుష్పాల సౌదర్యానికి, సౌగంధానికి మైమరచి అలంకార ప్రియుడు ముని ఎక్కడ నుండి ఇంత చక్కని పూలను తీస్తున్నాడా అన్న సందేహంతో ఒకరోజు ఆయనను అనుసరించారట. 
గలగలా సాగుతున్న నదీప్రవాహం, చుట్టూ పర్వతాలు, ఎత్తుగా పెరిగిన వృక్షాలు, మందగమనంతో సాగుతున్న వాయుదేవుని మృదుస్పర్శ ల మిశ్రమంగా అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది. అన్నింటికీ మించి కోనేరులోని పుష్పాలు. అన్నింటిని మైమరచి వీక్షిస్తున్న పరంధాముని వద్దకు ఇంద్రుడు, వాయువు, వరుణుడు వచ్చి ఈ పద్మనాభ పుష్కరణి ఒడ్డున కూడా కొలువు తీరమని అర్ధించారట. అంగీకరించారట  పద్మనాభుడు. నయనాలను విప్పార్చుకుని కలువ పూలను చూసిన స్వామిని తగినట్లుగా "శ్రీ అరవిందలోచనుడు" అని పిలవసాగారు. 

పద్మనాభ పుష్కరణి 

పెరుమాళ్ళనే ఆకర్షించిన పుష్పాలు  కలిగిన ఈ పుష్కరణి మరో విశేషం కలిగి ఉన్నది.  అదేమిటంటే తొలినాళ్లలో  మహర్షుల యజ్ఞ హవిస్సులో దేవ వైద్యులైన అశ్వనీ దేవతలకు భూగం ఉండేది కాదట. "తామూ దేవతలమే ! మాకూ భాగం కావాలని" వారు విధాతను కోరారట. ఆయన సలహా మేరకు వారు ఇక్కడికి వచ్చి నిత్యం పుష్కరణిలో స్నానం చేసి శ్రీ అరవిందలోచనుని అనుగ్రహం పొందారట. హవిస్సులో భాగం సంపాదించుకొన్నారట. దేవ వైద్యులు స్నానమాచరించిన నీరు కావడాన ఔషధ గుణాలను సంతరించుకొన్నవి అన్న విశ్వాసంతో భక్తులు ఈ నీటిలో స్నానం చేస్తారు. ముఖ్యంగా  మొండి చర్మవ్యాధులు గలవారు ఎక్కువగా వస్తుంటారు. 
మిగిలిన నవతిరుపతులలోని పెరుమాళ్ళ మీద మంగళ శాసనాలనుచేసిన శ్రీ నమ్మాళ్వార్ శ్రీ అరవిందలోచన స్వామి మీద కూడా ఒక పాశురాన్ని గానం చేశారు. 
పెరుమాళ్ సాక్షాత్కారం కాంక్షించే తన హృదయాన్ని వయస్సుకు వచ్చిన వనితతో, తనను తాను ఆమె తల్లిగా చూపుతూ  ఆమె తన కుమార్తె వేదనను ఎలా తెలుపుకుందో  వెలిబుచ్చారు ఈ పాశురంలో. 
"అందమైన నా కుమార్తె కాటుకతో తీర్చిదిద్దిన విశాల నేత్రాల నిండా పెరుమాళ్ళనే నింపుకొన్నది. నిత్యం వేదం పఠనం, వైదిక సిద్ధాంతం ప్రకారం సంప్రదాయాలను పాటించేవారితో, యజ్ఞయాగాదులను నిర్వహించేవారితో పవిత్రతను సంతరించుకొన్నది తిరు తులం విల్లి మంగళం. దివ్యదేశ గొప్పదనానికి చేతులు జోడిస్తోంది. శ్రీ అరవిందలోచనుని దివ్యనామం స్మరిస్తోంది. మితిమీరిన భక్తిభావంతో గొంతు జీరపోయింది. తాదాప్యంతో పరవశించి బాహ్యస్మృతి కోల్పోయినది" . యెంత గొప్ప భావన. 

తెందురిప్పెరై - శుక్రక్షేత్రం 

పావన తమిరపారాణి నదీతీరం లో నెలకొని ఉన్న నవ తిరుపతుల లో తెందురిప్పెరై ఒకటి శుక్ర క్షేత్రం. ఎవరైనా ఎంతటి వారైనా సవతి పోరును సహించలేరు  అన్న దానికి ఉదాహరణ గా నిలుస్తుంది ఈ క్షేత్ర గాధ.
శ్రీ జగన్నాధునికి తనకన్నా భూదేవి పట్ల అధిక ఆప్యాయత, అనురాగం ఉన్నాయనే అపోహతో భాధ పడేదట శ్రీ దేవి. ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వచ్చారట దుర్వాస మహముని. ఆయనకు తన మనసులోని ఆవేదనను తెలుపుకొన్నదట శ్రీ దేవి. మంచి రోజులు వస్తాయని ఓదార్చి ఆయన వెళ్లి పోయారట. తన దర్శనా క్రమంలో భూదేవి మందిరానికి కూడా వెళ్ళారట. ఆమె ఆయన పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి లో వ్యహ్వరించినదట. అతిధి మర్యాదలు సరిగ్గా చేయలేదట. ముక్కోపి అయిన మహర్షి ఆగ్రహించి పరంధాముని ప్రేమను పొందుతున్న ఆమె సౌందర్యం ఆమెను విడిచి పోవాలని శపించారట. 
శాపగ్రస్ధురాలైన భూదేవి శ్రీ మన్నారాయణుని శరణు కోరిందట. స్వామి వారు ముని శాపాన్ని తాము తొలిగించలేమని శాప విముక్తి కి తరుణోపాయం తెలిపారట. ఆ ప్రకారం తామ్రపర్ణి నదీతీరం లోని ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ వెలసిన స్వామి ని కొలుస్తూ తపస్సు చేయసాగిందట భూదేవి. ఒకనాడు నదిలో ఆమెకు మీనాకారంలో ఉన్న రెండు కర్ణ కుండలాలు లభించాయట. వాటిని శ్రీ వారి విగ్రహనికి అలంకరించినదట. దానితో ముని శాపం తొలగి పోయినదట. ఆమె సౌందర్యం తిరిగి పొందినదట. చేప ఆకారంలో ఉన్న చెవి కమ్మెలు ధరించినందున " శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ " అని పిలుస్తారు. అమ్మవార్లు శ్రీ కుళైకాడువల్లి మరియు శ్రీ తిరుప్పెరై నాంచారి. 
బ్రహ్మ, రుద్రుడు మరియు శుక్రుడు ఇక్కడ స్వామి దర్శనం పొందారు అని అంటారు. గురువు శాప కారణంగా అసురుల చేతిలో అపజయం పొందారట  వరుణుడు. ఇక్కడకు వచ్చి శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ ని సేవించి కోల్పోయిన శక్తి సామర్ద్యాలను  సాధించుకొని రాక్షసులను ఓడించారట. 
ఆలయం పాండ్య నిర్మాణం. సుందర పాండ్య కాలంలో వర్షాలు లేక కరువు ఏర్పడిందిట రాజ్యంలో. పండితుల సలహ మేరకు రాజు నూట ఎనిమిది మంది సామవేద పండితుల ఆధ్వర్యంలో స్వామి కి ప్రత్యేక పూజలు, వరుణుని రాక కొరకు యాగాలు నిర్వహంచారట. వానలు కురిసి దేశం తిరిగి సుభిక్షమైనదట. మరో విశేషం ఏమిటంటే అప్పటి దాకా సంతానం లేని పాండ్య రాజుకు ఈ యాగం తరువాత కుమారుడు జన్మించాడట. ఒకప్పుడు ఈ ఊరు వేద పండితుల అగ్రహారం. నిత్యం వేద పఠనం, యజ్ఞ యాగాదులు జరుగుతుండేవట . కాల క్రమంలో వారంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు అని అంటారు. 
చిన్న ఆలయం లోని మండప స్ధంభాల కు చక్కని శిల్పాలను చెక్కారు . గర్బాలయంలో శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో ఎడమ కాలుని చిత్రంగా మడిచి ఉంచి కనిపిస్తారు. మూలవిరాట్టు కు ఇరువైపులా బృగుమహర్షి,  మార్కండేయ మహర్షి నమస్కార ముద్రలో ఉంటారు. 
ఇద్దరు దేవేరులు విడి విడి సన్నిధులలో కొలువై ఉంటారు. 
తెందురిప్పెరై దివ్య దేశం గానే కాకుండా నవకైలాస క్షేత్రాల లో ఒకటి గా గుర్తింపు పొందినది. శ్రీ కైలాసనాధ స్వామి కొలువైన ఆలయ దర్శనం పుణ్యప్రదం. 
శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ ని కీర్తిస్తూ శ్రీ నమ్మాళ్వారు ఒక్కరే పాశురగానం చేసారు. ఆళ్వారు తిరునగరి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెందురిప్పెరై. 

తిరునెల్వేలి జిల్లాలో పావన తమిరపారాణి నదీ తీరంలో నెలకొన్ని ఉన్న నవ తిరుపతులు లేదా శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలలో చివరి రెండు స్థలాలు ప్రముఖమైనవిగా పేరొందినవి. కారణం ఆ క్షేత్రాలు పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖులైన శ్రీ నమ్మాళ్వార్ మరియు శ్రీ మధురకవి ఆళ్వారుల జన్మస్థానాలు కావడం. 

తిరుక్కోలూరు -  అంగారక క్షేత్రం    

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఒకరైన శ్రీ మధుర కవి జన్మస్ధలం. కవి, పండితుడు, శ్రీ మహవిష్ణువు భక్తుడు అయిన మధుర కవి ఎన్నో క్షేత్రాలను సందర్శించుకొన్నారు. దక్షిణ దేశంలో ఉన్న దివ్యదేశాలతో పాటు ఉత్తరభారతదేశం లోని దివ్య దేశాలను దర్శించుకొన్న ఒకే ఒక్క ఆళ్వారు ఈయనే ! 
యాత్రలు చేస్తూ అయోధ్య చేరుకుని రామ జన్మ భూమిని సందర్శించుకొన్న మధుర కవిని ఆకాశంలో అద్వితీయమైన ప్రకాశవంతమైన తార ఒకటి ఆకర్షించినదట. అది ఆయన ఉన్న ప్రాంతానికి దక్షిణ దిశగా ఉన్నదట. దానిని ఏదో దివ్య సందేశానికి సంకేతంగా భావించిన ఆయన ఆ దిశగా ప్రయాణించి తమిరపారాణి నదీతీరం లోని ఆళ్వారుతిరునగరి చేరుకొన్నారట. అక్కడ పుట్టినది మొదలు మౌనంగా చింత చెట్టు తొర్రలో ఉంటూ నిరాహరంగా ధ్యానంలో ఉన్న బాలుని గురించి తెలిసిందట. ఆయనే నమ్మాళ్వారు. ప్రధమ వీక్షణం లోనే ఆయన పట్ల గౌరవ భావం కలిగిందట. అది ఆయన తొలి సారిగా మధుర కవితో పలికిన మాటలతో స్థిరపడి వయస్సులో ఎంతో చిన్న వాడైన ఆయనను తన గురువు గా స్వీకరించారట. ఆ క్షణం నుండి ఆయన సేవలోనే ఉండిపోయారట. మధుర కవి గానం చేసిన కొద్ది పాశురాలలో నమ్మాళ్వారు గొప్పదనమే కనపడుతుంది. 
నమ్మాళ్వారు అవతార సమాప్తి సమయాన గరువు అండదండలు లేకుండా తను ఎలా ఉండగలను అని భాధపడ్డారట మధుర కవి. అప్పుడు నమ్మాళ్వారు ఒక మార్గం తెలిపి వైకుంఠానికి వెళ్ళిపోయారట. దాని ప్రకారం పవిత్ర తమిరపారాణి నీటిని తెచ్చి మరిగించగా ఒకటి తరువాత ఒకటిగా రెండు పంచ లోహ విగ్రహాలు ఉద్భవించాయట. మొదటిది అనంతరకాలంలో జన్మించిన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులది కాగా రెండవది శ్రీ నమ్మాళ్వారు ది. నవతిరుపతులలో మరోక క్షేత్రమైన ఆళ్వారు తిరునగరిలో మనం దర్శించుకొనే నమ్మాళ్వారు  విగ్రహం అదే! 
ఇక తిరుక్కోలూర్ లో కొలువై ఉన్నది శ్రీ వైధమానిధి పెరుమాళ్. శయనభంగిమలో కనిపించే స్వామి పేరుకు తగ్గట్టుగా అర్హులైన వారికి నవనిధులను ప్రసాదిస్తారన్నది భక్తుల విశ్వాసం. 
క్షేత్రగాధ కూడా దీనిని బలపరిచేదిగా ఉండటం విశేషం.
ఆదిదంపతుల దర్శనానికి కైలాసం వెళ్లిన కుబేరుడు పార్వతీదేవి సౌందర్యానికి చలించాడట. గమనించిన అమ్మవారు ఆగ్రహించి అతని అధీనంలో ఉన్న నవనిధులను కోల్పోయి దరిద్రం అనుభవించమని శపించారట.  తన తప్పుకు క్షమించమని వేడుకున్న కుబేరుని పావన 
తామ్రపర్ణి  నదీతీరంలో కొలువైన శ్రీ మహవిష్ణువును సేవించి శాపవిమోచనం పొందమన్నారట. శివాజ్ఞ ప్రకారం తిరుక్కోలూర్ క్షేత్రం లో స్వామిని సేవించుకొని అమ్మవారి శాపాన్ని తొలగించుకొన్నారట కుబేరుడు. 
నాటి నుండి నవనిధులు శ్రీ వారి అధీనంలో ఉండసాగాయట. ఈ కారణాన మూలవిరాట్టును శ్రీ వైధమానిధి పెరుమాళ్ అని పిలుస్తారు. కుబేరుడు నిర్మించిన ఆలయ పుష్కరిణి ని ఆయన పేరుతోనే పిలుస్తారు. 
సాదాసీదాగ ఉండే ఆలయాన్ని పాండ్య రాజుల నిర్మించారట. గర్బాలయంలో ప్రధాన అర్చనామూర్తి భుజంగశయనుడై దర్శనమిస్తారు. శ్రీ కుముదవల్లి, శ్రీ కోలూరువల్లి తాయారులు విడివిడిగా సన్నిధులలో కనిపిస్తారు. 
తిరుక్కోలూరు అంగారక పరిహార క్షేత్రం. భూమి పుత్రుని తరఫున శ్రీ వారే అన్ని పూజలు, ప్రార్థనలు, దానాలు మరియు జపాలను స్వీకరిస్తారు. అనుగ్రహిస్తారు. శ్రీ వైధమానిధి పెరుమాళ్ ను కీర్తిస్తూ నమ్మాళ్వారు ఒక్కరే పాశురగానం చేసారు.

ఆళ్వారు తిరునగరి (తిరుకుగునూర్ )

నాదముని ద్వారా మానవాళి కి నలయిర దివ్య ప్రభంధనాన్ని అందించిన నమ్మాళ్వారు జన్మస్థలం తిరుకుగునూర్. కానీ మహనీయుని జన్మస్ధలం గా ఆయన పేరు మీద ఆళ్వారు తిరునగరి అని పిలవసాగారు. 
నమ్మాళ్వారు అసలు పేరు మారన్. పదహారు సంవత్సరాల పాటు చింత చెట్టు తొర్రలో తపస్సు చేసారు. జీవితకాలం లో అక్కడి నుండి కదలలేదు. అయినా ఎక్కడెక్కడో కొలువైన శ్రీ హరి ని కీర్తిస్తూ పాశురగానం చేసారు. వైకుంఠుడు ఆయా రూపాలలో ధ్యానంలో ఉన్న నమ్మాళ్వారు కు దర్శనమిచ్చే వారని ప్రజలు విశ్వసిస్తారు. జీవిత సత్యాలను, మానవ జీవిత పరమార్దాన్ని లలిత లలిత తమిళ పదాలతో అందరికీ అర్దమయ్యే రీతిలో పాశురగానం చేయడం వలన ప్రజలు ప్రేమతో మన ఆళ్వారు అని అర్దం వచ్చేలా నమ్మాళ్వారు అని పిలవసాగారు.
కీర్తనాప్రియుడైన శ్రీమన్నారాయణుని సైన్యాద్యక్షుడైన విష్వక్సేనుని అవతారమే నమ్మాళ్వారు అని భావిస్తారు. 
నలయిర దివ్య ప్రభంధం లోని నాలుగు వేల పాశురాలలో నమ్మాళ్వారు ఒక్కరే గానం చేసిన వెయ్యి పాశురాలు ఉండటం విశేషం . 
నమ్మాళ్వారు వైకుంఠం వెళ్లి పోయిన తరువాత మధుర కవి తన గురు దేవుడు రచించిన కీర్తనలను పాండ్య రాజు ఏర్పాటు చేసిన పండిత సమాఖ్య కు సమర్పించారట. వారు వాటిని మిగిలిన కవులు రచించిన కావ్యాలతో కలిపి ఒక తాటి ఆకు మీద ఉంచి కోనేటి లోనికి వదిలారట. చిత్రంగా మిగిలినవి నీటిలో మునిగిపోగా నమ్మాళ్వారు రచించినవి ఆకు మీద ఉండి పోయాయట. తరువాత వాటిని పూర్తిగా అధ్యయనం చేసిన సమాఖ్య ఆ నాలుగు సంపుటాలు నాలుగు వేదాలతో సమానమని నిర్ణయించారట. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవతిరుపతులలో నమ్మాళ్వారు జన్నదినాన ఆయన గౌరవార్థం గరుడ సేవ ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 
శ్రీ ఆదినాధ పెరుమాళ్ ఈ క్షేత్రంలో మూలవిరాట్టు. ఇక్కడ ఇంద్రుడు,  విధాత,  బృహస్పతి,  నమ్మాళ్వారు మరియు మధుర కవి శ్రీవారి దర్శన భాగ్యం పొందారట
అయిదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మింపబడిన ఆలయానికి తూర్పున తొంభై ఏడు అడుగుల రాజగోపురం విష్ణు లీలా విన్యాసాల శిల్పాలతో సుందరంగా కనపడుతుంది. మూడు ప్రాకారాలు కలిగిన ఈ దివ్య క్షేత్రంలో ని తిరుమంజన, తిరుమామణి , కన్నాడి మండపాలు చక్కని శిల్పాలతో అలరిస్తాయి. ఇవే కాకుండా మరెన్నో శిల్ప విన్యాసాలు అబ్బురపరుస్తాయి. సప్త  స్వరాలు పలికే రాతి నాద స్వరం, సంగీత స్ధంభాలు నాటి శిల్పుల ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా నిలిచి ఉన్నాయి. 
ఉపాలయాలలో శ్రీ రామ, శ్రీ వేణుగోపాల, శ్రీ నృసింహ, శ్రీ వరాహ స్వామి, శ్రీ ఆంజనేయ, శ్రీ లక్ష్మీ, శ్రీ ఆదినాధ వల్లి  కొలువైఉంటారు. 
ప్రత్యేక సన్నిధి లో దర్శనమిచ్చే శ్రీ నమ్మాళ్వారు విగ్రహం ఆయన సూచించిన మేరకు తమిరపారాణి నది నీటిని మరిగించగా మధుర కవి ఆళ్వారుకు లభించిన పంచలోహ విగ్రహం. ఎవరూ మలచిన ది కాదు. స్వయంవ్యక్త మూర్తి. 
గర్బాలయంలో శ్రీ ఆదినాధ పెరుమాళ్ స్ధానక భంగిమలో  రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు. ఇక్కడ స్వామి వారి పాదాలు భూమిలో ఉంటాయి. కనుక పాదదర్శనం లభించదు. 
నమ్మాళ్వారు తపస్సు చేసిన చింత చెట్టును  ప్రాంగణంలో చూడవచ్చును. దీని వయస్సు రెండు వేల సంవత్సరాల పైచిలుకు గా శాస్త్రవేత్తలు నిర్ణయించారట.  
నమ్మాళ్వారు శ్రీ ఆదినాధ పెరుమాళ్ మీద పదకొండు పాశురాలను గానం చేశారు.

జై శ్రీ మన్నారాయణ! ! ! ! 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...