24, మార్చి 2020, మంగళవారం

Kanchipuram Temples - 2

                           కాంచీపురం - దివ్య దేశాలు -2




సప్త ముక్తి క్షేత్రాల లో ఒకటి గా కీర్తించబడే కాంచీపురం లో మొత్తంగా పదునాలుగు శ్రీ  వైష్ణవ దివ్య తిరుపతులు ఉన్నాయి అని గతంలో తెలుసుకొన్నాము కదా ! ఆ ప్రకారం ఇప్పటి దాకా పది క్షేత్రాలను పరిచయం చేయడం జరిగింది. మిగిలిన నాలుగు ఆలయాల గురించి ఈ సంచికలో తెలుసుకొందాము. ఈ నాలుగు కూడా పెద్ద లేదా శివ కంచి లో ఉండటం విశేషం.  అంతే కాదు వీటిలో ఒకటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో మరొకటి శ్రీ కామాక్షి అమ్మన్ కోవెలలో ఉండటం చెప్పుకోవలసిన విషయం. వీటితో పాటు కంచీపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో  ఉన్న మరో దివ్య దేశ విశేషాలను కూడా చూద్దాము. 

శ్రీ పాండవదూత పెరుమాళ్ ఆలయం 

ఆళ్వారులు ఈ క్షేత్రాన్ని "తిరుప్పాదగం " ( శ్రీ +పెద్ద +క్షేత్రం ) అని పాశురాలలో సంభోధించారు. పేరుకు తగ్గట్టుగా కొలువైన "శ్రీ పాండవదూత పెరుమాళ్ " అర్చామూర్తి పాతిక అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో దర్శన మిస్తారు. కురుక్షేత్ర యుద్దానికి ముందు వాసుదేవుడు పాండవుల తరుఫున రాయబారిగా కౌరవ సభకు వెళతారు. ఆయన హితోపదేశాలు,  హెచ్చరికలు రారాజు కు ఆగ్రహం కలిగించాయి. దూతను గౌరవించాలని తెలిసినా కోపంతో శ్రీ కృష్ణుని భంధించ యత్నించాడు. నిజభక్తులకు కన్నుల పండుగ కలిగించేలా, దూర్తులను భయకంపితులను చేసేలా జగద్రక్షకుడు విశ్వరూపాన్ని ప్రదర్శించారు.  తదనంతరకాలంలో పాండవుల ముని మనుమడైన జనమేజయుడు ఈ వృత్తాంతం విని శ్రీ హరి విశ్వరూప దర్శనాన్ని ఆకాంక్షించారట.  గురువైన హరిత మహర్షి సలహ మేరకు కాంచీపురం లో యజ్ఞం చేసి తన ఆకాంక్ష నెరవేర్చుకొన్నారట. ఆయన కోరిక మేరకు స్వామి ఇక్కడ శ్రీ పాండవదూత పెరుమాళ్ గా కొలువు తీరానికి క్షేత్ర గాధ తెలుపుతోంది.
తూర్పు ముఖంగా ఉండే ఆలయ గర్బాలయంలో సింహసనం మీద ఉపస్థిత భంగిమలో అభయ ముద్ర తో ఆకాశాన్ని తాకుతుందా అనిపించే రూపంతో కనిపించే మూలవిరాట్టు నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. అమ్మవారు,  శ్రీ చక్రత్తి ఆళ్వారు తమ తమ సన్నిధులలో కొలువై  ఉంటారు. 
పల్లవులు నిర్మించిన ఆలయాన్ని చోళులు,  విజయనగర రాజులు అభివృద్ధి చేసారు అనడానికి ఆలయంలో లభించిన ఎనిమిదో శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దానికి చెందిన శాసనాలు నిదర్శనంగా కనిపిస్తాయి. 
శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ పాండవదూత పెరుమాళ్ ను కీర్తిస్తూ మొదల్ ఆళ్వారులలో ఇద్దరైన పెయ్ ఆళ్వారు, భూతత్తి ఆళ్వారులతో పాటు తరువాతి కాలానికి చెందిన తిరుమలై సై ఆళ్వారు, నమ్మాళ్వారు పాశురగానం చేసారు. అలా దివ్య దేశ గౌరవాన్ని పొందిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టు ప్రధాన ఆకర్షణ.

శ్రీ పావళవన్నన్ పెరుమాళ్ ఆలయం

స్థానికంగా శ్రీ పావళవన్నన్ కోవెల గా పిలవబడే ఈ దివ్య దేశాన్ని తమ పాశురాలలో ఆళ్వారులు "తిరుపళ్ళవణ్ణం"గా పేర్కొన్నారు. కుంకుమ వర్ణ శోభితులుగా దర్శనమిచ్చే స్వామిని శ్రీ పావళవన్నన్ అని పిలుస్తారు. కృతయుగం నుండి స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని అనేక పురాణాలలో,  పెక్కు పురాతన తమిళ గ్రంధాల లో పేర్కొనబడినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్ర గాధ ఇలలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరడానికి సంభంధించిన కధ తో ముడిపడి ఉండటం విశేషం. 
పూర్వం మహర్షులకు " త్రిమూర్తులలో ఎవరు అగ్రగణ్యులు, ప్రధమ పూజితులు?  ఎవరికి యజ్ఞఫలం సమర్పించు కోవాలి? "అనితలెత్తిన సందేహన్ని తొలిగించాలని, బయలుదేరారు బృగుమహర్షి  
తనను గుర్తించి  గౌరవించలేదని అహంకరించి విధాత ను,  కైలాసవాసుని శపించి శ్రీ మహవిష్ణువు హృదయం తన్నిన కధ మనకందరకూ తెలిసిందే!  అలా మహలక్ష్మీ నిలయం అయిన శ్రీ వారి వక్షస్ధలం పైన పాదం తో తప్పడం వలన సంక్రమించిన పాపఫలం తొలగించుకోడానికి ఇక్కడ తపస్సు చేశారు బృగుమహర్షి. సంతసించి దర్శనమిచ్చిన వైకుంఠుడు " శ్రీ పావళవన్నన్ " గా కొలువుతీరారు. గర్బాలయంలో మూలవిరాట్టు తో పాటు కనిపించే బృగుమహర్షి మూర్తి ఈ క్షేత్ర గాధ కు బలం చేకూర్చుతోంది. 
శ్రీ పావళవన్నన్ ఉపస్థిత భంగిమలో కుడి కాలును కొద్దిగా మడిచి శంఖ చక్రాలను ధరించి అభయ ముద్రలో పడమర ముఖంగా కొలువై మనోహరమైన పుష్పాలంకరణతో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
తిరుమంగై ఆళ్వారు ఒక్కరే శ్రీ పావళవన్నన్ ని కీర్తిస్తూ పాశురగానం చేసారు. 
కంచి రైల్వే స్టేషన్ కు వెళ్ళేదారిలో ఉన్న ఈ ఆలయానికి ఎదురుగా "శ్రీ పచ్చయవన్నార్ పెరుమాళ్ " ఆలయం ఉన్నది. దివ్య దేశం కాకున్నా విశేష ఆలయం.దర్శనీయం. 

శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ ఆలయం. 

ఒకప్పుడు సహస్రాధిక ఆలయాలతో అలరారిన కాంచీపురం లో ప్రస్తుతం కొద్ది మాత్రమే మిగిలాయి. వాటిల్లో ప్రముఖమైనవి  శ్రీ ఏకాంబరేశ్వర,  శ్రీ కైలాసనాధ, శ్రీ కామాక్షి అమ్మన్, శ్రీ వరదరాజ పెరుమాళ్ ఇలా ఉన్నది జాబితా!  
నగరంలో ఉన్న శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటి ప్రసిద్ధ శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండటం విశేషం. 
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకనాడు కైలాసంలో సరస సల్లాపాల మధ్య పార్వతీదేవి త్రినేత్రుని నేత్రాలను తన కోమల హస్తాలతో క్షణకాలం మూసిందట. జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులు ఆ నేత్రాలు. క్షణకాలం అయినా లోకాలన్నీ తల్లడిల్లిపోయాయట. తెలియక చేసినా తప్పు తప్పే కనుక పరిహరం చెల్లించుకోడానికి అర్దనారీశ్వరుని అనుమతితో కాంచీపురం చేరుకొన్నదట గౌరీదేవి. ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి భక్తి శ్రద్దలతో సేవించసాగిందట. కొంతకాలానికి ఆమె పరీక్షింపనెంచారట. తన జటాజూటాల నుండి గంగను వదిలారట. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహవేగానికి సైకతలింగం ఎక్కడ మునిగి పోతుందో అని భయపడిందట. ఆందోళనతో కామాక్షి దేవి శ్రీ మహవిష్ణువు ను శరణు కోరిందట. ఆయన ఆమెను లింగాన్ని ఆలింగనము చేసుకోమని చెప్పి తాను విశ్వరూపాన్ని ధరించి ప్రవాహనికి అడ్డుగా శయనించారట. ముల్లోకాలకు విస్తరించిన శ్రీహరి ని దేవతలు,  మహర్షులు స్థుతించసాగారట. ఆ సమయంలో చంద్రుని కిరణాలు సోకి శ్రీ వారి కంఠం నీలంగా మారిందట. అందుకే స్వామిని "శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ "అని పిలుస్తారు.
శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ని అమ్మవారు కౌగలించుకోవడం వలన లింగం పైన ఆమె కరకంకళాల మరియు వక్షోజాల ముద్రలు పడినాయట. వాటిని నేటికీ లింగం మీద చూడవచ్చని చెబుతారు. ఉమా దేవి తపమాచరించిన మామిడి చెట్టు కూడా ప్రాంగణంలో ఉన్నది. 
విశాల ఆవరణంలో ఉండే  శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయాన్ని తొలుత పల్లవులు, చోళులు నిర్మించారని తెలుస్తోంది. తరువాత విజయనగరాధీశుడు శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయంలో ఎన్నో మండపాలు,  ఉపాలయాలను నిర్మించారు. రాజగోపురం కూడ ఆయన కాలంలోని నిర్మాణమే. చక్కని శిల్ప సౌందర్యాన్ని ప్రదర్శిస్తుందీ ఆలయం. ప్రదక్షిణా మార్గంలో ఉన్న 
గర్భాలయానికి ఎదురుగా చిన్న మందిరంలో దర్శనమిస్తారు పెరుమాళ్. దేవేరులు, ధ్వజస్తంభం, బలిపీఠం,  గరుడుడు ఏమీ ఉండవు. శైవార్చకులే పూజలు చేసే ఈ మందిరంలో ఆదిశేషుని పడగ ను ఛత్రం చేసుకుని చతుర్భుజాలతో స్తానక భంగిమలో రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్. 
పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ఒక్క తిరుమంగై ఆళ్వారు ఈ పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశురగానం చేసారు. 

శ్రీ కల్వర పెరుమాళ్ ఆలయం

కాంచీపుర ఏలిక ,అధిష్టాన దేవత, అష్టాదశ పీఠవాసిని అయిన శ్రీ కామాక్షి అమ్మన్ గాయత్రీ మండపంలో కొలువై పూజలందుకొంటుంటారు. కొలిచిన వారికి కొంగు బంగారం ఈ అమ్మ. సతీదేవి నాభి భాగం పడిన ప్రదేశం ఇదే అని చెబుతారు. 
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులుఅమ్మవారిని దర్శించుకోడానికి వస్తుంటారు. నిత్యం పర్వదినమే ఈ ఆలయంలో. 
అమ్మవారి సన్నిధి కి సమీపంలోనే ఉంటారు " శ్రీ కల్వర పెరుమాళ్ ". అలాగని ఆయన ఉన్నది పెద్ద ఆలయమో లేక ఉపాలయమో కాదు. ఒక మండప స్ధంభం మీద చతుర్భుజాలతో స్తానక భంగిమలో దర్శనమిస్తారు. కానీ స్వామి ని నేరుగా చూసే భాగ్యం లేదు. ఆలయ వెలుపల ఉంచిన దర్పణం లోనే పెరుమాళ్ ప్రతి రుపాన్ని వీక్షించగలము. ఈ క్షేత్ర గాధ ఇలా ఉన్నది.
సముద్ర రాజ తనయ, వెన్నెల రేడు శశాంకుని సోదరి అయిన శ్రీ మహలక్ష్మీ దేవి మేనిది బంగారు వన్నె ఛాయ. మరి శ్రీ మన్నారాయణుడో నీలమేఘ  శ్యాముడు. నల్లని వాడని సరదాగా గేలి చేస్తుండేది పద్మనయన. అనుకోకుండా ఒక రోజు ఆగ్రహించిన లక్షీనారాయణుడు ఆమె దేహ వర్ణం కోల్పోవాలని శపించారు. నల్లగా మారిపోయింది దేవేరి. ఏమి చేయాలో తెలియక భూలోకం లోని కాంచీపురం లో ఉన్న కామాక్షి దేవి వద్దకు వెళ్లారు. ఆమె ఈమెను ఓదార్చి తనకు భక్తులు చేసే కుంకుమ పూజ వలన కోల్పోయిన మేని ఛాయను  తిరిగి పొందగలదని వరమిచ్చారు. అలా సకల సంపదలకు అధిదేవత కంచిలో "అరూపలక్ష్మి"గా నేటికీ కొలువైన ఉన్నారు. అక్కడ వైకుంఠంలో స్వామి ఆమె ఎడబాటు ను సహించలేక ఎక్కడ ఉన్నదీ తెలుసుకొన్నారు. దీంతో  ఆయన కూడా కంచి చేరుకొన్నారు. బింకం సడల కూడదు.  ఎవరికీ తెలియకూడదు అన్న ఆలోచనతో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గాయత్రీ మండపం వద్దకు వెళ్ళసాగారు. కానీ ఈయన రాకను గమనించిన హృదయవాసిని " కల్వరా" అంటూ ప్రేమగా పిలిచారు. కల్వర అనగా " అందమైన చోరుడు". 
ఉలికిపాటుకు గరైన వైకుంఠుడు మండప స్ధంభం మీద శిలగా నిలిచారు. కల్వరుడు కొలువైన ప్రదేశంగా దీనిని "తిరుకల్వనూరు "గా తిరుమంగై ఆళ్వారు తన పాశురంలో పేర్కొన్నారు. 

శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఆలయం. తిరుపహిషి 

పరంధాముని  భక్తవత్సలతకు ఎల్లలు లేవు అని తెలిపే ఈ ఆలయ గాధ శ్రీ మద్రామయణం నాటి సంఘటనతో ముడిపడి ఉన్నది. 
దశకంఠుడు అపహరించుకొని పోతున్న సీతాదేవి ని కాపాడాలని శక్తి మేరకు పోరాడాడు పక్షిరాజు జటాయువు. చివరకు రెక్కలు తెగి నేలవాలాడు. జానకి దేవిని వెతుకుతూ తన వద్దకు వచ్చిన రామలక్ష్మనులకు విషయం తెలిపి దశరధ రాముని ఒడిలో కన్ను మూసాడు. అతను తమకు చేసిన సహయానికి శాస్ర్తోక్తంగా అంత్యక్రియలు చేయ నిర్ణయించారు రామయ్య. 
కార్యక్రమానికి కావలసిన నీటి కొరకు శరప్రయోగం తో పాతాళగంగ ను రప్పించారు. అదే ఆలయంలో ఉన్న "జటాయువు పుష్కరిణి ". 
వేగావతి నదీతీరం లో ప్రశాంత రమణీయ వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ విజయ రాఘవ పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో తూర్పు ముఖంగా దేవేరులు శ్రీ దేవి భూదేవి తో కలిసి దర్శనమిస్తారు. మూలవిరాట్టు ఒడిలో జటాయువు ను చూడవచ్చును.  పక్షిరాజు మరణానికి చింతిస్తున్నట్లుగా అమ్మవార్లు తమ ముఖాలను పక్కకు తిప్పుకొన్న భంగిమలో కనిపిస్తారు. కొద్ది దూరంలో ఉన్న చిన్న కొండ మీద జటాయువు ఆలయం కలదు.
పక్షిరాజు జటాయువు ప్రభుసేవలో ప్రాణం విడిచిన ప్రదేశం కనుక "తిరుపహిషి "(శ్రీ పక్షి ) అన్న పేరుతో పిలవసాగారు. 
తిరుమంగై ఆళ్వారు శ్రీ విజయరాఘవపెరుమాళ్ ను కీర్తిస్తూ పాశురగానం చేసారు.
ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న మరో విశేషం ఉన్నది . పరమాచార్య శ్రీ రామానుజాచార్యులు అద్వైత సిద్దాంతాన్ని గురువు శ్రీ యాదవ ప్రకాశుల వద్ద ఇక్కడి మండపంలో నేర్చుకొన్నారట. ఆలయం వద్ద ఆ మండపాన్ని నేటికి చూడవచ్చును.
కాంచీ పురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం చేరుకోడానికి బస్సులు, ఆటోలు లభిస్తాయి. 
ఇక్కడి తో కాంచీపుర దివ్య దేశాల విశేషాలు సమాప్తం.


జై శ్రీ మన్నారాయణ! !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...