17, జులై 2018, మంగళవారం

Sri swarnattu Mana , Pazhamthottam

               

                  శ్రీ కనకధారా స్తోత్రం చదివిన ఇల్లు ఇదే !






మనలో చాలా మంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కొరకు కనకధారా స్తవం లేదా స్తోత్రం నిత్యం పారాయణం చేస్తుంటాము. ఇది జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల విరచితం అని కూడా మనకు తెలుసు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఈ అద్వైత సిద్ధాంత స్థాపకుల జన్మస్థలం కేరళ లోని కాలడి. త్రిమతాచార్యులలో ప్రధములు. ఈయనను స్వయం కైలాసనాధుని అవతారంగా ప్రస్తుతిస్తారు. శంకరులు పిన్న వయస్సులోనే భారతదేశం అంతా పర్యటించారు. అనేక ఆలయాలను సందర్శించుకున్నారు. చాలా అమ్మవారి ఆలయాలలో  శ్రీ చక్ర స్థాపన చేశారు. అదే విధంగా  గణేష పంచ రత్న స్తోత్రం, శివానందలహరి, భజగోవిందం, శ్రీ సుబ్రమణ్య, శ్రీ నారసింహ కరావలంబ స్తోత్రాలు, శ్రీ అన్నపూర్ణాష్టకం రచించారు. మరెన్నో స్తోత్రాలు కూడా మానవాళికి అందించారు. వేదాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీత కు, బ్రహ్మ సూత్రాలకు, శ్రీ విష్ణు సహస్ర నామాలకు  తనదైన శైలిలో సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో భాష్యం రచించారు.  
చిన్నతనంలో బ్రాహ్మణ వటువుగా ప్రతి నిత్యం కొన్ని గృహాలలో భిక్ష తీసుకోవడం జగద్గురువుల నిత్యకృత్యం. అలానే ఒక రోజున ఒక గృహానికి వెళ్లారు. అదొక నిరుపేద బ్రాహ్మణ గృహం. ఆ ఇంటిలో నివసిస్తున్న బ్రాహ్మణ దంపతులు భోజనం చేసి కొన్ని రోజులైనది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ఇంటి ఇల్లాలు ధరించడానికి మరో చీర లేని పరిస్థితి. 













ఈ విషయాలేవీ తెలియని బాల బ్రహ్మచారి గుమ్మంలో నిలిచి "భవతీ భిక్షం దేహి !"అని అర్ధించాడు. విన్న ఆమె మనసు విలవిల్లాడి పోయినది. కారణం ఇంట్లో అతిథికి అందించడానికి ఏమీ లేవు. అయినా ఆమె ఆరని తడి చీరే ధరించి, ఇల్లంతా వెదికినది. చివరకి ఒక బుట్టలో బాగా పండి వడలి పోయిన ఉసిరి కాయ లభించినది. ఆమె అభ్యాగతిని రిక్త హస్తాలతో పంపడం మనస్కరించక ఉన్నదే ఇచ్చి పంపుదామన్న నిర్ణయానికొచ్చినది. తలుపు వారగా తెరచి వాకిట నిలిచిన బాలునికి కనిపించకుండా ఉసిరి కాయను అరుగు మీద ఉంచినది. 
దానిని చూడగానే వారి ఇంట తాండవిస్తున్న దరిద్రాన్ని గ్రహించాడా బాలుడు. నవ్వుతూ ఆ ఉసిరిని స్వీకరించి ఆకాశం వంక చూసి "అజ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ"   అంటూ సంపదలకు అధిదేవత అయిన ఆ సముద్రరాజ పుత్రికను ప్రార్ధించసాగాడు. ఈ ఇరవై రెండు చరణాల స్తోత్రం పూర్తి అయ్యేటప్పటికి ఆశ్చర్యంగా ధారగా బంగారు ఉసిరి కాయల వర్షం కురిసింది. 







తమ దరిద్రాన్ని తొలగించినందుకు ఆమె ఆనందంతో అతనికి మొక్కినది. నాటి నుండి ఆ బ్రాహ్మణ కుటుంబం "స్వర్ణత్తు మన" (బంగారాన్ని పొందిన వంశం)గా పిలవబడుతోంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం "పళంతొట్టం" అనే చిన్న పల్లెటూరు ! ఆ వంశం వారు, నేటికీ అక్కడ నివసిస్తున్నారు. ఆ ఇల్లు కూడా ఉన్నది. కాలాడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.












ప్రస్తుత గృహం రెండున్నర శతాబ్దాల క్రిందట పాత ఇంటి స్థానంలో నిర్మించబడినట్లుగా చెబుతారు. ఈ ఇంటి యొక్క గొప్పదనం తెలిసిన మలయాళీలు  కొందరు శ్రీ కనకధారా స్మృతి ట్రస్ట్" ఒక దాన్ని స్థాపించారు. వీరు ముంబాయిలో స్థిరపడినందున అక్కడే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీ హరి కృష్ణన్ అనే స్థానికుని పర్యవేక్షకునిగా నియమించారు.










ఈయన ఆధ్వర్యంలో ఊరికి చివర స్వర్ణత్తు మన వారికి చెందిన భూమిలో ఒక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి, శ్రీ ఆది శంకరుల ఆలయాలను నిర్మిస్తున్నారు. ఆలయాలే కాకుండా వైదిక కేంద్రం, 
 ధ్యాన కేంద్రం, నక్షత్ర వనం,వృద్దాశ్రమం, యాత్రీకుల విశ్రాంతి భవనం లాంటివి ఏర్పాటు చెయ్యాలన్న సంకల్పంలో ఉన్నారు ట్రస్ట్ సభ్యులు. నిర్మాణము వేగంగా సాగుతోంది.
స్వర్ణత్తు మన ఇంటి ముందు ఒక సూచన ఉంటుంది. దానిలో ఇంటిలోని వారికి ఇబ్బంది కలిగించ కుండా ముందు వసారాలో ఉన్నజగద్గురువుల చిత్రపటం వద్ద కూర్చొని కనకధార స్తోత్రం పఠించుకొని వెళ్ళవలసినదిగా అభ్యర్ధిస్తారు. శంకరాచార్య చిత్ర పటంవద్ద నిరంతరం దీపం వెలుగుతూనే ఉంటుంది.




నూతన నిర్మాణం 







స్వర్ణత్తు మన పక్కనే కొద్దిగా లోపలికి వారి కుల దైవమైన శ్రీ భువనేశ్వరి దేవి పురాతన ఆలయం ఉంటుంది. నిత్య పూజలు జరుగుతాయి. చాలా పురాతన నిర్మాణం అని తెలిపే చిహ్నాలు కనపడతాయి ఇక్కడ.













ఇంతటి అదృష్టానికి నోచుకొన్న పళంతొట్టం, ఎర్నాకుళం జిల్లాలోనే ఉన్నది. అలువా నుండి పళ్ళిక్కర బస్సులో సులభంగా చేరుకోవచ్చును (20 కిలోమీటర్ల దూరం). స్వంత వాహనం ఉంటే ఎర్నాకుళం నుండి త్రిపునిత్తుర లేదా చోటానిక్కర నుండి అలానే కాలడి నుండి కూడా నేరుగా చేరుకోవచ్చును. రహదారి( అన్ని మార్గాలలో) మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. వర్షాకాలంలో మరీ ఎక్కువ.
నిత్యం రద్దీగా ఉండే పట్టణ వాతావరణానికి భిన్నంగా అత్యంత ప్రశాంతంగా, పచ్చని పరిసరాలకు నిలయమైన పళంతొట్టం వెళ్లడం, భక్తికి, భగవంతుని అనుగ్రహానికి కేంద్రమైన విశేష నిర్మాణాన్ని సందర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...