21, జులై 2018, శనివారం

Sri Nataraja Swamy Temple, Chidambaram

                      శ్రీ నటరాజ ఆలయం, చిదంబరం 




శైవ సాంప్రదాయం లో శ్రీ నటరాజ స్వామి కొలువైన చిదంబర కనక సభను "కోవెల" అని అంటారు. స్వామివారిని రత్న సభాపతి అని పిలుస్తారు. నూట ఎనిమిది  శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో తొలి స్థానంలో ఉన్న  శ్రీ రంగనాధుడు కొలువైన శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం మరియు పెరియ కోవిల్ అని గౌరవిస్తారు. అదే విధంగా రెండు వందల డెబ్బై అయిదు పడల్ పెట్ర స్థలాల లో అగ్రస్థానంలో ఉన్న చిదంబర ఆలయాన్ని "కోవెల" అని సగౌరవంగా సంభోదిస్తారు. భక్తులకు సంబంధించినంత వరకు ఈ రెండు సమాన హోదా కలిగినవి. 
ఆళ్వార్లు గానం చేసిన పాశురాల వలన శ్రీ వైష్ణవ దివ్యదేశాలు రూపొందాయి. అలానే శివ భక్తులైన నయమ్మార్లు గానం చేసిన పాటికాల కారణంగా పడల్ పెట్ర స్థలాలు అవతరించాయి. 
చిదంబరం గొప్పదనం అక్కడితో ఆగలేదు. పంచభూత స్థలాలలో  ఒకటి. కంచి (భూమి), జంబుకేశ్వరం (జలం), తిరువణ్ణామలై (అగ్ని), శ్రీకాళహస్తి (వాయు)కాగా  చిదంబరం లో ఉన్నది ఆకాశ లింగం (శూన్యము). అసలు చిదంబరం అనగా చిత్ - చైతన్యం, అంబరం - ఆకాశం.  భగవంతుడు ఉండే ఊర్ధ్వ లోకానికి సంకేతం. హిందూ మత గ్రంథాలన్నీ మానవుని అంతిమ లక్ష్యం సరేశ్వరుని పాదాల వద్దకు చేరడమే అని తెలుపుతున్నాయి కదా ! అలా చిదంబర నాధుని సందర్శనం సర్వపాపహరణం మరియు ముక్తికి సోపానం అన్నది తరతరాల విశ్వాసం. మరో సిద్ధాంతం ప్రకారం అంబళం అంటే వేదిక ! నృత్యాన్ని, అభినయాన్ని లేదా నటనను ప్రదర్శించేది వేదిక మీదనే కదా ! నటరాజ స్వామి ఆనందతాండవం చేసిన ప్రదేశంగా చిదంబరం అన్న పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఏది ఏమైనా చిదంబరం జ్ఞాన క్షేత్రం.  
మరో విషయం ఏమిటంటే తమిళనాడులో పంచ సభల సంప్రదాయం కలదు. ఆ అయిదు సభలు తిరువళంగాడు (రత్న సభ), చిదంబరం (కనకసభ), మధురై (వెండి సభ), తిరునెల్వేలి (తామ్ర సభ) మరియు కుర్తాళం (చిత్ర సభ).  ఈ అయిదు దివ్యదేశాలలో మహేశ్వరుడు ఆనంద తాండవం సలిపినట్లుగా పురాణ గాధలు తెలుపుతున్నాయి. అద్భుత ఆలయాలు. చక్కని శిల్పాలకు నిలయాలు ఈ అయిదు ఆలయాలు. 




    












పురాతన గ్రంధాలలో "తిలై"గా పేర్కొనబడిన చిదంబర క్షేత్రానికి సంబంధించిన పురాణ గాధ గురించి "చిదంబర మహత్యం" అన్న గ్రంధంలో వివరించబడినది.
తొలి యుగ కాలంలో ఈ సముద్రతీర ప్రాంతం తిలై వనా(మడ అడవులు)లతో నిండి ఉండేదట. అక్కడ ఎందరో  మహర్షులు నివసిస్తుండేవారు. తపోశక్తి వలన వారిలో అహం తలెత్తినది. తాము చేసే క్రతువులు వలన, లభించే శక్తి ద్వారా భగవంతుని కూడా తమ అధీనంలో ఉంచు కోవచ్చును అని భావించారు. విషయాన్ని గ్రహించిన హరిహరులు వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొన్నారు. పరమశివుడు అందమైన యువ బ్రహ్మచారిగాను, మహావిష్ణువు సుందర మోహినీ రూపంలో తిలై వనాలలో విహరించసాగారు. పురుషుని లో వ్యక్తమవుతున్న  రాజసానికి ముని వాటికల లోని స్త్రీలు ఆకర్షితులయ్యారు. అదే విధంగా మోహిని రూప లావణ్యా లకు మునులు దాసోహమయ్యారు. మాయామోహం నుండి తొందరగానే తేరుకున్న మహర్షులు బ్రహ్మచారితో ముచ్చట్లాడుతున్నతమ భార్యలను చూసి ఆగ్రహావేశులయ్యారు. అతనిని దండించాలని సర్పాలను పంపారు. అతను వాటిని వడిసి పట్టుకొని తన దేహం పైన కంఠ, కర్ణాభరణాలుగా అలంకరించుకొన్నాడు. అలా ఆయన నాగాభరణుడయ్యాడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు ఒక పెద్దపులిని తమ మంత్రశక్తితో సృష్టించారు. పరమ శివుడు దానిని చీల్చి చర్మాన్ని ధరించాడు. ఆ విధంగా పులి చర్మాంబరధారి అన్న పేరు పొందారు. రెండు యత్నాలను భంగపరచడంతో మరింత ఆగ్రహాంతో అజ్ఞానానికి ప్రతీకగా పేర్కొనే "మూయాలకన్" అనే మరగుజ్జు రాక్షసుని సృష్టించి అంపకం చేశారు. మహేశ్వరుడు తన నిజరూపం ధరించి ఆ రాక్షసుని పడగొట్టి అతని దేహం మీద ఆద్యంతమైన సుందర చిద్విలాస నాట్యం చేశారు. తాము భగవంతుని అనుగ్రహానికి ప్రయత్నించాలి గానీ ఆయనను నియంత్రించలేమన్న సత్యాన్ని గ్రహించారు మహర్షులు. వారి అహం తొలగి పోయింది. వారు తమ స్తోత్ర పాఠాలతో ఆయనను కీర్తించి, శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామి తిలై వనాలలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.


















తదనంతర కాలంలో నారదమహర్షికి శ్రీమన్నారాయణుడు, నటరాజ ఆనందతాండవం గురించి ప్రసంశాపూర్వకంగా వివరించడం విన్నాడు ఆదిశేషుడు. శ్రీవారి పాన్పు అయిన అతనికి ఆ నృత్యాన్ని తిలకించాలన్న ఆశ కలిగింది. గ్రహించిన శ్రీహరి ఆదిశేషువుని భూలోకం లోని చిదంబర క్షేత్రం చేరి అక్కడి శివగంగ పుష్కరణి వద్ద శివధ్యానంలో ఉండమన్నారు. సర్పరాజు, పంతంజలిగా జన్మించి తిలై వనం చేరుకొని తపస్సులో నిమగ్నమయ్యారు. అప్పటికే అక్కడ ఎందరో మహామునులు నటరాజ నృత్యాన్ని వీక్షించడానికి నిరీక్షించసాగారు. వారిలో ఒకరు శ్రీ వ్యాఘ్రపాద మహర్షి. ఈయననే పులి కాలి ముని అంటారు. తండ్రి ఆదేశం మేరకు ఇక్కడికి చేరుకొన్న ఆయన నియమంగా లింగరాజును ఆరాధిస్తూ, జన్మరాహిత్యాన్ని అనుగ్రహించే ఆనంద తాండవాన్ని తిలకించే సమయము కొరకు ఎదురు చూడసాగారు. వీరందరి నిరీక్షణ ఫలించింది. పుష్యమాసం (తమిళంలో తాయి మాసం), పౌర్ణమి నాటి రాత్రి చిత్ సభలో తన నాట్య విన్యాసాలతో అనుగ్రహించారు.
నాటి నుండి ఈ ఆలయంలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ నటరాజ స్వామి పూజలు అందు కొంటున్నారు.  నాట్యానికి గుర్తుగా తూర్పు గోపురంలో భరతనాట్యం లోని నూట ఎనిమిది కర్ణాల  (భంగిమలు)ను రమణీయంగా మలచారు.

























చిదంబరం ఆలయం మరో విశేషమైన ప్రత్యేకత కలిగి ఉన్నది. పడాల్ పెట్ర స్థలాలలో అగ్రస్థానమే కాకుండా నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటిగా పేరొందినది. పన్నెండు మంది వైష్ణవ ఆళ్వారులలో ఒకరైన శ్రీ కులశేఖర ఆళ్వార్ శ్రీ గోవిందరాజ పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశుర గానం చేయడం వలన ఈ క్షేత్రము దివ్యదేశాలలో ఒకటిగా శాశ్విత కీర్తిని సొంతం చేసుకొన్నది.
ఇక్కడ వైకుంఠ వాసుడు కొలువు తీరడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. ఒకసారి వారి వారి నృత్య కౌశలాల గురించి ఆది దంపతుల మధ్య ప్రణయ కలహం నిజమైన కలహంగా మారింది. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోడానికి నిర్ణయించుకొన్నారు. శ్రీ మహావిష్ణువును న్యాయనిర్ణేతగా ఆహ్వానించారు. జగతికి తల్లితండ్రులైన శివపార్వతుల మధ్య జరగనున్న నాట్య పోటీని తిలకించడానికి ముక్కోటి దేవతలు, మహర్షులు, యక్ష, కిన్నెర కింపురుష, గంధర్వాదులు కూడా హాజరైనారు. ఒకరికి ఒకరు తీసి పోకుండా, చూపారులను రెప్పవేయకుండా సర్వ నృత్య రీతులను ప్రదర్శించారు.
ఒక సమయంలో నటరాజ స్వామి తన కర్ణాభరణాన్ని క్రిందకు విడచి, కాలితో తీసుకొని తిరిగి అమర్చుకొన్నారు. స్త్రీగా తాను అలాంటి ఊర్ధ్వ తాండవాన్ని ప్రదర్శించ లేనని అమ్మ తన ఓటమిని అంగీకరించినది. (చిదంబర ఆలయానికి సమీపం లోనే ఓటమితో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఉగ్రరూపాన్ని ధరించి కొలువైన శ్రీ ఉగ్ర కాళీ అమ్మన్ ఆలయం ఉంటుంది. విశేష ఆలయం. ఆ వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి). ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణ (కనక)సభ లోనే ! అందుకే అక్కడే తూర్పు ముఖంగా శయన భంగిమలో శ్రీ గోవిందరాజ స్వామి రమణీయ పుష్పా అలంకరణలో శ్రీ నటరాజ స్వామిని చూస్తున్న భంగిమలో దర్శనం అనుగ్రహిస్తారు. శివకేశవులు ఇద్దరూ ఒకే ప్రాంగణంలో కొలువైన ఆలయాలు కేరళ, తమిళనాడు మరియు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కానీ ఇంత దగ్గరగా ఇద్దరూ మూల విరాట్టులుగా పూజలు అందుకొనేది మాత్రం చిదంబరంలోనే !
శివుడు తప్ప అన్య దైవం లేదన్న భ్రమలో రెండవ కుళోత్తుంగ చోళుడు (12వ శతాబ్దం)శ్రీ గోవిందరాజ పెరుమాళ్ విగ్రహాన్ని పెకలించి వేసాడట. ఉత్సవ మూర్తితో శ్రీ రామానుజాచార్యుల వారు తిరుపతి చేరుకొన్నారట. ఆయన ప్రోద్బలంతోనే నాటి తిరుపతిలో శ్రీ గోవింద రాజ స్వామి ఆలయం నిర్మింపబడినట్లుగా చరిత్ర తెలుపుతోంది. రెండవ కుళోత్తుంగ చోళుని మరణానంతరం పరిస్థితులు చక్కదిద్దుకొన్నాక తిరిగి ఉత్సవమూర్తిని ఇక్కడికి తీసుకొని వచ్చినట్లుగా శాసనాలు చెబుతున్నాయి.   




































నలభై ఎకరాల సువిశాల స్థలంలో వివిధ రకాల నిర్మాణాలతో శోభించే చిదంబర నటరాజ స్వామి ప్రస్తుత ఆలయం సుమారు పదో శతాబ్దంలో చోళ రాజుల నిర్మాణంగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. తమిళంలో గత కాలం చరిత్రలను సవివరంగా తెలిపే రచనలుగా గుర్తింపు పొందినవి సంగం (క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుండి క్రీస్తు శకం మూడో శతాబ్దాల మధ్య కాలం) కాలం నాటివి. వాటి ప్రకారం తిలై వనాలలో కొలువైన కైలాసనాధునికి తొలి ఆలయం విశ్వకర్మ వంశానికి చెందిన శిల్పి శ్రీ విదువ్వేళవిదుగు పెరుంథాచన్ అని తెలుస్తోంది. రచనలలో ప్రముఖంగా పేర్కొన్నదంటే ఆ నిర్మాణాన్ని ఎప్పుడు నిర్మించారో ? ఇదే కాదు గాయక శివభక్తులైన నయమ్మారులలో ఆగ్రగణ్యులుగా కీర్తించబడే "అప్పార్ మరియు సుందరార్" గానం చేసిన పాటికాలలో చిదంబర ఆలయ వర్ణన ఉన్నది.
కాలగమనంలో కొత్త నిర్మాణాలతో పెరుగుతూ వచ్చిన ఆలయాన్నిపదవ శతాబ్దంలో సంపూర్ణంగా పునః నిర్మించిన ఘనత శాసనాల ఆధారంగా ఒకటవ ఆదిత్య చోళుడు దక్కుతుంది.
తరువాత ఒకటవ పరాంతక చోళుడు, ఒకటవ కుళోత్తుంగ చోళ, రెండవ మరియు మూడవ కుళోత్తుంగ చోళులు కూడా ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారు. వీరి తరువాత పాలన లోనికి వచ్చిన పాండ్యులు, విజయనగర మరియు నాయక రాజులు కొన్ని కొత్త నిర్మాణాలు చెప్పటడమే కాకుండా పాత వాటిని పటిష్ఠపరచారు.
పాలకులే కాకుండా ధనవంతులైన భక్తులు కూడా ఎన్నో విరాళాలను ఆలయ నిర్వహణ నిమిత్తం అందించారని తెలుస్తోంది.


















శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య, నవగ్రహ, నవ లింగాలు, శ్రీ దక్షిణా మూర్తి కాకుండా  అమ్మవార్లు శ్రీ శివగామి అమ్మన్ మరియు శ్రీ పుండరీకవల్లీ తాయారు ఉపాలయాలలో  కొలువు తీరి దర్శనమిస్తారు. శ్రీ శివగామి అమ్మవారి సన్నిధి పక్కనే శ్రీ చిత్రగుప్త ఆలయం ఉంటుంది. అలానే అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శివగంగ పుష్కరిణీ దగ్గర సగానికి విరిగి పోయిన స్థంభం వద్ద నిలబడితే ప్రాంగణంలో ఉన్న అన్ని గోపురాలు ఒకే సారి చూడవచ్చును. పుష్కరణి పక్కనే విశేష నిర్మాణం అయిన వెయ్యి కాళ్ళ మండపం ఉంటుంది. ప్రాంగణంలో ఉన్న ఎన్నో మండపాల పైకప్పులకు శివలీలా వర్ణ చిత్రాలను రమణీయంగా చిత్రించారు. ఎన్నో మనోహర శిల్పాలను ఇక్కడ చూడవచ్చును.
చోళులు వాస్త శాస్త్రాన్ని అమితంగా విశ్వసించేవారు. వారు నిర్మించిన అన్ని నిర్మాణాలలో అది కనిపిస్తుంది. ఇక్కడ కూడా వారి విశ్వసాన్ని చూపించారు. రెండో ప్రాకార గోడల పైన ఎనిమిది దిక్కులలో అష్ట దిక్పాలకులను ఉంచారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణమైన శ్రీ బృహదీశ్వర ఆలయం, తంజావూరు లో కూడా ఇదే మాదిరి కొలువైన అష్ట దిక్పాలకులను చూడవచ్చును. (చిత్రాలను చుడండి) 
చిదంబర ఆలయ నిర్మాణంలో ఎన్నో రహస్యాలున్నాయి. ఎన్నో నిఘాడ సందేశాలున్నాయి. ఆలయానికున్న ద్వారాల దగ్గర నుండి బంగారు పై కప్పు, దానికి అమర్చిన మేకుల సంఖ్య దాకా ప్రతి ఒక్కటి ఒక సందేశాన్ని, మానవ జీవితంలోని ఒక రహస్యాన్ని తెలుపుతాయి. అన్నింటి లోనికి ముఖ్యమైనది "చిదంబర రహస్యం".





















నటరాజ సన్నిధికి పక్కనే తెర వేసి కనపడుతుంది. అది ఆదిదంపతుల స్థిరనివాసం. వారు అదృశ్య రూపంలో అక్కడ కొలువై ఉంటారన్నది శతాబ్దాల నమ్మకం.రోజులో కొన్ని సమయాలలో దీక్షితులు తెర తొలగిస్తారు. అక్కడ ఒక బంగారు మారేడు పత్రాలతో చేసిన దండ అలంకరించ బడి ఉంటుంది. అదే శూన్యానికి ప్రతీక ! ఈ దర్శనానికి అయిదు వందలు తీసుకొంటున్నారు ప్రస్తుతం.
ఆలయం శివ దీక్షితార్ల ఆధ్వర్యంలో ఉంటుంది. సర్వ హక్కులు వారివే ! తమిళనాడులో ఇదొక్కటే ఆలయం ఇంకా పూజారుల చేతుల్లో ఉన్నది.


























శ్రీ శివగామి అమ్మన్ ఆలయం 

చిత్రగుప్త ఆలయం 









వెయ్యి కాళ్ళ మండపం 








శ్రీ ఉగ్ర కాళీ అమ్మన్ (తూర్పు గోపురం )








ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు, తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు ఆలయం తెరచి ఉంటుంది.నియమంగా రోజుకు ఆరు పూజలు జరుగుతాయి. అన్ని పర్వదినాలలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. లక్షలాది భక్తులు పాల్గొంటారు.
చెన్నై, కుంభకోణం, తంజావూరు, మదురై, రామేశ్వరం, పాండిచ్చేరిల నుండి బస్సు, రైలు మార్గాలలో చిదంబరం చేరుకోవచ్చును. చక్కని వసతి సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. శిర్కాలి లాంటి సందర్శనీయ స్థలాలున్నాయి.

నమః శివాయ !!!!  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...