వృక్షో రక్షతి రక్షితః
మన పూర్వీకులు గొప్ప మేధావులు. ఈ రోజు మనం అందుకొంటున్న, అనుభవిస్తున్నఅనేకమైన ఆరోగ్యకర జీవన విధానాలు పూర్తిగా వారి గొప్పదనమే ! వారు మనకు అందించినవే ! మనం జీవిస్తున్న పుడమి లో మనతో పాటు ఎన్నో రకాల జంతుజాలం, వృక్షజాలం, జలం, జలచరాలు, వాయువు, పక్షులు ఉన్నాయి. ఇవన్నీ మనం సంతోషంగా జీవించడానికి అవసరమైనవి. ఇలా ప్రకృతిలో లభించే లాభాలను అన్నింటినీ భావితరాలకు సంక్రమించడానికి మన పూర్వీకులు అనేక మార్గాలను ఎంచుకొన్నారు. అదే విధంగా నష్టం కలిగించే వాటి నుండి దూరంగా ఉండటం కూడా తెలిపారు. ఇవన్నీ ప్రకృతి అసలు రూపం మారకుండానే రూపొందించడం వారు ప్రకృతి పట్ల ప్రదర్శించిన గౌరవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును. ఊరికే లభిస్తుంది అంటే ఎవరికీ ఆసక్తి ఉండదు. గౌరవం చూపించరు. అందుకని వారు ఎంచుకొన్నది సర్వాతర్యామి అయిన భగవంతుని ! అన్నింటినీ పరమాత్మ తో ముడి వేశారు. ప్రజలు వాటిని నియమంగా ఆచరించడానికి వ్రతాలు, పూజలు, ప్రదక్షణాలు, ఉపవాసాలు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు, సుమంగళత్వం, ముక్తి మరియు మోక్షం ఇలా చాలా విధానాలతో వాటిని కలిపారు. ఏదో ఒక దానికి మానవుడు తప్పని సరిగా కట్టుబడతాడన్న నమ్మకమే వారిని అలా చేసేలా చేసిందేమో !
అంతే కాకుండా నిత్య జీవితంలో ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన విషయాలను నేర్చుకొనే అవకాశం,పురాణాల సారం,దేవదేవుని స్మరణం అన్నీ ఒక దగ్గరే లభించేలా వారు చేసిన ఏర్పాటే ఆలయం. పాలకుల దగ్గర నుండి ప్రజల వరకు అందరికీ సులభంగా అర్ధం అయ్యే రీతిలో విషయాలను శిల్పాల రూపంలో తెలిపే ఏర్పాటు చేశారు.
ఆలయ నిర్మాణం,పూజా విధానం,మండపాలు,విమానం,ధ్వజస్థంభం,బలిపీఠాలు, రాజగోపురం, దాని మీద కలశాలు, పుష్కరిణీ, ఆలయ వృక్షాలు ఇలా ప్రతి ఒక్కటీ భక్తులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. మానవ జీవితం సుఖంగా సాగడానికి దోహదపడే ఏదైనా అది భగవద్స్వరూపమే !
సృష్టిలో ప్రతి ఒక్కటీ అమూల్యమైనదే ! ప్రతి జీవి జన్మ వెనుక ఒక అర్ధం పరమార్ధం ఉన్నదన్న విషయాన్ని గ్రహించిన పూర్వీకులు వాటిని గౌరవించారు. జంతువులలో కొన్నింటికి భగవంతుని అవతారాలన్నారు. మరి కొన్నింటిని దేవతల వాహనాలన్నారు. దీని వలన పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే జంతువులకు తగిన స్థానం లభించినట్లు అయ్యింది. కానీ కాలక్రమంలో మారిన మానవ దృక్పధం నేడు వాటి సంఖ్యను అత్యంత దీనావస్థకు తీసుకొని వెళ్ళింది. రానున్న కాలంలో భావి తరాల వారు కొన్ని జంతువులను చిత్రాలలో చూసే పరిస్థితి నెలకొనబోతోంది అన్నది శాస్త్రవేత్తల మాట.
ఇదే పరిస్థితి వృక్షాలది కూడా ! వివిధ కారణాల వలన అరణ్యాలు అంతరించి పోతున్నాయి. అడవులు, వృక్షాలు అందించే లాభాల గురించి మనందరం చిన్నతనం నుండి తెలుసుకొంటూనే ఉన్నాము. జీవికకు కావలసిన ప్రాణవాయువు, వాతావరణ శుభ్రత, సకాలంలో వర్షాలు, గృహ నిర్మాణానికి కావలసిన కలప ఇలా ఎన్నో! శతాబ్దాలుగా శ్రేష్టమైనది, సులువైనది, తగినదిగాను మరియు ఎలాంటి ఇతర అనారోగ్య పరిస్థితులకు దారి తీయని వైద్యవిధానంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది ఆయుర్వేదం. వైద్య రంగంలో ఎంతో (?) పురోగతిని సాధించిన నేటికీ కొన్ని అనారోగ్యాలకు ఆయుర్వేదమే సరైన పరిష్కారంగా పేర్కొనబడుతోంది. ఈ వైద్య ప్రక్రియకు కావలసిన ముడి సరుకులు లభించేది వనాల నుండే! చెట్టులోని ప్రతి భాగం ఏదో రకంగా మానవాళికి ఉపయోగపడేదే కదా !
ఈ విధానంలో తయారు చేసే ఔషదాలన్నీ ప్రకృతి నుండి సేకరించిన వాటితో తయారయ్యేవే ! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వృక్షాల వివిధ భాగాలైన వేరు, బెరడు, ఆకు, పువ్వు, కాయ, పండు మరియు గింజల నుండి తయారు చేసేవే !
ఈ విధానంలో తయారు చేసే ఔషదాలన్నీ ప్రకృతి నుండి సేకరించిన వాటితో తయారయ్యేవే ! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వృక్షాల వివిధ భాగాలైన వేరు, బెరడు, ఆకు, పువ్వు, కాయ, పండు మరియు గింజల నుండి తయారు చేసేవే !
అనేక ఆయుర్వేద , వేద మరియు పురాణ గ్రంధాలలో ఈ వృక్షాల యొక్క గొప్పదనం గురించి, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వాటి పాత్ర గురించి విపులంగా పేర్కొనబడినది. ఈ విషయాన్ని అక్షర జ్ఞానం లేని సామాన్య ప్రజలకు కూడా తెలియ చెప్పడానికి పూర్వీకులు ఎంచుకొన్న మార్గం వాటిని ఆలయ వృక్షాలుగా నిర్ణయించడం ! దాని వలన అందరు వృక్షాలను గౌరవిస్తారు. క్షేత్రగాధల ప్రకారం ప్రతి ఆలయానికి ఒక వృక్షం ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఆలయ వృక్షానికి ఇచ్చే ప్రాధాన్యత విశేషమైనది. ఆలయంలో జరిగే ప్రతి ఉత్సవంలో ఆలయ వృక్షానికి తొలి పూజ నిర్వహిస్తారు.
ఈ క్రమంలో గమనిస్తే ఆలయ వృక్షాలలో అగ్రస్థానం మారేడు మరియు రావి లదే ! శివాలయమైతే మారేడు, విష్ణాలయం అయితే రావి చెట్టు క్షేత్ర వృక్షాలుగా ఉండటం చూడవచ్చును. వీటి రెండింటికీ ఉన్న ఔషధ గుణాలు ఎన్నో ! తరువాత స్థానం శమీ వృక్షానిది. ఇది శివ, విష్ణు, దేవి ఇలాంటి భేదాలు లేకుండా అన్ని ఆలయాలలో కనపడుతుంది. ఇక మామిడి, చింత, వేప, కొబ్బరి, తాడి, మద్ది, పనస, పొగడ, జిల్లేడు, రేగు ఇలా ఈ వరస అనంతంగా ఉంటుంది. మరో గమనించవలసిన అంశం ఏమిటంటే గత కొంత కాలంగా జన్మనక్షత్ర వృక్షాలు అన్న అంశం వ్యాప్తి లోనికి వచ్చింది. జాతక రీత్యా అననుకూలతలను ఎదుర్కొంటున్నవారు తమ జన్మ నక్షత్రానికి సంబంధించిన చెట్టు నాటడం, దాని స్వయంగా పోషించడం లేదా సంరక్షణ నిమిత్తం కొంత పైకాన్ని ఇవ్వడం చేయాలి. ఆ వృక్షానికి నిర్ణయించిన రోజులలో పూజలు చేసి ప్రదక్షణాలు చెయ్యడం లాంటివి కూడా చేస్తుంటారు. అలానే ఆలయ వృక్షానికి పూజారులు చేసే పూజలు కాకుండా భక్తులు నీరు పోయడం, పసుపు కుంకుమలతో పూలతో అర్చించి ప్రదక్షణలు చేస్తుంటారు. దీని వెనుక అనేక ఆరోగ్య సూత్రాలు నిమిడి ఉన్నాయి. నియమంగా రావి చెట్టుకు ప్రదక్షణలు చెయ్యడం వలన ఆ చెట్టు గాలి లోని శక్తి స్త్రీలలో నెలకొని ఉన్న గర్భకోశ సమస్యలను తొలగిస్తాయి అని ఆయుర్వేదం చెబుతోంది. వారు ఎదురు చూస్తున్న సంతాన భాగ్యాన్ని పొందేలా చేస్తుంది అని పురాతన వైద్య గ్రంధాలు తెలుపుతున్నాయి. అందుకే ఆలయాలలో రావి చెట్టు క్రిందనే సంతానం కొరకు నాగప్రతిష్ఠలు చెయ్యడం, క్రమం తప్పకుండా కొద్దీ రోజులు ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చెయ్యడం జరుగుతోంది. అదే విధంగా మిగిలిన అన్ని వృక్షాలు కూడా తమ ఔషధ లక్షణాలతో అనేక ఆరోగ్యసమస్యలను సరిదిద్దుతాయి అని అంటారు.
ప్రపంచవ్యాప్తంగా అడవుల విస్తీర్ణత దారుణంగా తగ్గిపోతున్న తరుణమిది. అలానే భూతాపం, కాలుష్యం భయానకంగా పెరిగిపోతున్న సమయమిది.మన నిత్య జీవితంలో తప్పని సరిగా మారిన వాహనాలు, ఏ సీలు, ప్లాస్టిక్ వాడకం,మొబైల్ ఫోన్లు, అనేక కర్మాగారాలు ఇలా ఎన్నో దీనికి కారణాలు చెప్పుకోవచ్చును. వాటి వాడకం తగ్గించుకోవడం దరిదాపుగా అసాధ్యం అని తేలిపోయింది. కనీసం వాటి ద్వారా ఉత్పన్నమౌతున్న ప్రమాద శాతాన్ని తగ్గించుకోవాలి అని ఎన్నో సర్వేలు తెలుపుతున్నాయి. కొన్ని పరిష్కారాలను కూడా చూపుతున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది చెట్ల పెంపకం. ప్రతి ఒక్కరు తమ ఇంటిలో ఒక వృక్షాన్ని నాటాలి. దానిని పసిపిల్ల లాగా సాకాలి. అదే మనం మన వారసులకు ఇచ్చే నిజమైన ఆస్తి. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా ఒక మనిషి స్వచ్ఛమైన నీరు, గాలి కొనుక్కొని ఎంత కాలం మనగలడు ? ఎన్నో చక్కని మార్గాలు ఉన్నప్పటికీ వాటిని వదిలి పెట్టి అవాంఛనీయ పరిస్థితులను తెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది ?ప్రభుత్వం వారు నాటే మొక్కల మన ఇంటి చుట్టుపక్కల కనుక ఉంటే వాటిని సంరక్షించే భాద్యత మనకు మనమే స్వచ్చందంగా తీసుకొవడం సమాజానికి చేసే సేవ మాత్రమే కాదు భగవంతునికి చేసే సేవతో సమానం ! నడి ఎండలో వస్తూ చెట్టు నీడకు చేరుకోగానే ఎండ వేడి వలన కలిగే అలసట నుండి మనం పొందే విశ్రాంతి యెంత ఆహ్లాదకరంగా ఉంటుందో అనుభవమే కదా ! మనం మరెందరికో అదే మాదిరి ఆహ్లాదం అందించడం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో ఊహించండి ! అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నది నేడు మనందరి నిత్య పఠన గాయత్రి కావాలి ! అదే భూమిని భద్రంగా భావి తరాలకు అందించే తారకమంత్రం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి