10, జులై 2018, మంగళవారం

Mallela Thertham, Sri sailam

                                           మల్లెల తీర్థం 



మన రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, కడప మరియు గుంటూరు జిల్లాలలో, తెలంగాణా రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల అడవులు మన దేశం లోనే పేరు పొందిన అభయారణ్యాలు.
దేశంలోని పంతొమ్మిది పెద్దపులుల రక్షిత అరణ్యాలలో ఇక్కడ ఉన్న రాజీవ్ అభయారణ్యం ఒకటి. దీనిలో ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్ద పులులతో సహా పెక్కు అంతరించి పోతున్న  వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వివిధ అరుదైన జాతులకు చెందిన వృక్షాల నిలయం ఈ అరణ్యాలు.
కృష్ణా మరియు పెన్నా నదుల మధ్య భాగంలో నెలకొని ఉంటాయి నల్లమల అడవులు. ఇదంతా  తూర్పు కనుమలలో భాగం. వీటిల్లో ఎత్తైన శిఖరం భైరాని కొండ. ఈ పర్వతం తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తుంటుంది.























ఎత్తైన ఈ తూర్పు కనుమల పర్వతాల మీద దట్టంగా పెరిగిన అడవులలో ఎన్నో దివ్య క్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో తిరుమల, అహోబిలం మరియు శ్రీశైలం అగ్రస్థానంలో ఉంటాయి. ఇవి కాకుండా నెమలిగుండ్ల రంగనాయక స్వామి, మాలకొండ స్వామి, మహానంది (నవ నంది క్షేత్రాలు), త్రిపురాంతకం, ఇష్ట కామేశ్వరి క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వరం, సలేశ్వరం, లొద్ది మల్లయ్య  ఇలా ఎన్నో పురాతన చారిత్రక ధామాలు ఈ అడవులలో కనపడతాయి. కానీ చిత్రమైన విషయం ఏమిటంటే వీటిల్లో కొన్ని ఆలయాలు వారానికి ఒక రోజున, మరికొన్ని సంవత్సరానికి ఒకటి నుండి మూడు రోజులు మాత్రమే తెరవడం ! బహుశా వన్య ప్రాంతాన్ని రక్షించాలన్న ఉద్దేశ్యం ఇందులో దాగి ఉన్నదేమో ! లేదా వన్య ప్రాణుల నుండి యాత్రీకులను కాపాడటానికో అయ్యుండవచ్చును అనిపిస్తుంది.
 పాలంక, పాలుట్ల లాంటి క్షేత్రాలు కూడా ఇదే విధంగా భక్తుల కొరకు  సంవత్సరానికి     ఒకటి నుండి మూడు రోజులకొకసారి  తెరవబడుతున్నాయి.
వీటిల్లో చాలా ప్రదేశాలు శ్రీశైలానికి దగ్గరలో ఉండటం విశేషం !















మార్చి నెలలో చేసిన శ్రీశైలం యాత్ర ప్రధానోద్దేశ్యం చైత్ర పౌర్ణమికి మాత్రమే మూడు రోజుల పాటు దర్శమిచ్చే సలేశ్వరం లింగమయ్య గుహను దర్శించుకోవడం ! కాకపోతే దర్శించుకోలేక పోయాము. కారణం స్థానిక వార్తా పత్రికలలో వచ్చిన వార్త ఆధారంగా మేము చైత్ర పౌర్ణమికి ముందు రోజు సలేశ్వరం వెళ్లే దారికి ముఖ ద్వారం అయిన అమ్రాబాద్ పెద్ద పులుల రక్షిత అడవి దగ్గరికి చేరుకున్నాము. ముందు రోజు శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమల్లిఖార్జున స్వామివార్లను సేవించుకొన్నాము.















స్థానిక శాసన సభ్యుడు పౌర్ణమికి ఒక రోజు ముందు నుంచి యాత్రీకులను అడవి లోనికి అనుమతి ఇస్తామని అన్నట్లుగా స్థానిక పత్రికలలో పేర్కొన్నారు. కానీ  అటవీశాఖ అధికారుల నుండి ఎలాంటి ఉత్తర్వులు లేనందున అమ్రాబాద్ దగ్గరి సిబ్బంది మాలాగా అక్కడికి వచ్చిన వారిని ఎవరినీ లోనికి అనుమతించలేదు. కొంత మంది మాత్రం అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన వాహనంలో వాహన విహారం చేసి,  ఫరహాబాద్ వ్యూ పాయింట్ దాకా వెళ్లి వచ్చారు. అధికారులకు ఫోన్ చేద్దామంటే అందరూ స్విచ్ ఆఫ్ చేసేసారు. పైగా ఆదివారం !
అన్ని ప్రయత్నాలు వృధాకావడంతో చేసేదేమీ లేక శ్రీశైలానికి తిరుగు ప్రయాణం అయ్యాము. శ్రీశైలానికి సలేశ్వరం డెబ్భై కిలోమీటర్ల దూరం. దట్టమైన అడవి.  ఎన్నో వన్యప్రాణులకు నివాసము. రాత్రి పూట వాహనాలకు ప్రవేశం నిషిద్ధం.
ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ, కలిగిన ఆశాభంగాన్ని తొలగించుకొని ప్రయత్నం చేస్తున్నాము. శ్రీశైలం ఇంకా యాభై కిలోమీటర్లు ఉన్నది అనగా ఎడమ పక్కన "మల్లెల తీర్ధం" ఎనిమిది కిలోమీటర్ల దూరం అన్న బోర్డు కనపడింది.
















ఏదో ప్రత్యేకత ఉన్నది అనిపించింది. అక్కడ ఉన్న టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ వాకబు చేసాము. నీరు తక్కువగా ఉన్నదట, కానీ బాగుంటుంది. చుట్టూ చిక్కటి అడవి, వెళ్ళండి అన్నదామె !
సరే వెళదాం అని కారును అటు తిప్పాము. సన్నటి తారు రోడ్డు పూర్తి అటవీ ప్రాంతానికి చెందిన వాతావరణాన్ని చూపించే చిన్న చిన్న గ్రామాల గుండా సాగి చివరికి మల్లెల తీర్ధం దగ్గరికి చేర్చినది. పాత వాటిని తొలగించి, యాత్రీకులకు సౌలభ్యం కలిగించే నిమిత్తం నూతన నిర్మాణాల నిర్మాణం సాగుతోంది.
ఎండ తగల కుండా పెద్ద చెట్టు క్రింద కారును నిలిపి లోయ లోనికి నడవడం మొదలు పెట్టాము. అన్ని పక్కలా ఎత్తైన పర్వతాలు, వాటి మీద పచ్చని చెట్లు. ఎండ ఎక్కువగా ఉన్నా అక్కడ చల్లగా అనిపించింది. లోయ లోనికి మెట్ల మార్గం ఉన్నది. కాకపోతే పనుల మూలంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. నెమ్మదిగా లోపలికి దిగాము. అక్కడ పర్యాటక శాఖకు చెందిన వ్యక్తి మనిషికి ఇరవై రూపాయల చొప్పున వసూలు చేసాడు.
























ఎదురుగా వంద అడుగుల ఎత్తు నుండి ధారాలు ధారలుగా నేలకు జాలు వారుతున్నట్లుగా నీటి ప్రవాహం. ఆ ప్రవాహం కారణంగా ఏర్పడిన పెద్ద కోనేరు. చుట్టూ సూర్య కిరణాలను అడ్డుకుంటూ దట్టంగా ఎత్తుగా శాఖోపశాఖలుగా పెరిగిన రకరకాల చెట్లు. ఎక్కువగా అడవి మామిడి చెట్లు కనిపించాయి.
చెట్ల కొమ్మల మీద నుండి రాళ్ళ మీదకి అక్కడి నుండి ఏమరపాటుగా ఉన్న యాత్రీకుల చేతుల్లోని వస్తువుల మీదకి దండయాత్ర చేస్తున్న వానర దండు. జలపాతం దగ్గరికి వెళ్లాలంటే కొద్ది ఎత్తు ఎక్కి మళ్ళీ క్రిందకు దిగాలి. అక్కడ చిన్న వినాయక విగ్రహం మరియు శివలింగ ఉన్నాయి. అక్కడే ఉంటున్న సాధువులు పూజాదికాలు నిర్వహిస్తున్నట్లుగా అనిపించింది.
మా బృందంలో జలపాతాన్ని చూడగానే స్నానం చేయాలి అని అనిపించిన ముగ్గురు, అప్పటికే అక్కడ జలక్రీడలు చేస్తున్న వారితో కలిసి పోయారు. చాలా మంది ఉన్నారు. వానాకాలంలో జల ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు యాత్రీకుల తాకిడి ఎక్కువగా ఉంటుందిట. సంవత్సరం అంతా కొద్దో గొప్పో నీరు ఉంటుందట జలపాతంలో ! గతంలో ఎందరో మునులు ఇక్కడ తపమాచరించి మహేశ్వరానుగ్రహంతో ముక్తిని పొందినట్లుగా స్థానిక నమ్మకం.








శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాల సందర్బంగా, కార్తీక మాసంలో వచ్చే భక్తులలో తెలంగాణాకి చెందిన వారు తప్పని సరిగా ఇక్కడికి వస్తారట. ఎందుకంటె ఇది హైదరాబాద్ వెళ్లే దారిలో ఉండటం!
సలేశ్వరం దర్శించుకోలేదన్న అసంతృప్తి మల్లెల తీర్ధం సందర్శనతో చాలా మటుకు తొలగి పోయింది. సుమారు మూడు గంటలు ప్రకృతితో మమేకమై శ్రీశైలం మీదగా విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యాము.

నమః శివాయ !!!!      


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...