1, జులై 2018, ఆదివారం

Dwadasa Jyothir Lingams

                                  ద్వాదశ జ్యోతిర్లింగాలు 



దైవ భూమిగా ప్రస్తుతించబడే భరతభూమి ప్రతి ఒక్క నీటి బిందువు, మట్టి రేణువు, ప్రతి గాలి తెమ్మెర ఇలా అన్నీ భగవంతుని స్వరూపాలే ! సర్వాంతర్యామిని పంచ భూతాత్మకునిగా ఆరాధించే సంస్కృతి భారతీయులది. 
హిందూ పురాణాల ప్రకారం చరాచర సృష్టికి మూల పురుషులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు. వీరినే త్రిమూర్తులు గా పురాణాలు పేర్కొంటున్నాయి. జీవుల సృష్టికి విధాత, స్థితికి మహావిష్ణువు, లయం చేసుకొని పునః సృష్టికి మార్గం సుగమనం చేసేది సర్వేశ్వరుడు. బ్రహ్మ ఉండేది సత్యలోకం, శ్రీహరి నివాసం వైకుంఠం కాగా నందివాహనుని ఆవాసం కైలాసం ! వారి అర్ధాంగులు, ఆయుధాలు, వాహనాలు అన్నీ వారు నిర్వహించే భాద్యతలను ప్రతిబింబించేవే కావడం విశేషంగా పేర్కొనాలి. 









మనదేశంలో ఉన్న దేవాలయాలలో అధిక శాతం కైలాసవాసునివే ! 
అందులోనూ పార్వతీపతికి ఎన్నో గొలుసుకట్టు ఆలయాలున్నాయి. పడల్ పెట్ర స్థలాలు, తేవర వైప్పు స్థలాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, పంచభూత స్థలాలు, పంచ నాట్య సభలు, పంచ బ్రహ్మ క్షేత్రాలు, పంచ క్రోశ ఆలయాలు, పంచ కేదారాలు, సప్త విదంగ క్షేత్రాలు, సప్త స్థాన క్షేత్రాలు, సప్త మాంగై స్థానాలు, అష్ట వీరట్ట స్థలాలు, నవనందులు, నవ కైలాసాలు, భాస్కర క్షేత్రాలు ఇలా లెక్క లేనన్ని ఆలయాలున్నాయి. ఆయా క్షేత్ర ప్రాధాన్యతలను గుర్తించిన మహర్షులు వాటిని కలియుగంలో మానవులు తమ ఈతి బాధలను తొలగించుకోడానికి తగినవిగా నిర్ణయించారు. 





ఈ బ్లాగ్ లో సప్త మాంగై స్థానాల, పంచ నాట్య సభల, పంచ భూత స్థలాల, అష్ట వీరట్ట స్థలాల మరియు నవ నందుల క్షేత్రాల గురించిన వివరాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి తెలుసుకొందాము. అసలు ఈ జ్యోతిర్లింగాలు మొదట్లో అరవై నాలుగుగా ఉండేవట. కాలగతిలో పన్నెండు మనకు లభించాయట. జ్యోతిర్లింగాల ఆవిర్భావం గురించిన గాధ మనందరికీ తెలిసినదే !
బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం తలెత్తడం, వారి మధ్యలో భూమ్యాకాశాలను తాకుతూ లింగాకార జ్యోతి ఉద్భవించడం, వారు దాని అగ్ర, అధో భాగాలను కనిపెట్టడంలో విఫలమవడం ఈ కధ తెలిసినదే కదా !
ఈ క్షేత్రాలలోని లింగాలు లింగరాజు యొక్క తేజస్సు (జ్యోతి)కు ప్రతీకలు అని చెబుతారు. దేశం నలుమూలల ఉన్న ఈ క్షేత్రాలలో రెండు సముద్ర తీరాన, నాలుగు పర్వత సానువుల్లో, మైదాన ప్రాంతాలలో మూడు, పావన నదీ తీరాలలో మూడు చొప్పున నెలకొని ఉన్నాయి. 
ఉపనిషత్తుల ప్రకారం ఈ ద్వాదశ లింగాలు మనిషి లోని సప్త  తత్వాలకు అదే విధంగా పంచ భూతాలకు ప్రతి రూపాలని అంటారు. అవి బ్రహ్మ, మాయ, జీవుడు, మనసు, బుద్ది, చిత్తం, అహంకారం కాగా మిగిలిన అయిదు పృథ్వి, జలం, అగ్ని (తేజస్సు), వాయువు మరియు ఆకాశం. 
ఈ పన్నెండు క్షేత్రాలు సోమనాథ్(గుజరాత్), శ్రీశైలం(ఆంధ్రప్రదేశ్), ఉజ్జయిని(మధ్యప్రదేశ్), కేదార్ నాథ్ (ఉత్తరాఖండ్), ద్వారకా(గుజరాత్), రామేశ్వరం(తమిళనాడు), ఘృణ్యేశ్వర్, త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర), దేవగఢ్ (ఝార్ఖండ్), భీమశంకర్(మహారాష్ట్ర), ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), వారణాసి (ఉత్తర ప్రదేశ్). 





 

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకర విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం ఈ వరస క్రమం ఇవ్వబడినది. కానీ ఈ క్షేత్రాల సందర్శన ఎక్కడి నుండి అయినా ప్రారంభించి ఎక్కడైనా ముగించవచ్చును. మొత్తం పన్నెండు ఆలయాలను సందర్శించడం ప్రధానం !! పుణ్యఫలం ముక్తిదాయకం !!!
కానీ అన్నింటి లోనికీ సోమనాధ ఆలయం ప్రత్యేకమైనదిగా పేర్కొంటారు. 

శ్రీ సోమనాధ ఆలయం, సోమనాధ్  








పశ్చిమ గుజరాత్ లోని వీరావల్ దగ్గర లోని ప్రభాస్ పట్నం లో అరేబియా సముద్ర తీరంలో   ఉన్నది. వెన్నెల రేడు చంద్రుడు ఈ క్షేత్రంలో చంద్రశేఖరుని గురించి తప మాచరించి, దక్షుని శాప ప్రభావాన్ని గణనీయంగా పరమేశ్వరుని అనుగ్రహంతో తగ్గించుకొన్నారని క్షేత్ర గాధ తెలుపుతోంది. ఈ క్రమంలోనే శుక్ల మరియు కృష్ణ పక్షాలు (చంద్ర కళలు) ఏర్పడ్డాయని అంటారు. 
 విదేశీయుల దండయాత్రలలో ఎన్నోమార్లు కూలగొట్టబడినదీ ఆలయం. ప్రస్తుత నిర్మాణాన్ని మనకు స్వతంత్రం వచ్చిన తరువాత 1951వ సంవత్సరంలో నిర్మించారు.  అహ్మదాబాద్ నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దివ్య క్షేత్రం. 

 

శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం, శ్రీ శైలం 







ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన నల్లమల అడవులలో నెలకొన్న ఈ క్షేత్రం, అష్టాదశ పీఠాలలో ఒకటి. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి కొలువైన ఈ క్షేత్ర ప్రస్థాపన శివపురాణం, అగ్ని పురాణం మరియు స్కాంద పురాణాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వామివారు కృత యుగంలో హిరణ్యకశ్యపుని, త్రేతాయుగంలో శ్రీ రామచంద్రని, ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అర్జనుని సేవలు అందుకున్నట్లుగా క్షేత్ర గాధలు చెబుతున్నాయి. కలియుగంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య ఇక్కడ కొంతకాలం తపస్సు చేసినట్లుగా, అప్పుడే శివానంద లహరి రచించారని అంటారు. 
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఆదిదంపతుల దర్శనార్ధం తరలి వస్తుంటారు. హైదరాబాద్, కర్నూల్, గుంటూరు, విజయవాడ మరియు తిరుపతి నుండి సులభంగా రహదారి మార్గంలో శ్రీశైలం చేరుకోవచ్చును. 

శ్రీ మహా కాళేశ్వర స్వామి ఆలయం, ఉజ్జయిని 



 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్షేత్రం ప్రముఖ వ్యాపార కేంద్రమైన ఇండోర్ పట్టణానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
మహాకాళేశ్వరుని ఆలయం అరణ్యం, స్మశానం, పీఠభూమి మరియు రుద్రసాగర్ పుష్కరణి పక్కన ఉన్న ప్రాంతంలో నెలకొల్పబడినది. అందుకే ఇక్కడ తాంత్రిక పూజలు ప్రసిద్ధి.  మరో విశేషమేమిటంటే స్వామి స్వయంభూ లింగంగా దక్షిణ ముఖంగా కొలువు తీరారు. అత్యంత అరుదైన విషయమిది. ఈ కారణంగా స్వామివారిని సకల విద్యలను ప్రసాదించే శ్రీ దక్షిణామూర్తి రూపంగా పూజిస్తారు. 
ఉజ్జయిని లో సతీదేవి అమ్మవారి పై పెదవి పడటం వలన అష్టాదశ పీఠాలలో ఒకటిగా కీర్తించబడుతున్నది. అమ్మవారు శ్రీ మహాకాళి దేవి అభీష్టవర ప్రదాయనిగా భక్తులు ఆరాధిస్తారు. తెల్లవారుఝామున స్వామివారికి జరిపి భస్మహారతి తప్పకుండా చూడవలసిన అరుదైన సేవ. దీనిని ముందుగా ఆలయ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి. 

శ్రీ కేదారేశ్వర ఆలయం, కేదారనాథ్ 






చార్ ధామ్ యాత్ర చేయాలన్నది హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. ఈ యాత్రలో భాగమే ఈ ఆలయం. హిమసానువులలో మందాకినీ నదీ తీరంలో కేదార శిఖరం మీద ఉన్న ఈ దివ్య జ్యోతిర్లింగాన్ని సంవత్సరంలో ఆరు నెలలే దర్శించుకోగలం. మిగిలిన ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ కాలాల్లో ఉత్సవిగ్రహాలను ఊఖి మఠ్ లో ఉంచి నిత్య పూజలు జరుపుతారు. 
పంచ కేదారాలలో మొదటిదైన ఈ లింగాన్ని పాండవులు ప్రతిష్టించారని క్షేత్రగాధ తెలుపుతోంది. పన్నెండు అడుగుల ఎత్తైన శిల రూపంలో కేదారనాధుడు భక్త జనుల పూజలు అందుకొంటారు. 


శ్రీ నాగేశ్వర ఆలయం, దారుకావనం (గుజరాత్) 








సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రానికి రెండు వందల కిలోమీటర్ల, అహ్మదాబాద్ కి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్ర ప్రస్థాపన శివపురాణం, స్కాంద పురాణాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్న దారుక అనే అసురుని సంహరించి, సర్వేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువు తీరారని క్షేత్రగాధ చెబుతోంది. 
అమ్మవారు నాగేశ్వరి దేవి భక్తురాలైన అసురుని భార్య దారుకి పేరు మీదుగా ఈ క్షేత్రానికి దారుకావనం అన్న పేరొచ్చినది అని అంటారు.

శ్రీ రామలింగేశ్వర (రామనాథ)స్వామి ఆలయం, రామేశ్వరం (తమిళనాడు)








భారతదేశ దక్షిణ భాగాన రామేశ్వర (పాంబన్)ద్వీప కల్పములో ఉన్న ఈ లింగం అవతార పురుషుడు శ్రీ రామచంద్రుని ప్రతిష్టగా పేర్కొంటారు. రావణ సంహారం ద్వారా సంక్రమించిన బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోడానికి దశరధ తనయుడు ఈ లింగాన్ని హిందూ మహాసముద్ర తీరాన ప్రతిష్టించారు. ఆలయాన్ని చోళరాజులు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా అవగతమవుతోంది. గొప్ప శిల్ప కళ దర్శనమిస్తుంది. అగ్నితీర్థం గా పిలిచే సముద్రంతో పాటు ఆలయంలో నెలకొన్న ఇరవై రెండు బావులలో స్నానమాచరించడం పుణ్య ప్రదంగా భక్తులు భావిస్తారు. సీత దేవిని రావణ చెర విడిపించే క్రమంలో వానర సేన సహాయంతో సీతాపతి రామసేతును  ఇక్కడికి దగ్గర లోని ధనుష్కోడి వద్ద నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కాశీ రామేశ్వర యాత్రలో భాగంగా పవిత్ర గంగా జలాలను తీసుకొని వచ్చి శ్రీ రామనాధ స్వామికి అభిషేకిస్తారు. 
చెన్నై నుండి నేరుగా బస్సు లేదా రైళ్లలో రామేశ్వరం చేరుకోవచ్చును. అదే విధంగా మధురై, తిరుచ్చి, తిరునెల్వేలి, కన్యాకుమారి ల నుండి కూడా సులభంగా చేరుకోవచ్చును. ప్రధాన భూభాగంతో పాంబన్ ద్వీపాన్ని కలిపే పాంబన్ రైలు వంతెన ఒక అద్భుత నిర్మాణ విశేషం. భారత దేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త మానవతావాది అయిన శ్రీ అబ్దుల్ కలాం గారి స్వస్థలం రామేశ్వరమే !


శ్రీ దుష్మేశ్వర స్వామి ఆలయం, ఘృష్ణేశ్వర (మహారాష్ట్ర)





     

 మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్ర సందర్శన  అపమృత్యు భయాన్ని తొలగించేది అని భక్తులు పరిగణిస్తారు. ఘృష్ణేశ్వరుడు అంటే కరుణా సముద్రుడు అని అర్ధం. స్వామి భక్తసులభుడు. 
విదేశీయులు చేసిన దాడుల సందర్బంగా ఈ ఆలయాన్నిధ్వంసం చేశారు. ప్రస్తుత ఆలయాన్ని ఇండోర్ రాణి అహల్యా బాయి నిర్మించినట్లుగా శాసనాలు తెలియజేస్తున్నాయి. 

శ్రీ త్రయంబకేశ్వర స్వామి ఆలయం, త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర)




మహారాష్ట్ర లోని నాసిక్ పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నది జన్మస్థానంలో శ్రీ త్రయంబకేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ప్రధాన లింగంతో పాటు నెలకొల్పబడిన త్రిమూర్తి స్వరూపాలుగా పిలిచే మూడు చిన్న లింగాల కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరొచ్చినట్లుగా క్షేత్రగాధ చెబుతోంది. 
బ్రహ్మగిరి, నీలగిరి మరియు కాలగిరి అనే మూడు పర్వతాల మధ్యలో ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రకృతికి నిలయం. ఆలయ చుట్టుపక్కల అమృతవర్షిణి, బిళ్వతీర్ధం, విశ్వనాథ తీర్థం మరియు ముకుందతీర్థం అనే పుష్కరుణులు  ఔషధ గుణాలు కలిగిన నీటి తో నిండి ఉంటాయి. 
ప్రస్తుత ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన పీష్వా బాలాజీ బాజీ రావు నిర్మించారు. భక్తులు ఆరోగ్యం కొరకు ఎక్కువగా శ్రీ త్రయంబకేశ్వరుని సేవించుకొంటుంటారు. 

శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయం, దేవగఢ్ (ఝార్ఖండ్ )









పేరులో ఉన్నట్లుగానే స్వామి ధన్వంతరి. అనారోగ్యాలతో తన చెంతకు వచ్చే భక్తులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించే వానిగా ప్రసిద్ధి. రావణాసురుడు కైలాసనాధుని అనుగ్రహం కొరకు ఇక్కడ తపస్సు చేసాడట. స్వామి అనుగ్రహం కొరకు తన ఇరవై చేతులను సమర్పించుకొన్నాడట. అతని భక్తికి సంతసించిన పరమేశ్వరుడు దర్శనమిచ్చి, అతని గాయాలను మాన్పి అనుగ్రహించారట. అలా వైద్యం చేసినందున వైద్య నాధునిగా పిలవబడుతున్నారు. విశాల ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఇరవై రెండు ఉపాలయాలు ఉంటాయి. విశ్వకర్మ నిర్మితంగా పేర్కొనే ప్రధాన ఆలయ కాల నిర్ణయం నేటికీ చెయ్యలేక పోయారని చెబుతారు.  భక్తుల సౌలభ్యం కొరకు పునః నిర్మించడానికి కూడా కుదరడం లేదని అంటారు. 
అత్యంత చిన్న లింగ రూపంలో కొలువైన శ్రీ వైద్యనాథ స్వామి ని స్థానికంగా బాబా బైద్యనాథ్ అని ప్రేమగా పిలుచుకొంటారు. ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని దేవగఢ్ కి సమీపం లోని రైల్వే స్టేషన్ జేసిది. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైలు సావుకార్యం కలదు. రాంచి, ధనబాద్, బొకారో, జంషెడ్పూర్ ల నుండి నేరుగా చేరుకోవచ్చును. 

శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం, భీమశంకరం (మహారాష్ట్ర)







చుట్టూ పచ్చదనాన్ని నింపుకున్న పర్వతాలు, పక్కనే ప్రవహించే భీమానది సోయగం అన్నీ కలిపి ప్రకృతికి మరో పేరు భీమశంకరం జ్యోతిర్లింగ క్షేత్రం. 
భీముడనే వాడు తన తల్లి కర్కటి తో కలిసి ఈ అరణ్యాలలో నివసించేవాడు.  పెద్ద వాడైన తరువాత తల్లి వాడు రావణుని తమ్ముడైన కుంభకర్ణుని కుమారుడని, రాముడు అక్రమంగా వారందరినీ సంహరించాడని తెలిపింది. తండ్రి మరణానికి కారణమైన హరి మీద ఆగ్రహంతో విధాత బ్రహ్మ గురించి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. వరగర్వంతో ముల్లోకవాసులను ఇక్కట్ల పాలు చేయసాగాడు. అతని బందీగా ఉన్న సుదక్షిణుడు అనే రాజు సైకత లింగాన్ని భక్తిశ్రద్దలతో పూజించేవాడు. భక్తుని కాపాడటానికి మహేశ్వరుడు స్వయంగా తరలి వచ్చి భీమాసురుని సంహరించారు. 
అలా భీమాసురుని సంహరించిన శంకరుని గా భీమశంకరుడు అని పిలబడుతున్నాడు. పూణే     పట్టణానికి నూటపాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమశంకరం ఆధ్యాత్మిక ఆహ్లాద క్షేత్రం. 


శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం, ఓంకారేశ్వర (మధ్యప్రదేశ్)











మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నగరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో నర్మదా నది మధ్యలో ఓంకార ఆకారంలో ఉన్న మాంధాత లేక శివపురి అని పిలిచే ద్వీపం లో కొలువైన క్షేత్రం కావడాన ఈ పేరు వచ్చింది. 
నది మధ్యలో కొలువై ఉంటారు శ్రీ ఓంకారేశ్వరుడు, ఒడ్డున ఉన్న ఆలయంలో ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి కొలువై ఉంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ అమరేశ్వరుడే జ్యోతిర్లింగ స్వామి. ఈయన ఉన్న మరో పేరే మామలేశ్వర స్వామి. అమరేశ్వర స్వామికి గల మరో పేరే మామల్లేశ్వర స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో పేర్కొన్నది ఈయన  గురించే !
క్షేత్రం గురించి ఎన్నో పురాణాలలో పేర్కొనబడినది. యుగానికొక గాధ చొప్పున వినిపిస్తాయి. పడవలో మాంధాత ద్వీపం చుట్టూ పరిక్రమ చేయడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. 



శ్రీ విశ్వనాధ స్వామి ఆలయం, వారణాసి (ఉత్తరప్రదేశ్)










       

వారణాసి సప్త ముక్తి స్థలాలలో ఒకటి. కాశీలో మరణిస్తే మరుజన్మ ఉండదన్నది హిందువుల విశ్వాసం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కాశీ సొంతం. దరిదాపుగా అన్ని హిందూ పురాణాలలో కాశీ ప్రస్థాపన ఉన్నదంటే ఈ క్షేత్ర ప్రాముఖ్యం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చును. 
పవిత్ర గంగా తీరంలో ఉన్న ఈ దివ్యధామంలో భారత దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాల నమూనాలు ఉంటాయి. ఎందరో మహనీయులు ఈ క్షేత్ర మహత్యం గురించి తమ రచనలలో ప్రముఖంగా పేర్కొన్నారు. 
శ్రీ విశాలాక్షీ అమ్మవారు అష్టాదశ పీఠ శక్తి రూపాలలో ఒకరు. 
నగరంలో కనిపించే ప్రతి చిన్న మందిరానికి ఒక విశేష చరిత్ర కలిగి ఉండటం పేర్కొనదగిన అంశం. ఆ వివరాలు తెలుసుకోవాలంటే "కాశీ ఖండం" చదివాలి. 
ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో నిర్వహించే గంగా హారతి ఒక నయనమనోహరమైన కార్యక్రమం. గంగా నదిలో నావలో విహరిస్తూ  తీరంలోని స్నాన ఘట్టాలను తిలకించడం మరో అద్భుత అనుభవం. 

నమః శివాయ !!!!   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...