25, నవంబర్ 2015, బుధవారం

Ashta Veeratta Sthalams in Tamilnadu

విశేష దర్శనీయ ఆలయాలు ఈ అష్ట వీరట్ట క్షేత్రాలు.  వీటిని గురించి వివరించిన నా వీడియో యూ ట్యూబ్ లో  చూడగలరు.


Ashta Veeratta Stalams - Importance of Lord Shiva Temples - By I.Venkateswarlu (HD)

Rose Telugu Movies

ashta+veeratta+sthalams+on+youtube
ashta+veeratta+sthalams+on+youtube


24, నవంబర్ 2015, మంగళవారం

Sri Patan Devi Mandir, Patna

                                శ్రీ పటాన్ దేవి మందిరం, పట్నా 

  






దైవ భూమి అయిన భరత దేశంలో ఎన్నో ప్రాంతాలు స్థానికంగా కొలువైన దేవి లేదా దేవత నామం మీద ఏర్పడటం అందరికీ తెలిసిన విషయమే !
భూలోక వైకుంఠము శ్రీ రంగం, కలియుగ వైకుంఠము తిరుమల, శ్రీ అనంత పద్మనాభ స్వామి కొలువైన తిరువనంతపురం ఇలా ఎన్నో ఉదాహరణలుగా పేర్కొనవచ్చును. 









వాటిల్లో గతంలో మన పురాణాలలో, చరిత్ర గ్రంధాలలో "మగధ"గా పేర్కొనబడిన నేటి "బీహార్" రాజధాని "పట్నా" పేరు కూడా చేర్చవచ్చును.
"పుత్రకు"నిగా పేర్కొనబడే పాలకుని చేత స్థాపించబడిన "పాటలీ పుత్ర"  నేటి "పట్నా"గా మార్పు చెందడానికి వెనుక విశేష పౌరాణిక మరియు చారిత్రక గాధలు ముడిపడి ఉన్నాయి అని తెలుస్తోంది. 





బడీ పటాన్ దేవి 



దక్ష ప్రజాపతి గురించి అందరికీ తెలిసిన విషయమే !
ఆయన పుత్రిక "సతీ దేవి" తండ్రి మాటను కాదని శ్మశాన వాసి అయిన శంకరుని పరిణయ మాడటం వలన తండ్రి నిరాదరణకు గురి అయినది.
సర్వేశ్వరుని కించపరచడానికి తలపెట్టిన యాగమనీ తమకు పిలుపు లేదనీ తెలిసి దాక్షాయణి వెళ్లి దక్షుడు చేసిన అవమాన భారం తట్టుకోలేక హోమ గుండంలో దుమికి ఆత్మ త్యాగం చేసింది.
వార్త తెలిసిన ఆగ్రహించిన  మహేశ్వరుడు వీరభద్ర, కాల భైరవాది గణాలను పంపి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించడం అసలు కధ ! ఇదే దక్షయజ్ఞం !






సతీ దేవి దూరం కావడంతో  విచారగ్రస్తుడైన పరమేశ్వరుడు ఆమె దేహాన్ని భుజం మీద వేసుకొని విరాగిగా మారి  లోకాలలో సంచరించసాగారు.  అమ్మవారి శరీరం ఆయనకు కనిపించినంత కాలం మామూలుగా మారరని గ్రహించిన శ్రీహరి సుదర్శన చక్రంతో సతీ దేవి దేహాన్ని ఖండించారు. ఆ భాగాలు భువిలో అనేక ప్రాంతాలలో పడినాయి. అవే శక్తి పీఠాలు. వీటిల్లో ప్రముఖమైనవి అష్టా దశ పీఠాలు. మిగిలిన భాగాలు పడిన 51 ప్రదేశాలను సిద్ద శక్తి పీఠాలు అని పిలుస్తారు. ముఖ్యమైన నాలుగు శరీర భాగాలు పడిన వాటిని  మహా శక్తి పీఠాలు అని పిలుస్తున్నారు. 








అమ్మవారి కుడి తొడ నేటి పాట్నా నగరంలోని  మహారాజ్ గంజ్ దగ్గర, సతీ దేవి పై వస్త్రం చౌక్ వద్ద పడినాయట. పాలకుడైన పుత్రకుడు అమితంగా అమ్మవారిని ఆరాధించేవాడట. సర్వకాలాలలో తనను కాపాడే దేవతకు ఆయనే ఆలయాలు నిర్మించారట. మహారాజ్ గంజ్ లో బడీ పటాన్ దేవి ఆలయం, చౌక్ వద్ద చోటీ పటాన్ దేవి ఆలయాలు ఉంటాయి.







 ఇలా రెండు చోట్ల కొలువైన అమ్మవారిని భక్తులు సంపూర్ణ విశ్వాసంతో ఆరాధిస్తారు. 
 చిత్రమైన విషయం ఏమిటంటే రెండు చోట్లా ఒక్క అమ్మవారే ఉండరు. గర్భాలయంలో రజత సింహాసనం మీద మూడు చిన్న సాలగ్రామ శిలలు ఉంటాయి.మూడు శిలలు మహా కాళీ, మహా లక్ష్మి, మహా  సరస్వతి. అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి. 
పుత్రకుడు కొలిచిన దైవంగా, పాటలీపుత్ర రక్షకురాలిగా అమ్మవారిని శ్రీ పటాన్ దేవి అని గౌరవంతో పిలిచేవారు. ఆ విధంగా అమ్మవారి పేరు  మీద పురం "పట్న" గా పిలవబడుతోంది.  









బడీ పటాన్ దేవి మందిర ప్రాంగణంలో లింగరాజు, శ్రీ హనుమంతుడు, శ్రీ భైరవుడు ఉపాలయాలలొ కొలువై ఉంటారు. ప్రతి నిత్యం ఎందరో భక్తులు అమ్మవారి దర్శనార్ధం వస్తుంటారు. మంగళ వారాలలో వీరి సంఖ్య చాలా అధికంగా ఉంటుంది.
పర్వ దినాలలో వేలాది మంది రాష్ట్ర నలుమూలల నుండి వస్తారు. నవ రాత్రులూ, శివరాత్రి,  హనుమజ్జయంతి  లాంటి రోజులలో విశేష అలంకారాలు, పూజలూ నిర్వహిస్తారు.





చోటీ పటాన్ దేవి 





పట్నా పాత నగరంలో ఉన్న ఈ ఆలయం ఉత్తర దిశగా దుకాణాల, గృహాల నడుమ ఉంటుంది. బడీ దేవి ఆలయంతో పోల్చితే చాలా చిన్న మందిరం.
ఇక్కడ కూడా ముగ్గురమ్మలు కొలువై ఉంటారు.
పక్కనే పురాతన సిక్కు గురుద్వారా,మహ్మదీయుల మసీదు కూడా ఉంటాయి.వీటి నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. ఇవి కూడా చరిత్ర కలిగినవి కావడం విశేషం. 









పట్నాలో తప్పక సందర్శించివలసిన మందిరాలలో బడీ చోటి పటాన్ దేవి మందిరాలు కూడా ఉంటాయి. పట్నా రైల్వే స్టేషన్ నుండి ఆటోలలో సులభంగా మొదట బడీ దేవి తరువాత చోటీ దేవి ఆలయాలను చేరుకోవచ్చును. వెళ్ళే మార్గంలో మా శీతలా దేవి మందిరం కూడా దర్శనీయ స్థలం.







మా శీతలా దేవి మందిరం 





నవరాత్రుల తొమ్మిది రోజులు విశేష సంఖ్యలో అమ్మవార్లను సేవించుకోడానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ప్రత్యేక పూజలు, అలంకరణలు అమ్మవార్లకు జరుపుతారు. 
ఈ మందిరాలన్నీ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ భక్తజన సౌకర్యార్దం తెరిచే ఉంటాయి. 

శ్రీ మాత్రే నమః !!



PARVATHAMALAI

                                         పర్వతమలై 

 

అయిదు సంవత్సరాల క్రిందట చెన్నైలో ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు మొదటిసారిగా విన్నాను పర్వత మలై గురించి. 
ప్రతి నెలా చేసే తిరువన్నామలై యాత్ర సందర్భంగా అక్కడివారిని ఆ క్షేత్ర విశేషాల గురించి తరచి తరచి అడిగే వాడిని. ఇంటర్ నెట్లో లభించిన సమాచారం చదివాను. యూ ట్యూబ్ లో పెట్టిన వీడియోలను చూసాను. ప్రతి సారీ వెళ్ళాలి అనుకోవడం ఏదో కారణంగా వెళ్ళలేక పోవడం. 
చివరికి ఈశ్వరానుగ్రహంతో ఈ నెల ఒకటో తారీఖున పర్వతమలై సందర్శించే భాగ్యం లభించింది.   

  





జవధి పర్వత శ్రేణి లో భాగం పర్వతమలై. రామరావణ యుద్ద సందర్భంగా ఇంద్ర జిత్తు ప్రయోగించిన అస్త్రం ప్రభావంతో లక్ష్మణుడు స్పృహ తప్పిపోయాడు. వానర వైద్యుడు శుషేనుని సలహా మేరకు  హనుమంతుడు ఆకాశ మార్గాన హిమాలయాలకు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని పెకలించుకొని తెచ్చాడు. ఆ క్రమంలో ఒక ముక్క విరిగి ఇక్కడ పడిందట. అందుకని ఈ కొండలు  అద్భుత వనమూలికలకు నిలయాలు.







 వేల సంవత్సరాలుగా ఈ పర్వతాలు యోగులకు, సిద్దులకు, తాపసులకు నిలయాలుగా పేరొందాయి.
వారు తమ నిత్య పూజల నిమిత్తం ఒక లింగాన్ని ప్రతిష్టించుకొన్నారు. "మలై పాడు కాండం" అనే పురాతన తమిళ గ్రంధం ప్రకారం క్రీస్తు శకం మూడో శతాబ్ద కాలంలో "మా మన్నన్" అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడట. ఆయన తరచుగా ఈ పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకొనే మహనీయులను సందర్శించుకోడానికి వస్తుండేవాడట.










ఆయనే శ్రీ మల్లిఖార్జున లింగానికి చిన్న మండపాన్ని నిర్మించారట. నాటి నుండి ఈ మహిమాన్విత ఆరోగ్య ప్రదాయక శిఖరాలకు సామాన్య భక్తులు పౌర్ణమి రోజులలో యాత్ర చేసి స్వామిని సేవించుకొంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రిందట ఎక్కడి వాడో తెలీదు కానీ మౌన దీక్ష లో ఉండే స్వామి ఒకరు ఇక్కడకు వచ్చారు. కొద్ది కాలంలోనే ఆయన గొప్పదనం వ్యాపించడం జరిగింది. కొందరు ఆయనకు శిష్యులుగా మారారు.










అప్పటి నుండి పర్వతమలై తమిళనాడులో విశేష గుర్తింపు సంపాదించుకొన్నది. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు, సాహాస యాత్రల పట్ల అభిలాష కలిగిన వారు ఈ దట్టమైన అడవులలో ప్రవేశించి, కష్ట సాధ్యమైన కొండలను ఎక్కి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లి ఖార్జున స్వామిని సేవించుకోడానికి రాసాగారు.












గత అయిదు సంవత్సరాలలో కొండకొమ్మున ఉన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందినది. పాత ఆలయాన్ని కదిలించకుండా పైన విమానాలను ఇతర నిర్మాణాలను కట్టారు. చక్కని దేవతా రూపాలతో ఈ నూతన నిర్మాణాలు ఆకర్షణీయంగా కనపడతాయి. శ్రీ మౌన గురు స్వామి సేవ సంఘం వారు భక్తులకు ఉచితంగా భోజన సదుపాయం అందజేస్తున్నారు. వదాన్యులైన  భక్తులు అన్నప్రసాదాలకు విరాళాలు ఇవ్వవచ్చును.










నాలుగు వేల అయిదు వందల అడుగుల ఎత్తున ఉన్న పర్వతమలై చేరుకోడానికి ఆరు పర్వతాలను అధిరోహించాలి.
అవి "కదలాడి, మెథమలై, కుమరి,మేట్టుమలై, కడప్పరై మలై, కనకచోడిమలై  మరియు పర్వతమలై. మొత్తం దూరం నాలుగున్నర కిలోమీటర్లు.
తిరువన్నామలై నుండి పర్వతమలై రోడ్డు ముప్పై అయిదు కిలోమీటర్లు. ప్రతి ఇరవై నిముషాలకి బస్సు లభిస్తుంది.
లేదా చెన్నై నుండి కూడా సొంత వాహనాలలో రావచ్చును. కాట్పాడి స్టేషన్( వెల్లూరు) నుండి  పోలూరు చేరుకొని అక్కడ నుండి పర్వతమలై రోడ్ కు బస్సు మారి చేరుకోవచ్చును.
ఉత్తమమైనది తిరువన్నామలై నుండే అన్నది నా అభిప్రాయం.









కాకపోతే దిగిన తరువాత సుమారు నాలుగు కిలోమీటర్ల గుంతల, గతుకుల దారిలో  ఆటోలో ప్రయాణించి పర్వత పాదాల వద్దకు చేరుకోవాలి. అక్కడ శ్రీ వీరభద్ర స్వామి మరియు శ్రీ వనదుర్గా ఆలయాలు ఉంటాయి. ఇక్కడ కూడా భక్తులకు అన్నప్రసాదం ఉచితంగా అందిస్తారు. భక్తులు తమకు తోచిన మొత్తం విరాళంగా సమర్పించుకోవచ్చును.
చాలా మంది భక్తులు ఇక్కడి బావి నీటితో స్నానం చేసి ప్రత్యేక పూజలు జరిపిన తరువాత ఎక్కడం ఆరంభిస్తారు.









చుట్టూ దట్టమైన అడవులు. అంతా పచ్చదనం. ఒక మాదిరి ఎత్తులో ఉన్న ఆరు పర్వతాల మధ్యన నిట్ట నిలువుగా ఉంటుంది ఆఖరిదైన పర్వతమలై. దూరానికి చూస్తే కొంత ఆందోళన కలుగుతుంది. యెక్క గలమా ? అన్న సందేహంతో. ఈ మొత్తం యాత్ర  ఏడు విధములయిన దారులలో సాగుతుంది.








శ్రీ వీర భద్ర స్వామి ఆలయం నుండి మట్టి దారి అర కిలోమీటరు దూరం ఉంటుంది. అక్కడ నుండి పదమూడు వందల మెట్ల మార్గం.
మట్టి దారికి ఒక పక్కన ఇటుకలు, కుప్పగా పోసిన కంకర రాళ్ళు ఉంటాయి. అక్కడే చిన్న చిన్న సంచులు కూడా! భక్తులు ఆ సంచులలో ఇటికనో లేక కొన్ని రాళ్లనో వేసుకొనిపైకి ఎక్కుతారు. ఆ విధంగా పైన జరుగుతున్న నిర్మాణ కార్యక్రమానికి ఉడత సాయం చేస్తారు.
మెట్ల మార్గం వద్ద రేకుల షెడ్డు క్రింద ఒక పక్క శ్రీ గణపతి, మరో పక్క శ్రీ కుమార స్వామి కొలువైవుంటారు. యాత్రీకులు యాత్ర నిర్విఘ్నంగా సాగాలని వీరిని ప్రార్ధిస్తారు.








అదే విధంగా ప్రతి బృందాన్ని ఒక శునకం అనుసరిస్తుంది మార్గాన్ని చూపిస్తుంది అంటారు. మీద పడే వానరాలను ఆపుతాయి కూడా !
యాత్రీకులు తప్పని సరిగా నీరు, బిస్కెట్స్ పూజా సామానుతో పాటు తప్పని సరిగా తీసుకొని వెళ్ళాలి. కొందరు స్థానికులు మార్గంలో దుకాణాలు ఏర్పాటు చేసుకొని టీ, కాపీ, కొబ్బరి బొండాలు, నీటి సీసాలు, ఇతర తిను బండారాలు అమ్ముతుంటారు. ధర కొద్దిగా అధికం !






నెమ్మదిగా మెట్లను ఎక్కడం తప్పని సరి. ఎందుకంటే తరవాత దారి ఎక్కడానికి తగిన శక్తిని కూడా గట్టుకోడానికి. ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. కాలుష్యం లేని స్వచమైన అటవీ ప్రాంతం కదా !
మెట్ల పక్కన రాళ్ళ మీద తమిళంలో శివ శివ అని రాసిన రాతలు కనపడతాయి.
అక్కడక్కడ చిత్రమైన దేవతా రూపాలు కూడా ఉంటాయి.
పైకి ఎక్కుతున్న కొద్దీ లోయల పక్కన సాగే నడక కొంత ప్రమాదకరం అనిపిస్తుంది. దారి పక్కన కనిపించే పెద్ద పెద్ద పాము పుట్టలు సర్ప సంచారాన్ని తెలియజేస్తాయి. కానీ గత వంద సంవత్సరాలలో ప్రమాదవశాత్తు పడిపోయి గానీ, పాము కాటుతో గానీ చనిపోయిన వారు లేరు అని స్థానికులు అంటారు.





పైకి సంచులలో ఇటుకలు మోసుకొని వెళుతున్న భక్తులు 


మమ్ములను అనుసరించిన భైరవుడు 

ఒకరకమైన గాజు పురుగులు 



వర్షాలు మొదలైతే ఇలాంటి గాజు పురుగులు కొన్ని వందలు గోడల పైన కనపడతాయి. పెద్దవైతే అక్కడొకటి ఇక్కడొకటి కనపడతాయి.









పైకి ఎక్కుతున్న కొద్దీ వాతావరణం చల్లగా మారుతుంటుంది. ఏపుగా పెరిగిన చెట్లు. స్వచ్చమైన గాలి. దూరం నుండి వినిపించే పక్షుల కిలకిలారావాలు మనసుకు యెనలేని శాంతి కలుగుతుంది.  అక్కడక్కడ ఉన్న దుకాణాల వద్ద కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొంటూ కదలడం ఉత్తమం.
ఒకటికి రెండు సార్లు వచ్చిన వారు వేరుశనగ పప్పులు తెచ్చి పిట్ట గోడ మీద పెడుతుంటారు. వాటి ధ్యాసలో పడి కోతులు యాత్రీకుల చేతుల్లోని వస్తువుల మీద దండ యాత్ర చేయవు.










పదమూడు వందల మెట్ల చివర చిన్న వినాయక మూర్తి. కర్పూరం వెలిగిస్తారు. ఇక అక్కడ నుండి ఆరంభం అవుతుంది. రాళ్ళ బాట. చిన్నా పెద్దా గుండ్రటి కొండ రాళ్ళను బాట లాగా పరిచారు. కానీ ఎప్పుడూ కురిసే వర్షాల కారణంగా వాటి క్రింది మట్టి కొట్టుకొని పోయి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి.
దీనికి తోడు బయల్పడిన చెట్ల వేర్లు మరో అవరోధం.
దారి తప్పిపోకుండా రాళ్ళ మీద మార్గాన్ని తెలుపుతూ గుర్తులు వేసారు.








ఒకరు ఎక్కుతుంటే పై నుండి దిగేవారు పక్కకు తొలిగి ఉండాలి. పక్కన పట్టుకోడానికి చెట్లే ఆధారం. నిట్ట నిలువుగా, వంగి, పాకి ఎక్కాలి. మధ్యలో ఒక పురాతన మండపం కనిపిస్తుంది. లోపల శివలింగం, అమ్మవారు. వెలుపల శ్రీ వినాయక, శ్రీ ధర్మ శాస్త, శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖుడు మూడు గద్దెల మీద కొలువై ఉంటారు. విభూతి అభిషేకం నిత్యం అక్కడ ఉండే సాధువులు చేస్తుంటారు.









ఇక్కడ నుండి చూస్తే ఆటోలో ప్రయాణించిన మార్గం సన్నని గీతలాగ కనిపిస్తుంది. ఇంత ఎత్తు ఎక్కామా అనిపిస్తుంది. పచ్చదనం మైమరిపిస్తుంది. దూరంగా ఉన్న పర్వతాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 


















అలవాటు లేక ఆపసోపాలు పడుతూ ముందుకు సాగితే మధ్యలో ఒక సిద్దుని జీవ సమాధి దర్శనమిస్తుంది. పురాతన మండపం, జీవ సమాధి ఈ ప్రాంతం ఏనాటి నుండో ఆధ్యాత్మిక వాసులకు నిలయం అన్న విషయాన్ని బలపరుస్తాయి.
యాత్రీకుల కొరకు ఇక్కడ నుండి వానరాలు అధిక సంఖ్యలో ఎదురు చూస్తుంటాయి.
ఎక్కడంలో నిమగ్నమై సామానుల విషయంలో ఆదమరుపుగా ఉంటారని వాటికి తెలుసేమో !




సిద్దుని జీవ సమాధి 



భైరవుడు 








ఒక్కో అడుగు వేస్తూ పైకి చూస్తే దగ్గరికి చేరుకొంటున్నాము అన్న ఆనందకరమైన లేదా ఆశావహపూరిత ఆలోచనలే కలుగుతాయి.అబ్బోఇంకా చాలా ఎక్కాలే అన్ననిరాశాపూరిత ఆలోచన కానీ నిష్ప్రుహ కానీ కలగవు. అదొక విశేషం. క్షేత్ర మహాత్యంగా పరిగణించాలి.









ఈ బోర్డులో చూపుతున్న మార్గంలో వెళితే కదలాడి గ్రామం చేరుకొంటాము. అక్కడే శ్రీ మౌన గురు స్వామి సమాధి ఉన్నది.  ఇక్కడ నుండి రాళ్ళ బాటకు మధ్యలో ఇనుప గొట్టాలతో ఆధారమొకటి ఏర్పాటు చేశారు. ఎక్కడం కొద్దిగా సులభంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా పెద్ద గుంటలు, వేర్లు ఉండి క్రిందకి పైకి ఎక్కడం తప్పనిసరి.













రాళ్ళ బాట పూర్తిగా ఎక్కిన తరువాత  ముందుకు వెళ్ళడానికి అస్సలు దారి కనపడదు. పరిశీలించి చూస్తే పెద్ద కొండ రాళ్ళ నడుమ చిన్న రాళ్ళను పేర్చి దారి చేసారు. ఒక పక్కన లోతైన లోయలు. కాలు జారుతుందేమో అన్న భయం అసంకల్పితంగా మదిలో మెదలుతుంది. మరింత జాగ్రత్తగా ఎక్కడం మొదలవుతుంది. 


















రాళ్ళను  దాటుకొని పైకి చేరితే సన్నని కాలి బాట కనిపిస్తుంది. సమానంగా ఉన్న దారిని చూడగానే కొత్త ఉషారు పుడుతుంది. గబ గబా నడిస్తే ఒక టీ దుకాణం దగ్గరకు చేరుతాము. ఎదురుగా నిట్ట నిలువుగా పర్వతమలై. పైకి చేరుకోడానికి కొత్తగా "యేని పాధై " గా పిలిచే నిచ్చెన మెట్లను అమర్చారు.
కొద్దిగా పక్కన "కడప్పరై పాదై" గా పిలిచే కష్తమైన పాత దారి. పెద్ద పెద్ద రాళ్ల మీద మెట్ల మాదిరి చెక్కి, ఆలంబన కొరకు వాటిల్లో ఇనుప రాడ్లను అమర్చారు. చీలిన రెండు కొండ భాగాలను కలుపుతూ బలమైన ఇనుప రేకులను పరచారు.క్రింద వందల అడుగుల లోయ. ప్రమాదకరమే కాదు సమయం కూడా ఎక్కువ పడుతుంది. కొత్త దారిలో వెళ్లి పాత దారిలో రావడం వలన రెండు రకాల అనుభూతులు దక్కించు కొనవచ్చును. 











పైకి ఎక్కడానికి యెనిపాదై ఎంచుకోవడం ఉత్తమం. పైనుండి దిగుతుంటే క్రింద వారు ఆగడానికి చాలా తక్కువ స్థలం ఉంటుంది. అందుకని ఎక్కే వారు, దిగే వారు పెద్దగా "నమః శివాయ" అని అరుస్తారు. దానికి బదులు వస్తే ఎవరో ఒకరు అక్కడే ఆగి పోతారు. రెండో వారికి దారి ఇస్తారు.  ఈ మెట్లను గమ్మత్తుగా అమర్చారు. మధ్యలో కొండ రాళ్ల మీద చిన్న చిన్నగట్లు లాంటివి భక్తుల ఆగే సౌలభ్యం కొరకు నిర్మించారు.
ఆధారం కొరకు ఇనప రాడ్లు, గొలుసులను ఏర్పాటు చేసారు. పై నుంచి చూస్తే దూరంగా ఉన్న పర్వతాలు, అడవులు, లోయలు మనసుకు ఆహ్లాదకరం కలిగిస్తాయి.
















యేని పాదై ద్వారా పైకి చేరిన తరువాత కొన్ని రాతి మెట్లు ఆఖరి అధిరోహనకు దారి తీస్తాయి. కొండ అంచున రాళ్ళకు అమర్చిన ఇనుప రాడ్ల ను పట్టుకొని కాలు జారకుండా  అడుగులో అడుగు వేసుకొంటూ ముందుకు కదలాలి.
కొత్తగా సోపానాలను నిర్మిస్తున్నారు. అయినా అవి కొంత మేర వరకే !
ఆ తరువాత మరో యేని పాదై ఏర్పాటు చేసారు. అవి యెక్కకుండా పక్కన ఉన్న పాత మార్గం గుండా వెళ్ళడం బాగుంటుంది.
సుమారు ఏడు వందల అడుగుల లోతైన లోయకు ఇనప తీగల వల ఏర్పాటు చేయబడినది. రెండు పెద్ద రాళ్ళ మధ్య నుండి పైకి చేరుకోవచ్చును.











దూరంగా అరుణాచలం 








ఇక్కడ రెండు నీటి గుంటలు కనిపిస్తాయి. ఈ నీటిని శుద్ధి చేసుకొని తిరిగి వాడుకోడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొన్నారు. పౌర్ణమి రోజులలో వేలాది భక్తులు వస్తారు మరి.
అదే విధంగా సూర్య కాంతి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసుకొనే సౌకర్యం కూడా ఉన్నది.




















చివరకి ఎట్లాగైతేనేమి శిఖరాగ్రానికి చేరుకొన్నాము. ఎదురుగా చిన్న మందిరం. అమ్మవారు. ఎడమ పక్కన కొండపైన శ్రీ మౌన గురు స్వామి స్మారక మందిర నిర్మాణం జరుగుతోంది. పూర్తి అయితే అదే భక్తులకు విరామ మందిరం.
తలెత్తి చూస్తే శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం కనపడుతుంది. కొండ అంచున నిర్మించిన మార్గంలో ముందుకు కదిలితే పూజా సామాగ్రి అమ్మే దుకాణం, నూతనంగా నిర్మించిన మండపం వస్తాయి.
దూరానికి చూస్తే పరిసరాలు పరవశింప చేస్తాయి. అంతా పచ్చదనమే! అంతటా స్వచ్చతే ! నిర్మలమైన గాలి!
అలసట అంటూ ఏమన్నా ఉంటే అది కాస్తా మటు మాయమవుతుంది.
భక్తులు క్రింద నుండి ఉడుతా భక్తిగా తీసుకొచ్చిన రాళ్ళను ఇక్కడ ఉంచుతారు.























వర్ణమయ శిల్పాలతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది ఆలయం. సహజంగా పర్వత శిఖరాల మీద గాలి బలంగా వీస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మందగమనంతో వాయుదేవుడు సంచరించడం, ఆ పవన సుఖాన్ని మనసార అనుభూతి చెందడం ఒక మధురమైన అనుభవంగా పేర్కొనాలి.
తూర్పు ముఖంగా ఉన్న ఆలయం లోనికి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాలి.











నూతనంగా నిర్మించిన ముఖమండపంలో ఆలయ కార్యాలయం. చిత్రాలు, ప్రసాదాలు అమ్ముతారు. విరాళాలు స్వీకరిస్తారు. ధ్వజస్తంభం అక్కడే ఏర్పాటు చేసారు. పక్కనే క్రమ పద్దతిలో జరుగుతున్న ఆలయ పురోభివృద్దిని తెలిపే చిత్రాలను ఉంచారు.












పురాతన కట్టడాన్ని కదిలించకుండా దాని మీద నూతన ఆలయాన్ని నిర్మించడం మెచ్చుకోదగిన విషయం.  కార్యాలయం వెనుక అమ్మవారు శ్రీ భ్రమరాంబా దేవి సన్నిధి. అటుపక్కన గణేశాది దేవతల సన్నిధి. మధ్యలో ఉన్న సన్నిధిలో శ్రీ మల్లిఖార్జున స్వామి వారు లింగ రూపంలో కొలువై ఉంటారు. ఎదురుగా నందీశ్వరుడు. నేతి దీపాల వెలుగులో వెలిగిపోతుంటారు శ్రీ మల్లిఖార్జనుడు.



















పర్వతమలై లోని విశేషమేమిటంటే భక్తులు నేరుగా స్వామికి అభిషేక, అర్చన, అలంకారాలు చేసుకోవచ్చును. పూజారులు ఉండరు. దక్షిణ భారత దేశంలో బహుశా ఇలాంటి సౌకర్యం అదృష్ట్టం లభించి ఆలయం ఇదొక్కటే !











ప్రయాసపడి ఇక్కడికి వచ్చి నిండు మనస్సులతో స్వామిని సేవించుకొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆలయ కార్య నిర్వాహక మండలి వారు భోజన వసతి కల్పించారు. పొంగలి, పులిహోర, సాంబారు లేక పెరుగు అన్నం కావలసినంత పెడతారు. ఈ ధర్మ కార్యం నిరంతరాయంగా కొనసాగడానికి భక్తులు తమ వంతు సాయం అందించవచ్చు. ఎలాంటి బలవంతము ఉండదు. ఇస్తే పుచ్చుకుంటారు. లేక పోతే లేదు.







కాకపోతే నగరాలలో పుట్టి పెరిగిన మనలాటి వారిని అబ్బుర పరిచే అంశం ఏమిటంటే అక్కడ కనిపించే వంట గ్యాసు సిలెండర్లు, బియ్యం బస్తాలు, జనరేటర్. మనం అరవై కిలోల శరీరాన్ని మోసుకొని రావడానికే ఇంత ప్రయాస పడ్డాము. వీటిని ఇక్కడికి ఎలా తేస్తున్నారు ? అని అనిపిస్తుంది.
 కార్యాలయ  సభ్యులు ఇక్కడే ఉంటారు. రాత్రి పూట నిద్ర చేయాలనుకొనే భక్తులకు తగిన వసతి లభ్యమౌతుంది.










పూజాదికాలు, భోజనం ముగించుకొన్న తరువాత క్రిందకి దిగడం మొదలు పెడతారు భక్తులు. అన్నిటికన్నా పైన ఉన్న యేని పాదై దిగి నీటి గుంతల పక్కన చాలా నెమ్మదిగా జాగ్రత్తగా దిగిన తరువాత పాత దారి కొద్దిగా క్రిందకి ఉంటుంది. ఇందులో "కడపారై పాదై" మరియు "ఆగాహ పాదై" అని రెండు ఉంటాయి.





ఆగాహ పాదై



 రెండుగా చీలిన శిఖరాగ్రం భాగాలను కలుపుతూ ఏర్పాటు చేసిన మందపాటి ఇనప రేకుల బాటను ఆగాహ పాదై అని అంటారు. క్రిందకు చూడకుండా కొండ రాయిని ఆసరాగా పట్టుకొని మలుపు తిరిగి కొండ అంచున ఉన్నఇనుప రాడ్లను పట్టుకొని దిగాలి. పడిపోకుండా ఇనుప వల అమర్చారు. ఒక్క చోట మాత్రం ఇనప నిచ్చెన ఉంటుంది.
















కడపారై పాదై


నిట్టనిలువుగా ఉన్న కొండ మీద నుంచి దిగడానికి అనువుగా రాతిలో మెట్ల ను చెక్కారు. ఇనుప రాడ్లను "త్రిశూలం"  "వెల్" ఆకారాల్లో చేసి రాతిలో అమర్చారు. పక్కన ఇనప గొలుసులను కూడా అదనపు ఆధారంగా ఏర్పాటు చేసారు.
ఈ భాగం దిగటానికి మేమైతే కూర్చొని పాకుతూ వచ్చాము. ఎక్కేటప్పుడే కొద్దిగా ఇబ్బంది పెట్టిన నా "నైక్" బూట్లు ఇక్కడకు చేరే సరికి మూడు ముక్కలుగా మారిపోయాయి.  రాళ్ళ నుండి పాదాలను కాపాడుకోటానికి ఆ మాత్రంగా ఉన్న వాటిని దరించి మెట్ల మార్గం దాకా వచ్చిన తరువాత ఉత్త కాళ్ళతో తిరువన్నామలై చేరి అక్కడ కొత్త చెప్పులు కొనుక్కున్నాను.మార్గంలో చాలా తెగిన బూట్లు, చెప్పులు కనపడతాయి.











ఎక్కేటప్పుడు కష్టం కానీ  సులభంగా దిగవచ్చును అనిపిస్తుంది.  అనుకున్నంత తేలిక కాదని దిగేటప్పుడు మాత్రమే  తెలుస్తుంది. ఎగుడు దిగుడు రాళ్ళ మీద దిగడం ఎక్కడం కన్నా ఇబ్బందికరం. పాదాలు సరిగ్గా పడవు. అడుగులు జారుతుంటాయి. ఆధారం పట్టుకొన్నా నున్నగా ఉన్న కొండ రాళ్ల మీద నుండి దిగడం అంత సులువు కాదు.












శ్రీ వీర భద్ర స్వామి ఆలయం వద్ద ఆటో వాళ్ళ మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఫోన్ చేస్తే వస్తారు. 
క్రింద నుండి చూస్తే అనిపిస్తుంది ఇంత ఎత్తు ఎక్కి దిగామా ! అని. 
మరోసారి ఎప్పుడు రాగలం అని కూడా అనిపిస్తుంది. ఈ అనుభూతి కోసమే భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. 
ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజులలో చాలా ఎక్కువగా! 
కార్తీక పౌర్ణమి రోజున, మహా శివరాత్రి నాడు వేలాది మంది తరలి వస్తుంటారు. 
నిత్యం వాహనాల మీద తిరుగుతూ, లిఫ్ట్ లలో  అనాయాసంగా ఎక్కి దిగుతూ, వాతావరణ మార్పులు సంపూర్ణంగా తెలియకుండా చల్లని శీతల యంత్రాల క్రింద ఉండే మనలాంటి వారికి ఈ యాత్ర కష్టమనిపిస్తుంది. కానీ కాదు.  ఒక జీవితకాల మధుర జ్ఞాపకంగా మాత్రం తప్పక మిగిలి పోతుంది. 

నమః శివాయ !!!   


Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...