20, మార్చి 2015, శుక్రవారం

Thotlakonda, Visakhapatnam

                     తొట్ల కొండ - బౌద్ద బిక్షువులు నడయాడిన కొండ

సర్వ జీవులకు ఆహ్లాదము పంచడంతో పాటు సర్వ మత సమానత్వం పాటించే పట్టణం విశాఖ.
ఈ సమానత్వ భావన ఈ నాటిది కాదు.
క్రీస్తు పూర్వం నుండే ఉండటం విశాఖ ప్రత్యేకత.
యుగాల నాటి హిందూ ఆలయాలు, చరిత్రకు అద్దం పట్టే నిర్మాణాలు, రెండువందల సంవత్సరాలకు ముందు నిర్మించిన క్రైస్తవ ప్రార్ధనా మందిరాలు, పురాతన మసీదులు, గురుద్వారా ఇలా ప్రతి ఒక్క మతం వారు తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్ధనలు జరుపుకోడానికి ఏర్పాట్లు ఉన్న నగరమిది. 




ఇవన్నీ ఒక ఎత్తైతే రెండువేల సంవత్సారాలకు పూర్వం ఈ ప్రాంతాలు బౌద్ద మరియు జైన మతస్తులకు ప్రధాన నివాస  మరియు అధ్యయన కేంద్రాలుగా నిలిచినట్లుగా లభించిన నాటి నిర్మాణాలు తెలుపుతున్నాయి. 
విశాఖపట్నం నుండి భీమిలీ వెళ్ళే సముద్ర తీర మార్గంలో ఉన్నబావికొండ, పావురాల కొండ మరియు తొట్ల కొండ వీటిల్లో ముఖ్యమైనవి. ఇవన్నీ బౌద్దులు నివసించిన ప్రదేశాలు.
ఇంతటి చరిత్రకు మూలమైన నిర్మాణాలు ఇరవైయ్యొ శతాబ్దంలో భారత నౌకా దళం తమ కార్యకలాపాలకు తగిన స్థలాన్వేషణ నిమిత్తం జరిపిన గగనతల పరిశీలనలో బయటపడినాయి.
తరువాత పురావస్తు శాఖ వారు నిర్వహించిన త్రవ్వకాలలో ఈ నిర్మాణాలు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి ముందు హీనయాన శాఖ ను అనుసరించిన బౌద్ద భిక్షువులు నివసించిన ఆవాసాలుగా నిర్ధారించబడినది. 

ఈ త్రవ్వకాలలో రోమనుల, శాతవాహనుల కాలాల నాటి వెండి నాణాలు, బ్రాహ్మి లిపిలో ఉన్న శాసనాలు లభించాయి.
వీటి ఆధారంగా జరిపిన విశ్లేషణలో ఈ ప్రాంతంలో క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండో శతాబ్దం వరకు బౌద్ధం అధిక జనాదరణ పొందినట్లుగాను అర్దం అవుతోంది, ఇక్కడ నుండి సింహళం లాంటి సమీప దేశాలకు కూడా నిరంతర మత వ్యాపార సంబంధిత ప్రయాణాలు జరిపినట్లుగా తెలుస్తోంది.  


ఆ రోజులలో ఈ కొండను "సేనగిరి" అని పిలిచేవారట.
పాళీ భాషలో "సేన" అంటే అగ్ర స్థానం అని అర్ధమట.


కొండ మీద మంచినీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకొన్నతొట్ల లాంటి నీటి కుంటల వలన వీటిని నేడు "తొట్ల కొండ" అని పిలుస్తున్నారు.
గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు కావలసిన రవాణా ఏర్పాట్లను చేసింది.


పచ్చదనం సంతరించు కొన్నకొండ మీదకు వెళ్ళే దారిలో బుద్దుని విగ్రహం మరియూ జాతక కధలను తెలిపే శిలా ఫలకాలను సుందరంగా అమర్చారు.











కొండ పైన బిక్షువుల చైతన్య గృహాలు, ఆరామాలు, విహారాలు, మహా స్తూపం, ఇతర నిర్మాణాలు ఉంటాయి. 
నేటి ఇటుకకు మూడింతల పెద్దదిగా ధృడంగా ఉన్న ఇటికలను ఎలా ఎక్కడ తయారు చేసారు అన్న ప్రశ్నలతో పాటు నేటికీ అవి చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 





పైనుండి దూరంగా కనిపించే నీలి సముద్రాన్నిచూస్తూ దాని పైనుండి వీచే గాలి లోని మధురిమను అనుభవించడం ఒక చక్కని అనుభూతిగా పేర్కొనవచ్చును. 
కొండమీదకు వెళ్ళడానికి వాహనానికి ఇంత అని రుసుము చెల్లించాలి. 
పైన గైడ్ ఉంటారు. 



అతనికి వేరే చెల్లింపు ఉంటుంది. 
మంచినీరు కూడా వెంట తీసుకొని వెళ్ళడం తప్పనిసరి. 
పక్కనే ఉన్న మరో దారిలో కొద్దిగా లోపలి వెళితే "బావి కొండ" ప్రధాన రహదారిలో వెళితే భీమిలి వద్ద పావురాల కొండ ఉంటాయి. 









ఈ చారిత్రాత్మక ప్రదేశాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది అని చెదురు మదురుగా ఎలాటి విశ్లేషణ వివరణ తెలియకుండా పడివున్న శిల్పాలను చూస్తే అనిపిస్తుంది.




ఈ నిర్మానుష్య ప్రదేశంలో నాడు వారు ఎలా నివసించేవారు అన్న సందేహం తప్పక కలుగుతుంది. 
అదే సమయంలో గైడ్ చెప్పిన మాటలు వింటే అప్పట్లో ఇదొక ప్రముఖ సందర్శక మరియు వ్యాపార క్షేత్రం కావడం వలన జన సంచారం బాగా ఉండేదేమో అన్న అభిప్రాయం తప్పక సందర్శకుల మదిలో కలుగుతుంది. 








విశాఖపట్నం బస్సు కాంప్లెక్స్ నుండి 900 నెంబర్ బస్సులు ఇక్కడికి నేరుగా రిషి కొండ మీదగా వెళతాయి.  సందర్శకులు ప్రెవేటు లేదా సొంత వాహనాలలో సులభంగా మార్గాయాసం తెలియకుండా సాగర తీర అందాలను చూస్తూ చేరవచ్చును. 
చరిత్రను ప్రేమించేవారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం తొట్ల కొండ. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...