29, మార్చి 2015, ఆదివారం

Sri Venkateshwara Swamy Temple, Upamaka

                           శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఉపమాక 

కలియుగ దైవం కోనేటి రాయుడు కొలువుతీరిన ప్రతి ఒక్క క్షేత్రం కొలిచిన వారికి కల్పతరువు.
ఆలాంటి కామదేనువులాంటి ప్రసిద్ద క్షేత్రాలలో  ఒకటి ఉపమాక.
ఉపమానము లేనిది లేదా సాటి లేనిది అని ఉపమాకకు అర్ధంగా చెబుతారు.
గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేసి కోరిన కోరిక మేరకు శ్రీ మన్నారాయణుడు స్వయం వ్యక్తగా వెలిశారు.
దూరానికి పక్షి ఆకారంలో కనిపించే పర్వతాన్ని "గరుడాచలం" అని పిలుస్తారు.   

బ్రహ్మ వైవర్తన పురాణంలో గరుడాచల మహత్యం గురించి పేర్కొనబడినది.
శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల వారు పదకొండవ శతాబ్దంలో ఉపమాక క్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఆయన రచించిన "ఆచార్య సూక్తి ముక్తావళి " అన్న గ్రంధంలో ప్రస్తావించబడినది.

పేరుకు తగినట్లుగా ఉపమాక అరుదైన విశేషాల నిలయం.
పర్వత పాదాల వద్ద ఉన్న "బంధుర పుష్కరణి" పరమ పవిత్రమైనది.
కృతయుగంలో విధాత బ్రహ్మ దేవుడు, త్రిలోక సంచారి నారద మహర్షి ఈ కోనేరులో స్నానమాచరించి కొంతకాలం ఇక్కడే ఉంది స్వామి వారిని సందర్శించుకోన్నట్లుగా స్థల పురాణం తెలుపుతోంది.
దీని ప్రకారం ఈ క్షేత్రం ఏ నాటిది ???
గరుడాచలం మీద కోవెలలో కామితార్ధ ఫల ప్రదాత ఉత్తర ముఖుడై కొలువు తీరి ఉండటాన ఉపమాకలో భక్తులకు
వైకుంఠ ద్వార దర్శనమే ! నిత్యం ఏకాదశే !!

ధనుర్మాస పూజల సందర్భంగా, వైకుంఠ ఏకాదశి నాడు వేలాదిగా భక్తులు తరలి వస్తారు.
అన్ని ఆలయాలలో చతుర్భుజాలతో స్థానక భంగిమలో దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వరుడు ఉపమాకలో మాత్రం భిన్న రూపంలో కనపడతారు.
గుహలాంటి చిన్న గర్భాలయంలో సాల గ్రామ శిల మీద శంఖం, చక్రం,ఖడ్గం,ధనుర్భాణాలు ధరించి అభయమిస్తూ అశ్వ వాహనం మీద స్వామి, పక్కనే అమ్మవారి స్వయం వ్యక్త రూపాలు రేఖా మాత్రంగా కనిపిస్తాయి.




అరుదైన రూపమైన షట్ భుజాలతో అశ్వా రూడులై కనిపించే జగద్రక్షకుని "దశావతరాలలోని పదో అవతారమైన "కల్కి"గా కీర్తిస్తారు.
ప్రపంచంలో మరెక్కడా ఇలా కొలువుతీరిన శ్రీ వారి అర్చా మూర్తి లేదు.
ఆలయానికి వెలుపల కొండ మీద స్వామి వారి పాద ముద్ర ఉంటుంది.
మూల వరులకు ప్రతి నిత్యం ఉదయాన్నే పంచామృత అభిషేకం జరుపుతారు.





కొండ క్రింద రాజ గోపురం మీద "ఏం కావాలో అడగండి" అని వ్రాసి ఉంటుంది.
భగవంతుడు భక్త సులభుడు అన్న విషయం తెలిసినదే !
కానీ ఆ విషయాన్ని ఇంత ఘనంగా చాటిచెప్పే క్షేత్రం మరెక్కడా లేదు.
 ఉపమాక శ్రీ వేంకటేశ్వరుడు వర ప్రదాత.
పరిపూర్ణ విశ్వాసంతో సన్నిధిలో తమ కోరిక విన్నవించుకొంటే ఆనతి కాలం లోనే అది నెరవేరుతుందని అన్నది స్థానిక నమ్మకం. 
మనోభీష్టం ఫలించిన తరువాత మరోసారి దర్శనానికి వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అన్నది అలిఖిత నిభందన. 
సోపాన మార్గానికి పక్కనే శ్రీ రామ చంద్ర స్వామి ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది. 
పురాతన ఆలయ స్థానంలో నూతనం గా నిర్మించారు. 
మరెక్కాడా లేని విధంగా జానకీ దేవి జగదానంద కారకుని వామాంకం పైన ఉపస్టితులై ఉంటారు. 
అనుంగు సోదరుడు లక్ష్మణుడు కనపడరు. 
పీఠం క్రింద నమస్కార భంగిమలో వాయునందనుడు కొలువై స్వామి వారి సేవకు సదా సిద్దం అన్నట్లుగా 
కనిపిస్తారు. 
ఆలయానికి ఎదురుగా శ్రీ రామ కోటి స్థంభాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ పెద జియ్యరు స్వామి యాభై సంవత్సరాల క్రిందట స్థాపించారు. 
జియ్యరు గారు ఆవిష్కరించిన నూట ఎనిమిది శ్రీ రామ కోటి స్థంభాలలో ఇది నలభై ఎనిమిదవది. 

కొండ క్రింద క్షేత్ర పాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది.
ఉపమాకలో ఇదే అతి పెద్ద ఆలయంగా పేర్కొనాలి.
ఇక్కడి ఆలయాలన్నింటినీ తొలుత ఆరో శతాబ్దంలో నేటి తూర్పు గోదావరి జిల్లా లోని "కాండ్రేగుల" సంస్థానాధీశులు అయిన శ్రీ కృష్ణ భూపాలుడు నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.

తదనంతర కాలంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, జమిందార్లు, సామాన్య భక్తులు ఆలయాభివ్రుద్దికి భూరి విరాళాలు ఇచ్చారు.
పిఠాపురం రాజా వారు శ్రీ వేంకటేశ్వర స్వామికి అమూల్య రత్నాభరణాలను పదిహేడో శతాబ్దంలో సమర్పించుకొన్నారు.
సువిశాల ప్రాంగణంలోని పురాతన ఆలయానికి మూడంతస్థుల రాజ గోపురాన్ని నూతనంగా నిర్మించారు.

బలి పీఠం ధ్వజస్తంభం దాటితే రాతి నిర్మిత ద్వారం వస్తుంది.
ఇక్కడి మండప స్థంభాలకు "యాళి" అనే పురాణ మృగాన్ని జీవం ఉట్టిపడేలా మలచారు.
ద్వారానికి ఇరుపక్కలా జయ విజయులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారు.

ప్రాంగణం లోపల ప్రహరీ గోడకు పొడుగునా నలుచదరపు మండపం ఏర్పాటు చేసారు.
నలు దిశలా నాలుగు ఉపాలయాలుంటాయి.
ఆగ్నేయంలో శ్రీ రామానుజాచార్యులు, నైరుతీలో శ్రీ శ్రీ మానవాళ మహర్షి, వాయువ్యంలో శ్రీ గోదా దేవి, ఈశాన్యంలో శ్రీ నమ్మాళ్వార్ కొలువై ఉంటారు.







గోడల మీద అక్కడక్కడ గరుడవాహన విష్ణు మూర్తి, శ్రీ ఆంజనేయ రూపాలను చెక్కారు. 
చక్కని విశాల ముఖ మండపం, చిన్న అర్ధ మండపం దాటితే గర్భాలయంలో స్థానక భంగిమలో శ్రీ వేణుగోపాల స్వామి రమణీయ అలంకరణలో నయన మనోహరంగా దర్శనమిస్తారు. 
ఇక్కడే శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ఉంచుతారు. 
ఉపమాక వేంకటేశ్వరుడు సంతాన ప్రదాత. 
వైకుంఠ వాసుని తమ పుత్రునిగా వాచించి బంధిర పుష్కరణిలో స్నానమాచరించి, పంచామృతాభిషేకం లో పాల్గొన్న అదితి కశ్యప దంపతులకు వామనునిగా జన్మించారని స్థల పురాణం. 

ముని దంపతులు నాడు చేసిన విధి విధానాలను అనుసరించితే తప్పక సత్సంతానం కలుగుతుందన్నది చాలా మంది దంపతుల స్వానుభవం.


ఉపమాకలో పంచ రాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తారు.
ప్రతి నిత్యం అభిషేకం, ధూప దీప నైవేద్యాలు నియమంగా జరుపుతారు.
నిత్య, వార, పక్ష, మాసోత్సవాలతో పాటు ఫిబ్రవరి నెలలో అధ్యయనోత్సవాలు, ఫాల్గుణ మాసంలో ఇరవై రోజుల పాటు కళ్యాణోత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
సెప్టెంబర్ నెలలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో లక్షలాది భక్తులు పాల్గొంటారు.










ప్రతి నిత్యం కళ్యాణాలలో ఇతర సేవలలో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు వస్తుంటారు.
శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణాష్టమి, మిగిలిన హిందూ పర్వదినాలలో వేలాదిగా భక్తులు అన్ని జిల్లాల నుండి వస్తారు.



ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే భాగ్యం ఉపమాక లో సందర్శకులకు లభ్యమవుతుంది. 
పచ్చని తివాసీ పరిచినట్లుగా చుట్టూ పొలాలు, కొబ్బరి, మామిడి తోటలను చూస్తూ వాటి నుండి కోనేటి మీదగా వీచే చల్లని స్వచమైన గాలిని ఆస్వాదించడం ఆహ్లాదకరం మరియు ఆరోగ్యభరితం. 











ప్రాంగణంలో ఎన్నో ఉత్సవ వాహనాలు కనపడతాయి.
ఆలయ వారి అధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు.






బంధిర పుష్కరణి చుట్టుపక్కల శివాలయం, శ్రీ దుర్గా దేవి ఇతర గ్రామ దేవతల ఆలయాలు చాలా ఉన్నాయి.





ఉపమాక విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే జాతీయ రహదారిలో నక్కపల్లి గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్నది.
ఈ పవిత్ర క్షేత్రాన్ని కాకినాడ, తుని, విశాఖ ల నుండి బస్సులలో సులభంగా చేరుకొనవచ్చును.
తగుమాత్రంగా సౌకర్యాలు లభిస్తాయి.

విశాఖ జిల్లాలో తప్పక సందర్శించవలసిన క్షేత్రాలలో ఉపమాక ఒకటి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...