19, మార్చి 2015, గురువారం

Sri Saptha Risheeshwara Swamy Temple, Rishikonda

                           శ్రీ సప్త రిషీశ్వర స్వామి ఆలయం, రిషి కొండ 

అందాల సాగరతీరం ఆశావహులకు అద్భుత భవిష్యత్తు చూపుతుంది ( city of destiny ) అని పిలిచే విశాఖపట్నం సొంతం.
ఆర్కే, గంగవరం, యారాడ, లాంటి అనేక సముద్ర తీరాలలో రుషి కొండ తీరం ప్రత్యేకమైనది.
సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా తీరం మిగిలిన తీరాలకన్నా లోతుగా ఉన్నా చుట్టూ ఉన్న పచ్చని కొండలతో ఉండే నిశ్శబ్ద వాతావరణం విశిష్టతను కలిగి ఉంటుంది.
వీటన్నిటితో పాటు కాలం తెలియని ఆధ్యాత్మిక సౌరభాలకు నిలయం ఈ సముద్ర తీరం. 



ఏనాటి నుండి ఉన్నాయో తెలియని మంచినీటి బావులు పురాణకాలం నాటి విశేషాలను తెలుపుతాయి.
స్థానిక భక్తులలో ఒకరికి కలిగిన భగవంతుని ప్రేరణతో జరిపిన అన్వేషణలో వెలుగులోనికి వచ్చిన స్థల పురాణం నాలుగు యుగాల క్రిందటిది.



సదాశివుని శిరస్సున కొలువైన గంగా దేవి అతర్వాహినిగా ప్రవహించే ఈ బావుల నీటితో సప్త మహర్షులు గంగాధరునికి భువిలో అభిషేకాలు చేసి పక్కనే ఉన్న పర్వతం మీద తపమాచరించేవారట.
ఈ కారణంగా ఇక్కడి పర్వతానికి ఋషుల పర్వతం అన్న పేరొచ్చినది.
కాల గతిలో అదే "రిషి కొండ"గా మారింది.
కొండ పైభాగాన పురాతన ఆలయ శిధిలాలు నేటికీ కనపడతాయి అంటారు.

తమ పరిశోధనలో ఆచూకీ దొరికిన భావులను పునరుద్దరించి అక్కడే నూతనంగా ఆలయాన్ని నిర్మించారు.
సాగరానికి చేరువలో సువిశాల ప్రాంగణంలో ఉన్న ఆలయ సముదాయంలో ఎన్నో దేవీదేవతలు అరుదైన సుందర శిల్పాలుగా కొలువై ఉన్నారు.


బావులను దాటితే కుడివైపున నిర్మించిన స్థూపం లాంటి నిర్మాణంలో శ్రీ పంచముఖ హనుమంతుని నిలువెత్తు వర్ణ శోభిత విగ్రహం భక్తులలో భక్తి భావం పెంచుతుంది.
ఎదురుగా ఒక మందిరంలో శ్రీ దాసాంజనేయ, మరో దానిలో హరిహరసుత శ్రీ ధర్మశాస్త కొలువై ఉంటారు.




నూతనంగా అధునాతనంగా నిర్మించిన తొలి  ఆలయంలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ పార్వతీ దేవి మరియు శ్రీ సప్త రుషీశ్వర స్వామి నాలుగు గర్భాలయాలలో దర్శనమిస్తారు.
ముఖ మండపంలో నెలకొల్పిన అష్ట భుజాలతో అంబా సుతునకు విశేష అభిషేకాలు, హోమాలు జరుపుతారు.
ప్రాంగణంలో గణపతి హోమం, మృతుయుంజయ హోమం ఇతర యజ్ఞ యాగాదులు నిర్వహించడానికి యాగ శాల ఏర్పాటు చేసారు.
పక్కనే ఉన్న రెండో ఆలయంలో శ్రీ లక్ష్మీ నారసింహ, అష్ట భుజ శ్రీ దుర్గాదేవి మరియూ నంది వాహనం మీద ఉపస్థితులైన ఆదిదంపతులు, మనోహర రజత కవచ ధారులై నాయన మోహనంగా దర్శనమిస్తారు. 

నిత్యం నియమంగా అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, ఆరగింపులు మూలవరులకు జరుపుతారు.
స్థల విశేషం నెమ్మదిగా నగర ప్రజలకు చేరడంతో సోమవారాలు, వారాంతంలో, పర్వదినాలలో, తమ జీవితాలలో
ప్రాధాన్యత'ఉన్న'రోజులలో పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ఏంతో  భక్తి శ్రద్దలతో నిర్మించిన ఈ పురాణ నేపద్యం కలిగిన స్థలానికి పక్కనే రాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన రిసార్ట్ ఉన్నది.
బీచ్ లో గవ్వలతో, ఆల్చిప్పలతో చేసిన గృహాలంకరణ వస్తువులు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.



విశాఖ పట్టణ రైల్వే లేదా బస్సు కాంప్లెక్స్ నుండి రుషి కొండ ( గీతం యూనివర్సిటీ బస్సు స్టాప్ )లో దిగి సముద్ర తీరం వైపుకు వెళితే అక్కడ కనపడుతుంది ఈ విశేష ఆలయం. 





ఆహ్లాదం ఆధ్యాత్మికత సమ భాగాలలో  నిండి ఉన్న పవిత్ర స్థలమిది.

నమః శివాయః !!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...