19, మార్చి 2015, గురువారం

Sri Bhimeshwara Swamy Temple, Bhimili

                             శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, భీమిలి 

భీమిలీ అన్న పేరు వినగానే చక్కగా సాగర తీరాన కొలువుతీరిన పల్లెటూరు, రాళ్ళ మీదగా ఎగిసిపడే సముద్రుని అలలు, చేపలు పట్టడానికి కడలి లోనికి చిన్న చిన్న పడవల మీద వెళ్ళే మత్స్యకారులు కాళ్ళ ముందు కదలాడతాయి. 
బంగాళాఘాతం ఒడ్డున ఉన్న ఈ ఊరు మహాభారత కాలంలో లక్క ఇంటి నుండి తప్పించుకొన్న పాండవులు తలదాల్చుకొన్న ఏకచక్ర పురం ఇదేనని అంటారు. గ్రామస్తులను పీడిస్తున్న బకాసురుడు అనే రాక్షసుని భీమసేనుడు సంహరించినది ఇక్కడే నని, అందుకే "భీముని పట్నం" గా పేరొంది ముద్దుగా "భీమిలీ"గా స్థానికులచే పిలవబడుతున్న ఈ సుదర ప్రశాంత ప్రదేశం చరిత్రలోని ఎన్నో జ్ఞాపకాలకు క్షేత్రం. 
బుర్రా గుహలలో ఉద్భవించిన "గోస్థనీ నది" సముద్రునితో  సంగమించేది ఇక్కడే ! 
క్రీస్తు పూర్వంలో బౌద్ధులకు మరియు జైనులకు ఆవాసంగా ఉన్నదని అనడానికి నిదర్శనం ఇక్కడి "పావురాల కొండ" పైన ఉన్నక్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన బౌద్ద నిర్మాణాలు.   


కలియుగారంభం నుంచీ ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 
పదిహేడో శతాబ్దంలో డచ్ వారు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సంపాదించారు. నేటికీ వారు నిర్మించిన అనేక 
వారి తరువాత చాలాకాలం ఆంగ్లేయులు తమ ఉత్తరాంధ్రా పాలన ఇక్కడ నుంచే సాగించారు. దీనికి ఉదాహరణ మన దేశంలోనే రెండో మునిసిపాలిటీగా 09.02. 1861లోనే సత్కరించబడిన గొప్పదనం భీముని పట్నానిదే !!
వారి కాలంలో నిర్మించిన గడియార స్థంభం, లైట్ హౌస్ మరియు ప్రార్ధనా మందిరాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 
స్వాతంత్రానంతరం ఏంతో  అభివృద్ధి సాధించిన "సిటీ ఆఫ్ డెస్టినీ" విశాఖపట్నం నగరంలో భాగంగా మారిన భీమిలీలో పౌరాణిక మరియు చారిత్రక ప్రసిద్ది గాంచిన ఆలయాలకు నిలయం.
ఇక్కడి ఆలయాలలో పేర్కొనదగిన ప్రధాన ఆలయం "శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం".
ఒకే ప్రాంగణంలో మూడు కాలాలకు చెందిన శివాలయాలు, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత చతుర్భుజ శ్రీ వేణుగోపాల స్వామి మరియు సుభద్రా బలభద్ర సమేత జగన్నాధ స్వామి మందిరం ఉండటం ఒక అరుదైన విషయం.

బకాసురుని కడతేర్చిన తరువాత పాండవ మధ్యముడు వాయు పుత్రుడు భీమసేనుడు భక్తి ప్రపత్తులతో ప్రతిష్టించిన చిన్న లింగమిది.  అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి. 
రెండు శివాలయాల మధ్యలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వెనుక పక్కపక్కన ఉన్న రెండు ఆలయాలలో ఆదిదంపతులు కొలువుతీరి ఉంటారు. 




తదనంతర కాలంలో ఈ ప్రాంతాలను తమ అధీనం లోనికి తెచ్చుకొన్న చోళ రాజుల కాలం లో ప్రతిష్టించబడినది శ్రీ చౌడేశ్వర స్వామి లింగం.
దేవేరి శ్రీ భ్రమరాంబా దేవి.
ఆలయాన్ని నిర్మించిన నరసింహ చోళ రాజు శిల్పం సతీమణి తో సహా నంది విగ్రహం వద్ద నమస్కార భంగిమలో కనపడతారు.

ప్రాంగణం లోనికి ప్రవేశించగానే కనిపించే ఈ ఆలయంలో తమిళ ఆలయ నిర్మాణం మరియు ఉపదేవతలు కనపడటం విశేషంగా చెప్పుకోవాలి. విఘ్న నాయకుడు పక్కన ఉన్న ఉపాలయంలో కొలువుతీరి ఉంటారు. 
శిధిల ధ్వజస్తంభం దాటిన తరువాత ద్వారానికి ఇరుపక్కలా ఉన్న ఉపాలయాలలో శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ వీర భద్ర స్వామి దర్శనమిస్తారు.
సహజంగా ఆంధ్ర ప్రదేశ్ ఆలయాలలో కుమార స్వామి సర్ప రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ మయూర వాహనుడు వేలాయుధంతో నిజ రూపంలో పూజలందుకొంటున్నారు.
అదే విధంగా మన రాష్ట్రంలో శ్రీ వీర భద్రస్వామి ఆలయాలు అరుదు. 
ఆరు భుజాలతో అరివీర భయంకరుడు దర్శనమిస్తారు.

ముఖమండపంలో దక్షిణా ముఖిగా శ్రీ భ్రమరాంబా దేవి సువర్ణాభరణ శోభితగా స్థానక భంగిమలో భక్తుల పూజలు స్వీకరిస్తారు.
తమిళ రాష్ట్రంలో జ్ఞాన ప్రదాత అయిన  శ్రీ దక్షిణా మూర్తికి శివాలయాలలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
అక్కడ అన్ని ఆలయాలలో స్వామి గర్భాలయాల దక్షిణ పక్కన ప్రత్యేకంగా నిర్మించిన మందిరంలో పూజలు స్వీకరిస్తుంటారు.
చోళ రాజుల నిర్మాణం గనుక ఇక్కడ కూడా శ్రీ దక్షిణా మూర్తికి ప్రత్యేక మందిరం నిర్మించబడినది.
దక్షిణా మూర్తి ఆలయానికి ఎదురుగా వర్ణమయ శోభిత ఉత్సవ మండపం నిర్మించారు.
రెండింటికీ మధ్యలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయుం ఎరుపు రంగు తో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
పొడుగుగా గుహ మాదిరి నిర్మించబడిన ఆస్థాన లేదా ముఖ మండపం దాటిన తరువాత గర్భాలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి స్థానక భంగిమలో రమణీయ అలంకరణలో కనపడతారు.
 పదిహేడవ శతాబ్దంలో డచ్ వారి మీద ఇక్కడ లభించిన విజయానికి కృతజ్ఞతగా  ఈ ఆలయాన్ని మరాఠ యోధుడు చత్రపతి శివాజీ వారసుడైన "రాగోజీ భోంస్లే" నిర్మించాడు.
మూల విరాట్టు చతుర్భుజాలతో ఉండటం ఒక విశేషమైతే, మరొకటి ఈ ఆలయ స్నపన మూర్తిగా శ్రీ నవనీత కృష్ణుడు పూజలందుకోవడం గమనించదగిన అంశం. 




మురళీధర సన్నిధికి అటుపక్క అదేవిధంగా నిర్మించబడిన ధవళ వర్ణ ఆలయంలో శ్రీ చంద్రశేఖర స్వామి కొలువై ఉంటారు. 
ఈ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి వంశీయులు పదిహేడో శతాబ్దంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ చంద్ర శేఖర స్వామి ని ప్రతిష్టించారు. 

ఈ క్షేత్ర పాలకుడు శ్రీ సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాధ స్వామి.
ప్రాంగణంలో దక్షిణ దిశలో పెద్ద ముఖమండపం తో ఉన్న మందిరంలో సోదర సోదరీ సమేతంగా జగన్నాధుడు సర్వం నేనే అన్న అపూర్వ సందేశం భక్తులకు ఇస్తారు. 





ఎదురుగా ఉన్న అశ్వద్ద వృక్షానికి భక్తులు భక్తి శ్రద్దలతో దీపాలు వెలిగించి పూజలు చేసి అనుకున్న సంఖ్యలో ప్రదక్షిణాలు చేస్తారు.
ఇందరు దేవీ దేవతలు కొలువైనందున ప్రతిదినం ఇక్కడ పర్నదినమే!
అన్ని పర్వదినాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు.
గణేష పూజ, సుబ్రహ్మణ్య షష్టి, శివరాత్రి, దేవీ నవరాత్రులు, శ్రీ కృష్ణాష్టమి మరియూ శ్రీ జగన్నాధ రధ యాత్రా ఘనంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయ వెనుక భాగాన శ్రీ నగరేశ్వర స్వామి మరియు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని 1870వ సంవత్సరంలో నిర్మించారు. 

సుందరతకే కాదు ప్రశాంతతకు మారు పేరుగా పేరొందిన "భీమిలీ" విశాఖ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
నగరం నుండి చక్కని సిటీ బస్సు సౌకర్యంతో లభిస్తుంది.
స్థానికంగా పరిమిత సదుపాయాల వసతి గృహాలు ఉన్నాయిక్కడ.
విశాఖలో ఉండటం మంచిది.
ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించవలసినది  శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం.

నమః శివాయః !!!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...