20, మార్చి 2015, శుక్రవారం

Sri Lakshmi Narasimha swamy Temple, Bhimili

                           శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, భీమిలి 

నరసింహ ఉపాసన, ఆరాధన దక్షిణ భారత దేశంలో అధికం.
తమిళనాడు, కర్నాటక, తెలంగాణా మరియూ  ఆంధ్ర  ప్రదేశ్  రాష్ట్రాలలో విశేష ప్రాధాన్యత  కలిగిన నారసింహ ఆలయాలు  ఎన్నో ఉన్నాయి.










భిన్న రూపాలలో కొలువు తీరిన స్వామి భక్తులకు  మృత్యు భయాన్ని తొలిగించే అభయ ప్రదాతగా పూజలందుకొంటున్నారు.
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు రచించిన శ్రీ నరసింహ ప్రాచీన గాధ లహరి ప్రకారం మన రాష్ట్రంలో ముప్పైరెండు పురాతన నృసింహ క్షేత్రాలు యుగయుగాలుగా విరాజిల్లుతున్నాయి.









ఈ దివ్య క్షేత్రాలలో నవ నారసింహ నిలయం అహోబిలంది  మొదటి స్థానం. చివరది సౌమ్య గిరి.
ఈ సౌమ్య గిరే నేడు భీమిలి పట్టణంలో ఉన్న పావురాల కొండ.
స్వామి ఉగ్రరూపం వదిలి సౌమ్య రూపం దాల్చిన ప్రదేశం కావున అలా పిలిచేవారు.










దీనికి సంభందించిన పురాణ గాధ కృతయుగం నాటిది.
లోక కంటకుడైన హిరణ్య కశపుని సంహరించారు నారసింహ స్వామి.
అసురుడు అంతమైన స్వామి వారి ఆగ్రహం చల్లారలేదు.








నారసింహుని లోకభీకర రూపం చూసి దేవతలు, మునులు ప్రజలు భయభ్రాంతులైనారు.
లోకాలు దద్దరిల్లేలా గర్జనలు చేస్తూ భూలోకమంతా తిరుగుతున్నారు.
దేవతలు నిజ భక్తుడైన ప్రహ్లాదుని స్వామివారిని శాంతపరచమని వేడుకొన్నారు.
బాలకుడు స్వామి వెనుకనే స్తోత్ర గీతాలు పాడుతూ తిరిగాడు.
చివరికి స్వామి ఇక్కడ తన రౌద్ర రూపం వీడి శాంతాకారునిగా దర్శనమిచ్చినందున  ఈ గిరిని సౌమ్య గిరి అన్న పేరొచ్చినది.










అర్ధోదయ మహోదయ పుణ్య సమయాన  వైకుంఠ వాసునిగా సమస్త లోకవాసుల కోరిక మీద వెలిశారు.
అందుకే స్వామి వారు చతుర్భుజ శ్రీ మన్నారాయణునిగా దర్శనమిస్తారు. నరసింహునిగా కాదు.
అదీ ఈ క్షేత్ర విశేషం.










ఊరికి దూరంగా కొండమీద ఉంటుందీ ఆలయం.
తొలి ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు.
కలియుగంలో ఈ ప్రాంతాన్ని  పాలించిన నరసింహప్ప చోళ రాజు పురాతన ఆలయాన్ని  నిర్మించి ఆలయ నిర్వహణకు గోవులు, మాన్యాలు ఇచ్చినట్లుగా లభించిన శాసనాలు తెలుపుతున్నాయి.
ఈ కారణంగా శ్రీ నరసింహ చోళ కొండ అని కూడా పిలుస్తారు.
తరువాత స్థానిక పాలకులైన "మింది వంశం" వారు ప్రస్తుత ఆలయాన్ని 1226వ సంవత్సరంలో నిర్మించారు.










పర్వత పాదాల వద్ద నుండి ఆరంభం అయ్యే సోపాన మార్గానికి మూడు అంతస్తుల రాజ గోపురం ఏర్పాటు చేసారు.
మెట్ల మార్గం మధ్యలో శ్రీ నారాయణ పధం అన్న పేరుతో వైఖానస ఆశ్రమం ఉంటుంది.
శ్రీ వైఖానస మునితో పాటు భ్రుగు, అత్రి, మరీచి మరియు కశ్యప మహర్షులు కొలువుతీరి ఉంటారు.


















పర్వత మధ్య భాగంలో ఉన్న ఆలయ అంతర్భాగంలో నలుదిశలా యాత్రీకులు విశ్రాంతి తీసుకోడానికి అనువుగా మండపాలు నిర్మించారు.
ధ్వజస్తంభం, బలి పీఠం దాటిన తరువాత మండపంలో చిన్న మందిరంలో శ్రీ వినతా సుతుడు కొలువుతీరి స్వామి సేవకు సదా సిద్దం అన్నట్లుగా ఉంటారు.
గర్భాలయంలో తూర్పు ముఖంగా శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి స్థానక భంగిమలో చతుర్భుజాలతో చక్కని పుష్పాలంక్రుతులై నయనమనోహరంగా దర్శనమిస్తారు.
ఉత్తరం పక్కన ఉన్న ఉపాలయంలో శ్రీ మహా లక్ష్మీ దేవి ఉపస్థిత భంగిమలో భక్తులను అనుగ్రహిస్తుంటారు.










ప్రధాన ఆలయ వెనక కొండ మీదకి బహుశా ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి మెటల్ మార్గం పైన చిన్న మండపం నిర్మించారు.
అక్కడ నుండి సుదూరం వరకూ కనిపించే నీలి సముద్రాన్ని, పచ్చదనంతో నిండిన పర్వతాలను, బొమ్మల కొలువులాగా కనిపించే భీమిలి పట్టణాన్ని వీక్షించడం ఒక మధురానుభూతి.
ఇక్కడ ప్రస్తుతం పెద్ద నారసింహ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.















స్వాతి నక్షత్రం రోజున, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి మరియు శనివారాలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతి, ధనుర్మాస పూజలు ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ప్రాంతాలలో ఎవరి ఇంట శుభ కార్యం జరుగుతున్నా ప్రధమ ఆహ్వానం స్వామివారికే !












శత్రు భయాన్ని, గ్రహ దోషాలను తొలగించి జీవితాలలో సుఖ శాంతులను కలగజేసే వానిగా ఈ స్వామి ప్రసిద్ది.










ఈ పర్వతానికి వెనక పక్క క్రీస్తుపూర్వం నాటి బౌద్ద భిక్షువుల విహార శిధిలాలు ఉంటాయి.










విశాఖ పట్టణం నుండి సులభంగా రహదారి మార్గంలో భీమిలి చేరవచ్చును.
తగుమాత్రంగా వసతి సౌకర్యాలు లభిస్తాయి.
విశాఖలో ఉండటం మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...