26, అక్టోబర్ 2014, ఆదివారం

Sri Lakshmi Varaha Swamy Temple,Tiruvananthapuram

    శ్రీ లక్ష్మీ వరాహ స్వామి ఆలయం,  తిరువనంతపురం 


                   


మనం ఎన్నో ప్రదేశాలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలను సందర్శించుకొని ఉంటాము.
కానీ శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో మూడవది అయిన శ్రీ వరహావతర ఆలయాన్ని ఎక్కడా చూసి ఉండము.
మన రాష్ట్రం లోని సింహాచలంలో ఉన్నది శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి. తిరుమల కొండల పైన ఉన్నది ఒక వరాహ స్వామి ఆలయం.  అక్కడ ఆయనే క్షేత్ర పాలకుడు.
కానీ తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో కొన్ని శ్రీ వరాహ స్వామి ఆలయాలు ఉన్నాయి.
అలాంటి అరుదైన క్షేత్రాలలో కేరళ రాజధాని తిరువనంతపురం లో ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెలుపల  నైరుతిలో ఉన్న శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఆలయం. స్వామి వెలసినందున ఈ ప్రాంతాన్ని "శ్రీ వరాహం " అని పిలుస్తారు. కేరళలో ఉన్న మూడు శ్రీ వరాహ స్వామి ఆలయాలలో ఇదే అత్యంత పురాతనమైనదిగా పేర్కొంటారు. మిగిలినవి అలికాల్ శ్రీ వరాహ దేవస్వం, చెరాయి, కొచ్చి మరియు శ్రీ వరాహ మూర్తి ఆలయం, వరపుళ , ఎర్నాకుళం దగ్గర. 
అసలు భారతదేశం మొత్తం మీద ఇరవై మూడు శ్రీ వరాహ మూర్తి ఆలయాలు ఉన్నాయి అంటారు. వీటిల్లో దేవేరితో కలిసి కొలువైనవి చాలా చాలా కొద్ది. 

















శ్రీ వరాహ స్వామి స్వయంభూ గా వెలిశారని చెప్పే ఈ క్షేత్రానికి  ఎన్నో విశేష ప్రత్యేకతలు ఉన్నాయి.









వైకుంఠ ద్వార పాలకులు అయిన జయ విజయులు బ్రహ్మ మానస పుత్రులైన సనత్కుమారుల ఆగ్రహానికి గురై భూలోకంలో ఏడు జన్మలు ఎత్తాలన్న శాపం పొందారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందిన వారికి శ్రీ హరి ఒక అవకాశం ఇచ్చారు. తొందరగా వైకుంఠ వాసుని చెంతకు చేరాలన్న తలంపుతో వారు విష్ణు ద్వేషులుగా మూడు జన్మలు ఎత్తాలని నిర్ణయించుకొన్నారు.
వాటిల్లో మొదటిది హిరణ్యాక్ష హిరణ్య కశపులు.
బ్రహ్మ వరంతో లోకకంటకులుగా మారారు అసుర సోదరులు.
భూదేవిని తీసుకొని సముద్ర గర్భంలో దాగుకొన్నాడట హిరణ్యాక్షుడు.
ఆమె మొర విన్న అనాధ రక్షకుడు వరాహ రూపం ధరించి రాక్షసుని అంతం చేసి భూదేవిని తన కోరల మీద నిలుపుకొని సముద్రగర్భం నుండి వెలుపలికి తెచ్చారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ అవతార ఉద్దేశం అది అన్నమాట. కానీ ఇక్కడ స్వామి కొలువు తీరడం వెనుక ఉన్న పౌరాణిక గాధ ఇదుమిద్దంగా తెలియరావడం లేదు. 











అనంతర కాలంలో దేవతల కోరిక మేరకు అదే రూపంలో స్వామి ఇక్కడ కొలువు తీరారట.
అంతే కాదు ఈ ఆలయాన్ని శ్రీ వరాహ స్వామే నిర్మించుకోన్నారని, కాల గతిలో ఈ ప్రాంతాన్ని  పాలించిన  వివిధ రాజ వంశాల వారు తగిన మార్పులు, అభివృద్దికి కృషి చేసినట్లుగా, కైంకర్యాలు సమర్పించుకొన్నట్లుగా తెలుస్తోంది.
సువిశాల ప్రాంగణంలో పడమర ముఖ ఆలయానికి వెలుపల ఎదురుగా ఉన్న తెప్పకులం గా పిలవబడే వరాహ తీర్ధం కేరళ రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద మంచి నీటి కోనేరుగా గుర్తింపు పొందినది.



















ప్రాంగణంలో ఎన్నో వట వృక్షాలు ఉంటాయి. ప్రతి వట వృక్షం వద్ద లెక్కకు మిక్కిలిగా నాగ ప్రతిష్టలు కనపడతాయి. ఇవన్నీ కూడా తమ అభీష్టం నెరవేరిన తరువాత భక్తులు ప్రతిష్టించినవి కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 








ఆదుకొనే వరదుడు శ్రీ వరాహ దేవుడు 


అవివాహితులు త్వరగా వివాహం కావాలని స్వామివారికి మొక్కుకుంటారు. అదే విధంగా సంతానం లేని దంపతులు సత్సంతానాన్ని ప్రసాదించమని వేడుకొంటారు. వారి కోరిక తీరిన తరువాత ఆలయంలో నాగ ప్రతిష్ట చేస్తారు. ప్రాంగణంలో కనిపించే వేలాది నాగ శిలలు అలా ఏర్పడినవే !
శ్రీ లక్ష్మి వరాహ స్వామి నిరుద్యోగులకు తగిన ఉద్యోగాన్ని చూపించే వానిగా  ప్రఖ్యాతి. ఉద్యోగం లేని వారు చిన్న కాగితం మీద వారి కోరిక రాసి ఆలయంలో వదిలేస్తారు. మండలం రోజులలో వారికి తగిన ఉద్యోగం లభిస్తుందట. అలా సంపాదనాపరులైన వారు స్వామికి ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు. 
ఇలా కోరికలతో వచ్చే వారితో పాటు నియమంగా నిత్యం స్వామిని దర్శించుకోడానికి వచ్చే స్థానిక భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతూ శోభాయమానంగా కనపడుతుంది. 



























ఆలయ విశేషాలు 

ఎలాంటి రాజ గోపురం లేకుండా సాదాసీదా పెంకుల మండపం గుండా ఆలయ ప్రాంగణం లోనికి 
ప్రవేశిస్తే కేరళ శైలిలో నిర్మించబడిన మండపాలు, గర్భాలయంతో పాటు నూతనంగా నిర్మించిన నిర్మాణాలు కూడా కనపడతాయి. విశేష నిర్మాణాలు మరియు శిల్పాలు ఉండవు. 
కేరళలోని ఆలయాల పరివార దేవతలలో ముఖ్యంగా కనిపించేది శ్రీ గణపతి, శ్రీ ధర్మ శాస్త, నాగ దేవతలు  మరియు శ్రీ దుర్గ / భగవతి. అరుదుగా యక్షిణి కనిపిస్తారు. శివాలయంలో అయినా శ్రీ కుమార స్వామి కొలువై ఉండటం దాదాపుగా కనపడదు. కానీ ఈ ఆలయంలో శ్రీ గణేశ, శ్రీ సదాశివ, శ్రీ కృష్ణ, శ్రీ ధర్మశాస్త, శ్రీ యక్షిణి ఉపాలయాలతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి కూడా ఉండటం విశేషం. ఇవన్నీ ప్రదక్షిణా ప్రాంగణంలో నిర్మించబడినాయి.
వర్తులాకార గర్భాలయంలో అత్యంత సుందర అలంకరణతో కొలువు తీరి దర్శనమిచ్చే శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఏకశిలా రూపం నయనానందకరం. శ్రీ లక్ష్మి నారసింహ ఆలయాలలో మాదిరి ఇక్కడ కూడా అమ్మవారు స్వామి వారి వామాంకం మీద ఉపస్థితులై ప్రశాంత వదనంతో దర్శనమిస్తారు. శ్రీ వరాహ స్వామి చతుర్భుజాలలో వెనక చేతులతో శంఖు చక్రాలను ధరించి, కుడి చేతితో అభయ ముద్ర మరో చేతిని అమ్మవారి చుట్టూ వేసి కనపడతారు. 
నిలువెత్తు అర్చనామూర్తికి చేసే అలంకరణలు నేత్రపర్వంగా ఉంటాయి. చందన లేపనం, పుష్ప అలంకరణ, పట్టు పీతాంబరాలు ధరించిన మూల విరాట్టును చూడటానికి రెండు నేత్రాలు చాలవు.  






నియమంగా రోజుకు నాలుగు పూజలు జరిగే ఈ ఆలయంలో ఎన్నో పూజలు చేస్తారు. భక్తుల కొరకు మరెన్నో ఆర్జిత సేవలు కూడా కలవు. అన్ని పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అష్టమి, నవమి మరియు రోహిణి నక్షత్రం ఉన్న రోజుల్లో విశేష పూజలు, హోమాలు జరుపుతారు. వైకుంఠ ఏకాదశి, శ్రీ నరసింహ జయంతి, శ్రీ వామన జయంతి,  శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణాష్టమి, శ్రీ బలరామ జయంతి, అక్షర తృతీయ విశేషంగా చేస్తారు. ముఖ్యంగా శ్రీ వరాహ  జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున చేస్తారు. ఆలయ ప్రతిష్టాపన దినోత్సవం ఈ ఆలయంలో జరిగే మరో పెద్ద ఉత్సవం. 
స్థానిక పర్వదినాలైన ఓనం మరియు విషు సమయాలలో భక్తుల తాకిడి మరింతగా ఉంటుంది. 
నిత్యం ఉదయం నాలుగున్నర నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉంటుంది. 
ప్రతి నిత్యం ఎందరో భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. 
దేశం లోని అన్ని ప్రాంతాల నుండి రైలు మరియు వాయు మార్గంలో కేరళ రాజధాని అయిన తిరువనంతపురం చేరుకోవచ్చును. స్థానికంగా వసతి సౌకర్యాలు లభిస్తాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కాకుండా శ్రీ పలవంగాడు మహా గణపతి ఆలయం, తిరువళ్లం శ్రీ పరుశురామ ఆలయం, అనంత పద్మనాభుని ఆలయ పడమర ద్వారానికి ఎదురుగా ఉన్న వీధిలో సృష్టికి  మూల పురుషులైన శ్రీ బ్రహ్మ దేవుడు, శ్రీ మహా విష్ణు, శ్రీ మహేశ్వరుడు కొలువైన త్రిమూర్తి దేవాలయం, మహిళల శబరిమలగా ప్రసిద్ధికెక్కిన శ్రీ అట్టుక్కాల్ భగవతి దేవి ఆలయం ఇలా ఎన్నో విశేష దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. సేద తీరడానికి సాగర తీరం కూడా ఉన్నది తిరువనంతపురంలో.    
అరుదైన విశేషమైన శ్రీ లక్ష్మి వరాహ మూర్తి ఆలయాన్ని తిరువనంతపురం వెళ్ళే ప్రతి ఒక్కరు తప్పని సరిగా సందర్శించాలి. 

ఓం నమో నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...