27, అక్టోబర్ 2014, సోమవారం

Mithranandapuram Trimurthy Temple, Tiruvananthapuram

 మిత్రానందాపురం త్రిమూర్తి ఆలయం, తిరువనంతపురం 





హిందూ పురాణాల ఆధారంగా మనకున్న దేవీ దేవతలు ముక్కోటిమంది. అందులో సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులది అగ్రస్థానం. స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు కు లయకారకుడైన సదాశివునికి పృధ్విలో ఎన్నో ఆలయాలున్నాయి. 
వ్యాప్తిలో ఉన్న అనేక కారణాల కారణంగా సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవునికి భువిలో పూజార్హత లేకుండా పోయింది. అయినా కమలాసనునికి దేశంలోని కొన్నిప్రాంతాలలో  ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది రాజస్తాన్ లోని పుష్కర్ లో ఉన్నది. అయితే  త్రిమూర్తులు ముగ్గురూ ఒకే చోట  కొలువైన క్షేత్రాలు బహు అరుదుగా కనపడుతుంటాయి.ఇలాంటి అరుదయిన క్షేత్రాలు అరుదైన ఆలయాల నిలయమైన కేరళలో ఎక్కువగా ఉండటం విశేషం. 
మలప్పురం జిల్లాలోని "తిరునవయ" మరియు రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలోని మిత్రానందపురం త్రిమూర్తి క్షేత్రం వీటిల్లో ముఖ్యమైనవి. 
ఈ రెండు క్షేత్రాలలోని ప్రధాన వత్యాసం ఏమిటంటే తిరునవయలో త్రిమూర్తుల ఆలయాలు కేరళ గంగ గా ప్రసిద్ది చెందిన భరత్ పుళ నదికి ఇరుపక్కలా ఉంటాయి. మిత్రానందపురంలో ఒకే ప్రాంగణంలో మూడు ఆలయాలు ఉంటాయి.  అలాని ఈ ఆలయాలేవీ విరాట్ నిర్మాణాలు కావు. నివాస గృహాల మధ్య గృహాల మాదిరే కనిపిస్తాయి. బ్రహ్మ ఆలయ పురాతన గోపురం, విష్ణాలయ ప్రవేశ ద్వారం మనలను ఆలయం లోనికి ప్రవేశిస్తున్నాము అన్న అనుభూతిని ఇస్తాయి.  









శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ఉత్తర ద్వారం 


పడమర ద్వారం 






తిరువునంతపురం అన్న పేరు స్థానికంగా కొలువుతీరిన శ్రీ అనంతపద్మనాభ స్వామివారి వలన వచ్చినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది. ఆలయంలో బయల్పడిన నిధి నిక్షేపాల కారణంగా గత కొంత కాలంలో అధికంగా వార్తలలో నిలుస్తోంది ఈ ఆలయం. తిరువనంతపురంలో ఎన్నో పురాతన  పౌరాణిక నేపథ్యం గల ఆలయాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మి  వరాహ స్వామి ఆలయం, శ్రీ మిత్రానందాపురం త్రిమూర్తి కోవెల, శ్రీ ద్రౌపదీ అమ్మన్ కోవెల, శ్రీ పరశురామ ఆలయం కొన్ని.   శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పడమర ద్వారానికి ఎదురు గుండా ఉన్న సన్నటి సందులో  శ్రీ పద్మనాభ స్వామి ఆలయ పూజారులు ( నంబూద్రి ) నివసిస్తుంటారు. 














దేవతల స్వస్థలంలో సహజంగా కనిపించే పచ్చదనం,చల్లదనం ఈ సన్నని సందులో కూడా కొలువై ఉంటాయి. పురాతన గృహాలు, ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా పెరిగిన చెట్ల సమూహం, పక్షుల కిలకిలారావాలతో నిండిన ప్రశాంత వాతావరణం మనస్సును దోచుకొంటుంది. నెలకొన్న నిశ్యబ్ద పరిసరాలు ముఖ్యపట్టణంలో ఉన్నామన్న ఆలోచనే రానీయదు. వీటి మధ్య  నుండి వెళుతుంటే మన ఆలోచనలు మనలను గతకాలం లోనికి తీసుకొని వెళతాయి. 
నంబూద్రుల నివాసాలను దాటి  కొద్దిగా దిగువకు వున్న ప్రాంతంలో మొదట శ్రీ హరి, పక్కన కైలాస నాధుని ఆలయాలు, కొద్దిగా లోపలగా విధాత ఆలయం ఉంటాయి. 
శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, శ్రీ మిత్రానంద పురం త్రిమూర్తి ఆలయం, మరెన్నో ఆలయాలు కేరళలో పేరుగాంచిన హరి భక్తుడు శ్రీ బిల్వమంగళ స్వామి తో ముడిపడి ఉన్నాయి. మహర్షుల తపస్సుకు సంతసించిన వైకుంఠ వాసుడు ఇక్కడ అనంత పద్మనాభునిగా వెలిశాడని తిరువనంతపుర చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్ర ప్రాధాన్యత తెలిసి బిల్వమంగళ స్వామి మిత్రానందపురంలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ప్రతిష్ఠ జరిపినట్లుగా స్థానికంగా కధలు వ్యాప్తిలో ఉన్నాయి. 















వ్యాప్తిలో ఉన్న గాధల ప్రకారం త్రిమూర్తులు ప్రత్యక్ష నారాయణుడు సూర్య దేవుని సంతృప్తి పరచడానికి ఒక గొప్ప యాగం ఇక్కడ చేసారట. ఆయన సంతృప్తి చెంది త్రిమూర్తుల అభీష్టాన్ని నెరవేర్చారట.సూర్యునికి ఉన్నమరో పేరు "మిత్ర". అలా ఈ ప్రాంతానికి మిత్రానందపురం అన్న పేరొచ్చినది. కాకపొతే ఆలయాలు తొలుత ఎవరు నిర్మించారు అన్న విషయాలు వెలుగులోనికి రాలేదు. 
కానీ కేరళ లోని ఆలయాల వివరాలను తెలిపే "శ్యానందుర పురాణం " ప్రకారం 1168వ సంవత్సరంలో ఈ ఆలయాల నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. శాసనాల ద్వారా 1196వ సంవత్సరంలో ఆలయాలకు మరమత్తులు జరిగినట్లుగా తెలియవస్తోంది.  తిరిగి 1748వ సంవత్సరంలో మహారాజా మార్తాండ వర్మ ఆధ్వర్యంలో ఆలయాలకు మరోసారి మర్మత్తులు జరిగినట్లుగా నమోదైన వివరాలు తెలుపుతున్నాయి. 









అరుదయిన ఈ ఆలయాలను సందర్శించడానికి ఒక పద్దతి ఉన్నది. పురుషులు తప్పనిసరిగా ధోవతి ధరించాలి. స్త్రీలు చీర ధరించాలి. ముందుగా లోపలికి ఉన్న సృష్టి కర్త ఆలయానికి వెళ్ళాలి. స్థానికంగా ఉన్న నమ్మకం ప్రకారం ఒకప్పుడు ప్రజలను ఇక్కట్లకు గురుచేస్తున్న యక్షిణిని పారద్రోలడానికి పండితుల సూచన మేరకు హంస వాహనుని ప్రతిష్టించినట్లుగా అవగతమౌతోంది. 








ఈ ఆలయానికి పక్కనే ఉన్న పుష్కరణిలో  స్నానం చేసిన తరువాతే శ్రీ పద్మనాభ స్వామి ఆలయ పూజారులు ఆలయ ప్రవేశానికి అర్హులు. 











చూడగానే అత్యంత పురాతన ఆలయంగా కనపడే  ఇక్కడ చతుర్ముఖుడు "ఏక ముఖు"నిగా చతుర్భుజాలతో ఉపస్థిత భంగిమలో చతురస్రాకార గర్భాలయంలో దర్శనమిస్తారు. ఇది ఒక ప్రత్యేకత. మరెక్కడా బ్రహ్మ  ఏకముఖునిగా కనపడరు. అన్నిచోట్లా చతుర్ముఖునిగానే కనపడతారు. 











గర్భాలయం మొదట్లో సిద్ది బుద్ది సమేత గణపతి కొలువై ఉంటారు. 
మనసులోని కోరిక వినాయకుని తెలిపి "తీపి అప్పం" ( మన బూరె లాంటిది భక్ష్యం )నైవేద్యం పెడితే స్వామి మనోభీష్టాన్నితప్పక నెరవేరుస్తారు అన్నది స్థానిక నమ్మకం. విఘ్ననాయకునికి ప్రతి నిత్యం విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించుకొంటారు. 
ఒకప్పుడు ఈ ఆలయం లోనికి స్త్రీలకు ప్రవేశం లేదట. ప్రస్తుతం అనుమతిస్తున్నారు.  










విధాత ను సందర్శించుకొన్న తరువాత  వెనక్కు వచ్చిశ్రీ మహా విష్ణువు ఆలయం చేరుకోవాలి.
వర్తులాకార గర్భాలయంలో వైకుంఠ వాసుడు చతుర్భుజాలతో స్థానక భంగిమలో దివ్యమైన పుష్ప అలంకరణతో నేత్ర పర్వంగా దర్శనం అనుగ్రహిస్తారు.









అష్టమి తిది  మరియు రోహిణి నక్షత్రం  రోజులలో విశేష పూజలు జరుగుతాయి. గర్భాలయం పక్కన ఉన్న చిన్న సాలగ్రామ శిల ఉంటుంది. శ్రీ విల్వమంగళ స్వామి పూజించిన శిల అని అంటారు.











ఇక్కడనుంచి దక్షిణంగా కొంచెం లోపలికి వెళితే నలుచదరపు ఆలయంలో కైలాస నాధుడు లింగ రూపంలో చందన విభూతి లేపనాలతో చక్కని పుష్పాలంకరణతో శోభాయమానంగా దర్శనమిస్తారు. స్వామి భక్త సులభుడు. ప్రతి శివరాత్రికి నియమంగా వశోధార హోమం చేస్తారిక్కడ.  ఈ హోమం వలన దేశం సుబిక్షంగా ఉంటుంది అని చెబుతారు. 
శివరాత్రి పర్వదినాన్ని వైభవంగా జరుపుతారు. పక్కనే శ్రీ గణపతి మరియు నాగ ప్రతిష్టలు కనపడతాయి. 














మూడు ఆలయాలలో నిత్యపూజలు నియమంగా జరుగుతాయి.అన్ని హిందూ పర్వదినాలలో భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చి త్రిమూర్తులను కొలుస్తారు. అత్యంత అరుదైన ఈ క్షేత్రం  తిరువనంతపురం దర్శించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా  సందర్శించుకోవలసినవి.



నమః శివాయ !!!

  









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...