Naga Nandi Temple, Nandyala


                                        నాగ నంది, నంద్యాల 

నవనంది క్షేత్రంగా ప్రసిద్దికెక్కినది   నంద్యాల.
కర్నూలు జిల్లాలో ఉన్న ఈ పట్టణ పరిసరాలలో ఉంటాయీ నవనంది ఆలయాలు.
వీటిల్లో మూడు నంద్యాల పట్టణంలో, మూడు నంద్యాల కు మహానందికి మధ్యలో, మిగిలిన మూడు మహానందిలో ఉంటాయి.




నంద్యాలలో ఉన్నవి  ప్రధమ నంది, నాగ నంది మరియు సోమనంది. 

మిగిలిన ఎనిమిది ఆలయాలకు ఈ ఆలయానికి గల ముఖ్య తేడా ఒకటి కలదు. 
అవి అన్నీ పరమేశ్వరుని పేరుమీద పిలవబడేవి. 
ఇది మాత్రం శ్రీ ఆంజనేయ కోదండ రామ స్వామి దేవస్థానంగా పేరొందినది. 
పౌరాణికంగానే కాకుండా  చరిత్రలోనూ  గుర్తింపుపొందిన ఈ క్షేత్ర గాధ ఇలా ఉన్నది.

తనను తన తల్లినీ ఎన్నో ఇక్కట్లకు గురిచేసిన నాగుల మీద అమితమైన ద్వేషం పెంచుకొన్న గరుత్మంతుడు దొరికిన నాగులను దొరికినట్లు చంపసాగాడట. 
ప్రాణభయంతో కొందరు నాగులు ఇక్కడ నాగభూషణుని దయకోసం ప్రార్ధించారట. 
వారికి సాక్షాత్కారమిచ్చిన సర్వేశ్వరుడు వారి రక్షణార్ధం ఇక్కడే కొలువు తీరడం వలన ఈ క్షేత్రం "నాగ నంది"గా పేరొందినది.  
కలియుగంలో విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీ కృష్ణ దేవరాయలవారి ఆధ్యాత్మిక గురువు శ్రీ వ్యాస రాయలు. వీరి ఆరాధ్య దైవం శ్రీ ఆంజనేయుడు. 
తమ నిరంతర పర్యటనలలో ఆయన అనేక ప్రదేశాలలో ఎన్నో హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించారు. 
వాటిల్లో ఇది ఒకటి. 
కైలాసనాధుని అంశ కపివీరుడని మన గ్రంధాలలో పేర్కొన్నారు కదా !
నిలువెత్తు రాతి మీద చెక్కబడిన శ్రీ అభాయాంజనేయుని రూపం నిరంతరం  పెరుగుతుందని అంటారు.
గర్భాలయంలో ఒక పక్కన చిన్న లింగ రూపంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి కొలువుతీరి ఉంటారు. 
నేరుగా సేవించుకొనే భాగ్యం భక్తులకు లభిస్తుంది. 

తదనంతర కాలంలో శ్రీ రామ మందిరం నిర్మించబడినది.
 అలా నాగనంది హరిహర క్షేత్రంగా పరిగణించబడినది. 
ఈ కారణంగా ప్రాంగణంలో నవగ్రహ మండపం నెలకొల్పబడినది.  
ఈ రెండు ఆలయాల మధ్యలో శ్రీ గురు రాఘవేంద్రుని మందిరం ఉంటుంది. 
ఆలయ వృక్షం శమీ వృక్షం. 
వృక్షం వద్ద నాగ ప్రతిష్టలతో పాటు హంస వాహనం పైన విహరిస్తున్న వాణీ సమేత విధాత విగ్రహం అత్యంత అరుదైనదిగా చెప్పుకోవాలి. 


శివ కేశవ బేధం లేకుండా అన్ని పర్వదినాలలో విశేష పూజలు నిర్వహించబడతాయి. 
ఈ పురాణ ప్రసిద్ది చెందినా ఆలయం నంద్యాల బస్సు స్టాండ్ సమీపంలో ఉంటుంది. 
నమః శివాయ !
జై శ్రీ రామ్ !
శ్రీ ఆంజనేయం!!!






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore