Shakthan Thampuran Palace, Thrissur


                             శాక్తన్ థంపురణ్ ప్యాలస్, త్రిస్సూర్ 

"రామవర్మ కుంజుపిల్ల " అంటే కేరళలో ఎవరికీ తెలియదు. 
అదే "శాక్తాన్ థంపురణ్" ( శక్తివంతుడైన రాజు ) అంటే మాత్రం ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పడమే కాకుండా చరిత్ర కూడా చెబుతారు. 
1751 నుండి 1805 వరకు కేరళలోని అత్యధిక భూభాగాన్ని పాలించిన పాలకుడు ఈయన. పేరుం పాడు స్వరూపం గా పిలవబడిన కొచ్చిన్ రాజ వంశం కీర్తిని పెంపొందించిన వారిలో అగ్రగణ్యుడు. 
ఆయన నిర్మించిన అనేక నిర్మాణాలలో ఒకటి త్రిస్సూర్ పట్టణంలో ఉన్న " శాక్తాన్ థంపురణ్ ప్యాలస్ ". 







" వాడక్కేచిర కోవిలకం " గా పిలవబడిన పురాతన రాజ భవనాన్ని శాక్తాన్ థంపురణ్ 1795 వ సంవత్సరంలో కేరళ మరియు డచ్ నిర్మాణ శైలిలో పునః నిర్మించినట్లుగా తెలుస్తోంది.





 " నలిక్కేట్టు " గా పిలవబడే నలుచదరపు సాంప్రదాయ నిర్మాణం స్థానిక మరియు అప్పుడే మన దేశం లోనికి ప్రవేశిస్తున్న విదేశీ సంస్కృతుల సంగమంగా పేర్కొన వచ్చును.
ఎత్తైన విశాల మైన గదులు, స్తంభాలు, చెక్కతో చేసిన ద్వారాలు, కిటికీలు కేరళ శైలికి నిదర్శనం కాగా,నేలమీద పరచిన చక్కని, ముదురు రంగుల పలకలు విదేశీ శైలిని ప్రదర్శిస్తాయి.
ఎన్నో చారిత్రక సంఘటనలకు సజీవ సాక్షిగా నిలిచే ఈ భవనాన్ని 2005వ సంవత్సరంలో ప్రదర్శన శాలగా మార్చారు.
మనిషికి ఇరవై రూపాయలు.
ప్రాంగణంలో ఫోటోలు తీసుకోవచ్చును.
లోపల తీయడానికి అనుమతి లేదు.










ప్రవేశ ద్వారం పక్కన ఉన్న ధ్వజం "టిప్పు సుల్తాన్ "ఈ ప్రాంతాన్ని తన అధీనం లోనికి తెచ్చుకొన్న సందర్భంలో స్థాపించినది. కాకపొతే ఇక్కడ కాదు.
పక్కనే ప్రస్తుతం క్రీడా మైదానం ఉన్న స్థలంలో. మైదాన నిర్మాణ సందర్భంగా ఇక్కడకు తరలించారు.









నాటి రాజుల జీవన విధానాలను ఎన్నో విధాలుగా ప్రతిబింబించే విధంగా సందర్శన శాలను రూపొందించారు.




దరిదాపుగా పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది ఈ భవనం.
లోపలి ప్రవేశించగానే దారికి ఇరుపక్కలా ఆ నాడు యుద్దాలలో ఉపయోగించిన మర ఫిరంగులు కనపడతాయి.
ప్రధాన భవనం మొదట్లో రాజ వంశీకులు విహరించిన బగ్గీ.
తరువాత వరసగా రాతి మరియు లోహాల మీద చెక్కిన దేవతా మూర్తులు, శిల్పాలు, వివిధ దేవతా రూపాలు ఒక క్రమ పద్దతిలో అమర్చారు.
ఈ విభాగం వెనుక ఉంటుంది  రాజు గారి వంటశాల. ఇందులో రోళ్ళు, రోకళ్ళు, చాటలు, జల్లెల్లు, పెద్ద పెద్ద కాగులు, వంట పాత్రలు, గరిటెలు ఉంటాయి.
అరుదైన చెక్క మీద సూక్ష్మ చెక్కడాలతో మలచిన  భోషాణం. ఒకప్పుడు ఇందులో నగదు, నగలు ఉంచేవారట.
తరువాత వరుసగా రకరకాల శిల్పాలు, రూపాలను అద్దాల బీరవాలలో ఉంచారు.
అలా మెట్ల మార్గంలో మొదటి అంతస్తుకు చేరితే రాజులు వాడిన ఆయుధాలు,రాజ సభ , అంతరంగిక మందిరం, కొచ్చిన్ రాజ వంశీకుల చిత్ర పటాలు, వారు ఆడిన చదరంగం, వారి రాజ దండం, పడక గది వరసగా ఉంటాయి.
ఆ కాలంలో రాజోద్యోగుల హోదాను తెలిపే నామ ఫలకాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఆకర్షించే విభాగం నాణాలది.
ఇందులో పదో శతాబ్దం నుండి స్థానికంగా వాడిన నాణాలు, తరువాత వచ్చిన విదేశీయుల అంటే ఇండో డచ్, ఇండో ఫ్రెంచ్, ఇండో పోర్చుగీసు, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక విషయాలు తెలుపుతాయి.
పన్నెండో శతాబ్దం నుండి పద్దెనిమిదో శతాబ్దం వరకు భారత దేశంలో విశేష గుర్తింపు మరియు విలువ కలిగిన "రామ టాంక "ప్రత్యేక ఆకర్షణ.
ఇంకా బ్రిటిష్ రూపాయి, టిప్పు సుల్తాన్ మరియు హైదరాబాద్ నవాబు కాలం నాణాలు కూడా ఉన్నాయి.









ప్రధాన భవనం వెనక కేరళలోని వివిధ ప్రాంతాలలో జరిపిన పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో లభించిన వస్తువులను ఉంచారు.
పురాతన లిపి. భాషా అభివృద్ధి తెలిపే చిత్రపటాలు ఉన్నాయిక్కడ.
అనేక శాసనాలు, తాళ పత్ర గ్రంధాలను కూడా భద్రపరచారు.





ఆనాటి పాలకులు పచ్చదనానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చే వారో తెలిపేది హెరి టేజ్ గార్డెన్.













ఇందులో కొందరు కొచ్చిన్ రాజ వంశీకుల సమాధులు ఉన్నాయి.
ఆ ఉద్యానవనం లోపల నౌకా విహారానికి చిన్న కొలను, పక్కనే రాజ వంశీకులు నిత్యం పూజించిన శివాలయం ఉంటాయి.












పచ్చని ప్రకృతిలో స్వచమైన గాలిని అందులో నగర మధ్యలో పొందే అవకాశం లభిస్తుంది శాక్తాన్ థంపురణ్ ప్యాలస్ లోని ఈ ఉద్యానవనంలో !!




త్రిస్సూర్ సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చూడ వలసిన ఈ భవనం శ్రీ వడక్కు నాథర్ ఆలయానికి దగ్గరలో, నార్త్ బస్టాండ్ చేరువలో ఉన్నది.

















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore