Thirunakkara sree Mahadeva Temple, Kottayam

                      తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయం, కొట్టాయం  

గత నెల రోజులలో నేను సందర్శించిన అద్భుత శివాలయాలలో మూడవది కేరళ రాష్ట్రం కొట్టాయం లోని తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయం.
కొట్టాయం శబరి మల యాత్ర చేసేవారందరికి తెలిసిన ఊరు.
ఆంద్ర నుండి వెళ్ళే అయ్యప్ప దీక్షా పరులలో చాలా మంది ఇక్కడే దిగుతారు.
ఈ ఊరు మధ్యలో ఉన్న తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయంలో కైలాస నాధుడు కోరి కొలువైనాడని క్షేత్ర పురాణ గాధ ఆధారంగా అవగతమౌతోంది. 
అయిదు శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతాన్ని పాలించే తేక్కుమ్కూర్ వంశ రాజు ప్రతి పౌర్ణమికి త్రిస్సూర్ వెళ్లి శ్రీ వడక్కు నాథర్ ను సేవించుకొని వచ్చేవారట. 
అలా చాలా సంవత్సరాలు గడిచాయి. 
ఒకసారి వయసు మీద పడటంతో వయోభారం వలన ఇంత దూరం ప్రయాణించి స్వామి దర్శనానికి రాలేనని, ఉపయోగం లేని ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించమని వేడుకోన్నారట రాజు. 
నాటి రాత్రి సదాశివుడు రాజుకు స్వప్న సందర్శనమిచ్చి తిరుగు ప్రయాణంలో లభించే లింగాన్ని తన రాజ్యంలో ప్రతిష్టించమని, అందుకు అవసరమైన ఆధారాలను తెలిపారట. 
తన అదృష్టానికి సంతోషించిన రాజు రాజ్యానికి బయలుదేరారట.  

సర్వేశ్వరుడు తెలిపినట్లుగా దారిలో ఒక బ్రాహ్మణుడు కలిసారట. 
ఆధారాల ప్రకారం ఒక స్థలంలో త్రవ్వగా లింగం లభించినదట. 
అవధులు లేని ఆనందంతో రాజు ఒక ఉత్సవంగా లింగరాజును తీసుకొని వచ్చి చిన్న పర్వతమైన "నక్కర"(పర్వతం )మీద ప్రతిష్టించారట. 
అలా కాలక్రమంలో "తిరు నక్కర" ( పవిత్రమైన పర్వతం)గా పిలవబడసాగింది. 
లింగం తో పాటు అమ్మవారి పంచలోహ విగ్రహం, నందీశ్వరుడు కూడా లభించారట. 
అందుకని గర్భాలయంలో స్వర్ణ కవచంతో కప్పబడిన లింగం పక్కనే అమ్మవారు కొలువైవుంటారు. 
సహజంగా కేరళ శివాలయాలలో వర్తులాకార శ్రీ కోవెలలో ముందు పక్క మహేశ్వరుడు, వెనక 
కేరళ శివాలయాలలో నందికి అంత ప్రాధాన్యత కనపడదు. చాలా ఆలయాలలో నందీశ్వరుడు ఉండడు. 
కానీ తిరునక్కర ఆలయం లోని నందికి అపరిమిత ప్రాధాన్యత ఉన్నది. 
గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపంలో పంచలోహాలతో చేసిన తొడుగు కప్పబడి ప్రత్యేకంగా కనపడతారు నంది. 
దీనికి సంబంధించి ఒక కధ స్థానికంగా వినపడుతుంది. 
పంటల కోతల సమయంలో పొలాలకు కాపలాగా ఉన్న రైతులకు ఒక ఎద్దు రాత్రి పూట్ల పంటను మేస్తూ కనపడగా, దానిని వెళ్ళగొట్టడానికి రాళ్ళు రువ్యారట. 
నాటి రాత్రి నంది రాజు కు కలలో కనపడి తన మీదకు రాళ్ళు వేసిన సంగతి తెలిపినాడట. 
మరుసటి రోజు రాజు ఆలయానికి వచ్చి చూడగా నంది విగ్రహం మీద రాళ్ళ గాయాలు కనిపించాయట. 
నాటి నుండి నందికి ప్రత్యేక నేవేద్యాలు ఏర్పాటు చేసారట. 
తరువాత కొంతకాలానికి నంది విగ్రహం మీద నీటి బొబ్బ కనపడగా రాజాజ్ఞ మేరకు వైద్యులు వైద్యం చేసారట. 
దీని గురించి జోతిష్కులను సంప్రదించగా ఇది రాజ్యంలో సంభవించబోయే ప్రకృతి వైవరీత్యాలకు సంకేతం అని తెలిపారట. 
చివరిసారి బొబ్బ సుమారు వంద సంవత్సరాల క్రిందట కనిపించినది అని నంది మీద హాని కారక క్రిములు చేరకుండా లోహపు కవచం పెట్టినట్లుగా తెలుస్తోంది. 
 ఆలయానికి చేరుకొనే మార్గంలో రోడ్డు మధ్యలో ఉంచబడిన పవిత్ర శిల కనపడుతుంది. 
తరువాత వట వృక్షం క్రింద ఉన్న దేవతా మూర్తులకు ఎదురుగా చిన్న గణపతి ఆలయం ఉంటుంది. 
చిన్నదైన అద్భుత వర్ణ చిత్రాలతో శోభాయమానంగా ఉంటుందీ ఆలయం.     






గణపతి ఆలయము పక్కనున్నమార్గం గుండా ఆలయానికి చేరుకోవచ్చును.
కొద్దిగా ఎత్తులో ఉన్న ప్రధాన ద్వారం వరకు మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.


ద్వారానికి ఇరుపక్కలా వినాయక, పరాశక్తి మహామునుల వర్ణ చిత్రాలను అద్భుతంగా చిత్రించారు.

సువిశాల ప్రాంగణమంతా ఉప ఆలయాలతో నిండిపోయి ఉంటుంది.
వినాయక, దుర్గ, సుబ్రహ్మణ్య, భద్రకాళి, వడక్కు నాథర్, ధర్మశాస్త, నాగరాజ మరియు బ్రహ్మ రాక్షస  ఈ ఆలయాలలో కొలువై ఉంటారు.

నిత్యం భక్తులతో కళకళలాడుతుండే ఆలయంలో ఎన్నో పూజలు జరుగుతాయి.
అన్ని హిందూ మరియు స్థానిక పండుగలు అయిన విషు, ఓనం రోజులలో విశేష పూజలు మరియు అభిషేకాలు ఉంటాయి.
గణేష చతుర్ధి, శివరాత్రి, నవరాత్రులు, శబరిమల మండల పూజ మరియు మకర జ్యోతి సమయాలలో ఆలయ వేళలో మార్పులు చేసి ప్రత్యేక దర్శన సమయాలను ఏర్పాటు చేస్తారు.
ఇవి కాకుండా తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయంలో మూడు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
మీనం మాసం ( మార్చి) లో పది రోజుల పాటు జరిగే "పైన్ కుని ", మిధునం నెల ( జూలై ) లో ఎనిమిది రోజుల పాటు జరిగే "ఆని", తులం నెలలో ( అక్టోబర్) ఆరు రోజుల పాటు నిర్వహించే "అల్పాసి".
ఈ ఉత్సవాల అన్నింటిలో కేరళలోని అన్ని రకాల వాయుద్యాల మరియు నాట్యాల విశేష సమ్మేళనంగా మేళవించి ఘనంగా నిర్వహిస్తారు.

జిల్లా కేంద్రమైన కొట్టాయంలో యాత్రికులకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి.
నమః శివాయ !!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore