అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి ఆలయం, కోయంబత్తూర్
వానరం అంటే స్థిరత్వం లేకుండా ప్రవర్తించే జీవి.
మానవ మనస్సుకు, ఆలోచనలకు ప్రతి రూపం వానరం.
మానవులకు సరి అయిన మార్గ దర్శకత్వం చేయడానికి స్వయ సర్వేశ్వరుడే వాయునందనునిగా అవతరించారని జ్ఞానులు, విజ్ఞులు అంటారు.
అందుకే నిరుపమాన స్వామి భక్తికి, అచంచల విశ్వాసానికి, చక్కని వాక్చాతుర్యానికి, కార్య దీక్షకు, పరాక్రమానికి, వినయ విదేయతలకు మరో పేరే శ్రీ ఆంజనేయుడు.
చిరంజీవిగా ఎక్కడ రామ నామ జపం జరుగుతుందో అక్కడ ఉంటారని భక్తులు విశ్వసించే స్వామి కి దేశం అంతటా ఎన్నో ఆలయాలున్నాయి.
వాటిల్లో ఏమాత్రం చారిత్రిక పౌరాణిక నేపద్యం లేకుండా ఒక భక్తుని ధృడమైన సంకల్పంతో నెలకొన్న ఆలయమే "అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి ఆలయం, కోయంబత్తూర్"
పది సంవత్సరాల క్రిందట సద్గురు ఆదేశంతో శిష్య బృందంచే నిర్మించబడిన ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
సహజంగా భక్త, దాస, అభయ, సంజీవ రాయ, పంచ ముఖ ఆంజనేయునిగా దర్శనమిచ్చే అంజనా సుతుడు ఈ ఆలయంలో అన్నీ మేలవించుకొని అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామిగా భక్తులను అనుగ్రహిస్తారు.
సాలగ్రామ శిల తో చెక్కబడిన ఎనిమిది అడుగుల విగ్రహం వెనుక రాతి మకర తోరణం శివలింగాకారంలో ఉండటం వలన హనుమంతుని ఆరాధిస్తే మహాదేవుని సేవించిన ఫలితం కనపడుతుంది.
కుడి అభయ హస్తం భక్తుల కష్టాలను దూరం చేసేదిగానే కాకుండా అరచేతిలోని శ్రీ మహా లక్ష్మి రూపం సిరిసంపదలను అనుగ్రహిస్తుంది. ఎడమ చేతిలోని గద మానవుల లోని ఈర్ష్య, అసూయ, అహంకారం, లోభం, మొహం అనే అయిదు దుర్లక్షనాలను దూరం చేసేదిగా అభివర్ణిస్తారు
పడమర దిశగా కొలువై ఉన్న సంజీవ రాయడు వివిధ వన మూలికలతో నిండిన పక్షిమ కనుమలను చూస్తూ అప్పన్నుల ఆరోగ్యాలను కాపాడే ధన్వంతరి.
దక్షిణ దిశగా తిరిగిన పాదాలతో ఉన్న చిరంజీవి తన గురువైన సూర్య నారాయణుని కుమారుడైన యమ ధర్మ రాజుని ప్రభావితం చేసి రామ నామ జపం నిస్వార్ధంగా చేసే భక్తులకు అపమృత్యు భయాన్ని కలగనీయరు అని అంటారు.
తమిళనాడులో ఆంజనేయుని అపురూపంగా వివిధ విధాలుగా అర్చిస్తారు, అలంకరిస్తారు, ఆరాధిస్థారు.
వీరి సేవలో వాయునందనుని వాలానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు.
తోకను ప్రతి ప్రదక్షిణ తరువాత తాకితే సకల గ్రహ భాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి వారి తోక పూర్తిగా దర్శనమిస్తుంది. ఇలాంటిది చాలా అరుదు. దాని దర్శనం భక్తులకు సర్వ శుభదాయకం.
స్వామివారి గుండ్రని నేత్రాలు సూర్య చంద్రులకు చిహ్నాలు. మానవులకు కావలసిన వేడి చల్లదనాలను ప్రసాదిస్తాయి.
2004 వ సంవత్సరంలో ప్రతిష్టించబడిన స్వామి నాటినుండి ఇక్కడి ప్రజలను కన్నబిడ్డల మాదిరి కాపడుతున్నరన్నది స్థానిక నమ్మకం.
అద్భుతమైన విషయం ఇక్కడ జరిగే అలంకరణలు.
నెలలోని ప్రతి శని, ఆదివారాలలో రమణీయమైన అలంకరణ జరుపుతారు.
ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మించారు.
ఈ ఆలయం కోయంబత్తూర్ పట్టణంలోని అవనాషి రోడ్ లోని ESSO బస్సు స్టాప్ దగ్గరలో ఉంటుంది.
కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి సిటీ బస్సులు లభిస్తాయి.
జై ఆంజనేయం !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి