1, జూన్ 2014, ఆదివారం

Ishtakameswari Devi Temple, Srisailam

                          శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం 

శ్రీ శైలం మహా పుణ్య క్షేత్రం.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పేర్కొనబడిన ఒకే ఒక్క క్షేత్రం శ్రీశైలం.
దట్టమైన నల్లమల అడవులలో నెలకొన్న శ్రీశైలం ఆది దంపతుల స్థిర నివాసంతో మహా క్షేత్రంగా పేరొందినది.
శ్రీశైలం సిద్ద క్షేత్రం గా కూడా పేర్కొనబడినది.
ఎందరో మహర్షులు, మహనీయులు, కారణజన్ములు, యోగులు, సిద్దులు ఇక్కడికి విచ్చేసి మల్లిఖార్జునుని కొలిచి ముక్తిని పొందారని తెలుస్తోంది.
నేటికీ ఇక్కడి అరణ్యాలలో తపస్సు చేసుకొనే మునులెందరో ఉన్నారని అంటారు.
ఎన్నో పురాతన ఆలయాలు, పురాణ చారిత్రక ప్రాధాన్యత గలిగిన ప్రదేశాలెన్నో ఉన్నాయిక్కడ.
అలాంటి వాటిల్లో గత పదేళ్ళలో భక్తులలో విశేష ప్రాచుర్యం పొందినది శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం. 



లలితా సహస్రనామాలలో కామేశ్వరి ఒకటి. కాని "ఇష్ట " అనే పద ప్రయోగం ఎక్కడా వినలేదు.
యిది ఎలా వ్యాప్తి లోనికి వచ్చినది తెలియరావట్లేదు.


శ్రీశైలం నుండి దోర్నాల వెళ్ళే దారిలో నెక్కంటి మరియు పాలుట్ల దగ్గర నుండి అటవీ మార్గంలో పది కిలో మీటర్లు ప్రయాణిస్తే ఇష్ట కామేశ్వరి ఆలయాన్ని చేరుకొనవచ్చును. 
శ్రీశైలం నుండి జీపులు లభిస్తాయి. 
అనుమతి లేని వాహనాలకు ప్రవేశం లేకపోవడం, దారి మహా భయంకరంగా ఉండి మోటార్ సైకిల్ లేదా కారు వెళ్ళలేక పోవడం వలన జీపులే ఆధారం. 
ఇరవై రెండు కిలోమీటర్ల దూరానికి మనిషికి ఏడువందల రూపాయలు వసూలు చేస్తారు. జీపుకి ఐదుగురు ఎక్కాలి. అది ముందు జాగ్రత్త చర్యగా అటవీ శాఖ వారి ఆదేశం అంటారు. 
రక్షిత అరణ్య ప్రాంతం కావడాన పర్యావరణానికి, జంతువులకు ఎలాంటి కీడు జరగకుండా ఉండటానికి అడవిలోనికి ప్రవేశించే మానవులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వివరాలు తెలిపే బోర్డులు ఎన్నో ఉంచారు. 
ప్రవేశం కూడా ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం మూడు గంటల వరకే !
ఎందుకంటె జీపులో అయినా అడవిలో రాను పోను ప్రయాణ సమయం సుమారుగా రెండు గంటలు, ఆలయం వద్ద గంట. దీనికి మిగిలిన ప్రయాణ సమయం కలుపుకొంటే మొత్తం నాలుగున్నర గంటలు. 





ముందుగా చెప్పినట్లు మొదటి పన్నెండు కిలోమీటర్లు తారు రోడ్ కావడం వలన బాగానే వుంటుంది. 
ఒకసారి అడవి లోనికి తిరిగిన తరువాత మాత్రం ఘోరమైన దారిలోనే ప్రయాణం. 
పూర్తిగా మట్టి, రాళ్ళుతో ఎత్తు పల్లాలతో నిండిన దారి. 
జంతువులు రాకుండా అటవీ శాఖ వారు ఎండిన కొమ్మలను కాల్చిన గుర్తులు కనిపిస్తాయి.  






మధ్య మద్యలో చిన్న చిన్న నీటి ప్రవాహాలు తగులుతాయి. 
వర్షా కాలంలో ఇబ్బంది కలిగిస్తాయి అని అన్నారు. 
నలు వైపులా దట్టమైన అడవి. 
పెద్ద పెద్ద పాము పుట్టలు. 
నడుస్తున్న జీపు చేసే శబ్దాలు, అప్పుడప్పుడు పక్షుల కూతలు లేకపోతె  పూర్తిగా తట్టుకోలేని నిశబ్దం. 
జంతువులు ఏమన్నా కనిపిస్తాయా అన్న కుతూహలం ఒక పక్క, డ్రైవర్ సరిగ్గా నడుపుతున్నాడా అన్న ఆందోళన మరో పక్క మదిలో మెదలుతుంటాయి. 
జీపులు కాకుండా శివరాత్రి సమయంలో శ్రీశైలం దగ్గర లోని సున్ని పెంట దగ్గర నుండి  లోయ లోనికి దిగి కొండ ఎక్కి అడవిలో పది కిలో మీటర్ల దూరం నడిచి కూడా ఇక్కడికి చేరుకోడానికి అనుమతినిస్తారని అంటారు. 
ప్రకాశం జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైన త్రిపురాంతకం నుండి ఎర్రగొండ పాలెం మీదగా కూడా మరో మార్గం ఉన్నదని చెబుతారు. 








కొన్ని చోట్ల దారి ఉండదు. ఎగుడు దిగుడు రాళ్ళ గుట్టల మీద వాహనాలు వెళ్ళడం వలన ఏర్పడిన మార్గంలో వెళ్ళడమే !




ఆలయానికి కొద్దిగా ముందు అటవీ శాఖ వారి "శ్రీ ఇష్ట కామేశ్వరి బేస్ క్యాంపు " వస్తుంది.




జీపుల్లోంచి దిగి ఒక అర కిలోమీటర్ దూరం నీటి ప్రవాహాన్ని దాటుకొని ఏపుగా పెరిగిన మామిడి చెట్ల మధ్య నుండి నడుచుకొంటూ ఆలయానికి చేరుకోవాలి.
పండిన కాయను రుచి చూడటానికి ప్రయత్నిస్తే పళ్ళు లాగేస్తాయి.
అంత పులుపు.
అడవి మామిడి.






ఇదే జీపుల్లో ఇక్కడ నివసించే గిరి పుత్రులు తమ నిత్యావసర వస్తువులను తెచ్చుకొంటారు.
వీరిని ఉచితంగా ఎక్కనిస్తారు.




నిరంతరం సాగే నీటి ఊట నుండి ఉద్భవించిన ప్రవాహం దగ్గర ఒక విఘ్న నాయకుని విగ్రహం పెట్టారు. ఇదే ఇక్కడ నివసించే వారికి ఆధారం.









గిరిజనుల నివాసాల మధ్య బండ రాళ్ళను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు పందిరితో సాదా సీదాగా కనిపిస్తుంది శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం.




గణపతి మూర్తి కుడిపక్కన, ఎదురుగా నంది, హోమ గుండం తో పాటు సిద్దునివి లాగ అనిపించే  విగ్రహాలు రెండు, భిన్నమైన మహిషాసురమర్ధని రూపం ఉంటాయి.
ఎదురుగా ఒక యేరు, పక్కన ఒక బావి కూడా ఉన్నాయి.








చిన్న ద్వారం గుండా గుంటలాగా ఉన్న ఆలయం లోనికి ప్రవేశించాలి. 





కొంచెం పాకుతూ వెళితే నూనె దీపం వెలుగులో చతుర్భుజాలతో ఉపస్థిత భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు.
పద్మాసనంలో అక్కడ కూర్చొని ఉన్న పూజారి దేవికి బొట్టు పెట్టి మనసులోని కోరిక చెప్పుకోమంటారు.
బయట అమ్ముతున్న రవికల గుడ్డ గాజులు తీసుకొని వెళితే వాటిని విగ్రహం ముందు పెట్టి శబ్దం రాకుండా పెదవులు కదలిస్తాడు తప్ప పెద్ద పూజా విధానాలు కనపడవు.




అమ్మవారి నిజరూపం విశేషాల గురించి అడిగితె తెలిసిన వివరాల ప్రకారం  వెనక ఉన్న రెండు చేతులతో పుష్పాలను, ముందు కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో శివ లింగం ఉంటాయట.
కొన్ని పురాణాలలో కైలాస నాధుని తన నాదునిగా చేసుకోవాలని నిర్ణయించుకొన్న పర్వత రాజ పుత్రి జపమాల మరియు లింగం ధరించి తపస్సు చేసినట్లుగా వర్ణించినట్లుగా తెలుస్తోంది.
ఆ కారణంగా కొందరు పార్వతి దేవి మరో రూపమే ఇష్ట కామేశ్వరి అని ప్రచారం చేస్తున్నారు.
దగ్గరలోనే పూర్తిగా నేలమట్టమైన కట్టడమే ఒకప్పటి  శివాలయం అని  స్థానికులు చెబుతారు.
నల్లమల అడవులు మొదటి నుండి సిద్దులకు, శక్తి ఉపాసులకు నిలయంగా పేరొందినది.
ఆ కారణంగా ఎవరో ఉపాసకులు ప్రతిష్టించిన మూర్తిగా కొందరు నిర్ధారించారు.
యివి తప్ప మరెలాంటి వివరాలు వెలుగు లోనికి రాలేదు.







దట్టమైన అడవిలో వదాన్యులైన కొందరు భక్తులు విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసారు. వారికి కృతజ్ఞతలు తప్పనిసరిగా తెలపాలి.






శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి సరైన మార్గం నిర్మించి, పర్యావరణం దెబ్బతినకుండా పరిమిత సంఖ్యలో వాహనాలను అనుమతిస్తే మరింత సులభంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది భక్తులు చేరే అవకాశం కలుగుతుంది. 
నల్లమల అడవులలో ప్రయాణం ఎవరికైన మధురానుభూతే కదా  !!!





















1 కామెంట్‌:

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...