Machilipatnam Temples

                     శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం , మచిలీపట్నం 


కలియుగ వరదుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన కోవెలలు మన కర్మ భూమిలో ఎన్నో కలవు. 
కొన్ని చోట్ల స్వయంభూ గాను, కొన్ని చోట్ల ప్రతిష్ట గాను గోవిందుడు కొలువై ఉన్నాడు. 
అలాంటి ప్రతిష్టిత ఆలయాలలో ఒకటి కృష్ణ జిల్లా కేంద్రమైన మచిలీపట్టణంలో 345 సంవత్సరాలుగా భక్తులను ఆకర్షిస్తోంది. 
అదే బచ్చు పేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.  
గతంలో బందరు గా ప్రసిద్దమైన సాగర తీర ప్రాంతం మచిలీ పట్టణం అనేక పురాతన మరియు అధునాతన ఆలయాలకు నిలయం. 
1669 వ సంవత్సరం లో స్థానిక భక్తులైన శ్రీ పేరా ప్రగడ బచ్చు గారి మదిలో మెదలిన ఆధ్యాత్మిక భావాల మరియు భగవత్ ప్రేరణల ప్రభావంతో తమ ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పూనుకొన్నారు. 
సాటి భక్తుల ఆధ్యాత్మిక వాదుల సహాయ సహకారాలతో కొద్ది కాలం లోనే ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్టించారు.  
శ్రీ బచ్చు గారి పేరు మీద గానే ఈ ప్రాంతాన్ని "బచ్చు పేట" అని పిలవ సాగారు. 
భక్తులకు లభించిన అనేకానేక శుభ ఫలితాల వలన వారందరి ప్రోద్బలంతో 1985వ సంవత్సరంలో ఆలయ పునః నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబడి 1986 నాటికి పూర్తి గావించారు. 
నేడు సర్వాంగ సుందరంగా కనిపిస్తున్న ఆలయం అదే !
రహదారి పైన స్వాగత ద్వారం ఉంటుంది. అక్కడి నుండి కొద్దిగా లోపలికి ఉంటుంది ఆలయం. 












అయిదు అంతస్తుల రాజ గోపురం భక్తులకు స్వాగతం పలుకుతుంది. 
గోపురానికి ఇరు పక్కలా ద్వారపాలకుల విగ్రహాలు వాటి క్రింద గోపుర నిర్మాణ దాతలు, నిర్మించిన కాలం తెలిపే రాతి ఫలకాలు ఉంచబడినాయి.    



 గోపురానికున్న ఎత్తైన ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే  లోపల  వైపున  వినతా సుతుడు ఒక వైపు అంజనా సుతుడు మరో వైపు శ్రీ గణేష మరియు శ్రీ విష్వక్సేన సమేతంగా స్వామి వారికి అంజలి ఘటిస్తూ దర్శనమిస్తారు. 










బలి పీఠం, ధ్వజస్తంభం మరియు శ్రీ గరుడాల్వార్ మండపము అక్కడే ఉంటాయి. 

ప్రదక్షణా పధంలో శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి పక్కనే శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాలను నూతనంగా నెలకొల్పారు. 

ఆలయ నైరుతీ భాగంలో స్వామి వారి ఊయల మండపం , వాయువ్యం లో సహస్ర దీపాలంకరణ మండపం ఉంటాయి. 

 దీపాలంకరణ మండపానికి జయ విజయులను పైన శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపాన్ని చక్కగా చెక్కారు.  
.









ఉత్తరాన వైకుంఠ ద్వారం, ఈశాన్యంలో కళ్యాణ మండపం నిర్మించబడినాయి. 




శ్రీ దాసాంజనేయ స్వామి అక్కడి ఉపాలయంలో ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
విశాల ముఖ మండపానికున్న ద్వారం ఆస్థాన మండపం లోనికి దారి తీస్తుంది. 

గర్భాలయంలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానక భంగిమలో అద్భుత రజత కవచ ఆభరణ ధారిగా రమణీయంగా భక్తులకు దర్శనమిస్తారు. 

ఈ ఆలయం ఉపనయనాలకి, వివాహాలకి ప్రసిద్ది. 
ఆలయ ఆద్వర్యంలో ఎదురుగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసారు. అందుబాటు ధరలలో ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలతో ఉంటుంది. 

 ప్రతి నిత్యం సర్వ సేవలు అభిషేకం, అర్చన, అలంకరణ అన్నీ నియమంగా జరుగుతాయి. 
నెలకొకసారి సహస్ర దీపాలంకరణ, ఊజల్ సేవ భక్తుల సౌలభ్యం కొరకు ఆర్జిత సేవగా జరుపుతారు. 
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, ఇతర పర్వ దినాలలో ప్రత్యేక పూజలు అలంకరణ ఉంటాయి. 
పక్కనే ఈ ఆలయం కన్నా ముందు నుంచి ఉందని చెప్పే శ్రీ భ్రమరాంబా సమేత మల్లిఖార్జున స్వామి ఆలయం ఉన్నది. 
ఎదురుగా శ్రీ సంకట మోచన హనుమాన్ మందిరం నూతనంగా నిర్మించబడినది.  




మచిలీ పట్నానికి రాష్ట్ర నలుమూలల నుండి రైలు, బస్సు మార్గాలలో చేరుకోవచ్చును. 
అన్ని సౌకర్యాలు లభిస్తాయి. 

వినా వెంకటేశం ననాధొ ననాద   సదా వెంకటేశం స్మరామి స్మరామి 
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయస్థ ప్రయస్థ !!! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore