3, మే 2014, శనివారం

Kozhikode Temples

                                   శ్రీ కంఠ క్షేత్రం - కోలి కోడ్  


దక్షిణ భారత దేశంలో ఆచార విషయాలలో మిగిలిన మూడు రాష్ట్రాలకు కొంత భిన్నంగా ఉండేది కేరళ. 
ఇక్కడ యోగుల, బాబాల, ఆధ్యాత్మిక గురువుల ప్రభావం కన్నా ఏనాడో నిర్ణయించిన సామూహిక సామాజిక నిర్ణయాల ప్రభావం ఎక్కువ అని నిశితంగా గమనిస్తే తెలుస్తుంది. 
దీనివలన సమాజంలో కొన్ని రకాల అంతరాలు తలెత్తాయి. 
వాటిల్లో కులం ఒకటి. 
సమాజం లోని అట్టడుగు వర్గాల కోసం తన జీవితాంతం శ్రమించిన వారిలో శ్రీ నారాయణ గురు అగ్రగణ్యులు. 
ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలను చైతన్యవంతులను చేసిన గురుదేవులు 1894వ సంవత్సరంలో వెనుకబడిన కులంలో జన్మించారు. 
చిన్నతనంలోనే సమాజంలో నెలకొన్న అసమానతలను గమనించి వీటిని నిర్మూలించాలంటే ప్రజలకు తగినంత విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమని గ్రహించి ఆ దిశగా తన కార్యక్రమాలను నడిపించారు. 
తిరువనంతపురం జిల్లాలోని వర్కలా (ప్రసిద్ద పర్యాటన స్థలం) దగ్గర లోని శివ గిరిని తన కార్యస్థలంగా నిర్ణయించుకొని అక్కడ ఒక ఆశ్రమం నెలకొల్పారు. 
ఎన్నో విద్యా సంస్థలను, ఆలయాలను నిర్మించారు శ్రీ నారాయణ గురు. 
అలాంటి ఆలయాలలో "శ్రీ కంఠ క్షేత్రం, కాలికట్" ఒకటి. 
మలబారు ప్రాంతంలో ప్రముఖ పట్టణమైన కొలికోడ్ ( కాలికట్)ఎన్నో పురాతన ప్రముఖ ఆలయాల నిలయం. 
సుమారు వంద సంవత్సరాల కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం స్థానిక ప్రజలలో విశేష భక్తి భావాలను నెలకొల్పినది అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. 
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశగా ఉండే ఆలయ సముదాయంలో ఎందరో దేవి దేవతలు కొలువై ఉన్నారు.  




దక్షిణం పక్కన చక్కగా నిర్వహించబడుతున్న కోనేరు ఉంటుంది.


తూర్పున, దక్షిణాన ప్రాంగణం లోనికి ప్రవేశించడానికి మార్గాలున్నాయి.
రెండు అంతస్తుల గోపురానికి ఉన్న ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే బలి పీఠం, ధ్వజస్తంభం తరువాత చిన్న మండపం ఉంటాయి.






ధ్వజస్తంభం నుండి ఎడమ వైపుగా ప్రదక్షిణ ప్రారంభిస్తే మొదట పడమర ముఖంగా  శ్రీ మహా విష్ణువు కొలువైన ఆలయం వస్తుంది. అయిదు అడుగుల ఎత్తు చతుర్భుజ శ్రీ మన్నారాయణ రూపం చక్కని అలంకరణ తో భక్తులను ఆకట్టుకొంటుంది. 
వైకుంఠ నాధునికి మొక్కులు సమర్పించుకొని కదిలితే దశావతార రూపాలతో నిండిన మండపం ఆ చివర రెండు ఉపాలయాలు కనపడతాయి.  



ఒక దానిలో విఘ్ననాయకుడు గణపతి, మరో దానిలో శ్రీ ధర్మశాస్త (అయ్యప్ప స్వామి ) 
శ్రీ శాస్త విగ్రహానికి బదులు శివ లింగం ఉండటం, దాని మీద పంచ లోహ అయ్యప్ప రూపాన్ని అభిషేకాల తరువాత అలంకరిస్తారు. 
దీనికి కారణం ఆలయ పూజారులు కూడా చెప్పలేక పోయారు. 
ఆలయ వెనుక శ్రీ నారాయణ గురు సెంటేనరి మెమోరియల్ హాల్ ఉంటుంది. 
సమావేశాలు, వివాహ వేడుకలు జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి.   




ఆలయ వాయువ్య భాగంలో శ్రీ భగవతి దేవి ఉపాలయం దానికి ఎదురుగా శ్రీ సుబ్రమణ్య స్వామి ఉపాలయం ఉంటాయి. 
గమనించ దగిన అంశం ఒకటి ఉన్నది. 
శ్రీ మహా విష్ణు ఆలయం మరియు శ్రీ షణ్ముఖ ఆలయాలు ప్రత్యేకంగా రూపొందించారు. 












చతురస్రాకారపు మండపమునాకు ఉన్న ద్వారం గుండా ప్రవేసిశ్తే వర్తులాకారపు శ్రీ కోవెల దానికి ముందు నమస్కార మండపం, అందులో నందీశ్వరుడు స్వామికి అభి ముఖంగా ఉంటాడు. 
శ్రీ కోవెలకు రెండు వరుసల పై కప్పు అమర్చారు. 
గర్భాలయానికి సోమసూత్ర  విధానంలో ప్రదక్షణ చేయాలి. 
ఈశాన్యంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. 
కొద్దిగా ఎత్తులో ఉండే గర్భాలయంలో భవనాశనుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. 
రజత త్రిపుండరాలు, మూడు అర్ధ చంద్రులు, నాగ పడగలతో పాటు సుందర పుష్పాలంకరణతో లింగ రాజు నయన మనోహరంగా కనపడతారు. 

ఉదయం నాలుగు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి వుండే ఆలయంలో ప్రతి నిత్యం మూడు పూజలు నియమంగా జరుగుతాయి. 
గణపతి హోమం, మృత్యుంజయ హోమం మరియు వాహన పూజలకు ప్రసిద్ది ఈ ఆలయం. 









అన్ని హిందూ పర్వదినాలలో, స్థానిక పర్వ దినాలైన విషు, ఓనం సమయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.
ఈ  శ్రీ కంఠ క్షేత్రం కోలి కోడ్ బస్సు స్టాండ్ కు ఎదురుగా ఉన్న ఈ ఎం స యస్ స్టేడియం వెనుక ఉంటుంది.
కోలి కోడ్ కు దేశం నలు మూలల నుండి రైలు సౌకర్యం కలదు.
యాత్రీకులకు కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటు ధరలలో లభిస్తాయి.
నమః శివాయ !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...