24, మే 2014, శనివారం

Thechikottukavu sri Bhagavathy Temple, Peramangalam

                తెచ్చికొట్టుక్కావు శ్రీ భగవతి ఆలయం , పేరమంగళం 

దేవదేవుడైన శ్రీ మహా విష్ణువు తన పరశురామ అవతార సమయంలో సముద్రుని నుండి పొందిన భూమిలో నూట ఎనిమిది  చొప్పున మహాదేవ, భగవతి మరియు శ్రీ ధర్మశాస్త విగ్రహాలను ప్రతిష్టించిన సంగతి తెలిసినదే !
వాటిల్లో ఒకటి ఈ "తెచ్చికొట్టుక్కావు శ్రీ భగవతి క్షేత్రం". 
సహజంగా కేరళలో అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా చాలా ఆలయాలలో సదాశివుడు మరియు అమ్మవారు ఒకే శ్రీ కోవెలలో తూర్పు మరియు పడమర ముఖంగా కొలువుతీరి ఉంటారు. 
కానీ ఇక్కడ ఇరువురు వేరు వేరుగా కొలువై ఉంటారు. 
ఏపుగా పెరిగిన చెట్లతో నిండిన చిన్న గుట్ట మీద విశాల ప్రాంగణంలో తూర్పు పడమరలలో ప్రవేశ ద్వారాలతో ఉన్న ఈ దేవాలయంలో శ్రీ భగవతి సమేత మహేశ్వరుని తో సహా శ్రీ వినాయక, శ్రీ భద్రకాళి, శ్రీ ధర్మశాస్త పరివార దేవతలుగా దర్శనమిస్తారు. 









తూర్పు ద్వారము 
రెండు ఆలయాలకు ధ్వజస్తంభాలు ఉండవు. రాతి దీప స్తంభాలు ఉంటాయి. 
ఆది దంపతులు తూర్పు ముఖంగా తమ తమ శ్రీ కోవెలలో కొలువై ఉండగా, శ్రీ భద్రకాళి మరియు శ్రీ ధర్మశాస్త పడమర ముఖంగా ఉంటారు. 
ప్రతి నిత్యం ఉదయం అయిదు గంటల నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయంలో మూడు పూజలు నియమంగా జరుగుతాయి. 

పడమర ప్రవేశ ద్వారము 


అన్నపూరం, వేళ పూరం, పరవై క్కాల్ లాంటి ప్రత్యేక ఉత్సవాలు ఈ క్షేత్రంలో నిర్వహిస్తారు.



















శ్రీ మహాదేవ మందిరం 


తెచ్చికొట్టుక్కావు ఆలయం ఎక్కువగా వార్తలలో ఉంటూ ఉంటుంది. దీనికి కారణం "రామచంద్రన్".
ఈ ఆలయ ఏనుగు.
ఆసియాలో పెంపుడు ఏనుగులలో అత్యంత ఎత్తైన గజరాజుగా ( పది అడుగుల నాలుగు అంగుళాలు ) ప్రసిద్దికెక్కిన రామచంద్రన్ జనాదరణలో గురువాయూరు కేశవన్ తరువాత స్థానంలో ఉన్నది.
ఆలయ ఏనుగును ఎంచుకొనేందుకు చూసే " ఆనే చందం " ప్రకారం అన్ని లక్షణాలు అంటే విశాలమైన కుంభస్థలం, పొడవైన తొండం, చక్కని చెవులు, కుచ్చు తోక, నేరుగా పెరిగిన దంతాలు కలిగివున్న రామచంద్రన్ సొంత రాష్ట్రం బీహార్.
 పదిహేడేళ్ళ వయస్సులో కేరళకు చెందిన ఒక ఏనుగుల వ్యాపారి అప్పట్లో "మోతీ ప్రసాద్ " గా పిలవబడే ఏనుగుని కొని " గణేష్ " గా పేరుమార్చాడు.
కొంత కాలం తరువాత దానిని తెచ్చికొట్టుక్కావు ఆలయానికి ఇచ్చివేశాడు.
ఆలయ అధికారులు "రామచంద్రన్ " అని మరో మారు పేరు మార్చేశారు.
పదిహేడేళ్ళ పాటు భోజ్ పూరి, హిందీ భాషలలో శిక్షణ పొందిన మోతీ ప్రసాద్ కొత్త పేర్లకు, భాషకు అంత తొందరగా అలవాటు పడలేక పోయాడు.
మావటి మలయాళంలో ఇచ్చే సూచనలను అర్ధం చేసుకోలేక పోవడంతో వారు రామచంద్రన్ ను తీవ్రంగా కొట్టడంతో ఎడమ కంటికి గాయం అయ్యి చూపును కోల్పోయినాడు.
ప్రస్తుతం తన నలభై తొమ్మిదో సంవత్సరంలో ఉన్న రామచంద్రన్ మావటి వారి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో క్రమశిక్షణ కలిగిన వానిగా పేరు తెచ్చుకొన్నా, తొలినాళ్ళలో దృష్టిని కోల్పోయిన  కారణంగా అప్పుడు ఏర్పడి బెదురు మాత్రం అలానే ఉండిపోయి అప్పుడప్పుడు అదుపుతప్పి ప్రవర్తిస్తుంటాడు.

బెయిల్ మీద ఉన్న గజ రాజు :

తన ఎడమ కంటి దృష్టిని కోల్పోయిన రామచంద్రన్ ఆ పక్క చిన్న అలికిడికి కూడా బెదిరి పోతాడు. 
1998వ సంవత్సరంలో ప్రసిద్ద    త్రిస్సూర్ పూరంలో పాల్గొన్న సమయంలో ఈ కారణంగా పక్కన ఉన్న "తిరువంబాడి చంద్రశేఖరన్ " అనే ఏనుగు మీద జరిపిన దాడిలో గాయాల పాలైన చంద్రశేఖరన్  సంవత్సరం పాటు వైద్యం పొందినా బ్రతకలేదు. 


గజ కేసరి 
అప్పుడే రామచంద్రన్ మీద తొలి నేరారోపణ దాఖలైనది. 
న్యాయ స్థానంలో దృష్టి దోషాన్ని చూపి ఆరోపణలు కొట్టివేసేలా చేసుకొన్నారు. 
కానీ  త్రిస్సూర్ పూరంకి ఒక ఆకర్షణ గా నిలిచిన రామచంద్రన్ అప్పటి నుండి అందులో పాల్గొనే అవకాశాన్నిపూర్తిగా కోల్పోయాడు. 
ఇలా బెదిరి పాలక్కాడు ఆలయ ఉత్సవాలలో ఒక బాలుని మృతికి కారణమైనాడు. 
గత సంవత్సరం పెరంబవూర్ (ఎర్నాకుళం జిల్లా) ఆలయ ఉత్సవాలలో అదుపుతప్పిన రామచంద్రన్ ముగ్గురు మహిళలను ఎత్తి కొట్టి చంపేసాడు. 
అటవీ అధికారులు మరో మారు నేరారోపణ చేసారు.  
ముప్పై లక్షల నగదు, ఇద్దరు వ్యక్తుల హామీతో ప్రస్తుతం "బెయిల్ " మీద ఉన్నాడు రామచంద్రన్. 

 అయినా అతని మీద ఆదరణ ప్రజలలో తగ్గలేదు.
ప్రతి నవంబర్ నెల నుండి జూన్ వరకు జరిగే అనేక ఆలయ సంబరాలలో తీరిక లేకుండా పాల్గొంటాడు రామచంద్రన్.
ఆహ్వానం అందిన ఆలయాలకి వెళ్ళడానికి ఒక ప్రత్యేక వాహనం రామచంద్రన్ కోసం ఏర్పాటు చేసారు.
కేరళ రాష్ట్రంలో ఎన్నో అభిమాన సంఘాలు అతనికి ఉన్నాయి.
అతను ఏ ఊరు వస్తుంటే ఆ ఊరంతా అతని చిత్రాలతో నిండి పోతుంది అంటే అతిశయోక్తి కాదు.
స్థానిక ప్రముఖులు, భక్తులు ప్రతి రోజు చెరుకు గడలు, బెల్లం, అన్నం అరటి పళ్ళు తినిపించడానికి పోటీ పడుతుంటారు.
కాకపొతే మావటి సమక్షంలో తగుమాత్రపు దూరం నుండే సుమా !
మానవులు చేసిన తప్పిదనానికి ఒక మూగ ప్రాణి పడే భాధలకు ప్రత్యక్ష సాక్షి రామచంద్రన్ !


ఇంతటి చరిత్ర కలిగిన గజ రాజు రామచంద్రన్ నిత్యం సేవించే శ్రీ తెచ్చికొట్టుక్కావు భగవతీ ఆలయం త్రిస్సూర్ నుండి ప్రముఖ కృష్ణ క్షేత్రం గురువాయూర్ వెళ్ళే దారిలో ఉన్న "పేరమంగళం " లో ఉన్నది.
గురువాయూరు వెళ్ళే అన్ని బస్సులు ఇక్కడ ఆగుతాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...