చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం
మన పురాణాల ప్రకారం మనకున్నది ముక్కోటి దేవీ దేవతలు.
వీరిలోని ప్రతి ఒక్కరు జీవుల నిత్య జీవన విధానాన్ని ప్రభావితం చేసేవారే !
అందుకే అందరికీ ఆలయాలు లేకున్నా మన పూజా విధానం లో అందరిని సంతృప్తి పరచే మంత్రాలు ఉన్నాయి.
అలా మానవ జీవితాలు ప్రశాంతంగా గడిచి పోతాయన్నది ఒక విశ్వాసం.
అదే విధంగా ఎన్నో భాషల సంస్కృతుల నిలయమైన మన దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన ఆరాధన విధానాలు, నమ్మకాల ప్రకారం ఆలయ నిర్మాణాలు జరిగాయని ఆ యా క్షేత్ర గాధలను చదివినప్పుడు తెలుస్తోంది.
అలాంటి దానికి సాక్ష్యం గా కనపడేదే "చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం".
తమిళ నాడు లోని ముఖ్య నగరాలలో ఒకటైన కోయంబత్తూర్ కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లలూరు గ్రామ శివారులలో ఉన్నదీ ఆలయం.
సుమారు మూడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిన ఈ ఆలయం కొన్ని కుటుంబాల అధీనంలో ఉండి, వారే పూజారులుగా వ్యవహరిస్తున్నారు.
కాలక్రమంలో మిగిలిన వారు కూడా సందర్శించడం ఆరంభమైనది.
ఎంతైనా యమధర్మ రాజ స్వామి కదా !
తమిళ నాడు లోని ఆలయాల నగరం కుంభ కోణం సమీపంలో ఉన్న "వంచియూరు" లోనూ, తంజావూరు జిల్లా తిరు చిత్రాంబలం లోను శ్రీ యమధర్మరాజ ఆలయాలు ఉన్నాయి.
ఆయనకు నీడలా ఉండే శ్రీ చిత్ర గుప్తునికి మరో ఆలయాల పట్టణం కంచి లోని బస్టాండ్ దగ్గర ఒక ఆలయం ఉన్నది.
కానీ ఇద్దరూ కలిసి ఒకే గర్భాలయంలో ఉన్నది బహుశా ఇక్కడే కాబోలు.
ఈ విశేష ఆలయం ఎన్నో విశేషాల సమాహారంగా పేర్కొనవచ్చును.
నిత్యం సాధారణంగా ఉండే ఆలయ పరిసరాలు ఆదివారాలు సందడిని సంతరించుకొంటాయి.
స్థానికులు, దూర ప్రాంతాల వారు ఎందరో తరలి వస్తారు.
వెల్లలూరు కు చివర సింగనల్లూర్ వెళ్ళే దారిలో అభివృద్ధి చెందుతున్న కాలనీ లో (అశోకన్ వీధి, IOB పక్క వీధి)
ఎలాంటి ఆర్భాటము లేకుండా ఉంటుందీ ఆలయం.
ముఖ్యంగా చైత్ర మాసం ( ఏప్రిల్ 17 నుండి మే 16 ) దాక భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
చైత్ర పూర్ణిమ చిత్ర గుప్తుని జన్మ దినం అంటారు.
ఆ రోజున ఆయన జీవుల పాప పుణ్యాల లెక్కలు రాసేందుకు ఆ సంవత్సరానికి కొత్త పుస్తకం మొదలు పెడతారట.
అందుకని ఆయనను ఆయన ఏలిక అయిన యమధర్మ రాజుని సంతృప్తి పరచడానికి నూట ఒక్క నైవేద్యాలతో పౌర్ణమి నాటి ఉదయం అయిదు గంటలకు ప్రత్యేక ఆరగింపు సేవ జరుపుతారు.
ఆ నెలంతా భక్తులు లెక్కకు మిక్కిలిగా వస్తుంటారు.
కొట్టని కొబ్బరికాయతో పాటు తమ కోరికను కాగితం మీద రాసి యమధర్మ రాజ స్వామి చేతిలో పెట్టిస్తారు.
కోరిక నెరవేరిన తరువాత అనుకున్న వస్తువు ( బెల్లం, పంచదార, అరటి పళ్ళు లాంటివి )ను తమ బరువుకు తగినట్లుగా తూచి సమర్పించుకొంటారు.
అక్కడే వంటలు చేసుకొని నివేదన చేసి స్వీకరిస్తారు కొందరు.
ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయానికి ముందు రేకులతో కప్పిన విశాలమైన మండపం ఉంటుంది.
ఇక్కడ చిన్న మందిరంలో "రాజ గణపతి " కొలువై వుంటారు.
గోడలకు యమ లోకంలో పాపులకు విధించే శిక్షల వివరాలు, ఆర్జిత సేవల వివరాలు రాసిన పటాలు పెట్టారు.
అక్కడే ఉన్న చిన్న ద్వారం గుండా లోపలి వెళితే మధ్యస్తంగా ఉండే మండపం అందులో శ్రీ యమ ధర్మరాజ చిత్రపటాలు వివిధ అలంకరణలలో ఉన్నవి కనపడతాయి.
ఎదురుగా ఉన్న గర్భాలయంలో ప్రధాన అర్చనా మూర్తి శ్రీ యమధర్మ రాజు మహిష వాహనం మీద ఒక చేతిలో పాశం మరో చేతిలో అంకుశం ధరించి చక్కని పుష్పాలంకరణలో దర్శనమిస్తారు.
ఆయనకు కుడి పక్కన శ్రీ చిత్ర గుప్తుల వారు ఘంటం మరియు తాళ పత్రాలను పట్టుకొని ఉండగా, ఎడమ పక్కన వేల్ నిలబెట్టి ఉంటుంది.
గర్భాలయం పక్కనే మరో చిన్న గదిలో కొన్ని శివలింగాలు, సప్త మాతృకలను స్థిరపరచారు.
ఈ ఆలయం లో భక్తులకు ఇచ్చే ప్రసాదం విభూతి.
నిత్యం ధరిస్తే అకాల మృత్యువు దరి చేరదని అంటారు.
ఆలయానికి నల్ల వస్త్రాలు ధరించి వెళ్ళ కూడదని, శ్రీ యమధర్మ రాజు చిత్రాన్ని పూజా మందిరంలో ఉంచకూడదని చెబుతారు.
మూడు శతాబ్దాల క్రిందట ఈ ఆలయం నిర్మించడానికి, వివిధ పూజా విధానాలను రూపొందించడానికి తగిన కారణాలు మాత్రం అందుబాటులో లేవు.
కానీ చిత్ర పుతిర శ్రీ యమ ధర్మ రాజ ఆలయం మాత్రం తప్పనిసరిగా సందర్శించవలసిన ఆలయం.
కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 55 B మరియు C లేకపోతే S19 సిటీ బస్సులు నేరుగా వెల్లలూరు వెళతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి