3, మే 2014, శనివారం

Kozhikode Temples

                                    తాళి మహాదేవ ఆలయం 

 దేవతల స్వస్థలంగా పిలవబడే కేరళను "పరశురామ భూమి" అని అంటారు. 
ఒకే యుగంలో అవతార పురుషులైన వామన మూర్తి మరియు శ్రీ పరశు రాముడు హరిహర సుతుడైన శ్రీ ధర్మ శాస్త, తదనంతర యుగాలలో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ బలరాముడు నడయాడిన ప్రదేశంగాను, కలియుగంలో అపర దేవి అవతారం గా భక్తులు ఆరాధించే శ్రీ అత్తుక్కాల్ భగవతి దేవి స్థిర నివాస మేర్పరచుకొన్నందున మరియు కారణ జన్ముడు అద్వైత సిద్దాంత రూప కర్త అయిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరుల జన్మ భూమి కావడం వలన, ఆయన శిష్యులలో ఒకరైన శ్రీ విల్వమంగళ స్వామికి వైకుంఠ నాధుడు తన అనంత శయన రూపంలో దర్శనమిచ్చిన క్షేత్రం కావడం వలన కేరళను దేవతల స్వస్థలం అని పిలవడంలో ఏ మాత్రం అతిశయం లేదనిపిస్తుంది. 
ఇక పరశు రామ భూమి అని పిలవడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. 
ప్రజలను కన్నబిడ్డలా మాదిరి పాలించ వలసిన పాలకులు కంటకులుగా మారి వారిని అష్ట కష్టాల పాలు చేస్తుండటంతో ఆగ్రహించారు అవతార మూర్తి. 
ఇరవై ఒక్క సార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్న వాడు లేకుండా సంహరించారు. 


వారి నుండి స్వాధీనం చేసుకొన్నభూమిని సజ్జనులకు దానం ఇచ్చివేసారట. 
దానం ఇచ్చిన భూమిలో నివాస ముండటం ధర్మ సమ్మతం కాదు కనుక సముద్రుని తాను తపస్సు చేసుకోడానికి కొంత భూమిని ఇమ్మని కోరారట. 
సాగరుడు వినయంగా కావలసిన నేల తీసుకొమ్మని సెలవివ్వడంతో తన పరుశుతో కావలసిన భూమిని వెలుపలకు తెచ్చారట. 
అదే నేటి కొంకణ్ మరియు కేరళ ప్రాంతాలు. 
ఆ భూమిలో నూట ఎనిమిది చొప్పున శివాలయాలు, శ్రీ భగవతి దేవి క్షేత్రాలు, శ్రీ ధర్మ శాస్త ఆలయాలను స్థాపించారు. 
సదాశివుని క్షేత్ర పాలకునిగా, దేవిని క్షేత్ర కావలి దేవతగాను శ్రీ శాస్త ను క్షేత్ర రక్షకునిగా నియమించారట. 
అంతే కాకుండా వాటిల్లో పూజాదికాలు నిర్వహించడానికి వేదవేదాంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులను కర్నాటక ప్రాంతం నుండి రప్పించి వారికి భాద్యతలు అప్పగించి తానూ మహేంద్ర గిరికి  తపస్సు చేసుకోడానికి వెళ్లిపోయారట. 
అందువలన కేరళ "పరశు రామ భూమి"గా పేరు గాంచినది.  
నాడు ఆరవ అవతారుడు ఆవిష్కరించిన ఆలయాలు నేడు ప్రముఖ క్షేత్రాలుగా పేరుగాంచాయి. 
అలాంటి వాటిల్లో "కోలి కోడ్" ( కాళికట్ ) లో ఉన్న "తాలి మహాదేవ ఆలయం" ఒకటి. 
స్థానికంగా జ్యోతిర్లింగ క్షేత్రం గా పేర్కొంటారు. 
ఈ ప్రాంతాన్ని పన్నెండో శతాబ్దం నుండి పద్దెనిమిదో శతాబ్దం వరకు పాలించిన "జామోరిన్" (Zamorin)  రాజుల కులదైవం తాలి మహాదేవ. 
ప్రస్తుత ఆలయం వారు నిర్మించినదే!!










ప్రస్తతం అత్యంత రద్దీ కూడలిగా ఉన్న" తాలి " లో నాలుగు పక్కలా ఎత్తైన కోట బురుజల లాంటి ప్రహరి గోడతో విశాల ప్రాంగణంలో ఉంటుందీ ఆలయం. 
స్థానికంగా "మహాదేవ క్షేత్రం"గా పిలవబడుతుంది. 
కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలిలో రెండు అంతస్తుల ప్రవేశ ద్వారం నిర్మించబడినది. 
రాతి స్థంభాలకు ఇరు వైపులా దీప కన్యలుంటారు. 
ప్రాంగణంలో ఎన్నో ఉప ఆలయాలున్నాయి. 
  



















తెల్లటి లుంగీ ధరించిన పురుషులకు, చీర కట్టుకొన్న ఆడవారికి మాత్రమే ప్రవేశం. 
పక్కన దుకాణంలో పంచెలు అద్దెకు ఇస్తారు. 
అదే విధంగా ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధం. 
నేను ఆలయ అధికారులతో చాలా సేపు మాట్లాడినా ఫలితం లభించలేదు. 



చెక్క, సునిశితంగా చెక్కిన రాతి శిల్పాల మరియు సహజ వర్ణ చిత్రాల ఉమ్మడి ఖజానా ఈ ఆలయం. 
అదే విధంగా కొలువైన దేవతల రూపాల్లో కూడా ప్రత్యేకత ఉండటం చెప్పుకోవాల్సిన విషయం. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎడమ వైపున శ్రీ నారసింహ ఉపాలయం ఉంటుంది. 
చతురస్రాకారపు గోడల మీద హిరణ్య కశప వధ కు సంబంధించిన సహజ వర్ణ చిత్రాలు విపరీతంగా ఆకట్టుకొంటాయి. 
శ్రీ నారసింహ స్వామి సింహపు వదనానికి బదులుగా సుందర దరహాస మానవ వదనం కలిగి ఉండటం గమనింపదగిన విషయం. 
ప్రదక్షిణా క్రమంలో దక్షిణాన ఉన్న ఉపాలయంలో శ్రీ ధర్మ శాస్త జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణా మూర్తి మాదిరి కుడికాలు మడిచి ఎడమ కాలు క్రింద పీఠం మీద ఉంచి వృక్షం క్రింద ఉపస్థిత భంగిమలో జ్ఞాన ముద్రతో  కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. 
పక్కనే శ్రీ తేవరతిల్ భగవతి అమ్మవారి ఉపాలయం కూడా ఉంటుంది. 
పడమరలో నాగ దేవతలుంటాయి. 
ఈశాన్యంలో పడమర ముఖంగా శ్రీ మురళీ కృష్ణ ఆలయం కలదు. 
కృష్ణ ఆలయంగా పేర్కొన్నా మూల విరాట్టు చతుర్భుజాలతో ఉన్న శ్రీ హరే !
ఇది విడిగా ధ్వజస్తంభం కలిగి ఉండటం వలన ఉపాలయంగా పరిగణించలేము. 
ఈ ఆలయంలో శ్రీ వలయనాడ్ భగవతి అమ్మవారి ఉపాలయం ఉండటం మరో విశేషం. 
బలి పీఠం, ధ్వజస్తంభం దాటి అంతరాలయం లోనికి ప్రవేసిశ్తే విశాలమైన గట్టుకు చెక్క చెక్కడాలతో నిండిన నమస్కార మండపం గుండా శ్రీ కోవెలలో కొలువైన శ్రీ కైలాస నాధుని లింగారూపాన్ని దర్శించుకొని అంతరాలయ ప్రదక్షిణ చేసే క్రమంలో నైరుతిలో తలి గణపతి,  ఈశాన్యంలో తేవరతిల్  గణపతి, ఆగ్నేయంలో శ్రీ తిరుమనధంకున్నుభగవతి ఉపాలయాలు ఉంటాయి. 
విశేషమేమిటంటే శ్రీ కోవెల వర్తులాకారంలో ఉండదు. 
 క్రింది వరుసలో ద్వారపాలకులు, శివ రూపాలు, శ్రీ వేంకటేశ, శ్రీ రామ, శ్రీ మహా విష్ణు, శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ హనుమల  సుందర శిల్పాలతో పాటు శివ, కృష్ణ లీలల సహజ వర్ణ చిత్రాలతో గర్భాలయ చతురస్రాకార వెలుపలి గోడలు అద్భుతంగా తీర్చి దిద్దబడినాయి. 
పై వరుసలో దక్షిణాన శ్రీ శాస్త, పడమర శ్రీ నారసింహ, ఉత్తరాన శ్రీ మన్నారాయణుడు రక్షకులుగా ఉండగా అనేక సాధు మరియు క్రూర మృగాల రూపాలను సున్నంతో మలచి వాటికి జీవం ఉట్టిపడేలా రంగులు అద్దారు. 
విమాన గోపురం పైన గజముల, భూత గణాల రూపాలను చెక్క మీద చక్కగా చెక్కబడ్డాయి. 
పదిహేను వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఈ గర్భాలయాన్ని మాత్రం జామోరిన్ రాజులు మార్చలేదు. 
కొద్దిగా ఎత్తులో రెండు చిన్న చిన్న ద్వారాలు కలిగివున్నగర్భాలయంలో సర్వేశ్వరుడు రజత త్రిపుండరాలు, మారేడు దళం, తొమ్మిది చంద్రవంకలు, నాగ పడగ ధరించి రమణీయ పుష్ప చందన కుంకుమ అలంకరణతో తన దివ్య దర్శనాన్ని భక్తులకు ప్రసాదిస్తారు. 
స్వామిని జామోరిన్  రాజులు "శైల భద్రేశ్వర" అని గౌరవంగా పిలిచేవారట. 
ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా మహా క్షేత్రాలలో జరిగే విధంగా నాలుగు పూజలు ఇతర సేవలు జరుపుతారు. 
తాలి మహాదేవునికి మొత్తం డెభై తొమ్మిది రకాల పూజలు, నైవేద్యాలు ఆర్జిత సేవలు భక్తుల కొరకు నిర్వహిస్తారు. 
తాలి మహాదేవ ఆలయంలో జరిగే మృత్యుంజయ హోమం చాలా ప్రసిద్ది. 
శివరాత్రి, గణేష చతుర్ధి, దేవీ నవరాత్రులు, కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. 
ప్రతి నిత్యం వందలాది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. 
ఆలయానికి దగ్గరలో జామారిన్ రాజులు 1877వ సంవత్సరంలో స్థాపించిన విద్యాలయం నేటికి విద్యార్ధులకు విద్యను అందించడం చెప్పుకోవలసిన విషయం. 






మహా దేవ మందిరానికి ఉత్తరాన పెద్ద పుష్కరణి ఉంటుంది. 
ఈ కోనేరు పడమర పక్కన తమిళ సంప్రదాయంలో నిర్మించబడిన అన్నదమ్ముల ఆలయలుంటాయి
విశాల మండపంలో పంచలోహ తొడుగులు కప్పబడిన రెండు నలుచదరపు ఆలయాలలో శ్రీ గణపతి, శ్రీ షణ్ముఖ స్వామి కొలువై ఉంటారు.
అశ్వద్ద వృక్షం, నాగ ప్రతిష్టలు, నవగ్రహ మండపం కూడా ఉన్నాయిక్కడ.
ఒక పక్కన శ్రీ ఆంజనేయ పీఠం కూడా ఉంచారు.
తమిళ నాడులో సహజంగా కనపడే ఆచరమైన కాగితాల మీద తమ మనసులోని కోరిక రాసి, వారిని దండగా కట్టి హనుమంతుని మెడలో అలంకరిస్తారు.
అలా చేస్తే మండలంలో కోరిక నెరవేరుతుందని వారి విశ్వాసం.
















పక్కనే చిన్న సందులో తాళి మహా దేవ ఆలయం అంత పురాతనమైన శ్రీ రామ క్షేత్రం ఉన్నది. 
పంచె ధరించిన వారికే ప్రవేశం. 
చిత్రంలో పాంట్ ధరించిన వ్యక్తిని ఆలయం లోనికి రానీయ లేదు. 
సీతా సమేత శ్రీ రామ స్వామి గర్భాలయంలో ఒకే పీఠం మీద స్థానక భంగిమలో నేత్ర పర్వంగా కొలువై ఉంటారు. 
చిన్న ఆంజనేయ ఉపాలయము ఉన్నది. 



మహాదేవ మందిర ప్రధాన ద్వారానికి దక్షిణ పక్కన ఉన్న చిన్న సందులో ఉన్నది ఒక విశేష ఆలయం. 
అదే శ్రీ వేటక్కారన్ స్వామి ఆలయం.  

పాండవ మధ్యముడైన అర్జనుని తపస్సును పరీక్షించడానికి కిరతకుని రూపంలో వచ్చిన సదాశివుడే ఈ వేటక్కారన్. 
చిన్న పెంకుల ఇంటిలో ధ్వజస్తంభం, బలిపీఠం ఏమీ లేకుండా ఉన్న పురాతన కట్టడంలో ఉంటారు శ్రీ  వేటక్కారన్. 
సంవత్సరానికి ఒక రోజున పంచ వాయుద్య ఘోష మద్యలో భక్తులు వేలాది కొబ్బరి కాయలు శ్రీ వేటక్కారన్కి సమర్పించుకొంటారు. 
మేము వెళ్ళిన రోజున ఆ పండగ జరగబోతోంది. 
సమయాభావం వలన కొద్దిసేపే ఉండి వచ్చేశాము.    






తాలి మహాదేవ క్షేత్రం కోలి కోడ్ బస్సు స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

నమః శివాయ !!!























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...