దక్షిణ ద్వారక - గురువాయూరు
త్రిమూర్తుల లో లోకసంరక్షకునిగా భక్తులు ఆరాధించే శ్రీ హరి దశావతారాలు ధరించిన విషయం తెలిసినదే ! ఈపదింటిలో అధిక ప్రాచుర్యం పొందినవి శ్రీ నరసింహ, శ్రీ రామ మరియు శ్రీ కృష్ణ అవతారాలు.
థశరధరాముని దేవాలయాలు గ్రామగ్రామాన నెలకొని ఉన్నాయి. నృసింహునికి కూడా పెక్కు విశేష ఆలయాలు కలవు. కానీ నటన సూత్రధారి అయిన శ్రీ కృష్ణుని ఆలయాలు కొద్దిగానే కనపడతాయి.
ద్వారక, మధుర, బృందావనం, ఉడిపి, పూరి, జైపూర్, ఉదయపూరు, కన్నంబాడి మరియు మన్నారుగుడి లాంటి శ్రీ కృష్ణ క్షేత్రాలతో పాటు శ్రీ గురువాయూరప్పన్ గా కొలువైన గురువాయూరు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది.
కేరళరాష్ట్రం లో ఒక అరుదైన విశేషం అది కూడా వైష్ణవ ఆలయాల్లో కనపడుతుంది. అదేమిటి అంటే అక్కడ ఉన్న స్వామి పేరు రాముడుగా, కృష్ణుడైనా కొలువై దర్శనమిచ్చేది మాత్రం చతుర్భుజాలతో కూడిన శ్రీ మన్నారాయణుడే! గురువాయూరు లో కూడా అంతే!
గురువాయూరప్పన్, బాలకృష్ణ గా పిలవబడే స్వామి నాలుగు చేతులతో కనపడతారు. కేరళలోని రెండవ వైష్ణవ క్షేత్రముగా గుర్తింపు పొందినది గురువాయూరు. మొదటిది శ్రీ అనంత పద్మనాభుడు కొలువైన తిరువనంతపురం.
దక్షిణ ద్వారక గా పేర్కొనే ఈ క్షేత్రంలోని గురువాయూరప్పన్ కేరళ హిందువులకు ఆరాధ్యదైవం. ఆయన నామం వారికి నిత్య స్మరణం.అందుబాటులో ఉన్న కధనాల ఆధారంగా అయిదు వేల సంవత్సరాల క్రిందట అంటే ద్వాపర యుగ చివరి భాగంలో శ్రీ కృష్ణ భగవానుడు ఇక్కడ స్దిరనివాసం ఏర్పరచుకొన్నట్లుగా తెలుస్తున్నది.
క్షేత్రగాధ
తొలుత ఈ మూర్తిని కైలాసనాథుడు విధాత బ్రహ్మ దేవునికి ఇచ్చారట. ఆయన వద్ద నుండి "సూతపాశమహముని" వద్దకు తర్వాత కశ్యప ప్రజాపతి వద్దకు చేరి చివరగా వసుదేవునికి దక్కిందట. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన శ్రీ మహవిష్ణు రూపాన్ని నియమంగా పూజించేవారట శ్రీ కృష్ణుడు.
అవతార సమాప్తి సమయాన ఉద్దవునికి విగ్రహన్ని ఇచ్చి దేవ గురువు బృహస్పతి కి అందచేయమన్నారట. గురువు వాయుదేవునితో కలిసి ఆకాశ మార్గాన వెళుతుండగా ఒక సరస్సు ఉత్తర భాగాన ధ్యానం లో ఉన్న సర్వేశ్వరుడు కనిపించారట. ఇంతకు మించిన ప్రశస్తమైన స్థలం లభ్యం కాదన్ననిర్ణయానికి వచ్చిన గురు వాయువులు ఆ కోనేటి దక్షిణ దిక్కున విగ్రహాన్ని ప్రతిష్టించి దేవ శిల్పి విశ్వకర్మ చేత ఆలయం నిర్మింపచేసారట. అలా గురువు వాయువు కలిసి ప్రతిష్టించడం వలన ఈ క్షేత్రానికి "గురువాయూరు" అన్న పేరు వచ్చింది అంటారు.
స్వామి కొలువు తీరడానికి పరమేశ్వరుడు కారణం గనుక క్షేత్ర పాలకుడు రుద్రుడు. నేడు ఆలయ ఉత్తర దిశన కనిపించే తటాకమే నాడు మహేశ్వరుడు తపమాచరించిన "రుద్రపుష్కరణి". ఈ పుష్కరిణి వెనుక ఉన్న "మమ్మియూరు శివాలయం" లోనే క్షేత్ర పాలకుడు కొలువై ఉంటారు. ఈయనను దర్శించుకొన్న పిదపే శ్రీ కృష్ణ దర్శనానికి వెళ్లాలి అని భావిస్తారు భక్తులు.
ఆలయ విశేషాలు
విశ్వకర్మ నిర్మించిన ఆలయాన్ని అభివృద్ధి చేసినది పాండవుల ముని మనుమడైన జనమేజయుడు అని గాధలు తెలియజేస్తున్నాయి. సర్పయాగం చేసి లక్షలాది పాముల మరణానికి కారణమైనందున సంక్రమించిన పాపఫలం వలన కుష్టు వ్యాధి గ్రస్తుడైనాడు జనమేజయుడు. పండితుల సలహ మేరకు సంవత్సర కాలం భక్తి విశ్వాసాలతో గురువాయూరప్పన్ ని సేవించి వ్యాధి నుండి విముక్తి పొందాడు. కృతజ్ఞతగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
అనంతరకాలంలో పాండ్య, చేర, జోమారిన్, కోచ్ఛిన్ వంశ రాజులు, స్థానిక పాలకులు,ధనవంతులైన భక్తులు ఆలయాభివృద్దికి కృషి చేసినట్లు తెలుస్తోంది. 1970లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆలయం లోని అధిక భాగం ధగ్దమైనది. ప్రస్తుతం ఉన్నది ఆ ప్రమాదం తర్వాత పునః నిర్మించిన ఆలయాన్ని.
తూర్పు ముఖంగా కేరళ ఆలయ వాస్తుశైలిలో ఉంటుంది. ప్రధానద్వారం గుండా ప్రాంగణం లోనికి వెళితే గర్బాలయంలో శంఖ చక్ర గదా పద్మధారిగా చతుర్భుజాలతో స్తానక భంగిమలో చందన లేపనం, పుష్ప, తులసి మాలలతో అలంకరించబడి నేత్ర పర్వంగా దర్శనమిస్తారు బాలకృష్ణుడు.
ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ భగవతివకొలువై ఉంటారు.
ఆలయ నియమాలు
కేరళ ఆలయాల్లో పూజ విధానంలో, ఆలయ తెరిచి మూసే సమయాలలో, అలంకార, నివేదనలలో ఇలా పెక్కు నిబంధనలు ఉన్నాయి. అదే విధంగా భక్తుల వస్రధారణ విషయంలో కూడా నిర్ణయించిన సంప్రదాయాన్ని నేటికీ అనుసరిస్తున్నారు.గురువాయూరు లో మరింత కట్టుదిట్టంగా నియమనిభంధనలను పాటిస్తారు.
ప్రధాన పూజారి ఉదయం నుంచి మధ్యహన్నం వరకూ మంచినీరు కూడా త్రాగకుండా పూజాధికాలు నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో స్వామి సేవలో పాల్గొంటారు.భక్తులకు కూడా వస్త్రధారణ నియమాలు తప్పని సరి. పురుషులు తెల్లని పంచ కట్టుకుని నడుముకు తెల్లని పైపంచ కట్టుకోవాలి. మగ పిల్లలు కూడా ఇలాగే రావాలి. ఆడవారు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఆలయ ప్రవేశం లభించదు. కెమెరాలు మొబైల్ ఫోన్లు తీసుకొని వెళ్ళరాదు.
గురువాయూరు ఆలయ పూజావిధానాలను జగద్గురువు శ్రీశ్రీశ్రీ ఆది శంకరులు రూపొందించారు అని అంటారు. వాటిని శ్రీ విళ్వమంగళ స్వామి స్దిరీకరించి ఆచరణలో పెట్టారంట.తెల్లవారుఝాము మూడు గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. నిత్య పూజలు, అలంకారాలు, ఆరగింపుల సమయాన్ని మినహాయించి మధ్యహన్నం పన్నెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు శ్రీ గురువాయూరప్పన్ దర్శనం లభిస్తుంది.
ఆలయ ఉత్సవాలు
భూలోక వైకుంఠంగా పేర్కొనే గురువాయూరు ఆలయం లో ప్రతి నిత్యం పర్వదినమే. ఎన్నో అలంకారాలు సేవలు స్వామి వారికి జరుపుతారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి ముఖ్య పర్వదినాలు. స్థానిక పర్వదినాలైన విషు, ఓణంతో సహ అన్ని హిందూ పర్వదినాలు సందర్భంగా వేలాదిగా భక్తులు శ్రీ ఉన్ని కృష్ణన్ దర్శనానికి తరలి వస్తారు.ఏకాదశి మరియు అష్టమి తిధులలో, రోహిణి నక్షత్రం రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.రోజుకు నాలుగు పూజలు. గజసేవ కూడా నియమంగా నిర్వహిస్తారు.
ఇవన్నీ కాకుండా దేవస్వంవారి ఆధ్వర్యంలో జరిగే ఎన్నో కార్యక్రమాలలో ముఖ్యమైనవి రెండు. అవి
కృష్ణాట్టం మరియు అనెయోట్టం.
కృష్ణాట్టం
16 శతాబ్దానికి చెందిన జోమారిన్ రాజు "సముత్ర మానదేవ" శ్రీ కృష్ణ భక్తుడు. ఆయనకు తన ఆరాధ్యదైవం యొక్క దర్శనం చేసుకోవాలి అన్న తలంపు కలిగిందట.దానిని గురువైన శ్రీ విళ్వమంగళ స్వామి కి విన్నవించు కొన్నారట. ఆయన రాజుని ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడచెట్టు వద్ద తెల్లవారు జామున ఆడుకొనే బాలకృష్ణుని చాటుగా దర్శించుకొని వచ్చేయమన్నారట.
మరునాటి ఉదయం దుర్లభమైన దర్శనాన్ని పొందిన రాజుకి బాలయ్యను తాకాలి అనిపించినదట. ఎదురుగా వెళ్లి పట్టుకోబోగా స్వామి దరహాసం చేస్తూ మాయమయ్యారట. కాని మహదేవుని చేతిలో కృష్ణుని శిఖలో ఉన్న నెమలి ఫింఛం ఉండిపోయిందట.ద్వారకాధీశుని దర్శనం తో లభించిన ప్రేరణతో మానదేవుడు "కృష్ణ గీతి" అన్న పేరుతో శ్రీ కృష్ణుని జీవిత గాధను 8 భాగాలుగా రచించారు. తరువాత దానికి అనుభవజ్ఞులైన నాట్యాచార్యుల చేత నృత్య రూపకంగా తయారు చేయించారు.
ప్రస్తుతం దేవస్థానం వారు రోజుకు ఒక భాగం చొప్పున ఆర్జితసేవగా ప్రదర్శింప చేస్తున్నారు. ప్రత్యేక నాట్య విధానంలో కృష్ణాట్టం ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక నాట్య కళాకారుల బృందాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. కృష్ణాట్టం లోని ఒక్కో భాగం ఒక్కో విధమైన కోరికను నెరవేర్చుతాయని విశ్వసిస్తారు భక్తులు.
అవతార ఘట్టం సంతానాన్ని, కాళియమర్దనం ఆరోగ్యాన్ని, రాసక్రీడ దంపతుల మధ్య అనుభంధాన్ని ధృఢం
చేయడానికి, కంసవధ శత్రు భాధల నుండి ఉపశమనం, స్వయంవరం తగిన వధువు లేదా వరుడు కొరకు, చక్కని సంబంధ బాంధవ్య అభివృద్ధి కోసం, బాణ యుద్ధం పాడి పంటల, సంపద అభివృద్ధి కొరకు, వివిధ వాదం దరిద్ర నాశనం కోసం మరియు ఆఖరిది అయిన స్వర్గారోహణం మరణించిన ఆప్తుల ఆత్మ శాంతి కొరకు. తిరిగి తొమ్మిదో రోజున అవతార ఘట్టంతో తో మొత్తం ఒక పర్యాయ కృష్ణాట్టం ప్రదర్శన ముగిస్తారు. భక్తులు దేవస్థానంవారు నిర్ణయించిన వారికి కావలసిన అంశానికి డబ్బులు కడతారు. కృష్ణాట్టం సంవత్సరంలో తొమ్మిది నెలలు మాత్రమే ప్రదర్శిస్తారు. మిగిలిన మూడు నెలలు సాధన కొరకు కేటాయిస్తారు.
అనెయోట్టం
కేరళ లోని ఆలయాల్లో భక్తులు తమ మొక్కులను తులాభారం ద్వారా చెల్లించుకొంటారు. వాటిలో ఎక్కువగా ధాన్యం , పప్పులు, కూరగాయలు, పండ్లు, కొబ్బరి కాయలు ఉంటాయి. అలా తులాభారం ద్వారా వచ్చిన పదార్థాలను భక్తులకు అందించే అన్న ప్రసాద తయారీలో వినియోగిస్తారు. మరో విధమైన కానుకలు సమర్పించు కొనే పద్దతి కూడా ఇక్కడ కనపడుతుంది. కానీ అది చాలా ఖరీదు. అదే తమ ఇష్ట దైవాలకు గజాలను ఇవ్వడం.
అలా అధిక సంఖ్యలో ఏనుగులను పొందిన స్వామి శ్రీ గురువాయూరప్పన్. ప్రస్తుతం ఉన్న అరవై పైచిలుకు ఏనుగులను ప్రత్యేకంగా " పునత్తూరుకోట " అనే పది ఎకరాలు స్థలంలో ఉంచుతున్నారు.
నేడు ఇంతటి గజ సంపద కలిగిన గురువాయూరు దేవస్థానం కొన్ని శతాబ్ధాల క్రిందట ఉత్సవాల సందర్భంగా గజసేవ నిమిత్తం మరో ఆలయ గజరాజు ను తెచ్చుకొనేది అంటే నమ్మగలమా! కానీ అది నిజం.
కొచ్చి రాజుల అధీనంలో ఉన్న ఒక ఆలయ ఏనుగును ప్రతి సంవత్సరం ఉత్సవాల సందర్భంగా తెచ్చుకొనేవారట గురువాయూరు వారు. జోమారిన్ మరియు కొచ్చి రాజుల మధ్య తలెత్తిన విభేధాల కారణంగా ఒక సంవత్సరం ఏనుగును ఇవ్వడానికి నిరాకరించారు ఆ ఆలయ నిర్వాహకులు. చేసేది లేక గజం లేకుండానే ఉత్సవాలు జరప నిశ్చయించారు.ఆశ్చర్యకరంగా ఉత్సవాల తొలి రోజున బంధనాలను తెంచుకొని మరీ ఆ గజరాజు గురువాయూరు చేరుకొన్నది. గజ సేవ ఘనంగా జరిగింది. ఈ సంఘటనను పురస్కరించుకొని నేటికీ ప్రతి సంవత్సరం ఆలయ ఉత్సవాల తొలి రోజు సాయంత్రం "అనెయోట్టం " పేరుతో ఏనుగుల పరుగు పందాన్ని ఏర్పాటు చేస్తారు.
వేలాదిమంది భక్తులు దేశవిదేశ పర్యాటకుల హర్షధ్వానాల మధ్య జరిగే ఈ పందెంలో విజేత ఆ సంవత్సర కాలం అన్ని ఉత్సవాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగించే అదృష్టాన్ని దక్కించు కొంటుంది.
త్రిమూర్తుల పూజలందుకొని, రుద్రుడు స్థలం లో గురువాయువుల చేత ప్రతిష్టించబడిన శ్రీ గురువాయూరప్పన్ కొలువై, ఎన్నో ప్రత్యేకతలు నిలయమైన గురువాయూరు కేరళ సంస్కృతి సంప్రదాయాల రాజధానిగా పేరుగాంచిన త్రిసూర్ పట్టణానికి పాతిక కిలో మీటర్ల దూరంలో ఉన్నది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి త్రిసూర్ కి రైలు సౌకర్యం ఉన్నది.
గురువాయూరు లో దేవస్థానం ఆధ్వర్యంలో వసతి గృహాలు అందుబాటు ధరల్లో అద్దెకు లభిస్తాయి.గురువాయూరు లో మరియు చుట్టుపక్కల పెక్కు విశేష ఆలయాలు కలవు. అన్ని దర్శనీయాలే !
కృ ష్ణం వందే జగద్గురుం !!!!
( ఈ వ్యాస రచనకు తగిన సమాచారాన్ని అందించిన గురువాయూర్ ఆలయ పూజారి చిరకాల మిత్రులు శ్రీ రాజేష్ నంబూద్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు)