28, జులై 2018, శనివారం

Sri Villiputtur

                                        శ్రీ విల్లిపుత్తూరు 






తమిళనాడులోని ఆలయాల లేదా ఊరి పేర్లు అతి తక్కువగా శ్రీ తో ప్రారంభం అవుతాయి. అలాంటి వాటిల్లో ప్రముఖమైనవి శ్రీ రంగం, శ్రీ ముషీణం మరియు శ్రీ విల్లిపుత్తూరు. చిత్రమైన విషయం  ఏమిటంటే ఈ మూడు క్షేత్రాలకు సంబంధం ఉండటం.
త్రిభువన పాలకుడు, అనంతశయనుడు అయిన శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాథస్వామి గా కొలువైన శ్రీరంగం , భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి కెక్కినది. ఆయన ధరించిన అనేకానేక అవతారాలలో ప్రముఖమైన దశావతారాలలో మూడవది అయిన వరాహ అవతార రూపంలో వెలసిన ఏకైక ఆలయం ఉన్న ప్రదేశం శ్రీ ముషిణం.
మూడవదైన శ్రీ విల్లిపుత్తూరు, శ్రీ మన్నారాయణ మూర్తి పైన అపురూపమైన పాశురాలను గానం చేసిన పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఇద్దరి స్వస్థలం. వారిలో ఒకరు శ్రీ రంగనాథుని ఆరాధించి ఆయనలో ఐక్యం అయిన ధన్యురాలు "ఆండాళ్ళు". ఈమెనే గోదాదేవి అని పిలుస్తారు. ప్రతి విష్ణు ఆలయంలో ఈమెకు ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఈమె రాసిన "తిరుప్పావై" గానం ప్రతి ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో నియమంగా  జరుగుతుంది.
శ్రీ విల్లిపుత్తూరు నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా కీర్తించబడటానికి కారణం ఆండాళ్ళు మరియు ఆమె పెంపుడు తండ్రి శ్రీ విష్ణుచిత్తుడు. ఈయనను పెరియాళ్వార్ అని కూడా పిలుస్తారు. 













ముకుంద మరియు పద్మ దంపతులు సంతానం గురించి శ్రీ వట పత్ర సాయి పెరుమాళ్లును ప్రార్ధించారు. ఆయన అనుగ్రహంతో పొందిన బిడ్డకు విష్ణు చిత్తుడు అని పేరు పెట్టి ప్రేమగా పెంచారు. పేరుకు తగినట్లుగా విష్ణుచిత్తుడు నిరంతరం శ్రీ మహావిష్ణు నామ ధ్యానంలో ఉండటం, రోజులో అధిక భాగం శ్రీ వటపత్ర సాయి ని సేవలో గడిపడం చేసేవాడు. అందుకని ప్రజలు ఆయన గరుత్మంతుని అంశ అని భావించేవారు. గౌరవంగా పెరియాళ్వార్ అని పిలిచేవారు.
అలంకార ప్రియునిగా శ్రీ మహావిష్ణువుకు పేరు. స్వామి వారి అలంకరణానికి అవసరమైన పుష్పాల నిమిత్తం విష్ణుచిత్తుడు నందనవనం ఏర్పాటు చేశారు. నిత్యం  ఉద్యానవనంలో పూలతోనే స్వామివారిని అలంకరించి చూసి మురిసిపోయేవారు. ఈయన పరమాత్మను యశోదాదేవి శ్రీ కృష్ణుని యెంత ప్రేమగా అబ్బురంగా చూసుకోనేదో అదే మాదిరి వ్యవహరించేవారు. అపురూపమైన  ఆప్యాయతను రంగరించి పెరియాళ్వార్ రచించిన పెరియాళ్వార్ తిరుమొళి మరియు తిరుపల్లాండు అనే పాశురాలు అదే విషయాన్ని స్ఫష్ఠంగా చూపుతాయి.




   






ఒకరోజు విష్ణుచిత్తునికి నందనవనంలోని తులసి చెట్టు క్రింద ముద్దులొలికే పసిపాప లభించినది. అంతర్యామి ప్రసాదించిన కానుకగా భావించి ఆమెకు "ఆండాళ్ళు" అన్న పేరు పెట్టి సొంత బిడ్డలాగా సాకసాగారు. తులసి దగ్గర  లభించినందున ప్రజలు "గోదా దేవి" అని ప్రేమగా పిలిచేవారు. ఆమె పెంపుడు తండ్రి దగ్గర రామాయణ, భాగవత గాధలు విని శ్రీ కృష్ణుని పట్ల అవాజ్యానురాగాన్ని పెంచుకొన్నది. తండ్రి నిత్యం శ్రీ వటపత్ర సాయి పెరుమాళ్ళుకు అలంకరించడానికి సిద్ధం చేసే దండలను ధరించి, మానసచోరునికి తగినదానినా కాదా అని బావి నీటిలో చూసుకొనేది. ప్రస్తుతం కన్నాడి (అడ్డం) బావిగా  పిలిచే ఆ నోటిని శ్రీ రంగమన్నారు ఆలయ ఆస్థాన మండపంలో ఈ రోజుకీ చూడవచ్చును. 
విజయ నగర సామ్రాజ్య నాధుడు శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఉదంతం ఆధారంగా "ఆముక్త మాల్యద"అన్న గ్రంధం అచ్చ తెలుగులో రచించారు. ఈయన శ్రీవిల్లిపుత్తూరు ఆలయానికి ఎన్నో కైంకర్యాలు సమర్పించుకున్నారు. ఆముక్త మాల్యద అంటే తాను  ధరించినది తీసి సమర్పించినది అని అర్ధం. బాలిక చేసినది అదే కదా !
పెరియాళ్వార్ వాటినే స్వామికి అలంకరించేవారు. ఒకనాడు దండలో పొడుగాటి కేశము కనిపించింది. కుమార్తెను అనుమానించి మరునాడు గమనించాడు. ఆండాళ్ళు చేస్తున్నది గమనించారు. పుత్రిక పసితనంతో చేస్తున్న పనిని గమనించకుండా ధరించి తీసిన దండాలనే తానూ స్వామివారికి సమర్పించడం ఘోర తప్పిదనంగా భావించి నాడు దండలను అలంకరించలేదు. నాటి రాత్రి పెరుమాళ్ళు పెరియాళ్వారుకు స్వప్న దర్శనమిచ్చి దీనిలో గోదా దోషం ఏమీ లేదు. ఆమె ధరించిన పుష్పమాలలు అంటే తనకు ప్రీతి. వాటినే తనకు అలంకరించమని తెలిపారట.    











కన్నాడి బావి 







కొంతకాలానికి శ్రీ రంగనాథుని స్వప్నాదేశం మేరకు మహారాజు సకల లాంఛనాలతో గోదాదేవిని శ్రీ రంగం పిలిపించారు. ఆమె స్వామి వారి దివ్యమంగళ రూపం చూసి మైమరచిపోయి సశరీరంగా ఆయనలో ఐక్యం అయ్యింది.
గోదాదేవి రచించిన తిరుప్పావై, ఆండాళ్ తిరుమొళి ప్రజలలో విశేష ఆదరణ పొందాయి. శ్రీవైష్ణవ గురువులు, విశిష్టాద్వైత ప్రభోధకులు అయిన శ్రీ రామానుజాచార్యులు ఆండాళ్ళును సోదరిగా భావించేవారు. ఆయన మార్గదర్శకాల మేరకు ధనుర్మాసంలో అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై గానం నియమంగా చేస్తారు. తిరుమలలో కూడా ధనుర్మాసంలో సుప్రభాత గానం కు బదులుగా తిరుప్పావై గానంతో కలియుగ దైవానికి మేలుకొలుపు పాడుతారు. అలానే దక్షిణాన అన్ని ఆలయాలలో భోగి పండుగనాడు గోదాకల్యాణం కూడా నియమంగా జరుపుతారు.












శ్రీవిల్లి పుత్తూరు ప్రస్థాపన బ్రహ్మవైవత్తర పురాణం మరియు వరాహ పురాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సత్య యుగంలో భృగు మరియు మార్కండేయ మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఉండేవారట. వారిని కాలనేమి అనే అసురుడు వారిని ఇబ్బందులకు గురి చేసేవాడట.  వారు శ్రీమన్నారాయణుని ప్రార్ధించారట. ఆయన రాక్షస సంహారం చేసి మహర్షుల కోరిక మేరకు శ్రీ వటపత్ర సాయిగా కొలువు తీరారు.
విశాల ప్రాంగణంలో రెండు ఆలయాలు మరెన్నో ఉపాలయాలుంటాయి. రెండు అంతస్థుల    ప్రధాన ఆలయంలో  క్రింద శ్రీ నరసింహ స్వామి, పైన సప్త మహర్షుల, సమస్త దేవతల కైవారాలను స్వీకరిస్తూ అనంతశయన భంగిమలో పాదాల కిరిపక్కలా దేవేరులతో, నాభి నుండి ఉద్భవించిన కమలంలో విధాత తో విరాట్రూపంలో దర్శనమిస్తారు శ్రీ వటపత్ర సాయి. తల దగ్గర వటవృక్షం తాలూకు ఆకు ఉంటుంది.
దక్షిణ భారత దేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఒకటి శ్రీవిల్లిపుత్తూరు ఆలయానిదే ! నూట తొంభై రెండు అడుగుల ఎత్తు గల ఈ గోపురాన్ని నాయక రాజులు నిర్మించారు. తమిళనాడు రాష్ట్ర అధికార చిహ్నం ఈ రాజ గోపురం !చోళ,పాండ్య, చేర, విజయనగర, నాయక, మరాఠా రాజులు ఆలయాభివృద్దికి విశేష కృషి చేశారు. 











ఒకప్పుడు మూలవిరాట్టును మూడు ద్వారాల గుండా తిరువనంతపురంలో మాదిరి చూడాల్సి ఉండేది. కానీ ఏ కారణంగానో మూడు ద్వారాల స్థానంలో ఒకే ద్వారాన్ని ఏర్పాటు చేశారు. 
ప్రదక్షిణా ప్రాంగణంలో గోడల పైన సహజ వర్ణాలతో చిత్రించిన నూట ఎనిమిది దివ్య దేశాల మూలవిరాట్టుల చిత్రాలు సుందరంగా ఉంటాయి. ఆస్థాన, ముఖ మండప పైభాగాన చెక్కల పైన చెక్కిన  సుందర చెక్కడాలు, పురాణ పురుషుల రూపాలు అద్భుతంగా ఉంటాయి. 
 రెండో ఆలయంలో రమణీయ శిల్పాలతో నిండిన కళ్యాణ మండపం విజయనగర శిల్ప విధానంలో నిర్మించబడినది. ఇక్కడి గర్భాలయంలో శ్రీ రంగమన్నారు, శ్రీ ఆండాళ్ మరియు గరుత్మంతుడు స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. 
కుమార్తె వివాహం చేయలేక పోయాను అని భాధ పడుతున్న పెరియాళ్వారుకు శ్రీ రంగనాధుడు దర్శనమిచ్చి గోదాను శ్రీవిల్లిపుత్తూరు పంపుతాను. అక్కడ మా వివాహానికి ఏర్పాట్లు చేసుకో . నేను ముహూర్త సమయానికి చేరుకొంటాను అని తెలిపారు. తన కోరిక తీరబోతున్నందుకు సంతసించిన పెరియాళ్వార్ వివాహ ఏర్పాట్లు ఘనంగా చేశారట. ముహూర్త సమయం సమీపిస్తున్న శ్రీవారి జాడ లేదట. ఆందోళన చెందిన ఆండాళ్ళు స్వామిని సమయానికి తెమ్మని వినతాసుతుని ప్రార్ధించి, తనతో సమాన స్థానం ఇస్తానని ఆశ చూపిందట. ఈ కారణంగా వీరి ముగ్గురి మూర్తులు ఉంటాయి గర్భాలయంలో. గోదా దేవి ఎడమ చేతిలో ఒక చిలక బొమ్మ ఉంటుంది. అది రాతి చిలక కాదు. కూరగాయలతో తయారు చేసింది. ప్రతి నిత్యం మారుస్తారు. దీని తయారీ ఒక రహస్యం. ఒక కుటుంబం వారే చేస్తారు. ఈ రోజు చిలకను మరునాడు వేలం వేస్తారు. దీనిని గృహంలో ఉంచుకొంటే శుభాలు కలుగుతాయి విశ్వసిస్తారు.  
రెండు ఆలయాల నడుమ పెరియాళ్వారుకు గోదాదేవి లభించిన నందనవనం ఉంటుంది. 












రోజు స్థానిక దూర ప్రాంత భక్తులు తరలి వస్తుంటారు. ఈ విశేష ఆలయంలో నియమంగా ఆరు పూజలు జరుగుతాయి. పెరియాళ్వారుకు ఆండాళ్ లభించినది ఆషాడ మాసంలో. అందువలన ఆడి నెలలో పన్నెండు రోజుల పాటు ఆడి పూరం నిర్వహిస్తారు. ఆ సందర్భంలో గోదా సమేత శ్రీ రంగమన్నారు స్వామి అతి పెద్ద రధము అధిరోహించి పురవీధులలో విహరిస్తారు.
ధనుర్మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు.
దివ్య తిరుపతులలో ప్రత్యేక స్థానం కలిగిన శ్రీ విల్లిపుత్తూరు చెన్నై పట్టణానికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేరుగా చేరుకోడానికి బస్సు మరియు రైలు సౌకర్యాలు లభిస్తాయి. మధురై నుండి ప్రతి అర గంటకీ శ్రీవిల్లిపుత్తూరు చేరుకోడానికి బస్సులు కలవు. స్థానికంగా వసతి సౌరకార్యాలు లభిస్తాయి.

ఓం నమో నారాయణాయ !!!!




24, జులై 2018, మంగళవారం

Sri Veerabhadra Swamy Temple, Palanka

శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, పాలంక 


                        పావనప్రదం పాలంక సందర్శనం 



ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో సుమారు అయిదు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి దట్టమైన నల్లమల అడవులు. ఇవి ఆంధ్రా లోని గుంటూరు, కర్నూల్, ప్రకాశం,కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలలో మరియు తెలంగాణ లోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో కృష్ణా మరియు పెన్నా నదీ తీరాల నడుమ ఉంటాయి. ఎన్నోఎత్తైన కొండలు, లోయలు, మైదాన ప్రాంతాలతో నిండి ఉంటాయి అరణ్యాలు. వీటిల్లో ఎత్తైన పర్వతాలు  గుండ్లకమ్మ నది జన్మస్థలమైన పర్వతంతో పాటు "భైరాని కొండ". వీటి ఎత్తు వెయ్యి మీటర్ల పై మాటే !
ఈ అరణ్యాలలో ఎన్నో రకాల వృక్షాలు మరియు ఔషధాలు లభ్యమవుతాయి. స్థానిక అడవి పుత్రులు తమ జీవనోపాధిని వీటి ద్వారానే పొందుతారట. అరణ్యంలో ఎన్నో గిరిజన గ్రామాలు ఉన్నాయి. 













ఈ అడవులలో మూడు వేల కిలోమీటర్ల మేర పెద్ద పులుల రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. ఎన్నో వాగులు, వంకలు, చెరువులు, గుండాలు ఈ అరణ్యాలలో కనిపిస్తాయి.
ఈ పర్వతాలు మరియు అరణ్యాలు విశేష ఆలయాలకు నిలయాలు. వీటిల్లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల, శ్రీ నారసింహుడు కొలువైన నవ క్షేత్రాల అహోబిలం మరియు శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి కొలువైన శ్రీశైలం ప్రముఖమైనవి. ఇవి కాకుండా గుండ్లబ్రహ్మశ్వరం, నెమలి గుండ్ల రంగనాయక స్వామి ఆలయం, శ్రీ మాలకొండ, ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం, మల్లెల తీర్థం, శ్రీ లొద్ది మల్లయ్య, సలేశ్వరం, ఉల్లెడ శ్రీ ఉమా మహేశ్వర ఆలయం, గవి మల్లేశ్వర స్వామి గుహలు, నిత్యపూజ కోన ఇలా బాహ్య ప్రపంచానికి అతి తక్కువుగా పరిచయమైన క్షేత్రాలు చాలా ఈ అరణ్యాలలో ఉన్నాయి.















చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే ఈ గుప్త క్షేత్రాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు సందర్శించుకోలేము. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో శనివారం నాడే భక్తులకు దర్శనం లభిస్తుంది. మరి కొన్ని చోట్ల శివరాత్రికి, కొన్ని చైత్ర పౌర్ణమికి, మరి కొన్ని చోట్ల తొలి ఏకాదశికి అక్కడ కొలువైన దేవీదేవతలను సందర్శించుకోవచ్చును.
ఈ ప్రాంతాలకు చేరుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకోవాలి. రక్షిత అరణ్యాలు కావడాన అటవీ శాఖ వారి అనుమతి కావాలి. లేదా వారు ప్రకటించే రోజులలో వెళ్ళాలి. సరి అయిన మార్గం ఉండదు. అధిక  శాతం కొండ  గుట్టలలో, లోయలలో నడిచి వెళ్ళాలి. రహదారి ఉన్నా మన  వాహనాలు వెళ్ళలేవు. స్థానికంగా అనుమతి ఉన్న జీపులలో ప్రయాణించాలి. ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ప్రయాణం కొద్దిగా ఇబ్బందికరమైన ప్రకృతి సౌందర్యం అలరించి మైమరపిస్తుంది ఆనందించ దగ్గ  మరో  విషయం ఏమిటంటే అన్ని చోట్ల విరివిగా అన్నదానం జరుగుతుంది.

















నేను ఇంతకు ముందు సందర్శించిన శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయము,  భైరవ కోన, సలేశ్వరం, మల్లెల తీర్థం, గుండ్ల బ్రహ్మశ్వరం, నెమలి గుండ్ల శ్రీ రంగనాయక స్వామి ఆలయ వివరాలు ఈ బ్లాగ్ లో పెట్టబడినాయి.
నిన్నటి తొలి ఏకాదశి నాడు ప్రకాశం జిల్లాలోని నల్లమల అడవులలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి కొలువైన పాలంక క్షేత్ర దర్శించుకునే అరుదైన అవకాశం లభించినది. నల్లమల అడవులలో తొలి ఏకాదశి నాడు మాత్రమే సందర్శించ గలిగిన క్షేత్రాలలో మొదటిది శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి కొలువైన పాలంక. . 
ఈ క్షేత్రం చేరుకోడానికి ముఖద్వారం యర్రగొండ పాలెం. వినుకొండ, మార్కాపురం, కర్నూలు, శ్రీశైలం, విజయవాడ, హైదరాబాద్, మహబూబ్ నగర్ ల నుండి చేరుకోడానికి బస్సు సౌకర్యం లభిస్తుంది.
యర్రగొండపాలెంలో ఉండటానికి చిన్న లాడ్జీలు ఉంటాయి.

















అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా ఎలా వెళ్ళాలి అన్న వివరాలు సేకరించాను,
అన్నీ అరకొరగానే ఉన్నాయి. గతంలో ఒకటి రెండు సార్లు వెళ్లిన వాళ్ళు కూడా పూర్తి వివరాలు ఇవ్వలేక పోయారు.  స్థానికులకు కూడా తెలిసిన వివరాలు చాలా తక్కువ. అన్నీ కూడా అసంపూర్ణమైనవే ! కారణం ఏమిటని విశ్లేషించుకొంటే ఇది అంత ప్రచారం పొందిన ప్రదేశం కాక పోవడం రెండవది రక్షిత అరణ్యాలలో ఉండటం అని తోచింది. సరే ఏమైతే ఏమయ్యింది తొలి ఏకాదశికి లోపలి వెళ్ళడానికి అనుమతి ఉన్నది కదా ! అన్న ధెర్యంతో విజయవాడ నుండి కారులో బయలుదేరి ఉదయం తొమ్మిదిన్నరకి యర్రగొండ పాలెం చేరుకున్నాము. అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. ముందు రోజు ఆదివారం కావడాన అటవీ అధికారులు భక్తులను అనుమతించారని, చుట్టుపక్కల గ్రామాల నుండి పక్క జిల్లాల నుండి చాలా మంది భక్తులు లారీలు మరియు జీపులలో లోపలికి వెళ్లారని తెలిసింది. మా కారు అక్కడికి చేరుకోడానికి పనికి రాదు. అద్దెకు వాహనాలు లేవు. ఎలా వెళ్ళాలి ?













వాహనం ఏదైనా దొరుకుతుందేమోనని తిరగ సాగాము. అప్పుడే మార్కాపురం నుండి వచ్చిన నలుగురు బాంక్ ఉద్యోగులు, వారితో అంతకు ముందే కలిసిన అద్దంకికి చెందిన నలుగురు వృద్ధుల బృందం వారు ఎదురయ్యారు. వారంతా వచ్చి రెండు గంటలు దాటిందట. బ్యాంకు మూలంగా వాళ్లకున్న స్థానిక పరిచయాల ద్వారా ఒక జీపును మాట్లాడారు. రానూ పోనూ అద్దె ఎనిమిది వేలు. "సరే !" అని  ఆ పైకాన్ని సమంగా పన్నెండు మంది మీద విభజించి వారికిచ్చాము. అడ్డంకి నుండి వచ్చిన వారిలో ఒకాయన మనుమరాలు "నవ్య" అని పది సంవత్సరాల పాప కూడా ఉన్నది. అంతా సర్దుకొని కూర్చున్న తరువాత జీపు బయలుదేరింది.














చారిత్రక నేపధ్యం 


దక్షిణాదిన ఉన్న రాజ్యాలను జయించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు తన రాజధాని హంపికి తిరిగి వెళుతూ ఇక్కడ విడిది చేశారట. చుట్టూ దట్టమైన ఆవి, ఒక పక్కన నిరంతరం పైనుండి జాలువారే జలపాతం, ఆ ఆ నీటి ధరల వలన క్రింద ఏర్పడిన పెద్ద చెరువు ఆయనను ఆకర్షించాయిట. అక్కడి చెంచులు రాయల వారికి చక్కని ఆతిధ్యాన్ని అందించారట. సంతృప్తి చెందిన చక్రవర్తి వారిని ఏమి కావాలో కోరుకోమన్నారట. కృతజ్ఞతలు తెలిపిన వారు తమ ఆరాధ్య దైవం అయిన శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని ఒకటి నిర్మించమని అభ్యర్ధించారట. ఆలయాల నిర్మాణాల పట్ల అమిత ఆసక్తి గల శ్రీ కృష్ణ దేవరాయలు వారి కోరికను తీర్చడానికి అంగీకరించి శిల్పులను నియమించారట. జలపాత ధారల ద్వారా ఏర్పడిన తీర్ధం పక్కన నియమించాలన్న నిర్ణయానికొచ్చారట శిల్పులు. కొండ క్రింద భాగాన్ని అర్ధ చంద్రాకారంలో గొడుగులాగా మలచి క్రింద  స్థానికుల ఇష్ట దైవాన్ని ప్రతిష్టించారట. తదనంతర కాలంలో శ్రీ లింగరాజు, శ్రీ పంచముఖేశ్వర మరియు శ్రీ మహిషాసుర మర్దని అమ్మవార్లను స్థానికులే ప్రతిష్టించుకొన్నారు. 













తమ కోరిక తీరడంతో ఆనందించిన చెంచులు తామే పూజారులుగా వ్యహ్వారిస్తూ స్వామివారికి నిత్య పూజలు చేయసాగారట. ఆనతి కాలంలోనే స్వామివార్ల మహత్యం మిగిలిన పల్లెలకు, అడవికి వెలుపల ఉన్న పట్టణ ప్రాంతాలకు పాకిందట. అరణ్యంలో సహజ వాతావరణం భంగం కాకుండా, వన్యప్రాణులకు హాని కలగకుండా ఉండటానికి సంవత్సరంలో మూడు రోజుల పాటు క్షేత్రంలో పూజలు, కొలుపులు జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. దానికి వారు ఎంచుకొన్న సమయం తొలి ఏకాదశి.  ఆ రోజు నుండి మూడు రోజులు జరిపే పూజలకు మాత్రమే అందరినీ అనుమతించాలని నిశ్చయించారట. నాటి నుండి నేటి దాకా అదే అమలు అవుతోంది. పాల లాంటి స్వచ్ఛమైన తెల్లని నీటిని జాలువార్చే జలపాతం ఉన్న ప్రదేశంగా "పాల వంక" అని పిలిచేవారట. కాలక్రమంలో అదే "పాలంక" గా మారింది అంటారు.















యర్రగొండపాలెం నుండి పాలంక అరవై కిలోమీటర్లు.  ఈ ప్రయాణంలో తొలి మజిలి "గంజివారి పల్లి" పదిహేను కిలోమీటర్ల దూరం. అక్కడి దాకా చక్కని తారు రోడ్డు ఉన్నది. గ్రామం దాటిన తరువాత నిర్మించిన పెద్ద స్వాగత ద్వారం వద్ద ప్రధమ పోలీసు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసారు. డ్రైవర్ అక్కడ వాహన వివారాలు అదే విధంగా యెంత మంది యాత్రీకులను తీసుకొని వెళుతోంది లాంటివి చెబితే వారు రాసుకున్నారు.
అక్కడ తాము తిరిగి వెళ్ళిపోతున్న విషయాన్ని అక్కడి అధికారికి తెలుపుతూ చాలా మంది మోటార్ సైకిల్ చోదకులు  ఉన్నారు. వారంతా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారని మోటార్ సైకిల్ వేసుకొని వస్తారని మా జీపు డ్రైవర్ చెప్పాడు.
జేగురు రంగు పూసుకొని ఉన్నాయి వారి శరీరాలు, దుస్తులు ఆఖరికి వాహనాలు కూడా ! దాన్ని వదిలించుకోడానికి తంటాలు పడుతున్నారు.మాకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది అని అనుకొన్నాము.











గంజి వారి పల్లి దాటిన తరువాత ఒక కిలోమీటరు ప్రయాణించాము. అక్కడ నుండి దారి భయానకం. సన్నని బాట. ఇది ముఖ్యంగా అటవీ శాఖ వారు తమ పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గంజివారి పల్లి వద్ద అటవీ శాఖ వారి కార్యాలయం కనపడుతుంది.
అరణ్యంలో నివసించే అడవి బిడ్డలు కూడా ఇదే మార్గాన్ని ఉపయోగిస్తారు.
పెద్ద చిన్న రాళ్ళూ రప్పలతో నిండి ఉంటుంది. వాహనంలో కుదురుగా కూర్చోలేము. యెగిరి పడటం లేదా ఊగిపోతుండటం సహజం.
యర్రగొండపాలెం నుండి శ్రీ వీరభద్ర స్వామి కొలువైన పాలంక లోయ దాకా అరవై కిలోమీటర్లు ! ఈ దూరాన్ని అధిగమించడానికి మాకు మూడు గంటలు పట్టింది అంటే ఊహించుకోవచ్చును దారి పరిస్థితి ఎలా ఉంటుందో! వళ్ళు, బట్టలు అంతా యెర్ర మట్టి నుండి లేచిన దుమ్ముతో రంగు మారిపోయాయి.
















ఈ మార్గంలో వచ్చే రెండో మజిలీ "పెద్దమ్మ తల్లి చెక్ పోస్ట్". చిన్న చెంచుల గ్రామం. అటవీశాఖ వారి కార్యాలయం, చిన్నగా కనపడే పెద్దమ్మ తల్లి కొలువైన గద్దె ఉంటాయి. అన్ని ఇళ్ళకీ, కార్యాలయాలకు సోలార్ పానల్స్ అమర్చారు. రక్షిత ప్రాంతం కావడాన విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం ఒక సమస్య కాకుండా ఉండటానికి ఈ ఏర్పాటు. స్థానికుల త్రాగు నీటి  సౌలభ్యం కొరకు ఏర్పరచిన బోరు పంపులకు కూడా సోలార్ పానెల్స్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీస్ పోస్ట్ దగ్గర వాహన వివరాలను నమోదు చేసుకొన్నాము. సగం కూడా పూర్తి కాని ప్రయాణం తాలూకు అలసట తీర్చుకోడానికి అందరం క్రిందకు దిగాము. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కెమెరాలలో బంధించడం చేసాము. పదిహేను నిమిషాల తరువాత మా ప్రయాణం తిరిగి ప్రారంభం అయ్యింది.
















ఎదురుగా నిన్న వెళ్లిన భక్తులు మోటార్ సైకిళ్ళ మీద , ట్రాక్టర్ మరియు లారీలలో రావడం మా ప్రయాణానికి మరో అవరోధంగా మారింది. తప్పుతప్పు !! వారు దర్శనం చేసుకొని వెనక్కి మళ్లడం ఆ చిన్న రహదారిలో ఎదురు బొదురుగా వాహనాలు వెళ్ళడానికి వీలులేకపోవడం ! ఒక వాహనం  పక్కకు లేదా వెనక్కు వెళ్లడం లాంటివి చేసి రెండో వారికి దారి ఇవ్వడం తప్పని సరి. దారికి ఒకపక్క కొండ, మరో పక్క లోయ. అంతటా పచ్చదనం. స్వచ్ఛమైన గాలి. పల్లంగా ఉన్న చోట దారికి రెండు పక్కల నుండి వర్షం కురిసినప్పుడు కొండ వాలుకు నీరు పారిన చిహ్నాలు కనపడుతున్నాయి. ఆ ప్రవాహంలో కొట్టుకు వచ్చిన రాళ్లు, చేట్ల  మానులు, కొమ్మలు, సన్నని మట్టి దారి మీద నిలిచిపోవడం కారణం ఆ ప్రవాహాలే అని అనిపించింది. వాతావరణం కూడా మాకు తన వంతు సహకారం అందించినది. ఎండ పెద్దగా లేదు. వాన కురవక పోయినా దట్టంగా పట్టిన నల్లని మబ్బులు పరిసరాలను హృద్యంగా చూపిస్తున్నాయి. మనస్సు అందాల వైపు లాగుతుంటే, బాహ్య జ్ఞానం ద్వారా జనించిన భయం దృష్టిని బాట వైపుకు మళ్లిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మూడో చెక్ పాయింట్ అయిన నారు తడికల పెంట చేరుకున్నాము.
 . 
 












అక్కడ కొద్ది సేపు ఆగి వాహన వివరాల నమోదు పూర్తి చేసుకొన్నాము. ఇక్కడ కూడా చిన్న అటవీశాఖ వారి విశ్రాంతి భవనం ఉన్నది. చుట్టూ ఏపుగా దట్టంగా పెరిగిన వెదురు పొదలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ ప్రాంతానికి అందమైన శోభను అందిస్తున్నాయి. సెల్ఫీలు తీసుకొన్నాము. విడి రోజులలో అటవీశాఖ వారు కొన్ని బృందాలుగా విడిపోయి వంతుల వారీగా విధులు నిర్వహిస్తారట.
పాలంక లోయ ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు అన్నారు. కొండ పైభాగానికి చేరుకొన్నామేమో అంతా పల్లంగా ఉన్నది. రాళ్ళూ తక్కువగా ఉన్నాయి. ఇసుక మాదిరి ఉన్న ఎఱ్ఱ మట్టి దారిలో డ్రైవర్ మరో మారు తన డ్రైవింగ్ ప్రతిభను ప్రదర్శించాడు. చివరికి మధ్యాహన్నం రెండు గంటలకు గమ్యాన్ని చేరుకున్నాము.











చాలా లారీలు, చిన్న సైజు రవాణా వాహనాలు, జీపులు, మోటార్ సైకిల్స్ ఆపి ఉన్నాయి. వాటికి దగ్గరలో వచ్చిన యాత్రీకులు నెల మీద ప్లాస్టిక్ పట్టాలు వేసుకొని విశ్రాంతి తీసుకొంటున్నారు. పక్కనే వంటలు వండుకున్న దానికి నిదర్శనంగా పెద్ద చిన్నా గిన్నెలు, ఆర్పిన మంటల దాఖలాలు కనిపించాయి.
కొందరు ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రికి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ఉన్నదట.
అందరం జీపు నుండి దిగి వంటికి పట్టిన మట్టిని దుమ్మును వీలైనంత వదిలించుకొన్నాము. బ్యాంకు వారు, అద్దంకి నుండి వచ్చిన వారు వాళ్ళతో పులిహోర, పెరుగన్నం, మిఠాయిలు తీసుకొని వచ్చారు. మా దగ్గర అరటిపండ్లు బిస్కెట్స్ మాత్రం ఉన్నాయి.
లోయ లోకి దిగే దారి వద్ద అంజనాసుతుని సన్నిధి ఏర్పాటు చేసారు. అందరం ఆయనకు మొక్కి దిగడం ప్రారంభించాము.








పాలంక క్షేత్రంలో ఒక చిత్రమైన పరీక్ష కనపడుతుంది. అది అందరికీ కాదు బిడ్డలు లేని దంపతులకు మాత్రమే ! గుహ మొదట్లో పై భాగాన ఒక నల్లటి లింగాకారంలో ఉండే ఆకారం కనపడుతుంది.అక్కడ నుండి ఒక్కో చుక్క క్రిందకు పడుతుంటాయి. సరిగ్గా దాని కింద ఒక పీఠం లాంటిది నిర్మించారు. సంతానం లేని భార్యాభర్తలు గుండంలో స్నానం చేసి శుచిగా వచ్చి అక్కడ కూర్చుంటారు. కోయ పూజారి మంత్రాలు చదివి వారి అరచేతులలో పసుపు కుంకుమ పెడతాడు. అక్కడ నుండి  వారు అలానే అర చేతులు చాపి కూర్చోవాలి.  నిర్ణయించిన సమయం లోపల నీటి చుక్క వారి చేతుల్లో పడితే సంతానం కలుగుతుంది లేక పోతే లేదు అని విశ్వసిస్తారు. చాలా మంది ఈ నీటి బిందువు జోస్యం కొరకు వరుసలో నుంచోవడం మాకు ఆశ్చర్యం కలిగించినది.


















పాలంక నుండి భక్తులు అడవిలో కాలి నడకన కొండ పైనుండి పాలుట్ల, నెక్కంటి మరియు శ్రీ ఇష్టకామేశ్వరి దేవి ఆలయం మీదగా  శ్రీశైలం చేరుకొంటారు. మరి కొందరు మరో మార్గంలో అడవిలో నడుచుకొంటూ మద్ది మడుగు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరకు వెళతారు. రెండూ పాతిక కిలోమీటర్ల దూరం ఉంటాయి. ఈ మూడు రోజులే ఈ రెండు మార్గములలో భక్తులను అనుమతిస్తారు.









కొండ అంచున ఏర్పాటు చేసిన సన్నని మార్గం. రాళ్లతో నిండి ఉండటంతో జారుడుగా ఉన్నది. రెండు కిలోమీటర్లు ఉండే ఈ దారిలో అలవాటు లేని మనలాంటి పట్టణ నివాసులు నెమ్మదిగా ఆసరాతో నడవడం తప్పనిసరి అని అర్థమైనది. అందులో ఘోరమైన బాటలో చేసిన మూడు గంటల ప్రయాణం మా అందరి మీద కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే మా పక్క నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ఆడ, మగ, వృద్ధ మరియు  పిల్లలు చకచకా ఎక్కడమే కారణం. కొంత మేర లోయ లోనికి దిగిన తరువాత ఎదురుగా జలపాత ఉద్భవించే పర్వతాగ్ర భాగం కనిపించింది. అది ఒక అర్ధ చంద్రాకారంలో ఉన్నది. నీరు కొద్దిగా మాత్రమే ఉన్నది. అందుకే జలం జాలు వారడం లేదు. కానీ ఎత్తైన ఆ కొండ నిరంతరం పడే నీటి ప్రవాహం కారణంగా ఏర్పడిన చిహ్నాలతో నిండి ఉన్నది. క్రింద జలాధారల కారణంగా ఏర్పడిన గుండం.
గుండం పక్కన గుంపులు గుంపులుగా కూర్చొన్న, పడుకొన్న, తిరగాడుతున్న భక్తులు. కొంత పరిశీలనగా చూస్తే కొండ క్రింద నాలుగైదు నిర్మాణాలు, అక్కడ గుంపు కట్టిన భక్తులు కూడా కనిపించారు. చుట్టూ ఉన్న కొండల పైన ఏపుగా పెరిగిన చెట్లు. పచ్చదనం. ప్రధానమైనది కాకుండా చాలా చోట్ల దండిగా వర్షం కురిస్తే ఏర్పడే జలపాతాల చిహ్నాలు కనపడినాయి.




 











నెమ్మదిగా ఆసరాతో, అడుగులో అడుగు వేసుకొంటూ ఆగుతూ అరగంటకి క్రిందకు దిగాము. మాతో పాటు వచ్చిన వారు గుండం లోకి దిగి జలకాలాటలు ఆరంభించారు. మేము మాత్రం ముఖం కాళ్ళూ చేతులు కడుక్కొని ఆలయాలున్న ప్రాంతానికి చేరుకున్నాము. కొండ క్రింద  మొత్తం ఆరు నిర్మాణాలు. అయిదు ఆలయాలు ఒకటి కార్యాలయం. శ్రీ గణపతి, శ్రీ లింగరాజు, శ్రీ  పంచ ముఖేశ్వరుడు, శ్రీ మహిషాసుర మర్దని ఆలయాలతో పాటు ప్రధాన అర్చనామూర్తి అయిన శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి కొలువైన సన్నిధి ఉన్నాయి. ఈ ఆలయం కొద్దిగా పెద్దగా ఉన్నది. ఎదురుగా నందీశ్వరుడు ఉండగా పక్కనే ధ్వజస్థంభం ఉంటాయి.
అంతటా పసుపుకొమ్మలు, కొబ్బరి చిప్పలు, వెలుగుతున్న అగరబత్తులు. యాత్రీకులు వరుసలలో వెళ్లి తమ ఆరాధ్య దైవాలను సందర్శించుకొని వస్తున్నారు.
మేము కూడా వెళ్లి దర్శించుకొన్నాము. కొన్ని ఫోటోలు తీసుకొన్నాము. అక్కడ బజ్జిలు, పకోడీలు వేడి వేడిగా వేసి అమ్ముతున్నారు. ఆకలి వేస్తోంది. చాలా మంది వచ్చి భోజనానికి రమ్మనమని అడుగుతున్నారు.
ఇక్కడికి వచ్చి మొక్కుకొని  ఫలితం పొందాక తిరిగి మరుసటేడు దర్శనానికి రావడం రివాజు. వచ్చిన ప్రతిసారీ ఒక లేక మూడు రోజుల నిద్ర చేస్తారు భక్తులు. నిద్ర చేయడం వలన కోరికలు ఫలిస్తాయి అన్నది వారి నమ్మకం. వచ్చిన ప్రతి సంవత్సరం మాలాగా వచ్చే యాత్రీకులకు     అన్నదానం చేయడం వారందరికీ ఆనవాయితి.











కానీ బ్యాంకు వారు తమతో ఆహరం తెచ్చిన విషయం మరో చోట తినవద్దని మాకు చెప్పిన విషయం గుర్తుకొచ్చి అలా కూర్చుండి పోయాము. అంతా స్నానం చేసి వచ్చిన తరువాత ఒక చోట కూర్చొని భగవంతుని సన్నిధిలో అడవి మధ్య లోయలో వనభోజనం చేసాము. అద్దంకి నుండి వచ్చిన వృద్దులు అంతా  డెబ్భై ఏళ్లకు పైనున్న వారే ! అయినా కూడా మాతో సమానంగా నడిచారు లోయ లోనికి దిగారు. భోజనానంతరం కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరాము. ఎక్కడం కూడా కష్ట సాధ్యమే ! సన్నగా వాన. చల్లటి గాలి. ఆహ్లదకరంగా మారిపోయాయి పరిసరాలు. ప్రకృతి లో నిండి ఉన్న గొప్పదనాన్ని వీక్షిస్తూ నెమ్మదిగా పైకి చేరుకొన్నాము. ఎక్కడానికి గంట పట్టింది.
సాయంత్రం ఐదున్నర.  డ్రైవర్ తొందర చేసాడు. చీకటి పడితే కష్టం అంటూ. అదీ కాక నిన్న నిద్ర చేసినవారు చాలా మంది తిరిగి వెళ్ళ సాగారు. దారిలో వాహన సంచారం పెరిగి ఇబ్బంది  పడే అవకాశం ఉన్నది. వచ్చేటప్పడు ఎదుర్కొన్న అనుభవంతో మేము చకచకా జీపులో సర్దుకొని కూర్చున్నాము.



















తిరిగి వచ్చేటప్పుడు మరింత వడుపుగా వేగంగా నడప సాగాడు డ్రైవర్. చీకటి పడటం వలన కాబోలు వీలైనంత తొందరగా చేరుకోవాలనేమో ! అయినా అనుకున్నంత పనీ అయ్యింది. సన్నని దారిలో రెండు చోట్ల లారీలు ఇరుక్కుపోవడంతో వాహనాలు అన్ని ఆగిపోయాయి. బృంద శ్రమతో వాటిని సర్ది ఎర్రగొండ పాలెం చేరుకొనే సరికి రాత్రి పది గంటలయ్యింది. జీపుని పంపించి కొత్తగా పరిచయమైన వారికి వీడ్కోలు పలికి మా వాహనం ఎక్కాము. ఉదయం నుండి మాకోసం అక్కడ ఎదురు చూస్తున్నమా కారు డ్రైవర్ అడుగుతున్న వివరాలను ఒకరి తరువాత ఒకరం వివరిస్తూ విజయవాడ వైపుకు తిరుగు ప్రయాణం అయ్యాము.
దారిని కొద్దిగా బాగుచేస్తే ఈ యాత్ర మరింత ఆహ్లాదంగా ఉత్సాహభరితంగా ఉంటుంది అనుకొంటూ నిద్ర లోకి జారిపోయాను.
సాహస. ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకొనే వారు తప్పని సరిగా దర్శించవలసిన వాటిల్లో ముఖ్యమైనది పాలంక.
వచ్చే సంవత్సరం వెళ్ళడానికి సిద్ధం కండి మిత్రులారా !

నమః శివాయ !!!!    


Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...