Thirssur Puram

  త్రిస్సూర్ పూరం 

దేవుని కల్యాణానికి ఊరంతా సందడే ! అందరూ పెద్దలే !!
కేరళ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని త్రిస్సూర్ పట్టణంలో జరిగే శ్రీ వడక్కు నాథర్ ఆలయ "పూరం" రాష్ట్ర వాసులకు ఎంతో ప్రత్యేకమైనది. .
పూరం అంటే కల్యాణం కాదు.
 సమూహము లేక సంపూర్ణము అని  అర్ధం గా చెప్పుకోవచ్చును.
స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక సమూహంగా ఏర్పడి సంవత్సరానికొకసారి సర్వేశ్వరుని సేవించుకోవడాన్ని పూరం అనవచ్చును.
సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో ఊరే కాదు రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంటుంది అంటే అతిశయోక్తి లేదు.
మలయాళ పంచాంగం "కొల్ల వర్షం" ప్రకారం "మేడం" (ఏప్రిల్ -మే )నెలలో నిర్వహిస్తారు. ప్రజలు సంవత్సరమంతా ఎదురు చూస్తారు.
రాష్ట్ర నలుమూలల నుండే కాక పక్క రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు ఉత్సాహంతో తరలివస్తారు.
పూరం లో మేళ తాళాలు, నృత్యాలు , బాణా సంచా, దీపాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
సుందరంగా అలంకరించిన గజరాజుల విన్యాసాలది ప్రధాన ఆకర్షణ. 
ఆర్భాటం, ఆహ్లాదం, ఆకర్షణ, ఆడంబరం, అతిశయం, ఆనందంతో పాటు ఆధ్యాత్మికతల మేలు కలయికే త్రిస్సూర్ పూరం.







త్రిస్సూర్ జిల్లా ఆరట్టుపుర లోని శ్రీ ధర్మశాస్త ఆలయం లో తో పాటు, కోచి సమీపం లోని త్రిపునిత్తూర శ్రీ పూర్ణ త్రేయేశ స్వామి ఆలయంలో జరిగే పూరం పురాతనమైనవిగా పేర్కొంటారు.  
ఈ పూరాలన్నీ సహజంగా అక్టోబర్ నుండి మే మధ్య కాలంలో జరుగుతుంటాయి. 
 వీటన్నింటి లోనికీ కేరళ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని త్రిస్సూర్లో  ముప్పై ఆరుగంటల పాటు ప్రజలకు నిరవధికంగా ఆహ్లాదాన్ని అందించే ఈ పూరం యొక్క ఆవిర్భావం చిత్రంగా జరిగింది.






అప్పట్లో నేటి త్రిస్సూర్ జిల్లా లోని అన్ని ఆలయాలు ఆరట్టుపుళ  పూరం లో పాల్గొంటూ ఉండేవి.
గమనింపదగిన అంశం ఏమిటంటే పూరం నిర్వహణలో సమయానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది.అన్ని అంశాలు నిర్ణయించిన సమయానికి ఒక దాని తరువాత ఒకటి వరుస క్రమంలో జరిగి పోవాల్సినదే !
ఒక సంవత్సరం జోరున కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీ వడక్కు నాథర్ ఆలయ సిబ్బంది ఆరట్టుపుళ సమయానికి చేరుకోలేక పోయాయి.ఆగ్రహించిన ఆ ఆలయ అధికారులు త్రిస్సూర్ కు చెందిన బృందాన్నివేడుకల నుండి బహిష్కరించారు.ప్రకృతి వైపరీత్యం మూలంగా జరిగిన దానికి తమను భాధ్యులను చేయడం,పూరం సంబరాలలో పాల్గొనకుండా చేయడం అవమానించడమే అని భావించారు శ్రీ వడక్కు నాథర్ ఆలయ అధికారులు. దానితో ఆగకుండా తమ ఆలయానికి విడిగా పూరం జపడానికి తీర్మానించుకొన్నారు. కానీ మిగిలిన ఆలయాల వారు కలిసి రాక పోవడంతో ఈ పూరం మొదలైన కొద్ది సంవత్సరాలకే ఆగి పోయింది.
అదే సమయంలో కొచ్చిన్ రాజ వంశానికి చెందిన శ్రీ రామవర్మ రాజు అయ్యారు. కేరళ చరిత్రలో అత్యంత గౌరవనీయ స్థానం గలిగి ప్రజల చేత " శాక్తాన్ థంపరన్ " ( శక్తిమంతుడైన పాలకుడు) అన్న బిరుదు పొందాడు ఈయన. శాక్తాన్ థంపురన్ ఆరాధ్య దైవం శ్రీ వడక్కు నాథర్.
ఈయనకు కళల పట్ల యెనలేని ఆసక్తి, కళాకారుల పట్ల అపార గౌరవం ఉండేవి. ఈ కారణం చేత తరుచుగా త్రిస్సూర్ లో విడిది చేయడానికి వీలుగా ఒక మహల్ నిర్మించుకొన్నారు.


శాక్తాన్ థంపరన్ ప్యాలస్, త్రిస్సూర్



పూరం విషయం గురించి తెలుసుకొన్నరాజు ఆలయాల అధికారులను, నగర ప్రముఖులను సమావేశపరచి తిరిగి త్రిస్సూర్ పూరం ఆరంభించడానికి కావలసిన మార్గ దర్శకాలను రూపొందించారు.అలా 18వ శతాబ్దంలో శాక్తాన్ థంపురన్ నేతృత్యం లో తిరిగి ప్రారంభించబడిన త్రిస్సూర్ పూరం గత రెండు వందల సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాల ఏర్పాట్లు పదిహేను రోజుల ముందుగానే మొదలవుతాయి. త్రిస్సూర్ పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రంలో పేరొందిన నాట్య కళాకారులు, పంచవాద్య మరియు చెండా మేళం వాయించే బృందాలు చేరుకొంటాయి.




శ్రీ వడక్కు నాథర్ ఆలయం త్రిస్సూర్ పట్టణానికి నది బొడ్డు అయిన అరవై అయిదు ఎకరాల స్వరాజ్ రౌండ్ లో ఉంటుంది. కోట లాంటి ఆలయ ప్రహారీకి నలుదిశలా ఉన్న నాలుగు ద్వారాలకు  పూరం లో ప్రత్యేక స్థానం ఉన్నది.
పూరం ఉత్సవాల ఆరంభం ప్రదర్శన శాల ( Exhibition)తో మొదలవుతాయి. పూరం రోజు సమీపించే కొద్ది ఎన్నో రకాల తినుబండారాల, వస్త్రాల, పూజా సామాను, ఆట బొమ్మల దుకాణాలు, వివిధ రంగుల రాట్నాలు స్వరాజ్ రౌండ్ లో వెలుస్తాయి.
 తిరువంబాడి  శ్రీ భగవతి  మరియు పరమేక్కావు శ్రీ భగవతి ఆలయాల అధ్వర్యంలో మొత్తం పది ఆలయాలు రెండు జట్లుగా విడిపోయి సంబరాల్లో పాల్గొంటాయి.
 పపరమేక్కావు పక్షాన పూకట్టికర కరముక్కు భగవతి, చూరకట్టుకర భగవతి, చెంపుక్కావు భగవతి, పనేముక్కుపిల్లి శాస్త ఉండగా  తిరువంబాడి తరుపున అయ్యన్తోల్ భగవతి, నేతిలక్కావు భగవతి, లూర్ భగవతి మరియు కనిమంగళం శాస్త ఉంటారు.



పూరం లో పాల్గొనే ఆలయాలలో వారం రోజుల ముందు ధ్వజం ఎగర వేస్తారు. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉన్నా పూరం తాలూకు పతాకం ఎగర వేయడానికి నిర్ణయించిన స్థలంలో  ప్రత్యేకమైన పూజ చేసి ధ్వజాన్ని పాతుతారు. దానికి జెండాను కడతారు. తరువాత అన్ని బృందాలు బయలుదేరి త్రిస్సూర్ చేరుకొంటాయి.
ధ్వజాలను ఆవిష్కరించిన నాలుగో రోజున  తిరువంబాడి మరియు పరమేక్కావు దేవస్థానాల అధ్వర్యంలో ఏనుగులకు అలంకరించే  బంగారు ఆభరణాలను, ప్రత్యేకంగా ఈ ఉత్సవ నిమిత్తం తయారు చేసిన గొడుగులు, ఇతర అలంకరణ సామాగ్రిని విడివిడిగా ప్రదర్శిస్తారు. అదే రోజు సాయంత్రం ఏడుగంటల నుండి ఈ రెండు ఆలయ బృందాలు రకరకాల రంగులు      వెదజల్లే బాణాసంచాను కాలుస్తారు. ప్రధాన సంబరాలకు ఇది ఒకరకమైన రిహార్సల్ లాంటిది.   







పూరం ఆరంభం అవడానికి ముందు రోజున నేతిలక్కావు భగవతి ఉత్సవమూర్తి  త్రిస్సూర్ కు విచ్చేస్తుంది. దేవస్వం అధికారులు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతారు.   శ్రీ వడుక్కునాదర్ ను దర్శించి, అనుమతి తీసుకొని, నిరంతరం మూసుకొని ఉండే దక్షిణ ద్వారాన్ని తెరిపించి పూరం ఆరంభమైనట్లుగా అధికార ప్రకటన చేస్తుంది నేతిలక్కావు భగవతీ దేవి బృందం. అనంతరం దేవిని పడమర ద్వారం వద్ద ఉన్న మూలస్థానం వద్ద ఉపస్థితురాలిని చేస్తారు.  
మొదటగా కనిమంగళం శ్రీ ధర్మ శాస్త ఆలయానికి చెందిన బృందం ఆలయ ఉత్సవ మూర్తితో  శ్రీ వడక్కు నాథర్ ఆలయ దక్షిణ గోపుర ద్వారం గుండా ప్రవేశించి పడమర వాకిలి చేరతారు.మిగిలిని ఆలయాల బృందాలు కూడా వాటికి నిర్దేశించిన తూర్పు, ఉత్తర  మరియు దక్షిణ ద్వారాల గుండా ఆలయం లోనికి ప్రవేశించి శ్రీ వడుక్కు నాధరును సేవించుకొని పడమర ద్వారం వద్ద ఉన్న మూలస్థానం వద్దకు చేరుకొంటాయి.


తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయం


పూరం లో ప్రధాన ఆకర్షణ లలో ఒకటి "మండతిల్ వోరువు".  ఈ పంచవాద్య కార్యక్రమంలో రెండువందల మంది నిష్ణాతులైన వాద్యకారులు తమ వాయిద్యాలతో  వీనుల  విందైన ఉత్సాహ భరిత వాయిద్య ఘోషను ప్రతిభావంతంగా  వినిపిస్తారు.  అర్దరాత్రి రెండు గంటలకు శ్రీ వడుక్కు నాధర్ సన్నిధిలో మరో విశిష్టమైన "ఇలంజితార మేళం" వాయిస్తారు. 
మేళం పూర్తి అయిన తరువాత పాల్గొనే అన్ని ఆలయాల ఉత్సవ మూర్తులు  పడమర ద్వారం గుండా మరో సారి ప్రాంగణం లోనికి ప్రవేశించి పూరం సంబరాలు ప్రారభించడానికి స్వామి వారి అనుమతి తీసుకొని దక్షిణ ద్వారం గుండా వెలుపలికి వస్తారు. 




దీనితో సంవత్సర కాలంగా లక్షలాది మంది సందర్శకులు ఎదురుచూస్తున్న అపురూప విన్యాసాల ప్రారంభం అవుతాయి.
పూరంలో పాల్గొనే రెండు బృందాలు ఎదురు బొదురుగా తమ గజ బలాలతో నిలబడతాయి. ఎంపిక చేసిన దేవస్థానాలకు చెందిన గజాలే కాకుండా సమీప, దూర ప్రాంతాల ఆలయ గజరాజులు కూడా తరలి వస్తాయి.
"నెట్టి పట్టం" అని పిలిచే బంగారు ఆభరణాలను నుదిటి మీద అలంకరించుకొని , వీపుమీద, దంతాలకు, చెవులకు మెడలో గంటలు, గతంలో పొందిన పతకాలను ధరించి గంభీరంగా పోరుకు సిద్దం అంటూ సుక్షిత సైనికుల మాదిరి నిలబడే మొత్తం యాభై  ఏనుగులు సందర్శకులను అలరిస్తాయి.
లక్షలాది మంది జనం చేసే కోలాహలం, వాయిద్యాల హోరు, టపాసుల మోత. వీటన్నిటి మధ్య మావటి ఆజ్ఞకు కట్టుబడి  గంటల తరబడి అదరకుండా బెదరకుండా కట్టు తప్పకుండా క్రమశిక్షణతో  సహననానికి ప్రతిరూపాలుగా ప్రవర్తించే ఏనుగులు ఎంతో కొనియాడతగినవి. కేరళ లోని అనేక ఇతర ఆలయ ఉత్సవాల్లో బెదిరి భయానక వాతావరణం సృష్టించాయి గజరాజులు. కానీ త్రిసూర్ పూరం లో గజరాజులు భీభత్సము చేసిన దాఖలాలు కనిపించలేదు గత రెండు శతాబ్దాల కాలంలో అని చెబుతారు. 





కొన్ని గంటల పాటు ఏనుగుల మీద నిలబడి నేర్పరులైన ఆటగాళ్ళు ప్రత్యేకంగా చేసిన రంగురంగుల గొడుగులతో చేసే వివిధ రకాల విన్యాసాలు చూడాల్సిందే ! వర్ణించలేము.
పూరం లోని మరో ఆకర్షణీయ అంశం బాణా సంచా.  సాధారణ టపాసుల నుండి ఎప్పుడూ కనీ వినీ ఎరుగని శబ్దాలతో చిత్ర విచిత్ర వర్ణాల కాంతులను వెదజల్లే ప్రత్యేక టపాసులతో ఆ రాత్రి త్రిస్సూర్ పట్టణం మారుమ్రోగి పోతుంది. వెలిగి పోతుంది.
ఈ సందర్భంగా వెలువడే శబ్దాలకు పడమర ద్వారానికి పూరం ముందు కప్పిన పెంకులు ఎలా పగిలి పోయాయో మీరే చూడండి.






సంబరాలు ముగుసిన మూడు రోజులకే మరల కప్పడానికి కొత్త పెంకులను తెప్పించడం తిరిగి కప్పించడం ప్రతి సంవత్సరం జరిగే తంతే !!




బాణా సంచా కార్యక్రమం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. ఒకరకంగా ఆలయ పూజలు కాకుండా సాధారణ ప్రజలను అలరించే పూరం కార్యక్రమాలు అక్కడితో ముగిసినట్లే !
శ్రీ వడక్కు నాదర్ ఆలయంలో పూజలు పూర్తి అయిన తరువాత విందు సేవించి పూరం లో  పాల్గొన్న పది ఆలయాల దేవి మరియు శాస్తలు తమ స్వస్థానాలకు తరలి వెళ్లిపోవడంతో ఈ సంవత్సరం త్రిస్సూర్ పూరం ముగిసినట్లే !
తరలి వచ్చిన ఇతర ఆలయ గజరాజులు నగర ప్రజలను అలరిస్తూ మరో రెండు రోజులు మైదానంలోనే గడుపుతాయి.








సువిశాల స్వరాజ్ రౌండ్ లో ప్రశాంతంగా తిరుగుతూ స్థానికులను ఆకర్షిస్తాయి.














మూడో రోజున దగ్గరి ఆలయాల ఏనుగులు కాలినడక, దూర ప్రాంత ఏనుగులు ప్రత్యేక వాహనాలలో వెళ్ళిపోతాయి. 
నగర ప్రజలు ఈ సంవత్సర పూరం సంబరాలలో పాల్గొన్నందుకు కృతజ్ఞతా పూర్వక వీడ్కోలు పలుకుతూ వచ్చే సంవత్సర పూరం సంబరాలలో పాల్గొనాలని ముందుగానే ఆహ్వానం అందిస్తారు. 




\





భక్తుల కోలాహలం, గజరాజుల ఘీంకారాలు, పటాసుల మోత, వాటి నుండి వెలువడే కాలుష్యం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని కొందరు నిరసనలు తెలుపుతున్నా సంవత్సరం సంవత్సరానికి త్రిస్సూర్ పూరం సంబరాల హడావుడి పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.
త్రిస్సూర్ రైల్వే స్టేషన్ కు ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేరళ రాష్ట్రం లో తొలి శివాలయంగా పేరొందిన శ్రీ వడక్కు నాదర్ ఆలయం.
కేరళ రాష్ట్రాన్ని సందర్శించే వారు పరిస్థితులు సమయం అనుకూలిస్తే కనీసం ఒక్క సారి అయినా త్రిస్సూర్ పూరం వీక్షించాలి. (ఈ రోజునే ఈ పురాతన ఆలయానికి యునెస్కో అవార్డు ఇచ్చారు) 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore