Idukku Pillayar, Tiruvannamalai

                          ఇడుక్కు పిళ్ళయార్, తిరువన్నామలై 


తిరువన్నామలై అపర కైలాసం గా పేర్కొనబడదగిన క్షేత్రం. సాక్షాత్తు పరమేశ్వరుడు పర్వత రూపంలో కొలువైన దివ్య క్షేత్రం. ఈ పరమ పావన క్షేత్రంలో చేసే గిరివలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పరమేష్టికి  చేసేదే ఈ ప్రదక్షణం.









సుఖ శాంతులను ప్రసాదించేది ఈ గిరివలయం.ఈ పదునాలుగు కిలోమీటర్ల గిరి మార్గంలో ఎన్నో పురాతన పౌరాణిక నేపద్యం గల ఆలయాలు, నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయ సందర్శనం ఇహపర సుఖాలను అనుగ్రహించేది కావడం చెప్పుకోవలసిన విషయం.








ఆలయాలు కాకుండా చిత్రంగా నిర్మించిన ఒక నిర్మాణం గిరి ప్రదక్షనం చేసే వారికి కర్మ ఫలాన్ని తొలగించేదిగా,మానసిక స్థిరత్వాన్ని , శారీరక ధృడత్వాన్ని కలిగించేదిగా ప్రసిద్దిని సొంతం చేసుకొన్నది. అదే "ఇడుక్కు  పిళ్ళయార్".








ఇడుక్కు పిళ్ళయార్ ఒక చిత్రమైన ప్రత్యేక నిర్మాణం. చిన్న గది లాంటి ఇడుక్కు పిళ్ళయార్ లో మూడు చిన్న చిన్న సన్నని ద్వారాలు ఉంటాయి. లోపల ఎలాంటి దేవీ దేవతల మూర్తులుండవు. భక్తులు తూర్పు వైపు నుంచి సన్నని ద్వారం గుండా ప్రవేశించి మధ్యలో ఉండే ఇంకా సన్నని ద్వారం దాటి పడమర వైపున ఉన్న మూడో ద్వారం నుండి వెలుపలికి వస్తుంటారు.
ముఖ్యంగా మధ్యలో ఉండే ద్వారాన్ని చూస్తే అసలు పట్టగలమా ? వెలుపలికి రా గలమా? అన్న సందేహాలు కలుగుతాయి.






కానీ పరిశోధకుల అంచనా ప్రకారం ఈ ద్వారాలు మానవ అస్థిపంజరం కొలతల ప్రకారం నిర్మించారని. అంటే మనిషి ఎంత లావుగా ఉన్న శరీర  ఎముకల అమరిక దాదాపుగా  అందరికీ ఒకేలా ఉంటుంది.
కొద్దిగా పక్కకు తిరిగితే యెంత లావుగా ఉన్న వారైనా సులభంగా బయటికి వస్తారు.
ఇడుక్కు పిళ్ళయార్ని తత్వవేత్తలు తల్లి గర్భం నుండి శిశువు ఈ ప్రపంచం లోనికి వచ్చే మార్గంతో  పోలుస్తారు.
దీని ప్రకారం ఈ జన్మకు ముందు అనేక జన్మలు ఎత్తిన ఒక జీవి యొక్క జన్మ జన్మల పాపాలను తొలగిస్తుంది ఈ ఇడుక్కు పిళ్ళయార్ ప్రవేశం. అంతే కాదు ఒక జీవిని ఆవరించి ఉండే  "నేను" అనే  అహం  పొరను తొలగించడమే కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేస్తుంది.







దీనికి సంభందించిన ఒక గాధ స్థానికంగా వినిపిస్తుంది. 
శ్రీ ఇదయ కట్టార్ సిద్దార్, తమిళ నాడులో ప్రసిద్ది చెందిన సిద్ద పురుషులలో ఒకరు. అనేక సిద్ద మూలికలతో పళని లోని శ్రీ పళని ఆండవర్ ( దండాయుధ పాణి / కుమార స్వామి) విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ సిద్ద వైద్య నిపుణుడు శ్రీ బోగార్ శిష్యుడు ఈయన. గురువు నుండి ఉపదేశం పొంది యోగ, సిద్ద విద్యలలో ఎన్నో నూతన శిఖరాలను అధిష్టించిన ప్రతిభాశాలిగా  గురువుచే పొగడబడిన వాడు. వీరి కాలం క్రీస్తు పూర్వం అయిదో శతాబ్దంగా పేర్కొంటారు. జీవిత చరమాంకంలో తిరువన్నామలై చేరుకొని అరుణాచలేశ్వరుని సేవించుకొని ఇక్కడే జీవ సమాధి చెందారు. ఆ సమయంలో శ్రీ ఇదయ కట్టార్ సిద్దార్ ఈ ఇడుక్కు పిళ్ళయార్  రెండు అత్యంత మహిమాన్విత యంత్రాలను ప్రతిష్టించారట. 
ఆ యంత్రాలు లోపలి ప్రవేశించిన వారి మీద పైన చెప్పిన ప్రభావాన్ని చూపుతాయి అన్నది తరతరాల విశ్వాసం. 






మరో రెండు నమ్మకాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 
మొదటిది తూర్పు నుండి ప్రవేశంచి పడమర నుండి వెలుపలికి వస్తే ఇహంలో అన్నింటా జయం, ధన లాభం లభిస్తాయట.  అదే పడమర  నుండి ప్రవేశించి తూర్పు వైపు నుండి వెలుపలికి వస్తే ముక్తి లభిస్తుందిట. 
మూడు సార్లు లోపలి వెళ్లి వెలుపలికి వస్తే ఎముకల సంభందిత రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని అంటారు. 






ఒకటి మాత్రం ప్రతి ఒక్కరికీ అనుభవం అయ్యేది ఏమిటంటే  పదునాలుగు కిలోమీటర్ల గిరి మార్గం లో ఇదుక్కు పిళ్ళయార్ పన్నెండో కిలోమీటరు దగ్గర ఉంటుంది.   నడక అలవాటు లేక పోవడం వలన కాళ్ళ నొప్పులు, శరీరం అలసిపోవడం సహజం.
ఇడుక్కు పిళ్ళయార్ లో ప్రవేశించిన తరువాత ఆ భాదల నుండి ఉపశమనం పొందుతారు.  కారణం ఏమిటంటే ఇది ఒక ఆటలాగ అనిపించి ఆలోచనలు నడక మీద నుంచి లోపలి పోవడం గురించి సాగుతాయి. ఇంకా గిరి వలయం చేస్తున్న భక్తులు ఇక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనే ఏర్పాటు కూడా ఉన్నది. రాతి అరుగులు ఏర్పాటుచేశారు.








ఈ ప్రత్యేక నిర్మాణం గిరి వలయం లోని "పంచ ముఖ దర్శనం " దగ్గరలో ఉంటుంది.
తిరువన్నామలై వెళ్లి గిరి వాలం చేసే ప్రతి ఒక్కరూ తప్పక  సరిగా "ఇడుక్కు పిళ్ళయార్ " సందర్శించి అరుదైన అనుభవం సొంతం చేసుకోవాలి.





ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!!






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore