29, సెప్టెంబర్ 2015, మంగళవారం

Manickavasagar

                                          కవి మాణిక్యవాసగర్ 


ఈయనను తమిళనాడు "రామదాసు" అని పిలవవచ్చును. 
అలానే శివ భక్తులలో "గోదాదేవి" (ఆండాళ్) అని కూడా పిలవవచ్చును. ఎందుకంటె ఈ కవి సరిగ్గా వారిద్దరూ చేసిన పనులను చేసారు.  
తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఈ శివ గాయక భక్తుని గురించి "తిరువిలయాడల్ పురాణం" సవివరంగా తెలిపినది. 






శ్రీ మీనాక్షీ దేవి కొలువైన మదురై పట్టణానికి దగ్గర లో పవిత్ర వైగై నదీ తీరం లోని "తిరువధవూర్"లో జన్మించారు.
ఈయన తండ్రి స్థానిక శివాలయంలో పూజారి. దానితో చిన్నతనం నుండి శివుని మీద అమిత భక్తి శ్రద్దలు ఏర్పడ్డాయి.విద్యా బుద్దులు నేర్చుకొన్న తరువాత  వరగుణ పాండ్య రాజు  వద్ద సైనిక అవసరాలను చూసే ఉద్యోగంలో చేరారు.నిజాయితీతో పనిచేసే మాణిక్యవాసర్ అంటే రాజుగారికి అభిమానం మరియు గౌరవం.
ఒకసారి అశ్విక బలాలను మరింత శక్తిమంతం చేయదలిచారు రాజు.పెద్ద మొత్తంలో ధనాన్ని మాణిక్య వాసగర్ కు ఇచ్చి ఆ పని మీద పంపారు.వెళుతున్న దారిలో  ఒక తాపసి తారసపడ్డాడు. అమిత తేజస్సుతో వెలిగిపోతున్న ఆయనను చూడగానే హృదయాంతరాలలో  భక్తి భావం పెల్లుబికి పాదాల మీద వాలి తనను శిష్యునిగా స్వీకరించమని కోరారు.






బయలుదేరిన పనిని మరిచిపోయి తాపసి చేసిన బోధనలతో ఇహ లోక బంధాలన్నీ అశాశ్వతము, సర్వేశ్వరుని నామ జపమే ముక్తికి మార్గం అని నిర్ధారించుకొన్నాడు మాణిక్య వాసగర్.
రాజు అశ్వాలను కొనమని ఇచ్చిన ధనంతో నేటి "పుదుకోట్టై జిల్లా " లోని' "తిరు ప్పెరున్ తురాయి" అనే గ్రామంలో తన ఆరాధ్య దైవానికి ఒక ఆలయం నిర్మించాడు.
తానీషా మాదిరే పాండ్య రాజు ఆగ్రహించి మాణిక్య వాసగర్ ను శిక్షించుదామని వచ్చారు. కానీ శివానుగ్రహంతో దాపున ఉన్న అడవిలోని నక్కలన్నీ గుర్రాలుగా మారిపోయాయి. రాజు చేసేదిలేక వాటిని తీసుకొని గ్రామం దాటగానే అన్నీ  తిరిగి నక్కలుగా మారి అడవి లోనికి వెళ్లిపోవడంతో మాణిక్య వాసగర్ భక్తి యొక్క శక్తిని అర్ధం చేసుకొన్నవరగుణ పాండ్యుడు క్షమించమని వేడుకొని ఆలయానికి తన వంతుగా మాన్యాలను, ధనాన్నిసమర్పించుకొన్నారు.




మాణిక్య వాసగర్ నిర్మించిన ఆలయం అత్యంత అరుదైనది. స్థానికంగా "అవుదైయార్ కోవెల"గా పిలిచే ఇక్కడ ఉత్త పానువట్టం మాత్రమే ఉంటుంది. లింగం ఉండదు. అంతే కాదు అమ్మవారు కూడా ఊహా రూపమే! నందీశ్వరుడు కనపడడు. చిదంబరంలో మాదిరి శూన్య రూపానికే  అర్చనలు,అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.
పదిఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన ఆలయం అద్భుత శిల్ప కళను ప్రదర్శిస్తుంది.
తంజావూర్ నుండి కానీ మదురై నుండి కానీ బస్సులో చేరుకొనవచ్చును. వంద కిలోమీటర్ల రెండు పట్టణాల నుండి.





పూర్తిగా శివ ధ్యానంలో మునిగిపోయిన మాణిక్య వాసగర్ ఒక చోట స్థిరంగా ఉండకుండా తమిళనాడులో ఉన్న శైవ క్షేత్రాలను సందర్శిస్తూ తిరువన్నామలై చేరుకొన్నారు. శ్రీ అన్నామలైయార్ ని సేవిస్తూ ఎంతో  కాలం గడిపారు.

చివరగా చిదంబరం చేరుకొని తానూ రచించిన గీతాల సంకలమైన "తిరువాసగం" కృతిని నటరాజ స్వామికి అంకితం చేసి ఆయనలో ఐక్యం అయ్యారు.






ఈయన రాసిన కావ్యం లోని ఇరవై కీర్తనలను మరో రచన అయిన "తిరుపల్లిన్చులి" నుండి పది కీర్తనలను కలిపి"తిరు వెంబవాయి" అని పిలుస్తారు.
తన "తిరుప్పావై"లో ఆండాళ్ ఎలా శ్రీ కృష్ణుని గురించి ఆయన ప్రేమ సందర్శనాల కొరకు ఆరాట పడిందో, అదే విధంగా తిరు వెంబవాయి లో మాణిక్య వాసాగర్ తనను తాను పరమేశ్వరుని ప్రేమ అనుగ్రహాల కొరకు తపించే విరహిణి గా చిత్రీకరించారు.

తిరుప్పావై ని ఎలా ప్రతి వైష్ణవ ఆలయంలో ధనుర్మాస మంత గానం చేస్తారో,   తిరు వెంబవాయి ని అన్ని శివాలయాలలో "మార్గశిర మాసం"లో గానం చేస్తారు.
ఈ కావ్య రచన వలన శ్రీ మాణిక్య వాసగర్, నయమ్మారులలొ ప్రముఖులైన "సంబందార్, అప్పార్, సుందరార్ లతో పాటు సమాన స్థాయి గౌరవాన్ని అందుకొన్నారు.
పై ముగ్గురినీ ఈయనతో కలిపి "నాల్వార్స్" అని ప్రేమగా భక్తులు పిలుచుకొంటారు.
ఈ మధుర కావ్యాన్ని మాణిక్య వాసగర్ తిరువన్నామలై లో ఉన్నప్పుడే రచించారు.




నాడు ఆయన నివసించిన ప్రదేశంలో నేడు ఈ గాయక భక్తునికి  ఒక ఆలయాన్ని నిర్మించారు.

గిరి వలయం మార్గంలో వచ్చే "ఆది అన్నామలై ఆలయా"నికి దారి తీసే వీధి మొదలులో ఉంటుంది శ్రీ మాణిక్యవాసగర్ ఆలయం.

ఆలయ ప్రహరీ గోడల పైన అరవై మూడు మంది గాయక భక్తులైన నయమ్మారుల చిత్రాలను చిత్రించారు. గర్భాలయంలో శివలింగ పక్కన శ్రీ మాణిక్య వాసగర్ విగ్రహం దర్శనమిస్తుంది.

గిరి వలయం చేసే సమయంలో తప్పక సందర్శించవలసిన ఆలయం.

నమో అరుణాచలేశ్వరాయ నమః !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...