10, మే 2015, ఆదివారం

Vijayawada Temples

            శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం, మాచవరం ( విజయవాడ)




   

మనోజవం, మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసాన్నమామి !!!!!
భక్తి ఒక్కటే కాకుండా మరెన్నో మానవులు శ్రీ ఆంజనేయుని జీవితం నుండి నేర్చుకోవలసిన అంశాలు ఉన్నాయి.అచంచల రామ భక్తికి, స్థిర చిత్తానికి నిలువెత్తు రూపం హనుమంతుడు.
సమయోచితంగా పదప్రయోగం చేస్తూ సంభాషించడం వాయునందనుని గొప్పదనం.
భూతప్రేత, గ్రహ బాధల నుండి, ఆరోగ్యానికి, శారీరక శౌష్టవానికి అంజనాపుత్రుని ఆశ్రయిస్తుంటారు.










ఈ కారణంగా భారత దేశ నలుమూలలా గ్రామ గ్రామాన వాయునందనుని ఆలయాలు నెలకొల్పబడినాయి.దాసాంజనేయుడు, భక్త ఆంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు, సంజీవరాయడు, వీరాంజనేయుడు, ప్రసన్నఆంజనేయుడుఇలా వివిధ రూపాలలో కొలువైన  అంజనా సుతుడు కొలువై ఉంటారు. నిష్ఠ నియమాలతో, పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో  కొలిచి ధన్యులయ్యే భక్తులెందరో !!!











పావన కృష్ణా నదీ తీరం ఎన్నో మహిమాన్విత దేవాలయాలకు నిలయం. మట్టపల్లి, వేదాద్రి, ఇంద్రకీలాద్రి లాంటి వాటిల్లో విజయవాడ నగరంలో ఉన్న మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి. నిత్యం వందలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం రాష్ట్రమంతటా ఎంతో ప్రసిద్ది. 









మాచవరంలో స్వామి స్థిర నివాసం ఏర్పరచుకోవడం వెనుక అయిదు శతాబ్దాల చరిత్ర ఉన్నది.
విజయనగర సామ్రాజ్య పాలకుడైన శ్రీ కృష్ణ దేవరాయల ఆధ్యాత్మిక గురువు శ్రీ వ్యాసరాయలు.
వీరు ఆంజనేయోపాసకులు.కాలినడకన దక్షిణ భారత దేశం అంతా తిరుగుతూ ఎన్నో రామ భక్తుని ఆలయాలు నిర్మించారు.
తమ పర్యటనలో భాగంగా వ్యాస రాయలు ఈ ప్రాంతాలకు వచ్చి ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న శ్రీ కనక దుర్గ దేవి దర్శనార్ధం వెళ్లారట.అమ్మను సేవించుకొన్న తరువాత ప్రాంగణంలో విశ్రాంతి తీసుకొంటున్న గురు రాయల వద్దకు ఒక వానరం వచ్చినదట.









ఎదుట నిలిచి రకరకాల సైగలు చేస్తున్న కోతి తనకేదో సందేశం ఇస్తోందని గ్రహించి దాని వెనుక నడిచారట వ్యాస రాయలు. ఇంద్రకీలాద్రి నుండి తూర్పు దిక్కుగా నడిచి చిన్న గుట్టలు, ఎత్తైన వృక్షాలతో అడవి లాగా ఉన్న ఈ ప్రాంతానికి చేరిన వానరం ఒక అశ్వద్ద వృక్షాన్ని చూపించి అదృశ్యం అయ్యిందట. ఆరాధ్య దైవమే  స్వయంగా వచ్చి ఈ పవిత్ర ప్రదేశంలో తనకొక  ఆలయం నిర్మించమని తెలుపుతున్నారని అర్ధం చేసుకొన్నారు వ్యాస రాయలు.  








ఆలయ నిర్మాణానికి భూమిని త్రవ్వుతుండగా వృక్ష మూలంలో తూర్పు ముఖంగా కొలువుతీరి ఉత్తరాన్ని చూస్తున్న నమస్కార భంగిమలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహాము లభించిందట. వానరం ఈ స్థలాన్ని చూపించడంలో గల అంతరార్ధం అర్ధమయ్యి సంతోషంతో ఆ విగ్రహాన్నేప్రతిష్టించారట.తదనంతర కాలంలో వెనుక సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి విగ్రహాలను ప్రతిష్టించారు.
 ఈ ఉదంతం జరిగినది క్రీస్తు శకం 1509వ సంవత్సరంలో అని అంటారు. కొంతకాలం ఇక్కడే ఉండి స్వామిని సేవించుకొన్న వ్యాసరాయలు ఆలయ నిర్వహణా భాద్యత స్థానిక భక్తులకు అప్పగించి తాను తన యాత్రను కొనసాగించారట.









కొన్ని సంవత్సరాల తరువాత వ్యాస రాయలు ప్రతిష్టించిన కపివీరుని విగ్రహం, నిర్మించిన చిన్న ఆలయం రెండూ శిధిలం అయ్యి మరోమారు భూమిలో కలిసి పోయాయి. 
సుమారు మూడున్నర శతాబ్దాల తరువాత 1850వ సంవత్సరంలో విజయవాడ నుండి ఏలూరు పట్టణానికి రహదారి నిర్మించ నిర్ణయించారుట. దాని నిర్మాణ పనులను స్థానికులైన శ్రీ దున్నా వీరా స్వామి నాయుడు చేపట్టారు. ఒకనాటి రాత్రి ఆయనకు స్వప్నంలో శ్రీ హనుమంతుల వారు కనిపించి రహదారి మార్గంలో తన విగ్రహం ఉన్న తావు తెలిపి ఆలయం నిర్మించమని ఆదేశించారట. శ్రీ నాయుడు గారు చెట్టు మొదలులో త్రవ్వగా శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహం లభించినది. 
 అదృష్టానికి ఆనందించిన  అక్కడే ఆలయాన్ని నిర్మించి  రహదారిని మాత్రం కొద్దిగా పక్కకు మరలించారట. అలా ఒంపు తిప్పిన  రహదారిని నేటికీ అలానే ఉండటం విశేషం. 









అలా శ్రీ నాయుడు గారిచే మూడోమారు ప్రతిష్టించబడిన మారుతి అతి తొందరలోనే మహిమాన్వితుడు  అన్న విశ్వాసం భక్తుల మనస్సులలో నెలకొన్నది. కాల గమనంలో  ఆలయం ఎన్నో మార్పులకు లోనై. అభివృద్ధి చెంది ప్రస్తుత రూపానికి చేరింది.గర్భాలయంలో స్వామి నమస్కార భంగిమలో ఉత్తరాన్ని చూస్తూ స్థానక భంగిమలో దర్శనమిస్తారు. స్వామి వారివెనుక నిర్మించిన పీఠం మీద సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి స్థానక భంగిమలో ప్రధమ పూజలందుకొంటుంటారు.
ఉపాలయాలు ఏమీ ఉండవు. వాయువ్యంలో ఉత్సవ విగ్రహాలను ఉంచడానికి చిన్న మందిరం నిర్మించారు.మూలవిరాట్టుకు ఎదురుగా ఆలయం వెలుపల ధ్వజస్తంభం, అక్కడే చిన్న మందిరంలో ఉపస్థితులై వినతానందనుడు ఉంటారు.












ప్రతి నిత్యం వందలమంది భక్తులు ఆలయాన్ని సందర్చించి తమ ఆరాధ్య దైవాన్ని సేవించుకొంటారు.మంగళ మరియు శని వారాలలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.
ధనుర్మాస పూజలు,  రామనవమి, హనుమత్ జయంతి, ఉగాది మరియూ సంక్రాతి పండుగులను విశేషంగా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో ప్రతినిత్యం తిరుప్పావై సంకీర్తన జరుగుతుంది.  భోగినాడు ఘనంగా గోదా కల్యాణం నిర్వహిస్తారు.నగరం లోని సగానికి పైగా వ్యాపారస్థులు తమ కొత్త ఖాతా పుస్తకాలను ఇక్కడే రాస్తారు.గతంలో  సినిమా హిట్ అవ్వాలని నిర్మాతలు సినిమా రీళ్లకు ఇక్కడ పూజలు చేయించుకునేవారు.








ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకూ భక్తుల సౌలభ్యం కొరకు తెరిచి ఉండే మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నూత వాహన పూజలకు ఏంతో  ప్రసిద్ది.
ప్రతినిత్యం ఎందరో వచ్చి తమ వాహనాలకు పూజలు చేయించు కొంటారు.










R. T. C వారు కూడా కొత్త బస్సులకు పూజలు ఇక్కడే చేయిస్తారు. 
విజయవాడలో తప్పక సందర్శించవలసిన ఆలయాలలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం, మాచవరం ఒకటి. 

శ్రీ ఆంజనేయం !!!!


3 కామెంట్‌లు:

  1. దున్నా వీరాస్వామీ నాయుడు గారికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. ఆలయాన్ని అభివృద్ధి చేసిన గత ప్రధాన అర్చకులు1శ్రీ gtvk భట్టర్ 2శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్య 3శ్రీ దిట్టకవి రామకృష్ణ మాచార్యులు. (స్వామివారి స్థల పురాణ రచయిత )

    రిప్లయితొలగించండి
  3. గత వైభవం ఇక రాకపోవచ్చు స్వామి సేవలో అహర్నిశలు శ్రమించిన అర్చక స్వాములను ఇప్పుడు స్మరించేవారు లేకపోవటం విచారకరం.

    రిప్లయితొలగించండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...