Sri Pardhasathi Swamy Temple, Guruvayur

                         శ్రీ పార్ధ సారధి ఆలయం, గురువాయూరు 


                      పాండవ మాత  కొలిచిన పార్ధసారధి 




గురువాయుర్ కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో భక్త జనులను ఆకర్షించే దివ్య క్షేత్రాలలో ఒకటి.
శ్రీ గురువాయురప్పన్ ( శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన  కారణంగా "గురువాయుర్ " అన్న పేరోచ్చినదంటారు. అత్యంత అరుదైన "పాతాళ శిల" తో మలచబడిన ఈ విగ్రహాన్ని మహేశ్వరుడు విధాత బ్రహ్మదేవునికి ఇచ్చారట. ఆయన నుండి కశ్య ప్రజాపతి, ఆయన నుండి వసుదేవునికి, ఆయన నుండి శ్రీ కృష్ణుని పూజలు అందుకొన్న అపురూప మూర్తి ఇది. శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ఉద్దకునికి విగ్రహాన్ని ఇచ్చి దానిని బృహస్పతికి అందజేయమని ఆదేశించారట. దేవగురువు వాయుదేవుని తో కలిసి ఆకాశమార్గాన ప్రయాణిస్తూ సముద్రతీరాన ఒక కోనేరు ఒడ్డున తపస్సు చేస్తున్న సదాశివుని చూసి ప్రణమిల్లారట. నీలకంఠుడు వారిని శంఖం, చక్రం, కౌమోదకం మరియు పద్మ జపమాలలు ధరించి ముగ్ధమనోహర రూపంలో ఉండి వాసుదేవునిగా పూజలందుకొంటున్న శ్రీ మహావిష్ణువు ప్రతి రూపమే శ్రీ గురువాయూరప్పన్. నాడు గంగాధరుడు తపమాచరించి కోనేరే నేటి "రుద్రా తీర్థం". తొలి ఆలయం క్రీస్తు పూర్వం నిర్మించబడినది అని అంటారు. ఎందరో రాజా వంశాల వారు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు. ఈ క్షేత్రంఎన్నో విశేషాలకు, ప్రత్యేక పూజలకు, విశేష ఉత్సవాలకు నిలయం.
గురువాయూరులో పెక్కు విశేష ఆలయాలు ఉన్నాయి.అలాంటి ఆలయాలలో శ్రీ  పార్ధ సారధి ఆలయం ఒకటి. వైకుంఠ వాసుని రూపంలో ఉన్న మరో శ్రీకృష్ణుని ఆలయం ఇది. 













అద్వైత సిద్ధాంత రూపకర్త జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య ప్రతిష్టగా పేర్కొనే ఈ ఆలయ పౌరాణిక గాధ ద్వాపర యుగం నాటిది.
పాండవులకు బంధువు, మార్గదర్శి, సహాయకారి, దైవం అన్నీ శ్రీ కృష్ణుడే కదా !! కష్ట సుఖాలలో తమ ఆరాధ్య దైవాన్ని మానసా వాచా కర్మనా తలుచుకొంటూనే ఉండేవారు. సహాయ సహకారాలు పొందేవారు. మహాభారతంలో ఇలాంటి సంఘటనల గురించి శ్రీ వ్యాస భగవానుడు రమణీయంగా వర్ణించారు.











పాండవుల తల్లి కుంతీ దేవి తన బిడ్డల క్షేమం కోరి వాసు దేవుని విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకొని  ప్రతి నిత్యం పూజించేదిట. నిరంతరం ఈ మూర్తి ఆమె వద్దనే ఉండేదట. తదనంతర కాలంలో విగ్రహ వివరాలు తెలియరాలేదట.ఆమె నాడు అర్చించిన విగ్రహమే ఈ ఆలయంలో ఉన్నది అని చెబుతారు.నారద మహర్షి ఆ విగ్రహం గురించిన విశేషాలను శ్రీ ఆది శంకరులకు తెలిపారు. అలా త్రిలోక చారుని మార్గదర్శకత్వంలో శ్రీ శంకరులు శ్రీ పార్ధ సారధి మూర్తి ఎక్కడ ఉన్నదో కనుగొని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారట.











ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఎన్నో రాజ వంశాలు కైంకర్యాలు సమర్పించుకొన్నాయి. ముఖ్యంగా జొమారిన్ వంశ పాలకులు గురువాయూరప్పన్ ని తమ కులదైవంగా స్వీకరించి క్షేత్ర అభివృద్ధికి కృషి  చేశారు.కానీ  పద్దెనిమిదో శతాబ్దంలో మైసూరు పాలకుడైన టిప్పుసుల్తాన్ కేరళ ప్రాంతం మీద తన ఆధిపత్యాన్నిపూర్తి స్థాయిలో చెలాయించాడు.కేరళ ప్రాంతంలో  అనేక హిందూ ఆలయాలు విధ్యంసానికి గురైనాయిట . వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటి అని అంటారు. చాలాకాలం అలా శిధిలావస్థలోనే
ఉండిపోయిందీ ఆలయం.













కానీ కాలక్రమంలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల ఆదరణతో  స్థానికంగా ఉన్న ఆలయాల పునః నిర్మాణం ఆరంభమయ్యింది. కొందరు స్థానిక భక్తులు ఈ ఆలయాన్ని సంరక్షించే భాద్యత తీసుకొన్నారు. ప్రస్తుతం మలబార్ దేవస్వం అధీనంలో ఉన్నదీ ఆలయం. చిన్న ప్రాంగణానికి  కేరళ నిర్మాణ శైలిలో నిర్మించబడిన మూడు అంతస్థుల రాజగోపురం ప్రధాన ప్రవేశ ద్వారం. ద్వారానికి రెండు పక్కలా ఆలయ గాధ తెలిపే చిత్రాలను ఉంచారు. ఉపాలయాలు అంటూ ప్రత్యేకంగా కనిపించవు.
ప్రతి రోజూ ఉదయం నాలుగున్నర నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుందీ ఆలయం. నియమంగా నాలుగు నిత్య పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు  అందుకొంటున్న మూలవిరాట్టు చతుర్భుజ శ్రీ పార్ధ సారథి అత్యంత సుందర అలంకరణతో నయన మనోహరంగా దర్శనమిస్తారు.












నిత్యం ఎందరో భక్తులు శ్రీ పార్ధసారధి స్వామి దర్శనార్ధం వస్తుంటారు. వీరిలో స్థానికులే అధికం. బయట వారికి ఈ ఆలయం గురించి చాలా తక్కువ అవగాహన ఉండటమే కారణం. ఈ విశేష క్షేత్రంలో గురువాయూర్ ఆలయంలో మాదిరి కృష్ణాష్టమి, శ్రీ రామ నవమి, విషు, ఓనం లాంటి పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. అష్టమి మరియు నవమి రోజులలో ప్రత్యేక అలంకరణ జరుపుతారు.ఆలయ ప్రతిష్టా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గజాలు సందడి చేస్తాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.












గురువాయుర్ పట్టణంలో ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి కాలినడకన సులభంగా చేరుకోవచ్చును.








కృష్ణం వందే జగద్గురుం !!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore