Irumpanam Makaliyam Sree Rama Swamy Temple

                            శ్రీ రామ స్వామి ఆలయం, ఇరుంపాణం

 


భారతీయులకు శ్రీ రామ చంద్ర మూర్తి ఆరాధ్య దైవమే కాదు మార్గదర్శి, ఆమోదప్రదమైన ప్రభువు, ఆదర్శ మూర్తి.
శ్రీ రాముని ఆలయం లేని ఊరు భారత దేశంలో కనపడదు. రామాయణ పారాయణం చేయని హిందువు ఉండడు. 
శ్రీ రాముని ఆలయాలలో కొన్ని సమస్త ప్రజానీకానికి తెలిసి ప్రముఖ స్థానాన్ని పొందుతున్నాయి.
మరికొన్ని విశేష పురాణ నేపద్యం ఉన్నా స్థానికంగా కూడా అంత గుర్తింపు పొందనివి.
అలాంటి వాటిల్లో కేరళ రాష్ట్రం లోని  ఇరుంపాణం మకలియం శ్రీ రామ స్వామి ఆలయం ఒకటి.









కేరళ రాష్ట్రం లో నెలకొని ఉన్న శ్రీ రామాలయాలలో గర్భాలయంలో రాముడు ఒక్కరే ఉంటారు. మిగిలిన రాష్ట్రాలలో సీతాలక్ష్మణులతో పాటు దాసుడు శ్రీ హనుమంతునితో కలిసి పూజలందు కొంటారు దశరథ తనయుడు. ఇది ఇక్కడ, మిగిలిన ప్రదేశాలలోని రామాలయాలకు గల  ప్రధాన వత్యాసం. పోనీ ఉపాలయాలలో అయినా శ్రీ జానకీ మాత ఉంటారా అంటే అదీ కనపడదు. కేరళలో ప్రముఖ రామాలయం అయిన త్రిప్రయార్ లో కూడా ఇలానే ఉంటుంది. 








ఇరుంపాణం మకలియంలో జగదభిరాముడు కొలువు తీరడానికి వెనుక త్రేతా యుగం నాటి సంఘటనలే కారణం అని క్షేత్ర గాధ తెలుపుతోంది. 
లంకేశ్వరుని ముద్దుల చెల్లెలు శూర్పణఖ అరణ్య వాసం చేస్తున్న మనోభిరాముని చూసి వాంచించడం, సోదరుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోయడం అందరికీ తెలిసిన కధే !









నిరాశకు తోడు ముక్కు చెవులు కోసివేసిన అవమానంతో శూర్పణఖ రోదిస్తూ తొలుత అదే అరణ్యంలో ఉన్న సోదరులు ఖర దూషణాదుల వద్దకు వెళ్ళింది.
సోదరికి జరిగిన పరాభవానికి ఆగ్రహానికి లోనైన వారు తమ బలగాలను తీసుకొని కోదండ పాణి మీదకు దండయాత్రకు తరలి వెళ్ళారు.









సీతాదేవిని లక్ష్మణుని సంరక్షణలో ఉంచి తామొక్కరే వేలాది మంది రాక్షసులను సంహరించారు కోదండపాణి.
అదే విధంగా వారి నాయకులైన ఖర దూషణ మరియు వారి సన్నిహితుడైన త్రిశరుని అంతం చేసారు అసురసంహార మూర్తి.
అకంనుడు అనే  వారి సహచరుడు తప్పించుకొని పారిపోయాడట. ప్రాణభయంతో సురక్షిత ప్రదేశంలో తలదాచుకున్న వానికి సుందర శాంత స్వరూపులైన దాశరది రుద్ర తాండవ రూపంలో పద్దెనిమిది హస్తాలతో రాక్షస సంహారం చేసిన విధానం పదే పదే తలపునకు వచ్చినదిట. తన భయాన్ని తొలగించుకోడానికి ఆ శ్రీరామచంద్రుని శరణు కోరడం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడట ఆ అసురుడు. అరణ్యానికి తిరిగి వెళ్ళి శ్రీ రాముని చరణాలకు మొక్కి తనను మన్నించమని కోరుకొన్నాడట. ఇతరులకు హాని చేయకుండా సాదు జీవనం గడపమని ఆదేశించారట అవతార పురుషుడు. 
తనకు ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా హితోపదేశం చేసి, జీవిత గతిని మార్చిన ఆయన పట్ల గౌరవంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి, జీవితకాలం సేవించుకొన్నాడట. 
ఖరదూషణాదులతో శ్రీరాముడు సల్పిన  భీకర యుద్ధం జరిగిన స్థలం ఇదేనని చెబుతారు.
(ఇదే సంఘటన జరిగిన స్థలంగా ఛత్తీస్ ఘర్ రాష్ట్రం "ఖరోద్" అనే గ్రామాన్ని కూడా పేర్కొంటారు. ఖర దూషణనుల పేర్ల మీద "ఖరోద్" అన్న పేరు వచ్చినది అంటారు)






ఖరదూషణులతో పాటు వందలాది మంది అసురులను అంతం చేసిన ప్రదేశంలో, అసురుడు ప్రతిష్టించిన రణరంగ రాముని విగ్రహం అందుకని ఇక్కడ స్వామి ఉగ్ర రూపులై ఉంటారన్న భావనతో అందుకే నిరంతరం చందనంతో అలంకరించి శాంత పరుస్తారని చెబుతారు. రుద్ర రూపం దాల్చడం వలన సదాశివునికి మాదిరి నుదిటిన మూడో నేత్రం ఉందని భావిస్తారు.  స్వామి రెండు హస్తాలతో కొలువు తీరి కనిపిస్తున్నామిగిలిన పదహారు హస్తాలు అదృశ్యంగా ఉంటాయని, భక్తులకు హాని తల పెట్టేవారిని అంతం చేసే సమయంలో అవి దర్శనమిస్తాయని విశ్వసిస్తారు. 
మూల విరాట్టు ఐదున్నర అడుగుల ఎత్తుతో ధనుర్భాణాలు ధరించి సుందర చందన పుష్ప అలంకరణతో స్థానక భంగిమలో నయన మనోహరంగా దర్శనమిస్తారు. 
సువిశాల ప్రాంగణంలో పడమర దిశగా ఉంటుందీ ఆలయం. తూర్పున కూడా ద్వారం అక్కడ ఒక రాతి దీప స్థంభం ఉంచారు. 









ఉపాలయాలలొ శ్రీ గణపతి మరియు శ్రీ ధర్మ శాస్త కొలువై ఉంటారు.
ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు మరియు ఆంజనేయుడు స్వామి సేవకు సిద్దంగా ఉంటారు.
విశాల ప్రాంగణంలో పూర్తిగా కేరళ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడి, సుందరంగా ఉంటుంది. నలుచదరపు పెంకుల మండపం, తూర్పున ఎత్తైన ఉత్సవ మండపం కనపడతాయి. 
సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రిందట చేర వంశ రాజులు తొట్ట తొలి ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసన ఆధారాలు తెలుపుతున్నాయి.
కానీ రెండువందల సంవత్సరాల క్రిందట జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో ఆలయం పూర్తిగా కాలిపోయింది.
నాటి కొచ్చిన్ రాజులు ఆలయాన్ని యధాతధంగా పునః నిర్మించారు.
నిత్యం మూడు పూజలు , అభిషేకాలు , అలంకరణలు నివేదనలు శ్రీ రామ స్వామికి నియమంగా జరుపుతారు.  











గణేష చతుర్ధి, హనుమజ్జయంతి, ఓనం, విషు లతో పాటు శ్రీ రామ నవమి వైభవంగా నిర్వహిస్తారు. 
జన్మ రీత్యా, జాతక రీత్యా ఏర్పడే గ్రహ దోషాలను హరించే వానిగా శ్రీ రామ స్వామి ప్రసిద్ది.  ప్రత్యేక పూజలు జరిపించుకోడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. 
గమనించవలసిన అంశం ఏమిటంటే ఆలయ సమయాలు.  మరెక్కడా లేని విధంగా ఈ ఆలయాన్ని ఉదయం అయిదున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదున్నర నుండి రాత్రి ఏడున్నర వరకు మాత్రమే తెరవబడి ఉంటుంది. ఒకసారి మూసివేస్తే తరువాతి సమయంలో తప్ప మధ్యలో ఆలయాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా తెరువరు. 









ఈ విశిష్ట క్షేత్రం కొచ్చిన్ నగర శివారు ప్రాంతమైన "త్రిపునిత్తూర"కు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది .
ఎర్నాకుళం జంక్షన్ లేదా టౌన్ రైల్వే స్టేషన్లల నుండి బస్సులు  త్రిపునిత్తూరకు లభిస్తాయి. అక్కడ నుండి బస్సు లేదా ఆటోలో ఇక్కడికి చేరుకోవచ్చును. 
త్రిపునిత్తూరలోని శ్రీ పూర్ణత్రేయేశ స్వామి ఆలయం, కొచ్చిన్ రాజా భవనం  తప్పక చూడవలసినవి.

ఈ బ్లాగ్ లో ఆ ఆలయ వివరాలు ఉన్నాయి.

జై శ్రీ రామ్ !!!







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore