Sri Venkateshwara Swamy Temple, Upamaka

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఉపమాక కలియుగ దైవం కోనేటి రాయుడు కొలువుతీరిన ప్రతి ఒక్క క్షేత్రం కొలిచిన వారికి కల్పతరువు. ఆలాంటి కామదేనువులాంటి ప్రసిద్ద క్షేత్రాలలో ఒకటి ఉపమాక. ఉపమానము లేనిది లేదా సాటి లేనిది అని ఉపమాకకు అర్ధంగా చెబుతారు. గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేసి కోరిన కోరిక మేరకు శ్రీ మన్నారాయణుడు స్వయం వ్యక్తగా వెలిశారు. దూరానికి పక్షి ఆకారంలో కనిపించే పర్వతాన్ని "గరుడాచలం" అని పిలుస్తారు. బ్రహ్మ వైవర్తన పురాణంలో గరుడాచల మహత్యం గురించి పేర్కొనబడినది. శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల వారు పదకొండవ శతాబ్దంలో ఉపమాక క్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఆయన రచించిన "ఆచార్య సూక్తి ముక్తావళి " అన్న గ్రంధంలో ప్రస్తావించబడినది. పేరుకు తగినట్లుగా ఉపమాక అరుదైన విశేషాల నిలయం. పర్వత పాదాల వద్ద ఉన్న "బంధుర పుష్కరణి" పరమ పవిత్రమైనది. కృతయుగంలో విధాత బ్రహ్మ దేవుడు, త్రిలోక సంచారి నారద మహర్షి ఈ కోనేరులో స్నానమాచరించి కొంతకాలం ఇక్కడే ఉంది స్వామి వారిని...