Sri Kanaka Mahalakshmi Ammavari Temple, Visakhapatnam

                  శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం , విశాఖ పట్టణం 

విశాఖ వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. 
నేడొక ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ వంద సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే !
ఒకప్పుడు ఈ ప్రాంత పాలకులు నివసించిన బురుజు పేట లోని ఒక బావిలో అమ్మవారి విగ్రహం లభించినది. 
దొరికిన చోటే ప్రతిష్టించాలన్న అమ్మవారు ఒక భక్తుని ద్వారా అందించిన ఆదేశం ప్రకారం రహ దారి మధ్యలో విగ్రహాన్ని ఉంచి పూజలు ప్రారంభించారు. 
కొద్ది సంవత్సరాలు అలానే ఉన్న అమ్మవారిని ఆనాటి ఆంగ్ల పాలకులు పక్కకు జరిపారు. 
కాతాళీయమో లేక మరొకటో అదే సమయంలో మహా భయంకర "ప్లేగు"వ్యాధి విశాఖ మీద తన కర్కశ పంజా విసిరింది. 
ఎందరో ప్రాణాలు కోల్పోయారు. 
ప్రజలు ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరిపిన దాని ఫలితంగా భావించి తిరిగి పాత స్థానంలో ఉంచారు. 
అంతే కొద్దికాలం లోనే వ్యాధి తగ్గి పోయినది. 
నాటి నుండి భక్తులను కాపాడే దేవతగా అమ్మవారు పేరుపొందారు. 
 గడచిన రెండు దశాబ్దాలలో ఎంతో అభివృద్ధి చెందిన ఆలయం ఇరవై నాలుగు గంటలూ భక్తుల కొరకు తెరిచే ఉంటుంది.
అమ్మవారి కోర్కె ప్రకారం కులాలకు మతాలకు అతీతంగా భక్తులే స్వయంగా పూజించుకొనే అవకాశం ఉన్నదిక్కడ.
ఆలయానికి పైకప్పు కూడా ఉండదు.
ప్రతి నిత్యం ప్రాతః కాల పూజ తో ఆరంభం అయ్యి ఎన్నో అభిషేకాలు, పూజలు, అలంకరణలు భక్తులు భక్తి ప్రపత్తులతో జరుపుతారు. 
 ఇక్కడ ప్రసిద్ది చెందినవి మార్గశిర మాసం ( డిసెంబర్ - జనవరి )లో నెల మొత్తం జరిగే మార్గశిర మాస ఉత్సవాలు.
సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలలో ఎంతమంది వస్తారో అంతకు రెట్టింపు భక్తులు ఆ ఒక్క నెలలో వస్తారంటారు.
ఆ నెల రోజులూ అమ్మవారికి  విశేష సేవలు నిర్వహిస్తారు.
స్థానికులు, రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల వారే కాక పక్క రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్ మరియు ఒడిస్స ల నుండి కూడా ఎందరో భక్తులు తరలి వస్తారు.


వైవిధ్యంగా ఉండే విగ్రహ రూపం లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు   కొలిచిన వారి కొంగు బంగారం. 
విశాఖ పట్టణం పాత పోస్ట్ ఆఫీసు చేరువలో ఉన్న ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోన వచ్చును. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore