26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

Kottai Eswaran Temple, Coimbattor

         శ్రీ సంగమేశ్వర స్వామి  ( కోట్టై ఈశ్వరన్ ) ఆలయం, కోయంబత్తూర్ 




తమిళ నాడులోని ప్రముఖ పట్టణాలలో ఒకటైన కోయంబత్తూర్ కి  ఆ పేరు రావడానికి కారణమైన ఆలయమిది. 
పురాణకాలం నాటి గాధలతో, సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి శ్రీ సంగమేశ్వర స్వామి లేదా స్థానికంగా కోట్టై ఈశ్వరన్ కోవెల గా పిలవబడే ఈ ఆలయం.







కోయంబత్తూర్ రైల్వే జంక్షన్ స్టేషన్ కు సమీపం లోని టౌన్ హాల్ సెంటర్  ఈశ్వరన్ కోవిల్ వీధిలో ఉంటుందీ ఆలయం.








కృత యుగంలో బ్రహ్మ దేవుని నుండి పొందిన వరబలంతో లోకకంటకునిగా మారిన అసురుని కైలాస నాధుడు భీకర యుద్దంలో ఇక్కడే సంహరించి, అందరి విన్నపం మేరకు స్వయంభూగా కొలువుతీరారట .
తదనంతర కాలంలో శివ పార్వతుల కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఒకే శరీరంలో ఉన్న శూర పద్ములనే  రాక్షస సోదరులను సంహరించి, యుద్ద సమయంలో వాహనంగా దేవేంద్రుడు ఇచ్చిన ఐరావతం అలసిపోడంతో, దానికి విశ్రాంతి కలిగించడానికి  ఇక్కడి పుష్కరణి వద్దకు వచ్చారట.
పదో శతాబ్దంలో సంతానం కొరకు వివిధ క్షేత్రాలను సందర్శించిన చోళ రాజు ఈ  క్షేత్ర విశేషం గురించి తెలుసుకొని పూజలు చేసారట. కొద్ది కాలం లోనే పుత్ర సంతానం కలగడంతో కృతజ్ఞతతో  రాజు ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. తదనంతర కాలంలో అనేక రాజ వంశాలు ఆలయాభివ్రుద్దికి తమ వంతు కృషి చేసాయి.
క్షేత్ర పురాణ గాధల ఆధారంగా సదాశివునికి, పార్వతి దేవికి, కుమార స్వామి ఆలయాలను నిర్మించారు.














సువిశాల ప్రాంగణంలో ప్రదక్షణ క్రమంలో మొదట వట వృక్షం క్రింద కొలువైన విఘ్న నాయకుడు కనపడతారు. పక్కనే దక్షిణ గోడ వద్ద నిర్మించిన మండపంలో గాయక శివ భక్తులైన నయమ్మారుల విగ్రహాలను ప్రతిష్టించారు.












ఈ మండపానికి ఎదురుగా ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో జ్ఞాన ప్రదాత శ్రీ దక్షిణా మూర్తి కొలువు తీరి వుంటారు. 
నిత్య అభిషేకాలు, పూజలు ఈయనకు జరుగుతాయి. 












ప్రాంగణ పడమర భాగంలో కన్నిమూల గణపతి, కాశి విశ్వనాధ, నీలఖండేశ్వర, మరియు శ్రీ సూర్య  ఉపాలయాలు ఉంటాయి. 















వరసగా ఉన్న మూడు గర్భాలయాల విమానాల మీద వివిధ శివలీలా ఘట్టాలను సుందర శిల్పాలుగా నిలిపారు. శివాలయ వెనుక భాగాన లింగోద్భవ మూర్తి దర్శనమిస్తారు.
























ప్రాంగణంలో ఉత్తర భాగాన శ్రీ కాలభైరవ సన్నిధి, నవగ్రహ మండపం ఉంటాయి.
దక్షిణం వైపున ఉన్న ఆలయంలో శ్రీ కైలాస నాధుడు పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే లింగ పైభాగాన "బ్రహ్మ సూత్రాలు" లిఖించబడి ఉండటం. అపమృత్యు భయాన్ని తొలగించేవానిగా స్వామి ప్రసిద్ది.
 శ్రీ సంగమేశ్వర స్వామిని సేవిస్తే విద్య, ఐశ్వర్యాల అభివృద్ధి కలుగుతుందని స్థానిక నమ్మకం.












మధ్యలో ఉన్న ఆలయంలో శ్రీ కుమార స్వామి కొలువైవుంటారు. 
గమనించ వలసిన అంశం ఏమిటంటే సహజంగా స్వామి ఆరుముఖాలు ఆరు దిక్కులు చూస్తుంటాయి. కాని ఇక్కడ పెద్ద రాతి మీద చెక్కబడిన శ్రీ షణ్ముఖ రూపం లోని ఆరు ముఖాలు తూర్పు దిశగానే ఉండటం. 
సంతానాన్ని ప్రసాదించే వానిగా, శత్రు భయాన్ని తొలగించే వానిగా ఈయన ప్రసిద్ది. 












మరో విశేషం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. చిన్న ధ్వజస్తంభం వద్ద ఉంటుంది.
సూర పద్ములను సంహరించిన తరువాత దేవ సేనాని ఇక్కడకు వచ్చారు కదా! ఆ సమయంలో ఆయన వాహనం ఐరావతం.
ముఖ మండపంలో స్వామికి ఎదురుగా ఈ ఉదంతానికి గుర్తుగా ఏనుగు రూపాన్ని ప్రతిష్టించారు.
చివర ఉన్న ఆలయంలో శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు కొలువుతీరి ఉంటారు.
అమ్మవారు అన్నోన్య దాంపత్యాన్ని, సుమంగళిత్వాన్ని ప్రసాదించేదిగా ప్రసిద్ది.
ముఖమండపం లోని స్తంభం పైన చెక్కబడిన అంజనా సుతుడు ఉత్తారాభి ముఖుడై ఉండి పూజలందుకోవడం సహజంగా శివాలయాలలో కనపడని అంశం.
కోయంబత్తూర్ నగరంలో ప్రసిద్ది చెందిన ఆలయ బ్రహ్మోత్సవాలు చైత్ర (ఏప్రిల్-మే )మాసంలో పదమూడు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి.
వినాయక చవితి, స్కంద షష్టి, మాస శివరాత్రులు, నవ రాత్రులు, మహా శివ రాత్రి తో అనేక స్థానిక పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉండే ఈ ఆలయం కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
స్టేషన్ ఎదురుగా అందుబాటు ధరలలో వసతి గృహాలు ఉంటాయి.
నమః శివాయ !!!!!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...