Sri Satya Narayana Swamy Temple, Visakhapatnam

     శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, విశాఖ పట్టణం 

సుందర సాగర తీర నగరం విశాఖపట్టణం. 
ఎన్నో ప్రకృతి అందాలు ఈ ప్రాంత సొంతం. 
ప్రకృతే కాకుండా పరమాత్మ కూడా వివిధ రూపాలలో కొలువు తీరిన అనేక ఆలయాలు ఈ ప్రాంతం లో ఎన్నో ఉన్నాయి. 
వాటిల్లో నగర నది బొడ్డున రెండు శతాబ్దాల క్రిందట నెలకొల్పబడిన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. 

రెండు వందల సంవత్సరాల క్రిందట శ్రీ సీతారం బాబాజీ అనే సాధువు ఉత్తర భారతం నుండి పాలరాతితో సుందరంగా మలచిన విగ్రహాలను తెప్పించి ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
ఆనతి కాలం లోనే భక్తులకు కలిగిన అపూర్వ అనుభవాలతో ఆలయం దినదినాభివృద్ది చెందినది. 
సుమారు ముప్పై సంవత్సరాల క్రిందట ఆలయాన్ని పునః నిర్మించారు. 
ప్రస్తుతం నగరంలో పేరొందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటి అధ్వర్యంలో ఉన్న ఆలయాన్ని  ప్రతి నిత్యం ఎందరో భక్తులు సందర్శించు కొంటున్నారు.


ఆంధ్ర రాష్ట్ర తూర్పు ప్రాంత ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా పేరొందిన కింగ్ జార్జి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఇసుక  కొండ లేదా బాబాజీ కొండ మీద ఉన్న ఈ ఆలయానికి రహదారి మరియు సోపాన మార్గం ఉన్నాయి. 
మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసం అయ్యి మర్మత్తులు చేపట్టాల్సిన పరిస్థితిలోఉన్నది. 






వాహనం మీద ఆసుపత్రి లో నుండి నేరుగా ఆలయ సమీపానికి చేరుకోన వచ్చును. 
అయిదు అంతస్తుల రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్తంభం దాటిన తరువాత చక్కని "అనివెట్టి మండపం" కనపడతాయి. ధ్వజస్తంభం వద్ద వినతా సుతుని సన్నిధి కలదు. 
రాజ గోపురం పక్కనే వెలుపల కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటు చేసారు. 








ప్రాంగణం వెలుపల మరియు లోపల ఒక్క శ్రీ ఆంజనేయుని ఉపాలయం తప్ప మరో సన్నిధి ఉండదు. 
మండపంలో కేసరీ నందనుడు దక్షిణా ముఖుడై కొలువుతీరి ఉంటారు. 
గర్భాలయంలో ఒక అద్భుత దృశ్యం కనపడుతుంది. 
పై వరుసలో తొలుత ప్రతిష్టించిన పాలరాతి విగ్రహాలు, మధ్య వరుసలో తదనంతరం నెలకొల్పిన నల్లరాతి విగ్రహాలు, తరువాత ఉత్సవిగ్రహాలు.  అన్నిటికన్నా దిగువన నమస్కార భంగిమలో కూర్చొనివున్న గరుత్మంతుడు తన రెక్కలను విప్పుకొని పైన ఉన్న శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ రూపాలను తన మూపురాన నిలుపుకొన్నట్లుగా కనపడతాడు. 
ఇలాంటి సుందర దృశ్యం మరే ఆలయం లోనూ కనపడదు.
గరుడ వాహన శ్రీ హరి సందర్శనం అత్యంత పుణ్య ప్రదంగా పేర్కొంటారు. మిగిలిన ఆలయాలలో అది పర్వదినాలలోనే సాధ్యం. 
ఇక్కడ మాత్రం ప్రతి నిత్యం గరుడ వాహన సత్య దేవుని దర్శనమే ! 
అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువు చతుర్భుజాలతో  చక్కని పుష్ప, స్వర్ణఆభరణాలను ధరించి నయనమనోహరంగా దర్శనమిస్తారు. 
మూలవిరాట్టుల మీద నుండి దృష్టి మరల్చుకోవడం అంత సులభ సాధ్యం కాదు. 









ప్రతి రోజు మూల వరులకు ఎన్నో పూజలు, అలంకారాలు, అర్చనలు జరుగుతాయి. 
ప్రతి పౌర్ణమికి జరిగే  శ్రీ సత్యనారాయణ వ్రతం చాలా ప్రసిద్ది. 
లక్షకు పైగా భక్తులు పున్నమి నాటి వ్రతంలో పాల్గొంటారు. 
ఆ రోజున ఘనంగా అన్న దానం కూడా ఏర్పాటు చేస్తారు. 



అయిదు నెలలు వరసగా దీక్షతో వ్రతం చేసి ప్రతిసారి అయిదు ప్రదిక్షణలు చేసిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి అన్నది అనేక మంది భక్తులకు అనుభవం లోనికి వచ్చిన విశేషం. 



వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, ఇతర హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. 

ఆలయ అధ్వర్యంలో నడపబడుతున్న గోశాల కూడా ఉన్నది. 
పర్వత పై భాగం నుండి విశాఖ అందాలను చూడటం మరో చక్కని అనుభవం. 









 భక్తులకు అనుభవం లోనికి వచ్చిన అనేక విషయాల మూలంగా ఈ క్షేత్రం విశాఖ పట్టణ అన్నవరం గా పిలవబడుతోంది.
ప్రతి ఒక్కరూ సందర్శించవలసిన ఆలయం.
నమో నారాయణాయ నమః !!!!




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sri Omkara Siddeshwara Swamy Temple, Omkaram

Sri Kasinayana Temple, Jyothi, AP

Sri Irukalala Parameswari Temple, Nellore