15, జూన్ 2014, ఆదివారం

Ashtamsa Sri Varada Anjaneya Temple, Coimbatore

            అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి ఆలయం, కోయంబత్తూర్ 

వానరం అంటే స్థిరత్వం లేకుండా ప్రవర్తించే జీవి. 
మానవ మనస్సుకు, ఆలోచనలకు ప్రతి రూపం వానరం. 
మానవులకు సరి అయిన మార్గ దర్శకత్వం చేయడానికి స్వయ సర్వేశ్వరుడే వాయునందనునిగా అవతరించారని జ్ఞానులు, విజ్ఞులు అంటారు. 
అందుకే నిరుపమాన స్వామి భక్తికి, అచంచల విశ్వాసానికి, చక్కని వాక్చాతుర్యానికి, కార్య దీక్షకు, పరాక్రమానికి, వినయ విదేయతలకు మరో పేరే శ్రీ ఆంజనేయుడు. 
చిరంజీవిగా ఎక్కడ రామ నామ జపం జరుగుతుందో అక్కడ ఉంటారని భక్తులు విశ్వసించే స్వామి కి దేశం అంతటా ఎన్నో ఆలయాలున్నాయి.  
వాటిల్లో ఏమాత్రం చారిత్రిక పౌరాణిక నేపద్యం లేకుండా ఒక భక్తుని ధృడమైన సంకల్పంతో నెలకొన్న ఆలయమే "అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి ఆలయం, కోయంబత్తూర్"
పది సంవత్సరాల క్రిందట సద్గురు ఆదేశంతో శిష్య బృందంచే నిర్మించబడిన ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 
సహజంగా భక్త, దాస, అభయ, సంజీవ రాయ, పంచ ముఖ ఆంజనేయునిగా దర్శనమిచ్చే అంజనా సుతుడు ఈ ఆలయంలో అన్నీ మేలవించుకొని అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామిగా భక్తులను అనుగ్రహిస్తారు.  


సాలగ్రామ శిల తో చెక్కబడిన ఎనిమిది అడుగుల విగ్రహం వెనుక రాతి మకర తోరణం శివలింగాకారంలో ఉండటం వలన హనుమంతుని ఆరాధిస్తే మహాదేవుని సేవించిన ఫలితం కనపడుతుంది. 
కుడి అభయ హస్తం భక్తుల కష్టాలను దూరం చేసేదిగానే కాకుండా అరచేతిలోని శ్రీ మహా లక్ష్మి రూపం సిరిసంపదలను అనుగ్రహిస్తుంది. ఎడమ చేతిలోని గద మానవుల లోని ఈర్ష్య, అసూయ, అహంకారం, లోభం, మొహం అనే అయిదు దుర్లక్షనాలను దూరం చేసేదిగా అభివర్ణిస్తారు

పడమర దిశగా కొలువై ఉన్న సంజీవ రాయడు వివిధ వన మూలికలతో నిండిన పక్షిమ కనుమలను చూస్తూ అప్పన్నుల ఆరోగ్యాలను కాపాడే ధన్వంతరి. 
దక్షిణ దిశగా తిరిగిన పాదాలతో ఉన్న చిరంజీవి తన గురువైన సూర్య నారాయణుని కుమారుడైన యమ ధర్మ రాజుని ప్రభావితం చేసి రామ నామ జపం నిస్వార్ధంగా చేసే భక్తులకు అపమృత్యు భయాన్ని కలగనీయరు అని అంటారు.   

తమిళనాడులో ఆంజనేయుని అపురూపంగా వివిధ విధాలుగా అర్చిస్తారు, అలంకరిస్తారు, ఆరాధిస్థారు. 
వీరి సేవలో వాయునందనుని వాలానికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. 
తోకను ప్రతి ప్రదక్షిణ తరువాత తాకితే సకల గ్రహ భాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. 
అష్టాంశ శ్రీ వరద ఆంజనేయ స్వామి వారి తోక పూర్తిగా దర్శనమిస్తుంది.  ఇలాంటిది చాలా అరుదు. దాని దర్శనం భక్తులకు సర్వ శుభదాయకం.  
స్వామివారి గుండ్రని నేత్రాలు సూర్య చంద్రులకు చిహ్నాలు. మానవులకు కావలసిన వేడి చల్లదనాలను ప్రసాదిస్తాయి. 


2004 వ సంవత్సరంలో ప్రతిష్టించబడిన స్వామి నాటినుండి ఇక్కడి ప్రజలను కన్నబిడ్డల మాదిరి కాపడుతున్నరన్నది స్థానిక నమ్మకం. 
అద్భుతమైన విషయం ఇక్కడ జరిగే అలంకరణలు. 
నెలలోని ప్రతి శని, ఆదివారాలలో రమణీయమైన అలంకరణ జరుపుతారు. 



ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మించారు. 
ఈ ఆలయం కోయంబత్తూర్ పట్టణంలోని అవనాషి రోడ్ లోని ESSO బస్సు స్టాప్ దగ్గరలో ఉంటుంది. 
కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి సిటీ బస్సులు లభిస్తాయి.  









జై ఆంజనేయం !!!

Thirunakkara sree Mahadeva Temple, Kottayam

                      తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయం, కొట్టాయం  

గత నెల రోజులలో నేను సందర్శించిన అద్భుత శివాలయాలలో మూడవది కేరళ రాష్ట్రం కొట్టాయం లోని తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయం.
కొట్టాయం శబరి మల యాత్ర చేసేవారందరికి తెలిసిన ఊరు.
ఆంద్ర నుండి వెళ్ళే అయ్యప్ప దీక్షా పరులలో చాలా మంది ఇక్కడే దిగుతారు.
ఈ ఊరు మధ్యలో ఉన్న తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయంలో కైలాస నాధుడు కోరి కొలువైనాడని క్షేత్ర పురాణ గాధ ఆధారంగా అవగతమౌతోంది. 
అయిదు శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతాన్ని పాలించే తేక్కుమ్కూర్ వంశ రాజు ప్రతి పౌర్ణమికి త్రిస్సూర్ వెళ్లి శ్రీ వడక్కు నాథర్ ను సేవించుకొని వచ్చేవారట. 
అలా చాలా సంవత్సరాలు గడిచాయి. 
ఒకసారి వయసు మీద పడటంతో వయోభారం వలన ఇంత దూరం ప్రయాణించి స్వామి దర్శనానికి రాలేనని, ఉపయోగం లేని ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించమని వేడుకోన్నారట రాజు. 
నాటి రాత్రి సదాశివుడు రాజుకు స్వప్న సందర్శనమిచ్చి తిరుగు ప్రయాణంలో లభించే లింగాన్ని తన రాజ్యంలో ప్రతిష్టించమని, అందుకు అవసరమైన ఆధారాలను తెలిపారట. 
తన అదృష్టానికి సంతోషించిన రాజు రాజ్యానికి బయలుదేరారట.  

సర్వేశ్వరుడు తెలిపినట్లుగా దారిలో ఒక బ్రాహ్మణుడు కలిసారట. 
ఆధారాల ప్రకారం ఒక స్థలంలో త్రవ్వగా లింగం లభించినదట. 
అవధులు లేని ఆనందంతో రాజు ఒక ఉత్సవంగా లింగరాజును తీసుకొని వచ్చి చిన్న పర్వతమైన "నక్కర"(పర్వతం )మీద ప్రతిష్టించారట. 
అలా కాలక్రమంలో "తిరు నక్కర" ( పవిత్రమైన పర్వతం)గా పిలవబడసాగింది. 
లింగం తో పాటు అమ్మవారి పంచలోహ విగ్రహం, నందీశ్వరుడు కూడా లభించారట. 
అందుకని గర్భాలయంలో స్వర్ణ కవచంతో కప్పబడిన లింగం పక్కనే అమ్మవారు కొలువైవుంటారు. 
సహజంగా కేరళ శివాలయాలలో వర్తులాకార శ్రీ కోవెలలో ముందు పక్క మహేశ్వరుడు, వెనక 
కేరళ శివాలయాలలో నందికి అంత ప్రాధాన్యత కనపడదు. చాలా ఆలయాలలో నందీశ్వరుడు ఉండడు. 
కానీ తిరునక్కర ఆలయం లోని నందికి అపరిమిత ప్రాధాన్యత ఉన్నది. 
గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపంలో పంచలోహాలతో చేసిన తొడుగు కప్పబడి ప్రత్యేకంగా కనపడతారు నంది. 
దీనికి సంబంధించి ఒక కధ స్థానికంగా వినపడుతుంది. 
పంటల కోతల సమయంలో పొలాలకు కాపలాగా ఉన్న రైతులకు ఒక ఎద్దు రాత్రి పూట్ల పంటను మేస్తూ కనపడగా, దానిని వెళ్ళగొట్టడానికి రాళ్ళు రువ్యారట. 
నాటి రాత్రి నంది రాజు కు కలలో కనపడి తన మీదకు రాళ్ళు వేసిన సంగతి తెలిపినాడట. 
మరుసటి రోజు రాజు ఆలయానికి వచ్చి చూడగా నంది విగ్రహం మీద రాళ్ళ గాయాలు కనిపించాయట. 
నాటి నుండి నందికి ప్రత్యేక నేవేద్యాలు ఏర్పాటు చేసారట. 
తరువాత కొంతకాలానికి నంది విగ్రహం మీద నీటి బొబ్బ కనపడగా రాజాజ్ఞ మేరకు వైద్యులు వైద్యం చేసారట. 
దీని గురించి జోతిష్కులను సంప్రదించగా ఇది రాజ్యంలో సంభవించబోయే ప్రకృతి వైవరీత్యాలకు సంకేతం అని తెలిపారట. 
చివరిసారి బొబ్బ సుమారు వంద సంవత్సరాల క్రిందట కనిపించినది అని నంది మీద హాని కారక క్రిములు చేరకుండా లోహపు కవచం పెట్టినట్లుగా తెలుస్తోంది. 
 ఆలయానికి చేరుకొనే మార్గంలో రోడ్డు మధ్యలో ఉంచబడిన పవిత్ర శిల కనపడుతుంది. 
తరువాత వట వృక్షం క్రింద ఉన్న దేవతా మూర్తులకు ఎదురుగా చిన్న గణపతి ఆలయం ఉంటుంది. 
చిన్నదైన అద్భుత వర్ణ చిత్రాలతో శోభాయమానంగా ఉంటుందీ ఆలయం.     






గణపతి ఆలయము పక్కనున్నమార్గం గుండా ఆలయానికి చేరుకోవచ్చును.
కొద్దిగా ఎత్తులో ఉన్న ప్రధాన ద్వారం వరకు మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.


ద్వారానికి ఇరుపక్కలా వినాయక, పరాశక్తి మహామునుల వర్ణ చిత్రాలను అద్భుతంగా చిత్రించారు.

సువిశాల ప్రాంగణమంతా ఉప ఆలయాలతో నిండిపోయి ఉంటుంది.
వినాయక, దుర్గ, సుబ్రహ్మణ్య, భద్రకాళి, వడక్కు నాథర్, ధర్మశాస్త, నాగరాజ మరియు బ్రహ్మ రాక్షస  ఈ ఆలయాలలో కొలువై ఉంటారు.

నిత్యం భక్తులతో కళకళలాడుతుండే ఆలయంలో ఎన్నో పూజలు జరుగుతాయి.
అన్ని హిందూ మరియు స్థానిక పండుగలు అయిన విషు, ఓనం రోజులలో విశేష పూజలు మరియు అభిషేకాలు ఉంటాయి.
గణేష చతుర్ధి, శివరాత్రి, నవరాత్రులు, శబరిమల మండల పూజ మరియు మకర జ్యోతి సమయాలలో ఆలయ వేళలో మార్పులు చేసి ప్రత్యేక దర్శన సమయాలను ఏర్పాటు చేస్తారు.
ఇవి కాకుండా తిరునక్కర శ్రీ మహాదేవ ఆలయంలో మూడు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
మీనం మాసం ( మార్చి) లో పది రోజుల పాటు జరిగే "పైన్ కుని ", మిధునం నెల ( జూలై ) లో ఎనిమిది రోజుల పాటు జరిగే "ఆని", తులం నెలలో ( అక్టోబర్) ఆరు రోజుల పాటు నిర్వహించే "అల్పాసి".
ఈ ఉత్సవాల అన్నింటిలో కేరళలోని అన్ని రకాల వాయుద్యాల మరియు నాట్యాల విశేష సమ్మేళనంగా మేళవించి ఘనంగా నిర్వహిస్తారు.

జిల్లా కేంద్రమైన కొట్టాయంలో యాత్రికులకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి.
నమః శివాయ !!!

9, జూన్ 2014, సోమవారం

Sri Vadakkunnathan Temple, Thrissur

                       శ్రీ వడుక్కునాథర్ ఆలయము, త్రిస్సూర్ 

గత నెలలో  సందర్శించిన అద్భుత శివాలయాలలో రెండవది కేరళ రాష్ట్ర కళల రాజధాని త్రిస్సూర్ నడి బొడ్డున ఉన్న " వడక్కునాథర్ ఆలయము"
త్రిస్సూర్ పట్టణంలోని ప్రధాన కూడలి "స్వరాజ్ రౌండ్" మధ్యలో సుమారు పది ఎకరాల సువిశాల స్థలంలో ఉంటుందీ ఆలయం.
కొన్నిశతాబ్దాల క్రిందట చిన్న కొండ మీద ఉన్న ఈ ప్రాంతము దట్టమైన అడవి. నేరస్తులకు శిక్షగా " తెక్కిన్ కాడు" లోనికి పంపేవారట.
తరువాత కొచ్చిన్ రాజ వంశీకులు పూనుకొని ఆలయ నిర్మాణాన్ని చేసారట.
ప్రస్తుత ఆలయం సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రిందటి నిర్మాణంగా నిర్ణయించి పురావస్తు శాఖ తన అధీనం లోనికి తీసుకొన్నది.
సంరక్షించాల్సిన పురాతన నిర్మాణంగా "యునేస్కో" గుర్తింపు కూడా పొందినది శ్రీ వడక్కునాథర్ ఆలయం.






















\







పురాణ కాలంలో "తిరు శివవేరూర్" గా పిలవబడి కాలక్రమంలో "త్రిస్సూర్" గా మార్పు చెందినట్లు తెలుస్తోంది. 
పద్దెనిమిదో శతాబ్దంలో కొచ్చిన్ రాజు అయిన "రాజా శాక్తన్ థంపురన్" (1751 - 1805) కాలంలో త్రిస్సూర్ అభివృద్దికి పునాది పడినది. 
కొచ్చిన్ సమీపంలోని త్రిపునిత్తూర నుండి రాజధానిని త్రిస్సూర్ కి మార్చారు. 
నాడు ఆయన నివసించిన రాజభవనం  "శాక్తన్ థంపురన్ ప్యాలస్" నేడు మ్యూజియంగా రూపుదిద్దుకొన్నది. 
ఎన్నో పౌరాణిక గాధలు, చారిత్రక విశేషాలను తెలిపే ఒక గొప్పనిర్మాణం శ్రీ వడక్కునాథర్ ఆలయం.  









అన్నిరహదారులు రోము నగరానికే! అన్నట్లుగా త్రిస్సూర్ లోని దారులన్నీశ్రీ వడక్కునాథర్ ఆలయం వైపుకే !
నగరం లోని ఏ పక్కకు వెళ్ళాలన్నా లేక నగరం లోనికి రావాలన్నా తప్పనిసరిగా స్వరాజ్ రౌండ్ మీదగానే రావాలి.
బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడిన ఈ ఆలయ గాధ కృత యుగం నాటిది.
ఇరవై ఒక్క సార్లు భూమండలం అంతా తిరిగి రాజు అన్న వాడినల్లా సంహరించిన అవతార పురుషుడు శ్రీ పరశురాముడు.
అలా జయించిన భూమిని అర్హులకు దానమిచ్చి తాను తపమాచరించుకొనడానికి సముద్రుని నుండి కొంత భూమిని స్వీకరించాడు.
ఆ భూమిని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని భావించిన మహర్షి కైలాసము వెళ్లి తన గురువైన సదాశివుని సలహా కోరారట.
సంతసించిన సర్వేశ్వరుడు ఆ భూమిలో ధర్మాన్ని, దైవభక్తిని పెంపు చేసేందుకు ఆలయాలను నిర్మించమని సెలవిచ్చారట.
గురువాజ్ఞను ప్రమాణంగా స్వీకరించిన పరశురాముడు తొలి ఆలయం ఆయనదే కావాలని అభ్యర్ధించారట.



శిష్యుని కోరిక మేరకు సపరివారంగా బయలుదేరిన లయ కారుడు ఇక్కడ కోలువైనారట. 
యుగాల పాటు ఆయన లింగ రూపంలో నేటి ఆలయ వెలుపల ఉన్న పెద్ద వట వృక్షం క్రిందనే ఉన్నారట. 
అందుకే దానిని "మూల స్థానం" అంటారు. 
అక్కడే ఉన్న మరో రెండు వృక్షాలు కూడా పవిత్రమైనవిగా భావిస్తారు.


సుమారు పద మూడు వందల సంవత్సరాల క్రిందట పేరుంపాడు స్వరూపంగా పేర్కొనే కొచ్చిన్ రాజ వంశీకులు, ఇక్కడి అడవిని తొలగించి  ప్రసిద్ద శిల్పి అయిన "పేరున్ థాచన్" అధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేసారని శాసనాల ద్వారా తెలుస్తోంది. 
వృక్షం క్రింద నుంచి తొలగించే క్రమంలో జరిగిన "దైవ ప్రశ్న" సందర్భంగా ఇక్కడే ద్వాపర యుగంలో అర్జునునకు, కిరాతక వేషంలో వచ్చిన మహేశ్వరునికి యుద్ధం జరిగినది అని. 
ఆ పోరులో గాయపడిన గంగాధరునికి శ్రీ ధన్వంతరి స్వచ్ఛమైన ఆవు నేతి లేపనం తో ఉపశమనం కలిగించారని కూడా తెలిసినదట. 
హిమాలయాలో ఉండే "ముక్కంటి" దక్షినాదికి తరలి వచ్చినందున అభిషేక ప్రియునికి నెయ్యి అభిషేకం జరగాలని దైవజ్ఞులు నిర్ణయం చేసారట. 
నాటి నుండి ఉదయం ఆవు నేతితో, సాయంత్రం లేత కొబ్బరి నీతితో మాత్రమే అభిషేకం జరుపుతారు. 
వడక్కు నాథర్ అంటే వడ = ఉత్తర ప్రాంతం అని, నాథర్ = అధిపతి అని అర్ధం. 
అందుకే త్రిస్సూర్ "దక్షిణ కైలాసం"గా ప్రసిద్ది.  
పద మూడు వందల సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రవేశించడానికి తెల్లని ధోవతి తప్పనిసరి. 








సాంప్రదాయ కేరళ శైలిలో ఉండే నాలుగు అంతస్తుల గోపురానికి చెక్కతో చక్కని సుందర శిల్పాలను, సూక్ష్మమైన లతలు, పుష్పాలను చెక్కారు. 




తొలి ప్రాంగణంలో ప్రదక్షిణ చేయడానికి,  రెండో ప్రాకారంలో ఉన్న నాలుగు ప్రధాన ఆలయాలను సందర్శించుకోనడానికి ఒక ప్రత్యేక పరిక్రమా నియమావళి ఉన్నది. 

సువిశాల ప్రాంగణానికి నిర్మించిన దుర్భేద్యమైన ప్రహరి గోడకు నలుదిశలా ప్రవేశ ద్వారాలున్నాయి. కాని పడమర ముఖంగా ఉండే ప్రధాన ద్వారం గుండానే వెళ్ళాలి. 

లోపలకి ప్రవేశించిన తరువాత ఎదురుగా ఎత్తైన గోపురం కలిగిన "కూతంబలం" గా పిలిచే నాట్య మండపం కనిపిస్తుంది. 
పక్కనే ఉన్న రాళ్ళు పరచిన మార్గంలో వెలుపలి ప్రదక్షణ మొదలుతుంది. 
భక్తులకు ఇది ప్రదక్షిణ కాగా స్థానికులకు ఆరోగ్యాన్నిచ్చే నడక. 
ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఎందరో ఇక్కడ నడుస్తుంటారు. 


తొలుత వచ్చే "అర్జున విల్కుళి" లోని నీటిని తల మీద జల్లుకొవాలి. 
ఈ కోనేటి వెనుక మహా భారతం లోని గాధ ఒకటి ఉన్నది. 
తన కుమారుడైన అభిమన్యుని అధర్మ యుద్దంలో సంహరించిన వారిలో "జయధ్రధుడు" (సైంధవుడు) ముఖ్య పాత్ర పోషించాడని తెలుసుకొన్న అర్జనుడు అతనిని సూర్యాస్తమయం లోపల సంహరిస్తానని ప్రతిన పూనాడు. 
ఆ భయంతో  దాక్కున్న అతను కృష్ణ మాయ వలన వెలుపలికి వచ్చి పార్ధుని చేతిలో హతమయ్యాడు. 
కానీ సైంధవుడు శివ భక్తుడు. 
గాండీవి విడిచిన శరం సైంధవుని శిరస్సును తెచ్చి ఇక్కడ పదవేసినదట. 
యుద్దానంతరం విషయం తెలుసుకొన్న విజయుడు వచ్చి తెలియక చేసిన తప్పుకు భక్త సులభుని క్షమాభిక్షను కోరి, బాణం పడిన ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఈ కోనేరును తవ్వించాడట.   
మనం చేసిన అన్ని పాపాలను తొలగించే శక్తి ఈ నీటికి ఉందని భక్తుల నమ్మకం.  
తొలుతగా కూతంబలం వెనక ఉన్న "శ్రీ గోశాల కృష్ణ" దర్శనం. 
ఈ స్వామి శ్రీ బిళ్వ మంగళ స్వామి ప్రతిష్ట. 
తూర్పుదిశగా నడుస్తూ చిన్న మలుపులో లోపలి ఉండే "వృషభన్" సన్నిది సందర్శించు కోవాలి. 
ప్రధాన ఆలయంలో భాగం అయిన ఈ ఉపాలయ గోడలను  చక్కని సహజ వర్ణ చిత్రాలతో అలంకరించారు. 
లోపల నందీశ్వరుడు ఉత్తర ముఖుడై కనపడతాడు. 
ఒక నూలు పోగును ( తమ పంచ నుండి తీసిన దారాన్ని )సమర్పించుకోవడం ఆచారంగా వస్తోంది. 


ముందుకు వెళితే పుక్కరార్ తార వస్తుంది. 
ఇక్కడే ఆలయ ఉత్తరద్వారం ఉంటుంది. 
ఇది కొద్దిగా వంగి ఉంటుందని అంటారు ( పరిశీలనగా చూస్తే ). దీని వెనుక ఒక ఆసక్థికర కధ వినిపిస్తుంది. 
గతంలో ఒకసారి ఒక బంగారు సర్పం నమస్కార మండపంలో కనిపించినదట. 
ఆలయ పూజారులు కొంటెతనంతో  హింసించబోగా నాగుల రాజు వాసుకి అయిన ఆ దివ్య సర్పం విపరీతంగా పెరిగి పోయిందట. 
భయపడిన పూజారులు గరుడుని ప్రార్ధించారట. 
భక్తులను రక్షించడానికి వచ్చిన పక్షిరాజు తరలివచ్చారట. 
గరుత్మంతుని రాకను పసిగట్టిన వాసుకి అదృశ్యమైనాడట.  
కానీ గరుడుని వేగానికి బరువుకి గోపురం కొద్దిగా వాలినదని చెబుతారు.   
కొంచెం ముందర పరశురామ సన్నిధి ఉంటుంది. కొత్తగా సృష్టించిన భూభాగంలో ఆది గురువు సూచించిన కార్యక్రమం పూర్తి చేసిన పరశురాముడు ఇక్కడ నుండి తపస్సు చేసుకోడానికి అదృశ్యమైనారట.  


నలుచదరపు గట్టుకు ఒక మూల చిన్న మందిరంలో ఉన్న అవతార రూపానికి మొక్కాలి. 
రాజులకు శత్రువైన పరశురాముని దర్శించుకోడానికి ఇష్టపడని కారణంగా మరో దారిని నిర్మించారు. 


తూర్పు ద్వారానికి ఎదురుగా నందీశ్వరుని శిష్యుడైన  " సింహోదరు"ని ఉపాలయం ఉంటుంది. 
ఈయన ఆలయానికి ప్రధాన కాపలాదారు. 
ఇక్కడే ఆలయ గోడకు ఉన్న త్రికోణాకారపు రంధ్రం గుండా లోపల ఉన్న ప్రధాన ఆలయాన్ని వీక్షించవచ్చును. 
  



ఆగ్నేయంలో ఉన్న గట్టును "శంభు తార" అంటారు. పైన నిలబడి ఉత్తరంగా తిరిగి చిదంబర నాదునికి, తూర్పుగా తిరిగి సేతు నాధన్ కు ప్రణమిళ్ళాలి. 


దక్షిణ ద్వారాన్ని కొదంగల్లూరు రాజులు నిర్మించారు. 
ఒక్క పూరం సమయంలో తప్ప మిగతా కాలంలో మూసివేసి వుంటుంది.  గతంలో మరణ శిక్ష విధించిన వారిని ఆలయానికి ఆఖరి ప్రార్ధన కోసం తీసుకొచ్చి, ఈ ద్వారం గుండా తీసుకొని వెళ్లి శిక్ష అమలుచేసే వారట. 
ఇక్కడ నిలబడి శ్రీ కోడంగళ్ళూరు భగవతీ దేవిని తలచుకోవాలి.  


నైరుతి మూల కట్టిన గట్టు ఎక్కి కూడళ్ మాణిక్యం అనే ఊరిలో ఉన్న శ్రీ భరత పెరుమాళ్ ( శ్రీ రాముని సోదరుడు ) ని, ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న "ఊరకతమ్మ అమ్మవారి"ని ధ్యానించాలి. 

ఆ తరువాత నేరుగా విజయేశ్వరస్వామి మరో రూపమైన "వేటక్కారన్"ని దర్శించుకొని, వ్యాస శిల చేరుకొని "హరి శ్రీ గణపతియే నమః " అని రాస్తే పిల్లలకు ఉన్నత విద్య లభిస్తుంది.  




గజ పృష్ట ఉపాలయంలో హరిహర సుతుడు శ్రీ ధర్మశాస్త కొలువుతీరి ఉంటారు. 




పక్కనే మృత సంజీవని మట్టిని తాకి, నాగ దేవతలను దర్శించుకొని, శంఖు చక్రాలకు మొక్కి నేరుగా జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరుల సన్నిధికి చేరుకోవాలి. 













జగద్గురువుకు శ్రీ వడక్కు నాథర్ ఆలయం తో ఉన్న బంధం విడదీయలేనిది. శంకరులు ఈశ్వరాంశ. 
శివ గురువు, ఆర్యాంబ దంపతులు  సంతానం కొరకు శ్రీ వడక్కు నాథర్ ని సేవించిన తరువాతే గురుదేవులు జన్మించారు. 
ఆది శంకరులు ఈ ఆలయాన్ని సందర్శించారు. 
ఇక్కడి శంకరనారాయణ మరియు శ్రీ రామ విగ్రహ ప్రతిష్టాపన ఆయన చేసినవే అంటారు. 
















ఈ విధంగా బయట కొలువున్న పరివార దేవతలను సందర్శించుకొన్న తరువాత ప్రధాన ఆలయ ద్వారానికి చేరాలి. 
ఇక్కడ మొత్తం మూడు ద్వారాలుంటాయి. 
దక్షిణ వైపున వున్నా వాకిలి నేరుగా శ్రీ వడక్కు నాథర్ శ్రీ కోవెలకు దారి తీస్తుంది. 
లోపల తొలుత నందికి ప్రణమిల్లి, గోడలకు ఉన్న వాసుకి మరియు నటరాజ స్వామి చిత్రాలకు మొక్కి,  శ్రీ వడక్కు నాథర్ సన్నిధికి చేరుకోవాలి. 
లింగం చిన్నదే అయినా కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న అభిషేకం కారణంగా పేరుకు పోయిన 
నెయ్యి మూలంగా తెల్లని హిమ శిఖరాలను తలపించే విధంగా పదిహేను అడుగుల ఎత్తుతో గర్భాలయం అంతా వ్యాపించి కనపడుతుంది.
ఇంత పెద్ద ఎత్తున ఘ్రుతం ఉన్నా ఎలాంటి వాసన రాదు. చీమలు ఈగలు లాంటి కీటకాలు కనిపించక పోవడం చెప్పుకోదగిన అంశం.
అద్భుత దృశ్యం.
జీవిత కాలం మదిలో నిలిచిపోయే దర్శన దృశ్యం.
వర్తులాకార శ్రీ కోవెలలో తూర్పు వైపున శ్రీ పార్వతీ దేవి కొలువై ఉంటారు.
శ్రీ గణపతి తూర్పు ముఖంగా చతురస్రాకార కోవెలలో దర్శనమిస్తారు.
ఈ గణపతి ధన ప్రదాత.
పక్కనే శ్రీ శంకరనారాయణ తరువాత శ్రీ రామ ఆలయం ఉంటాయి.
ఈ గర్భాలయ గోడలపైన చిత్రించిన పురాణ గాధల వర్ణ చిత్రాలు అద్భుతంగా ఉంటాయి.
సహజంగా  సతీ,  సోదర మరియు దాసుని తో కలిసి కనపడే శ్రీ రామచంద్రులు ఇక్కడే ఒక్కరే కనపడతారు.
ఇన్ని ఆలయాలున్నా ఒక్క ధ్వజస్తంభం కనపడక పోవడం మరో విశేషం.
అంతరాలయాల దర్శనానికి ఒక పద్దతి ఉన్నది.
శ్రీ వడక్కు నాథర్, అమ్మవారు, గణపతి, శంకర నారాయణ, శ్రీరామ, తిరిగి శ్రీరామ నుండి శంకరనారాయణ, మహాగణపతి, అమ్మవారు, శ్రీ వడక్కు నాథర్.
ఇదే క్రమంలో మూడు సార్లు చేయాలి. (చిత్రం చూడండి )
ఈ క్రమంలో అందరికన్నా ఎక్కువగా శంకర నారాయణను దర్శించుకోవడం జరుగుతుంది.
ఈయనే శ్రీ వడక్కు నాథర్ ఆలయ ఆస్తిపాస్తుల లెక్కలు చూసేది అంటారు.


ఆలయ గజశాలలో ఎందరో భక్తులు కానుకగా సమర్పించుకొన్న గజాలున్నాయి.

పదనాలుగు భువనాలకు అధిపతి అయిన పరమేశ్వరునికి ఇక్కడ ప్రతినిత్యం ఉదయం మూడు గంటల నుండి పది వరకు, తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు ఎన్నో పూజలు జరుగుతాయి.
పౌర్ణమి కి విశేష పూజలు.
అన్ని హిందూ పర్వదినాలలో, స్థానిక పర్వాల సందర్భంగా పండగ వాతావరణం నెలకొంటుంది.
ప్రతి మే నెలలో నిర్వహించే "త్రిసూర్ పూరం" ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తోంది.
దేశమంతటా నెలకొని ఉన్న అనేక శివాలయాలలో శ్రీ వడక్కు నాథర్ ఆలయం అన్ని విషయాలలో ప్రత్యేకమైనది.
ఆలయమంతటా సాష్టాంగ ప్రమాణం చేస్తున్న రూపాలు లెక్కలేనన్ని కనపడతాయి.


సర్వం శివమయం కదా ! 

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...