Vellamassery Garudan Kavu

గరుడన్ కావు ( గరుత్మంతుని ఆలయం ) ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ గరుడన్ కావు". శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి ( గద ), ఆదిశేషువు మరియు గరుత్మంతుడు ముఖ్యమైనవి అని చెప్పుకోవాలి. శంఖం మరియు గద శ్రీహరి హస్త భూషణాలుగా ప్రసిద్ది. స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉన్నది. ఎన్నో ఆలయాలలో సుదర్శన సన్నిధి ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడినది. ఇక ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడే ! సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ది గరుత్మంతుడు. ప్రతి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతా సుతుని మనందరం చూస్తూనే ఉంటాం. కాని అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం "గరుదన్ కావు"లో ఉన్నదే. బహుశా భారత దేశం మొత్తం మీద పక్షి...