నంద నందనుడు కొలువైన నందలూరు
శ్రీ మహా విష్ణువు భూలోకంలో అనేకానేక రూపాలలో, ఎన్నో నామాలతో కోవెలలో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబదుతున్నాడు.
అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ హరి సౌమ్య నాధ స్వామి గా వెలసిన క్షేత్రం నందలూరు.
నందనందనుడు వెలసిన కారణంగా ఈ గ్రామానికి నందలూరు అన్న పెరోచ్చినదని చెబుతారు.
సుందర శిల్పాలతో కళకళలాడే ఆలయం శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా పరిగణించవచ్చును.
పౌరాణిక గాధ :
లోక కంటకుడైన హిరణ్యకశపుని సంహరించిన తరువాత కూడా నరసింహుని ఉగ్రత్వం తగ్గలేదు.
అరణ్యంలో చెంచు వనిత రూపంలో లక్ష్మి దేవి సహచర్యంతో స్వామి సౌమ్యుడైనాడు.
ఆ రూపనికే సౌమ్యనాదుడు అని పేరు.
తొలుత నిరంతరం నారాయణ నామాన్ని జపించే నారద మహర్షి ఇక్కడ ఎన్నో పురాణాలలో పేర్కొన్న బాహుదా ( చెయ్యేరు) నదీ తీరంలో ప్రతిష్టించారని స్థానికంగా ఒక కధనం ప్రచారంలో ఉన్నది.
నారద ప్రతిష్టిత శ్రీ సౌమ్యనాధ స్వామికి దేవతలే ఆలయం నిర్మించారని, కాల గతిలో అది శిధిలం కాగా దాని మీదే ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని అంటారు.
ఆ కధనం నిజమా అన్నట్లుగా ఆలయ స్థంభాలకు మిగిలిన ఆలయాలలో ఉన్నట్లు పైన సింహపు తలలు ఉండకుండా క్రింద ఉంటాయి.
ఆలయ విశేషాలు :
పది ఎకరాల విశాల స్థలంలో చుట్టూ ప్రహరి గోడ, నాలుగు వైపులా గోపురాలతో దుర్భేద్యమైన కోటలా కనపడుతుంది.
పదకొండవ శతబ్దంలో కులోత్తుంగ చోళ రాజు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ఆరంభించారు.
తదనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో కూడా నిర్మాణ ప్రక్రియ కొనసాగింది.
పదిహేడవ శతాబ్దంలో స్థానిక పతి రాజుల కాలంలో పూర్తి అయినట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది.
తూర్పు గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఈశాన్యంలో పుష్కరణి, రాతి స్థంభం, ధ్వజస్తంభం, గరుడా ఆళ్వార్ సన్నిధి, పక్కనే ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి సన్నిది ఉంటాయి.
పూర్తిగా ఎర్ర రాతితో నిర్మించబడిన ఈ ఆలయాన్ని తిరువన్నమలై లో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చిన్న రూపంగా పేర్కొంటారు.
మొత్తం నూట ఎనిమిది స్తంభాలపైన ప్రధాన ఆలయం నిర్మించారు.
స్తంభాల పైన పురాణ ఘట్టాలను, నాటి ప్రజల జీవన శైలిని, చిత్ర విచిత్రమైన జంతువులను, ఆంజనేయ, గరుడ, రూపాలను సుందరంగా జీవం ఉట్టి పడేలా మలచారు.
గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేశ, శ్రీ ఆదిశేష విగ్రహాలను నిలిపారు.
ముఖ మండపం నుండి కొద్దిగా ఎత్తులో వున్నగర్భాలయానికి సోపాన మార్గం ఉన్నది.
ఇరు వైపులా జయ విజయులు ఉంటారు.
మండప ద్వారం వద్ద ఉండగానే శ్రీ సౌమ్యనాధ స్వామి దివ్య రూపం నయన మనోహరంగా దర్శనమిస్తుంది.
అర్ధ మండపం, గర్భలయాలలొ విద్యుత్ దీపాలుండవు.
అయినా కళకళలాడుతూ కనపడతారు స్వామి.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే సూర్య కాంతితో ప్రకాశించుతారు మూల విరాట్టు.
ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి
ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి
కలియుగ వైకుంఠము లో కొలువు తీరిన వేంకటేశ్వరుని ప్రతి రూపంగా ఉండే ఈ ఏడు అడుగుల సుందర స్వామిలో కనపడే తేడా అల్లా అక్కడ వరద హస్తం కాగా ఇక్కడ అభయ హస్తం.
రెండూ భక్తులు భగవంతుని నుండి కోరుకోనేవే కదా !
ఆలయ పైకప్పుకు ఒక పెద్ద చేప చెక్కబడి కనపడుతుంది.
కలియుగంతానికి వచ్చే జల ప్రళయంలో ఇది జీవం పోసుకొని ఈదుకుంటూ వెళుతుంది అన్నది స్థానిక నమ్మకం.
ఆలయంలో తమిళంలో ఎక్కువగా తెలుగులో కొద్దిగా శాసనాలు చెక్కబడి ఉంటాయి.
వివిధ రాజ వంశాల రాజులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు వీటిల్లో రాయబడినాయి.
కాకతీయ ప్రతాప రుద్రుడు గాలి పురం నిర్మించి వంద ఎకరాల మన్యం ఆలయ నిర్వహణకు ఇచ్చినట్లుగాను, సమీపంలోని పొత్తపి ని పాలించిన తిరు వేంగ నాధుని సతీ మణి చనెన రాణి శ్రీ సౌమ్యనాదునికి బంగారు కిరీటం, శంఖు చక్రాలు , మరెన్నో స్వర్ణాభరణాలు సమర్పించుకొన్నట్లుగా శాసనాల ఆధారంగా అవగతమౌతోంది.
అన్నమాచార్య :
వాగ్గేయ కారుడు అన్నమయ్య కొంతకాలం నందలూరులో సౌమ్యనాధుని సేవలో గడిపారని, తన కీర్తనలతో స్వామిని ప్రస్థుతించారని శాసనాలలో పేర్కొనబడినది.
తొమ్మిది ప్రదక్షిణాలు :
ధృడమైన నమ్మకంతో, బలమైన కోరికతో ఓం శ్రీ సౌమ్యనాదయ నమః అంటూ గర్భాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షణలు చేసి మొక్కుకొంటే మనోభీష్టాలు నెరవేరుతాయి అన్న ఒక విశ్వాసం తరతరాల నుండి ఇక్కడ కొనసాగుతూ వస్తోంది.
కోరిక నెరవేరిన వారం రోజులలో వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి అని కూడా అంటారు.
బ్రహ్మోత్సవాలు :
మానస పుత్రుడు నారదుని సహాయంతో విధాత బ్రహ్మ ఆరంభించినందున బ్రహ్మోత్సవాలని పిలుస్తారు.
ప్రతి సంవత్సరం జూలై నెలలో శ్రవణా నక్షత్రం నాడు ఆరంభించి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుతారు.
ఆలయ వెలుపల ఉన్న మరో కోనేరులో తెప్పోత్సవం జరుగుతుంది.
పూజలు :
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో ఎన్నో విధాల నిత్య పూజలు నియమంగా చేస్తారు.
అన్ని పర్వ దినాలలో, అష్టమి, నవమి తిధులలో, ధనుర్మాసంలో విశేష పూజలు భక్తుల కోరిక మేరకు జరుపుతారు.
శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి దేవస్థానం :
శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయానికి వెలుపల ఈ ఆలయం ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి