17, జనవరి 2014, శుక్రవారం

Sri Lakshmi Chenna Keshava Swamy Temple, Markapur


                శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం, మార్కాపూర్

స్థితి కారకుడు, సమస్త లోకాలను కాపాడే వాడు అయిన శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్ధం ఎన్నో అవతారాలు ధరించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. 
అలాంటి వాటిల్లో కేశవ రూపం ఒకటిగా చెబుతారు. 
తనకి ప్రమాదకరంగా భావించిన శ్రీ కృష్ణుని సంహరించడానికి కంసుడు చేసిన అనేకానేక ప్రయత్నాలలో "కేశి"
అశ్వ రూపంలో వచ్చిన కేశిని వధించినందున కృష్ణుని "కేశవుడు " అని అన్నారు. 
సుందర రూపుడైన స్వామి కేశిని హతమార్చి కేశవుడు అయినందున చెన్న కేశవుడు అని కూడా అంటారు. 
కేశిని వధ గురించిన ప్రస్తావన విష్ణు పురాణం, భాగవత పురాణాలలో ఉన్నది. 
భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయాలున్నాయి.  
అందులో ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్దికెక్కినది. 
చరిత్రలో ఒక విశిష్ట స్థానం పొందిన మార్కాపురం పిల్లలు రాసుకొనే పలకల తయారీకి పేరొందిన ఊరు. 

చారిత్రక విశేషాలు :

దక్షిణా పధంలో ఎన్నో ఆలయాలను నిర్మించి, హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించిన విజయనగర పాలకులు 1425 వ సంవత్సరంలో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
తదనంతర పాలకులు, స్థానిక సామంత రాజులు, ఇతర ప్రముఖుల తోడ్పాటుతో ఆలయం నేటి రూపుని సంతరించుకొన్నది. 
సుమారు ఆరు వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. 

ఆలయ విశేషాలు :

ప్రధానంగా చెప్పుకోవలసినది ఆలయ గోపురం గురించి. 
తొమ్మిది  అంతస్తులతో నూట ముఫై అడుగుల ఎత్తు రాజ గోపురం ఊరికి చేరడానికి ముందే కనపడుతూ కనులకు విందు చేస్తుంది. 
శ్రీ కృష్ణ దేవరాయలు ఈ రాజ గోపుర నిర్మాణాన్ని ఆరంభించగా, అలానే ఉండిపోయిన దానిలోని మొదటి రెండు అంతస్తులను శ్రీ వేదేశ్వర రావు అన్న భక్తులు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోను, మిగిలిన భాగాన్ని పంతొమ్మిది వందల ముపై ఆరులో శ్రీ లింగ రాజు అన్నవారు నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
ఆలయ గోడల మీద విజయనగర రాజుల కాలానికి చెందిన కొన్ని శాసనాలు లభించాయి. 
రెండువేల పన్నెండో సంవత్సరంలో ఈ రాజ గోపురాన్నిపూర్తి స్థాయిలో మరమత్తులు చేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
మహా గోపురం దాటిన తరువాత ఒక గరుడ మండపం ఉంటుంది. 
దాటిన తరువాత వచ్చే ద్వారం ప్రధాన ఆలయ ప్రాంగణం లోనికి దారి తీస్తుంది. 



























ప్రదక్షిణా ప్రాంగణంలో మూడువైపుల భక్తులు విశ్రాంతి తీసుకోడానికి మండపాలు నిర్మించారు. 
ఆలయ వాయువ్యంలో శ్రీ రంగనాథ స్వామి వారి ఉపాలయం ఉంటుంది







ఆలయ ఈశాన్యంలో ఉన్న నాట్య మండప స్తంభాలకు అతి సూక్ష్మ చెక్కడాలను సునిశితంగా మలచారు.  






అక్కడే ఉన్న శమీ వృక్షం క్రింద శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చును.








ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారి సన్నిధిని ఉంటుంది.
స్వర్ణాభరణ అలంకారంతో ఉపస్థిత భంగిమలో అమ్మవారు భక్తులకు వరాలను అనుగ్రహిస్తుంటారు.











గర్భాలయంలో వివిధ వర్ణ పుష్పాలంకరనతో స్థానక భంగిమలో శ్రీ చెన్నకేశవ స్వామి వారి దివ్య మంగళ రూపం నేత్ర పర్వంగా దర్శనమిస్తుంది.
గమనించదగిన అంశం ఏమిటంటే ప్రతి విష్ణు ఆలయంలో మూలవిరాట్ కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి దర్శనమిస్తారు.
కానీ మార్కాపుర శ్రీ చెన్న కేశవ స్వామి ఎడమ చేతిలో చక్రాన్ని, కుడి చేతిలో శంఖము పట్టుకొని కనపడతారు.



ధ్వజస్థంభం వద్ద ఉన్న గరుడ మండపానికి వెనుక ఉన్న రంద్రాలనుండి ప్రతి డిసెంబర్ నెల ఇరవై మూడునుండి జనవరి నాలుగో తేదీ వరకు ( ధనుర్మాసంలో ) ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నలభై నిముషాలనుండి ఏడు గంటల వరకు రాజ గోపురం నుండి సూర్య కిరణాలు గరుడ మండపంలో నేల మీద పడి అక్కడి నుండి స్వామి వారి మూలవిరాట్టు పైన ప్రతిబింబిస్తాయి.
ఉదయారుణ కాంతులలో శ్రీ చెన్న కేశవుడు దేదీప్యమానంగా వెలిగి పోతారని చూసిన చెబుతుంటారు.




ప్రతినిత్యం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కొరకు తెరచి వుండే ఆలయంలో నిర్ణయించిన ప్రకారం ఎన్నో రకాల సేవలు జరుగుతాయి.





అన్ని పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, ధనుర్మాస పూజలు, వైకుంట ఏకాదశి ఘనంగా నిర్వహిస్తారు. 
ప్రతి సంవత్సరం మార్చి - ఏప్రిల్ నెలల మద్యలో పది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో లక్షలాది భక్తులు పాల్గొంటారు.  





మార్కాపురానికి దగ్గరలో ఉన్న శ్రీ కపిల గిరి యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం తప్పక దర్శించవలసిన క్షేత్రం.
చిన్న కొండ మీద నిర్మించబడిన ఈ ఆలయం సుందర ప్రకృతి అందాలకు నిలయం.
ప్రశాంతతకు మరో పేరు .












ప్రకాశం జిల్లాలో  ఉన్న మార్కాపురానికి  రాష్ట్ర మంతట నుండి బస్సులు లభిస్తాయి. రైలు సౌకర్యం కూడా కలదు..
అన్ని సదుపాయాలూ అందుబాటు ధరలలో లభిస్తాయి. 
జై చెన్న కేశవ !!!

1 కామెంట్‌:

  1. మా చిన్నతనంలో కొనాళ్ళు మార్కాపురంలో ఉండేవాళ్ళము.అప్పుడు శిథిలమైన గాలిగోపురాన్ని స్థానిక తాసిల్దారు చందాలు వసూలు చేసి మళ్ళీ కట్టించాడు .మాఇంటికి దగ్గరేఉన్న ఆ గుడిలోకి వెళ్ళి ఆడుకొనేవాళ్ళము.ఫొటోలతో సహా జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...