26, జనవరి 2014, ఆదివారం

Radha sapthami

                          వందే సూర్యం నిత్య పూజితం 

వేదకాలంలోనూ తదనంతరం అంటే ద్వాపర యుగం దాక ముల్లోకాలకు అధిపతి అయిన సర్వేశ్వరుడు మానవ రూపంలో ఈ పుడమి మీద నడయాడినట్లుగా మన హిందూ పురాణాల ద్వారా అవగతమౌతున్నది.

ఆ కాలంలో దుష్టుల నుండి రక్షణకు, దైవ సాక్షత్కారంతో మోక్షం పొందేందుకు తమపు, యజ్ఞ యాగాదులే మార్గంగా ముముక్షువులు ఎంచుకోనేవారు తప్ప విగ్రహారాధన లేదని తెలుస్తోంది.

వారు చేసిన మరో ఆరాధనా ప్రక్రియ సూర్య దేవుని  కొలవడం.

పురాణాలలోని ముక్కోటి దేవతలలో ప్రతక్షంగా దర్శనమిచ్చేది దివాకరుదోక్కడే.

సూర్యునికి అర్ఘ్యం సమ ర్పించుకోవడం సాక్షాత్ శ్రీ మన్నారాయనునికి సమర్పించుకొవడంగా భావించేవారు.

సూర్య నమస్కారాలు కూడా ఆ కోవలోనివే.

ప్రతక్ష నారాయణునిగా కీర్తించబడే ప్రచండ తేజోమూర్తి అయిన భాస్కరుడు మానవ జీవితాలలో ఎంతో ముఖ్య భూమికను పోషిస్తున్నారు.

ప్రజాపతులలో మరియు  సప్తరుషులలో ఒకరు అయిన కాశ్యపకుని భార్యలలో ఒకరైన అదితికి జన్మించినవాడే ఆదిత్యుడు.

సూర్యుని హరిహరుల సమానాంశగా పేర్కొంటారు.

ఒకవిధంగా సూర్యుడు శ్రీహరికి అగ్రజుడు.

ఎలా అంటే కృతయుగంలో శ్రీ మహావిష్ణువు, బలిచక్రవర్తి ని శిక్షించడానికి అదితి, కశ్యపులకు వామనునిగా జన్మించారని వామన పురాణం  తెలుపుతోంది కదా !

భానుని, వైకుంఠ వాసుని చతుర్వింశతి రూపాలలో ఒకటిగా పురాణాలు పేర్కొన్నాయి.

అందుకనుగుణంగానే సూర్యుడు కూడా చతుర్భుజునిగా శంకు చక్ర పద్మ అభయ హస్తాలతో  గాయత్రీ , హరితి,   బృహతి, హుష్నిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్ మరియు పంక్తి అనే ఏడు అశ్వాలు పూన్చిన బంగారు రధంలో  దర్శనమిస్తారు.

అదే శ్రీ హరికి  రామావతార కాలంలో రావణునితో తలపడే ముందు విజయం సిద్దించాలని అత్యంత శక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని తొలిసారిగా అగస్త్య మహర్షి ఉపదేశించారు. 
నిత్యం నియమంగా చదివితే జీవితం విజయవంతంగా సాగిపోతుంది. 



రధసారధి అరుణుడు. ఇతను కశ్యపమహర్షి మరో భార్య అయిన వినతకు జన్మించినవాడు. గరుత్మంతుని సోదరుడు.

సూర్యునికి కూడా సోదర సమానుడే. తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే కాబట్టి.

చక్రం లేకుండా చక్రధారి శ్రీ హరిని ఊహించలేము.

ఎందరో లోకకంటకులను సంహరించిన సుదర్శన చక్రం కశ్పాత్మజుని కాంతి నుండి ఉద్భవించినది .

తన కుమార్తె సంధ్యాదేవి సూర్యుని తేజస్సుని తట్టుకోలేక పోవడంతో దేవ శిల్పి విశ్వకర్మ సూర్యుని తెజస్సు నుండి కొంత తీసుకొని సుదర్శన చక్రాన్ని తయారుచేసి శ్రిమన్నారాయనునికి  ఇచ్చారట.

విశ్వకర్మ ఆ చక్రాన్ని త్రిపురాసుర సంహారమప్పుడు కైలాసవాసునికి ఇచ్చారని తరువాత ఆయన చక్రదారికి బహూకరించారని మరో కధనం కూడా ప్రచారంలో ఉన్నది. 

సూర్యుడు కాంతి ప్రదాత. ఆయన కిరణాల ద్వారానే పృధ్వి పచ్చదనంతో పరవశించడమే కాకుండా సమస్త జీవ రాశికి అత్యంత అవసరమైన గాలి, నీరు, ఆహరము మరియు ఇతరములు లభిస్తున్నాయి.

సూర్య కాంతి లేని లోకాన్ని ఊహించలేము.
సూర్య రదానికున్నఏడు అశ్వాలు సప్త వర్ణాలకు లేదా వారంలోని ఏడు రోజులకు నిదర్శనమైతే, రదానికున్న పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు లేదా సంవస్సతరం లోని పన్నెండు నెలలకు ప్రతీకలు.
 సప్తాశ్వరధం మీద రాశి కొక నెల చొప్పున ప్రభావం చూపుతూ తన  లోక పర్యటనను పూర్తి చేయడానికి మూడువందల అరవై అయిదు రోజులు తీసుకుంటారు లోక నాయకుడు.
ఇలా తండ్రి లోకానికి  కాలనిర్ణయం చేస్తుంటే  తనయుడు అయిన వైవస్వత మనువు లోక పాలకునిగా తన భాద్యతను నిర్వర్తిస్తున్నారు.
వైవస్వత మనువు తర్వాత భాద్యతలు స్వీకరించే సవర్ణ మనువు కూడా  సూర్య పుత్రుడే.
ఇక సూర్య దేవుని ఇంకో కుమారుడైన శనిదేవుడు మానవుల జీవితాలపైన తిరుగులేని ప్రభావం చూపే గ్రహముగా భూలోకంలో ఎంతో భయాధరణ సమిస్తిగా పొందినవాడు.
ఈయన అనుగ్రహం కోరి మానవులు ఎన్నో జపాలూ, శాంతులు జరుపుతుంటారు.
మరో కుమారుడైన యముడు జీవుల మరణ కాలాన్ని నిర్ణయించేవాడు.
ఈయనను శాంతింపచేయడానికి ఎన్నో హోమాలు, యజ్ఞాలు, చేయడం ఈయన పాశం బారినుండి తమను తాము  కాపాడుకోడానికి మానవులు పడే పాట్లు లెక్కలేనన్ని.
కశ్యపాత్మజుడు  నవ గ్రహాధిపతి.

నిరంతరం రామ నామాన్ని జపించే వాయునందనుడు ఆదిత్యుని శిష్యుడే !

ప్రపంచ వ్యాప్తంగా సుర్యారాధన ఉన్నది అనటానికి ఆయన కున్న ఆలయాలు మరియు వివిధ దేశాలలో వ్యాప్తిలో ఉన్న అనేక నామాలే సాక్ష్యం. 

మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి. 

అందులో కొన్ని చాలా ప్రాముఖ్యం పొందినవి. 

మొధేరా ( గుజరాత్ ), కోణార్క ( ఒడిస్సా ), అరసవిల్లి ( ఆంధ్ర ప్రదేశ్ ), సూర్యనార్ కోవెల ( తమిళనాడు ), మార్తాండ్ ( జమ్మూ కాశ్మీర్ ), ముల్తాన్ ( పంజాబ్ ) ముఖ్యమైనవిగా పేర్కొన వచ్చును. 

ఇంకా అస్సాం, మధ్య ప్రదేశ్, బెంగాల్, బీహార్ లలో కూడా స్థానికంగా పేరొందిన సూర్య ఆలయాలు ఉన్నాయి. 
మన రాష్ట్రంలో సూర్య దేవాలయం అనగానే అందరికి గుర్తుకొచ్చేది అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారే !
కానీ మన రాష్ట్రంలో మరో నాలుగు పౌరాణిక, చారిత్రక ప్రసిద్ది చెందిన దివాకరుని దేవాలయాలున్నాయి. 
బుదగవి ( అనంత పురం ), నందికొట్కూరు ( కర్నూల్ ), గొల్లల మామిడాడ ( తూర్పు గోదావరి), మరొకటి హైదరాబాద్ లో ఉన్నాయి. 
అదేవిధంగా ఒరిస్సాలో ప్రసిద్ద కోణార్క ఆలయం కాకుండా బరంపురంకి చేరువలో బుగద గ్రామంలో ఉన్న శ్రీ బిరించి నారాయణ స్వామి ఆలయం కూడా ప్రసిద్ది చెందినదే! 
ఈ ఆలయాన్ని చెక్కతో నిర్మించినందున కలప కోణార్క అని పిలుస్తారు. 
అలానే అదే రాష్ట్రంలో భద్రక్ సమీపంలో మరో చరిత్ర ప్రసిద్దికెక్కిన బిరంచి నారాయణ ఆలయం పాలియా గ్రామంలో ఉన్నది. 
ఇండోనేషియా, మలయా, చైనా, జపాన్, ఈజిప్ట్, ఇలా ఎన్నో దేశాలలో ప్రభాతుడు పూజ్యనీయుడు. 
ఈజిప్ట్ లో "రా", జపాన్ లో "అమెతెరాసు", సిరియా లో "ఎరిన్న", గ్రీక్ లో " హిలియోస్  ", "లిజా" అని ఆఫ్రికా ఖండంలో, పర్షియా లో " మిత్రాస్ " అని సూర్యుని పిలుస్తారు. 

అమెతెరాసు



"తై యాంగ్ జింగ్ జున్ ఆక" చైనా  సూర్యుడు 

 హిలియోస్
బుదగవి సూర్య దేవాలయం 


నందికొట్కూరు సూర్య దేవాలయం 

గొల్లల మామిడాడ మూల విరాట్టు 
హైదరాబాద్ సూర్య దేవాలయం 
పూర్వీకులు సూర్య ఆరాధనను ఆధ్యాత్మిక భావనలతోనే కాకుండా లోకాలకు వెలుగును, దాని వలన ఆహారాన్ని పొంది జీవిస్తున్నామన్న పవిత్ర భావనతో పాటు సూర్య కిరణాలలోని అద్భుత శక్తిని గుర్తించి  ఎలా ఆ శక్తిని సుఖమయ జీవితాల కొరకు  ఉపయోగించుకోవాలో కూడా వారు భావి తరాల వారికి తెలిపారు. 
సూర్యకిరణాలు ఏడు రకాలని వేదాలు తెలుపుతున్నాయి. ఒకొక్క కిరణంలో ఒక్కో శక్తి ఉన్నది. 
అవి వరసగా "సుష్మ , సురందన, ఉదన్నవాసు, విశ్వ కర్మ, ఉదవసు, విశ్వ వ్యాక , మరియు హరికేశ"
సుష్మ కిరణాల వలన చంద్రుడు ప్రకాశవంతంగా, ఆహ్లాద పరచే వెన్నెలను కురిపిస్తాడు. 
సురందన కిరణాల నుండే చంద్రుడు ఉద్భవించాడు. 
కుజ గ్రహ దోషాలను, జీవునకు తప్పక కావలసిన ఆరోగ్యము, తెలివితేటలు, ధనాన్ని ప్రసాదించేవి ఉదన్నవాసు అనే కిరణాలు. 
విశ్వ కర్మకిరణాల వలన మనిషికి మానసిక వేదన తొలగిపోయి ధృడత్వం పెంపొంది జీవితంలో అన్నింటా విజయం సాధిస్తాడు. ఈ కిరణాలు భుధ గ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. 
ఉదవసు కిరణాలు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే సామర్ధ్యాన్ని అందిస్తాయి. ఇవి గురు గ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. 
శుక్ర మరియు శని గ్రహాలని ప్రభావితం చేసే  విశ్వ వ్యాక కిరణాలు మానవునికి దీర్ఘాయువును ప్రసాదిస్తాయి. 
ఆఖరిదైన  హరికేశ కిరణాల నుండి ఉద్భవించిన నక్షత్రాలు మానవునికి కావలసిన తేజస్సు, బలం, ధైర్యాన్ని అందిస్తాయి. 
ఈ మహత్యాన్ని గ్రహించిన మునులు మానవులకు సూర్య నమస్కారాలను ప్రసాదించారు. 
సూర్య నమస్కారాల ప్రస్తావన ఋగ్వేదం లో ఉన్నది. 
తొలుత నూట ఎనిమిది గా ఉండే సూర్య నమస్కారాలు నేడు పన్నెండుకు చేరుకొన్నాయి. 
ఒక్కో నమస్కారానికి ఒక్కో మంత్రం ఉన్నది. 
మంత్రం తెలియకున్నా నియమంగా చేస్తే నేటి అదునాతన  జీవన శైలి వలన సంక్రమిస్తున్న అనేక రుగ్మతలను మనం దూరం చేసుకొనే అవకాశాన్ని పొందగలము. 
ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది ఉదయపు నడక యొక్క ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 
సూర్యుడు నమస్కార మరియు ప్రదక్షణ ప్రియుడు. 
ఏదైనా సూర్య దేవాలయంలో లేదా నవగ్రహ మండపంలో కొలువు తీరిన దినకరునికి నియమంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలను పన్నెండు ఆదివారాలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని, మనసులో కోరుకొన్న కోర్కెలు నెరవేరుతాయి అన్నది పెద్దల మాట. 
ఆ రోజులలో మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. 
తన అరుణారుణ కాంతులతో లోకాలను వెలుగుతో నింపే ప్రభాకరుడు మానవునికి కావలసిన వెలుగు, ఆహరం, ఆరోగ్యం, ఆనందం అన్నింటిని ప్రసాదించే వాడు. 
అందుకే శ్రీ సూర్య నారాయణుడు ప్రత్యక్ష దైవమే కాదు ప్రత్యక్ష ధన్వంతరీ రూపం. 
శ్రీ  సూర్య నారాయణుడు నిత్య పూజితుడు. 
జపా కుశుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతమ్ 
తమోరిం సర్వ పాపఘ్నమ్ ప్రణతోస్మి దివాకరం !!! 














 


 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...