శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - మోపిదేవి
ఆది దంపతులైన శివ పార్వతుల ప్రియా పుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన భారతదేశంలోనే కాదు పొరుగు దేశాలైన శ్రీలంక, మలేషియా, సింగపూర్, మారిషస్ మరియు మలేషియాలతో పాటు తమిళ ప్రజలు ఎక్కడ అధిక సంఖ్యలో ఉంటారో అక్కడ తప్పకుండా శ్రీ షణ్ముఖునికి ఒక ఆలయం తప్పకుండా ఉంటుంది.
శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనకు తమిళనాడులో ప్రాధాన్యత కలిగి ఉన్నది. కారణం ఏమిటీ అంటే పురాతన తమిళ గ్రంధాలు తగిన వివరణ ఇస్తున్నాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని వారు "మురుగ(క)" అని సంభోదిస్తారు.ఈ మూడు అక్షరాలు త్రిమూర్తులకు సంకేతం. "ము" అనగా శ్రీ మహావిష్ణువు మరో పేరైన ముకుందుడు అన్నదానికి, "రు" అంటే రుద్రుడు, "క "అంటే కమలాసనుడు బ్రహ్మకు సంకేతాలని పురాతన తమిళ గ్రంధాలు తెలుపుతున్నాయి. మురుగ అంటే స్ఫురద్రూపి, దైవత్వం, యువకుడు, మూర్తీభవించిన మగతనానికి నిదర్శనం అన్న అర్ధాలు ఉన్నాయి అని అంటారు.
స్వామి మరో పేరు షణ్ముఖ లేక ఆర్ముగం అనగా ఆరు ముఖాలు కలిగిన వాడు అని అర్ధం. ఈ ఆరు ముఖాలు పంచేద్రియాలకు మరియు మనస్సుకు సంకేతాలు. వాటి మధ్య ఉండే సత్సంబంధం జ్ఞానసముపార్జనకు మార్గం సుగమం చేస్తుంది. వేలాయుధన్ అనగా వెల్ ని ఆయుధంగా ధరించినవాడు మరియు అజ్ఞానాన్ని తొలగించేవాడు అని కూడా చెబుతారు.
ఇలా స్వామి వారి నామాలకు అనేక ప్రత్యేకతలు మరియు విశేష అర్ధాలు ఉన్నాయి.
అంతే కాకుండా శ్రీ షణ్ముఖుని ఆదేశం మేరకు అగస్త్య మహర్షి పొదిగై పర్వత గుహలో ఉండి సంస్కృతంతో పాటు తమిళ భాషకు అంకురార్పణ చేశారని కూడా ఆ గ్రంధాలు పేర్కొంటున్నాయి.
ఆరుపాడై వీడులుగా ప్రసిద్ధికెక్కిన ఆరు ముఖ్య ఆలయాలతో పాటు మరెన్నో విశేష ఆలయాలు కార్తికేయునికి తమిళనాట ఉన్నాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మన రాష్ట్రంలో కూడా తగు మాత్రంగా ఉన్నది. జిల్లాకొక ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉండటం దానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. వీటిల్లో కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రం అగ్రస్థానంలో ఉన్నది అంటే ఎలాంటి సందేహం లేదు.
స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించారు అని క్షేత్ర గాథ తెలియచేస్తోంది.
క్షేత్ర గాథ
ఒకసారి మహర్షులు పార్వతీపరమేశ్వరుల దర్శనార్ధం కైలాసానికి వెళ్లారట. ఆ సమయంలో అక్కడ అమ్మ వడిలో కూర్చున్న బాల మురుగన్ మునుల గడ్డలు, మీసాలు, సంస్కారంలేని జడలు కట్టిన జుట్టు, వారి వస్త్రధారణ చూసి అపహాస్యం చేస్తూ నవ్వారట.
అమ్మవారు బాలుని వారించి మహర్షుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మహా అపరాధం అన్నారట. తాను చేసినది ఎంతటి తప్పదనమో అర్ధం చేసుకొన్నా పరిహారార్ధం తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారట. తల్లితండ్రుల అనుమతితో కృష్ణాతీరంలో కుమార క్షేత్రం అనువైనదిగా భావించి అక్కడికి వెళ్లి ఒక వాల్మీకంలో కూర్చొని నిరంతర ధ్యానంలో మునిగిపోయారట.
సంవత్సరాలు గడిచిపోయాయి.
మహర్షి అగస్త్యుడు సతీమణి లోపాముద్ర మరియు శిష్యప్రశిష్యులతో అక్కడికి వచ్చారట. ఆయన క్కడికి రావడం వెనుక లోకకల్యాణం కొరకు త్రిమూర్తులు ఆయనను ఆదేశించడం !
ఎందుకంటే ఆయన శిష్యుడైన వింధ్య పర్వత రాజు మిగిలిన పర్వతాలపై ఆధిపత్యం చూపించుకోడానికి తన ఆకారాన్ని విపరీతంగా పెంచేసాడట.
దాని వలన గ్రహ మరియు నక్షత్ర సంచారానికి ఆటంకం ఏర్పడినదట. ముఖ్యంగా లోకానికి వెలుగు చూపే సూర్యచంద్రుల సంచారానికి పూర్తి స్థాయిలో అవరోధం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారట.
ఏర్పడిన పరిస్థితిని సరిదిద్దగలవాడు వింధ్యుని గురువైన అగస్త్య మహర్షి అని నిర్ణయించారట త్రిమూర్తులు. ఆయనను పిలిచి పరమేశ్వరుడు తన శిష్యప్రశిష్యులతో కలిసి దక్షిణ దేశానికి తరలి వెళ్ళమని ఆదేశించారట. అదే సమయంలో ఆయనకు రెండు వరాలను ఇచ్చారట. పార్వతీ దేవితో తనకు జరిగే కల్యాణాన్ని ఆయన ఎన్నడ నుండైనా వీక్షించే అవకాశం తో పాటు ఆయన ప్రతిష్టించే లింగాలకు చిరస్థాయిగా ప్రజల ఆదరణ ఉండేలాగా వరాలను ప్రసాదించారట.
తరలి వచ్చిన గురువుకు వంగి వినమ్రంగా నమస్కరించిన వైద్యుని ఆశీర్వదించి తానూ తిరిగి వచ్చేవరకు ఇదే విధంగా ఉండమని ఆదేశించారట మహర్షి.
అడ్డంకి తొలగిపోవడంతో లోకానికి ఏర్పడిన ఇబ్బంది కూడా తొలగి పోయింది.
అలా దక్షిణ భారత దేశానికి తరలి వచ్చిన మహర్షి తన నిత్య పూజల నిమిత్తం ఎన్నో శివ లింగాలను అనేక ప్రాంతాలలో ప్రతిష్టించారు. అందుకే దక్షిణ భారత దేశంలో అధిక శాతం ఆలయాలలో శ్రీ అగస్తేశ్వర స్వామిగా మహేశ్వరుడు దర్శనమిస్తారు.
ఒకనాడు పవన కృష్ణా తీరానికి విచ్చేసిన మహర్షికి ఈ క్షేత్రంలో అనేక పాము పుట్టలు కనిపించాయట. అందులో ఒకటి దివ్య కాటులతో వెలిగిపోతూ సమీపంలోనికి వెళ్లి వింటే "నమః శివాయ అన్న పంచాక్షరీ మంత్రం వినిపించిందట. అంతే కాకుండా జాతి వైరం లేకుండా పాము ముంగీసలు, మయూరాలు మరియు సర్పాలు స్నేహంగా మెలగడం కనిపించిందట.
దివ్యదృష్టితో వీక్షించిన మహర్షికి జరిగిన సంఘటన తెలిసిపోయింది. కైలాసనాధుని ప్రార్ధించి ఆ వాల్మీకం నుండి వేయి పడగలతో కూడిన శివ లింగాన్ని వెలికి తీసి ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించి కుమార క్షేత్రం అని పేరు పెట్టారట.
నాటి నుండి స్వయంవ్యక్తగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వెలసిన కుమార క్షేత్రం భక్తుల ఆదరణతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది నేటి రూపును సంతరించుకొన్నది.
ఆలయ విశేషాలు
మోపిదేవి గ్రామా నడి బొడ్డున ప్రధాన రహదారి మీద ఉండే ఆలయం ప్రస్తుతం సుందరరూపుతో భక్తులకు సకల సౌకర్యాలతో అభివృద్ధి చెందినది. మూడంతస్థుల రాజగోపురం అనుసంధానిస్తూ ప్రహరీ గోడ ఉంటాయి. అక్కడ శ్రీ వల్లీ దేవసేన సమెత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఉంచారు.
నూతనంగా నిర్మించిన ముఖమండపం వర్ణమయ శిల్పాలతో అలరారుతూ దర్శనమిస్తుంది. గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, ఇరుపక్కలా ప్రత్యేక సన్నిధులలో దేవేరులైన శ్రీ వల్లే మరియు శ్రీ దేవసేనలతో దర్శనం అనుగ్రహిస్తారు.
ఆలయ వెలుపల పెద్ద వృక్షం క్రింద భక్తులు తమకు ఏర్పడని సర్ప దోషం తొలగించుకోడానికి ప్రతిష్టించిన నాగ శిలలు కనిపిస్తాయి. సర్ప దోష నివారణ పూజ కూడా చేయించుకొని అవకాశం భక్తులకు లభిస్తుంది.
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉండే ఆలయంలో నియమంగా నిత్యపూజలు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం పంచహారతులు,చతుర్వేద స్వస్తి జరుపుతారు.
ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున అష్తోత్తర శత కలశ అభిషేక పూర్వక కళ్యాణ మాల (ఆర్జిత సేవ) నిర్వహిస్తారు.
మహా శివరాత్రి, ఉగాది, వినాయక చవితి, దసరా నవ రాత్రులు, నాగుల చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి , స్వామి జన్మ నక్షత్రం ఐన ఆషాడ మాస కృత్తికా నక్షత్రం రోజున పవిత్రోత్సవాలు ఏర్పాటు చేస్తారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘ మాసం చవితి నుండి అష్టమి వరకు ఘనంగా నిర్వహిస్తారు.
స్వర్ణ బిల్వపత్ర అర్చన, నాగ ప్రతిష్టలాంటి ప్రత్యేక ఆర్జిత సేవలు కూడా ఉన్నాయి.
మంగళవారం, ఆదివారం, అమావాస్య, షష్టి రోజులలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సమీపంలో పురాతన ఈశ్వరాలయం కలదు.
కైలాస నాథుడు అక్కడ శ్రీ సకలేశ్వర స్వామి గా పూజింపబడుతున్నారు. శ్రీ వినాయక, శ్రీ పార్వతీ దేవి, శ్రీ ఆంజనేయ స్వామి ఆదిగా గల దేవీ దేవతలు ఉపాలయాలలో కొలువై ఉంటారు. ప్రత్యేక నవగ్రహ మండపం కూడా కలదు.
రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాలలో కూడా ప్రసిద్ధికెక్కిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చేరుకోడానికి అనువైన రహదారి మార్గం విజయవాడ నుండి కలదు. ఫ్రీ పదిహేను నిముషాలకు ఒక బస్సు లభిస్తుంది.
మోపిదేవిలో తగుమాత్రపు సాధారణ వసతి సౌకర్యాలు లభిస్తాయి. సౌకర్యంవంతమైన వసతి విజయవాడ లేక మచిలీపట్నం లలో దొరుకుతుంది.
దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి