13, జనవరి 2024, శనివారం

Sri Bagalamukhi Temple, Chendolu


          వరదాభయప్రదాయని శ్రీ బగళా ముఖి అమ్మవారు 

త్రంత్ర విధానంలో దశ మహా విద్యలు అని ఉన్నాయి. అవి వరుసగా శ్రీ కాళీ దేవి, శ్రీ తారా దేవి, శ్రీ షోడశీ దేవి, శ్రీ భువనేశ్వరీ దేవి, శ్రీ త్రిపుర భైరవీ దేవి, శ్రీ చిన్న మస్తా దేవి, శ్రీ ధూమావతీ దేవి, శ్రీ బగళాముఖీ దేవి, శ్రీ మాతంగీ దేవీ, శ్రీ కమలాత్మికా దేవి. 
ఈ దేవతలను తంత్ర పూర్వక విధానంలో పూజిస్తే సకలాభీష్టాలు నెరవేరతాయని చెబుతారు. 
వీరిలో ఎనిమిదవ విధ్యాధిపతి శ్రీ బగళా ముఖీ దేవి. 
ఈమెనే స్థంభన దేవత, పీతాంబరి అని కూడా పిలుస్తారు. ఈమె భక్తులకు శత్రువుల మీద విజయాన్ని ప్రసాదిస్తారు అని అంటారు. ముఖ్యంగా కోర్టు కచేరీలలో విజయాన్ని ప్రసాదించడమే కాకుండా  వారి  అజ్ఞానాన్నితొలగిస్తారని గ్రంధాలు తెలుపుతున్నాయి. 
 "బగళ" అన్న పదం "వల్గా" అన్న పదం నుండి పుట్టినది అంటారు. వల్గా పదానికి "కట్టు, నిరోధించు,ఆపు చేయు" అన్న అర్ధాలు ఉన్నాయి. అంటే అమ్మవారు భక్తులను కష్టాలను నిరోధించేదానిగా ప్రసిద్ధి. కాలక్రమంలో వల్గా ఉచ్చారణ దోషాల వలన  బగళ గా మారింది అని తెలుస్తోంది. 









పసుపువర్ణ వస్త్రాలు ధరించి శోభించే శ్రీ బగళాముఖీ దేవి భక్తులకు వరదాభయప్రదాయనిగా ప్రసిద్ధి. అమ్మవారు కొలువైన ఆలయాలు చాలా కొద్దిగా ఉన్నాయి. 
అష్టాదశ పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కామాఖ్యాదేవి ఆలయానికి (గౌహతి, అస్సాం)దగ్గరలో ఉన్నది. ఇక్కడ మన దేశంలో మరెక్కడా లేని విధంగా దశ మహా విద్యా దేవతల ఆలయాలు ఉండటం విశేషం. 
మిగిలిన వాటిలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయని తెలియవస్తోంది.  వీటిలో అస్సాంలోని ఆలయం తరువాత హిమాచల్ ప్రదేశ్ లోని బంఖండి లోని ఆలయం ప్రసిద్ధి చెందినవి. మన పొరుగు దేశం అయిన నేపాల్ లో కూడా ఒక శ్రీ 
బగళాముఖీ దేవి ఉన్నట్లుగా తెలుస్తోంది. 
కొలిచిన వారి కొంగు బంగారంగా భావించే శ్రీ బగళాముఖీ దేవి ఆలయం ఒకటి మన రాష్ట్రంలో కూడా ఉండటం, అది కూడా విశేష చరిత్ర కలిగిన ఆలయం కావడం చెప్పుకోవలసిన అంశం. 

చెందోలు 

గతంలో గుంటూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న చందోలు గతంలో వెలనాడు, ధనదపుర గా పిలవబడేది అని శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
చోళ రాజులలో ఒక శాఖగా పేర్కొనబడే వెలనాటి చోడుల రాజధాని గతంలో ధనధపుర గా పిలవబడిన నేటి చందోలు. పన్నెండవ శతాబ్దపు కావ్యాలు ఎన్నో చందోలును కుబేరుని పట్టణమైన అలకాపురితో పోల్చాయి. పాడి పంటలతో, స్వర్ణరాశులతో గొప్పగా ఉండదట. 
అంతకు పూర్వమే అనగా క్రీస్తు పూర్వం నుండి కృష్ణా నది తీరంలోని ఈ ప్రాంతం భౌద్ధులకు నివాసంగా ఉండేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అనేక భౌద్ద స్థూపాలు, ఇతర శిల్పాలు లభించడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవాలి. సమీపంలోని భట్టిప్రోలు లో  నేటికీ క్రీస్తుపూర్వం నాటి బౌద్ధ స్థూపాన్ని చూడవచ్చును. 
ఒకప్పుడు శోభాయమానంగా ఐశ్వర్యవంతంగా ఉండిన చందోలు నేడు ఒక చిన్న ఊరు మాత్రమే !
నాటి రాజుల కాలం నాటి మూడు ఆలయాలు శివాలయం, విష్ణాలయం మరియు బండలమ్మ ఆలయం నాటి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి. 
శివాలయంలో నాటి శాసనాలను చోడవచ్చును. 
శ్రీ బండలమ్మ నే శ్రీ బగళాముఖీ దేవి గా భావిస్తూ పూజిస్తున్నారు. 
చందోలులో అమ్మవారు కొలువు తీరడానికి సంబంధించిన గాథ ఇలా ఉన్నది. 

ఆలయ పూర్వ గాథ 

గతంలో ఈ ప్రాంతం వెలనాటి చోడుల పాలనలో ఉండేదని ముందుగా చెప్పుకొన్నాము కదా ! ఆ కాలంలో స్థానికంగా ఉన్న శ్రీ లింగోద్భవ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకొన్నదట. 
ప్రజల కోరిక మేరకు మహారాజు ఆలయాన్ని పునరుద్ధరించడానికి  నిర్ణయం చేశారట. నిపుణులైన శిల్పులను రప్పించి వారి ద్వారా సమీపం లోని కొండ రాయి ఆలయ నిర్మాణానికి శ్రేష్టమైనదిగా  ఎంపిక చేశారట. 
అక్కడ నుండి రాళ్లను ఎడ్ల బండ్ల మీద చందోలుకు తెస్తున్నప్పుడు ఒక ప్రదేశానికి వచ్చిన తరువాత బండ్లు హఠాత్తుగా ఆగిపోయాయట. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ముందుకు కదిలించలేక పోయారట. 









ఏమి చేయాలో పాలుపోక ఈశ్వర ప్రార్ధన చేశారట. అప్పుడు ఒక సాధువు రాజాస్థానానికి వచ్చి "ఈ క్షేత్రం శ్రీ బగళా ముఖి దేవి వారి నివాసం. ఆమె అనుమతి లేకుండా ఏమీ చేయరాదు. దేవి ఆలయం శిధిలమై భూగర్భంలో కలిసిపోయింది. తిరిగి ఆలయం నిర్మించాలి. దానిలో అమ్మవారిని అందులో అమ్మవారిని పునః ప్రతిష్టించాలి" అని అన్నారట. 
నీటిలో కొట్టుకుపోతున్న వానికి తగిన ఆధారం దొరికినట్లుగా భావించిన రాజు సాధువు నేతృత్వంలో బండి నుండి ఒక రాతిని తీసి అక్కడ ఉంచారట. 
వెంటనే ఎడ్ల బండ్లు అన్నీ ఒక్కసారిగా కదిలాయట. సంతోషించిన మహారాజు సాధువు సలహాతో ఆ ప్రాంతమంతా అన్వేషించారట. అక్కడ ఒక చోట చిన్న గుంటలో నీరు ఉబుకుతోందట. సాధువు మహారాజుతో అక్కడ తవ్వించమన్నారట. తవ్వించగా ఒక కోనేరు, పురాతన శిధిల ఆలయం, అమ్మవారి విగ్రహం  కనపడ్డాయట. 
తన భాగ్యానికి మహదానంద పడిన మహారాజు ఆలయ నిర్మాణానికి కావలసిన ముహూర్త నిర్ణయం చేయమని అభ్యర్ధించారట. తన మహిమ చూపి బండికి ఒక బండరాయి పెట్టిన తరువాత ఎడ్ల బండ్లు కదిలించిన తల్లిని అప్పటి నుండి భక్తులు ప్రేమగా శ్రీ బండ్లమ్మ అని భక్తితో పిలవసాగారు. 
అమ్మవారి మూర్తి లభించిన కోనేరును ఒక బావిగా పునఃనిర్మించి అమ్మవారి అభిషేకాలకు, ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. అప్పట్లో "శ్రీ బండ్లమ్మ జలాశయం" అని పిలిచేవారట. కొంత కాలానికి ఈ బావి భూగర్భంలో కలిసిపోయింది. తిరిగి స్థానిక భక్తులు, రెవిన్యూ శాఖ వారు కలిసి అన్వేషించి వెలికి తీసి నేడు కనపడుతున్నబావిని తిరిగి నిర్మించారు. 
స్థానికులు శ్రీవిద్యోపాసకులుగా ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ఆలయాభివృద్దికి విశేష కృషి చేసారు. వారు అమ్మవారి మహిమలను, భక్తవత్సలతను భక్తులకు అనేకమార్లు ప్రత్యక్షంగా చూపించారట. 
రెండు దశాబ్దాల క్రిందట ఆలయ ముఖమండప నిర్మాణం కొరకు పునాదులు త్రవ్వుతుండగా కొన్ని వందల సంవత్సరాల క్రిందటివిగా పురావస్తు శాఖ నిపుణులు నిర్ధారించారు. వాటిని భద్రపరిచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే తిరునాళ్ల సందర్బంగా అలంకరిస్తున్నారు. 

ఆలయ విశేషాలు 

స్వాగత ద్వారం పైన ఎలాంటి గోపుర నిర్మాణం ఉండదు. కానీ ముఖ మండపం పైన వర్ణమయ అష్టాదశ పీఠాల అధిదేవతలను వర్ణమయ రూపాలలో చక్కగా అమర్చారు. 
గర్భాలయంలో దశ  మహా విద్యలలో ఎనిమిదవ విద్య యొక్క రూపమైన శ్రీ బగళాముఖీ దేవి ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. 
కాపాలమాలాలంకృత ధారిణిగా, మకర కిరీటం ధరించి అసుర వాహనం పై ఆసీనురాలై హస్తాలలో వివిధ ఆయుధాలు, పాన పాత్ర మరియు అభయ హస్తంతో ఉండే రూపం అమ్మవారిది. 
సరిగ్గా అదే రూపంలో ఇరువైపులా సూర్యచంద్రులు, నుదిటిన మూడవ నేత్రంతో, కుడి చెవికి నాగము, కపాలం, ఎడమ చెవికి వృత్తాకారపు కర్ణాభరణం ధరించి, హస్తాలలో ఆయుధాలు, అభయ ముద్రలో ఉన్న శ్రీ బండలమ్మ రూపం శ్రీ బగళాముఖీ దేవి రూపాన్ని పోలిఉండటం విశేషంగా చెప్పుకోవాలి. మరో రెండు విషయాలు ఈ అర్చామూర్తిలో కనపడతాయి. అవి ఏమిటంటే శిఖ జ్వాలా రూపంలో ఉండటం, రెండవది అమ్మవారి ఎడమ భుజంపైన లయకారకుడు లింగ రూపంలో కొలువై ఉండటం. వీటి వలన అమ్మవారు మరింత లోకప్రయోజన శక్తులు కలిగి వరదాభయప్రదాయనిగా కొలువై ఉన్నారని చెబుతారు. 










పూజలు మరియు ఉత్సవాలు 

గత కొన్ని సంవత్సరాలుగా భక్తజన లోకంలో విశేష ఆదరణ పొందుతున్న శ్రీ బగళాముఖీ దేవి ఆలయంలో ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి. 
ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రీ వినాయక చవితి, మహా శివరాత్రి పర్వదినాలను జరుపుతారు. 
ప్రత్యేకంగా వైశాఖ మాసంలో ఆలయ వార్షికోత్సవాలను అయిదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మధ్యలో అష్టమినాడు అమ్మవారి జయంతి సందర్బంగా విశేష పూజలు జరుగుతాయి. 
శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పాడ్యమి నుండి దశమి వరకు ప్రత్యేక అలంకరణలు, పూజలు, హోమాలు నిర్వహిస్తారు. 
ప్రతి అమావాస్యకు సాయంత్రం అయిదు గంటలకు శ్రీ బగళాముఖీ దేవి ప్రత్యేక హోమం జరుగును. 
అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి. ఈ కారణంగా అవివాహిత యువకుల కొరకు ప్రతి శుక్రవారం, ఆడపిల్లల కొరకు మంగళవారం ప్రత్యేక కళ్యాణ పూజలు నిర్వహిస్తున్నారు. 
ఇవన్నీ ఒకఎత్తు అయితే అమ్మవారి దీక్ష మరో ఎత్తు. శ్రావణ మాసంలో కోర్కెలు నెరవేరిన భక్తులు, మొక్కులు మొక్కుకున్న భక్తులు, అభీష్టాలు లేకుండా సంపూర్ణ భక్తి భావంతో దీక్ష తీసుకొనేవారు అంతా భక్తిభావాలతో దీక్ష పూర్తి చేసి అమ్మవారికి ఇక్కడ తమ ఇరుముడులను సమర్పించుకొంటారు. 






ప్రతి నిత్యం ఉదయం ఆరు నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఆలయానికి స్థానిక, పక్క, దూర ప్రాంతాల భక్తులు వస్తుంటారు. 
ఇన్ని విశేషాల సమాహారమైన శ్రీ బగళాముఖీ దేవి ఆలయం తో పాటు పురాతమైన శ్రీ లింగోద్భవ స్వామి ఆలయం, శ్రీ చెన్న కేశవ ఆలయం కూడా  చెందోలు ఉన్నాయి. 
ఇంతటి చారిత్రాత్మక విశేషాల నిలయమైన చెందోలు గుంటూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వసతి సౌకర్యాలు గుంటూరు లేక పొన్నూరులలో లభిస్తాయి. 
రహదారి మార్గంలో సులభంగా చెందోలు చేరుకోవచ్చును. 






ఓం శ్రీ మాత్రే నమః !!!!


   
   
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...