9, జనవరి 2024, మంగళవారం

Sri Subbaraaya Kotturu, Nandyal

                                   శ్రీ సుబ్బరాయ కొత్తూరు 


యావత్ భారతదేశంలో తమిళనాడుతో పోలిస్తే మిగిలిన రాష్ట్రాలలో ఆది దంపతుల ద్వితీయ పుత్రుడు దేవసేనాని అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తక్కువ అని చెప్పుకోవాలి. తమిళనాడులో  శ్రీ కుమారస్వామి కొలువైన ప్రముఖ క్షేత్రాలైన ఆరు పాడై వీడుతో సహా అనేక ఆలయాలు ప్రతి ఒక్క జిల్లాలో కనపడతాయి. అంతే కాదు ప్రతి ఒక్క శైవ క్షేత్రంలో తప్పనిసరిగా ఒక్కటయినా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి కనపడుతుంది. 
సంగమ కాల సాహిత్యంలో కూడా శ్రీ కార్తికేయ ప్రస్తాపన అనేక చోట్ల కనపడుతుంది. ప్రముఖ  కవి శ్రీ అరుణగిరినాధర్ తన ఆరాధ్యదైవం అయిన శ్రీ షణ్ముఖుని కీర్తిస్తూ అనేక వేల కీర్తనలు రచించి గానం చేశారు అని తెలుస్తోంది. 




శ్రీ కార్తికేయ, శ్రీ షణ్ముఖ, శ్రీ ఆర్ముగ, శ్రీ ఆండవర్, శ్రీ దండాయుధ పాణి, శ్రీ వేలాయుధం, శ్రీ స్కంద, శ్రీ మురుగన్ ఇలా ఎన్నో పేర్లతో తమ ఆరాధ్యదైవాన్ని కొలుచుకొంటారు. తమ పిల్లలకు ఆ పేర్లను పెట్టి ప్రేమతో పిలుచుకొంటారు. 
వారికి దేవసేనాని పట్ల ఇంతటి గౌరవాభిమానాలు ఉండటానికి కారణం ఆయన ఆదేశం మేరకే శ్రీ అగస్త్య మహర్షి పొదిగై పర్వతాలలో ఉంది దేవభాష సంస్కృతంతో పాటు తమిళ భాష రూపొందించారన్న నమ్మకమే !
అంతేకాకుండా శ్రీ షణ్ముఖుడు జ్ఞాన ప్రదాత అన్న విశ్వాసం కూడా ప్రధానమైనది. 
తమిళనాడులో అంత కాకున్నా దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రంలో కూడా విశేష శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కనపడతాయి. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వాటిలో అగ్రస్థానంలో ఉన్నది. 
కేరళలో మహేశ్వరుడు, వైకుంఠవాసుడు, శ్రీ భగవతి అమ్మవారి తరువాత శ్రీధర్మశాస్త అధికప్రాధాన్యత కలిగిన దైవం. చాలా కొద్దిచోట్ల శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు కనపడతాయి. 
ఇక మన రాష్ట్రంలో రాహుకేతు పరిహార పూజలు, సర్ప దోషాల నివారణార్ధం, కుజ దోషము  తొలగిపోవడానికి, కళ్యాణానికి, సంతానానికి ఇలా అవసరార్ధం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంటుంది. 











బయటికి తెలియదు కానీ మన రాష్ట్రంలోని ప్రతి  జిల్లాలోనూ ఒక విశేష శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం స్థానికంగా భక్తుల ఆదరణ పొందుతున్నది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 
సింగరాయపాలెం, కృష్ణ జిల్లా, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా, అత్తిలి. పశ్చిమ గోదావరి జిల్లా, ఫజుల్లాబాద్, గోకవరం దగ్గర, తూర్పు గోదావరి జిల్లా, మల్లం, నెల్లూరు జిల్లా, పంపెనోరు, అనంతపురం జిల్లా, చెంగలరాయ కొండా, చిత్తూరు, ఫ్యూల్బాగ్, విజయనగరం, చోడవరం, విశాఖ జిల్లా, నాగుల మడక, ప్రముఖ శ్రీ శనీశ్వర క్షేత్రం పావగడ దగ్గర, అనంతపురం జిల్లా వీటిల్లో కొన్ని. కానీ ప్రథమస్థానంలో ఉన్నది మాత్రం కృష్ణా జిల్లాలోని మోపిదేవి. ఆ తర్వాత స్థానం కర్నూలు జిల్లా లోని శ్రీ సుబ్బరాయ కొత్తూరు అని ఘంటాపధంగా చెప్పవచ్చును. 
ముఖ్యంగా ఆదివారాలు, మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి అంటే అతిశయోక్తి లేదు. 
ముఖ్యంగా నంద్యాల పట్టణానికి సమీపంలోని శ్రీ సుబ్బరాయ కొత్తూరు (ఎస్.కొత్తూరు) మాత్రం అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నది. 






ఆలయ పురాణ గాథ 

ఈ క్షేత్రగాథ సుమారు అయిదువందల సంవత్సరాలనాటిదిగా తెలుస్తోంది. 
గతంలో ఈ గ్రాంలో శ్రీ బీరం చెన్నా రెడ్డి అనే పేద రైతు ఉండేవారట. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పడలేదట. తనకు కనిపించిన ఒక సాధువును పరిష్కారం తెలుపమని ప్రార్ధించారట రెడ్డి. 
మాఘ శుద్ధ షష్టి నాడు ఒక శుభ సమయాన పొలాన్ని అరకతో దున్నితే పంటలు చక్కగా పండి కష్టాలు తొలగిపోతాయని సాధువు తెలిపారట. 
వరద నీటిలో కొట్టుకొనిపోతున్న వారు చిన్న గడ్డి పరక దొరికినా వదలరు అన్నది తెలిసిన సామెత కదా ! సాధువు మాటలను సంపూర్ణంగా విశ్వసించిన చెన్నా రెడ్డి   నిర్ణయించిన ముహూర్తానికి పొలం దున్నడానికి సిద్దపడగా కొద్దిగా ముందుకు వెళ్లిన అరక ఆగి పోయిందట. 
ఎన్ని ప్రయత్నాలు చేసినా అరక కదల లేదట. 
చెన్నా రెడ్డి దిక్కు తోచక తన కులదైవమైన పరమేశ్వరుని ప్రార్ధించారట. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసి ఆ వెలుగులో ద్వాదశ పడగల పెద్ద సర్పం దర్శనమిచ్చినదట. ఆ కాంతికి రెడ్డి దృష్టిని కోల్పోయాడట. 
మెరుపు శబ్దానికి తరలివచ్చిన గ్రామస్థులు అతి కష్టంగా అరకను వెలుపలికి తీయగా దానితో పాటు పన్నెండు పడగల  నాగేంద్రుని విగ్రహం వచ్చిందట. గ్రామస్థులు నిర్ఘాంతపోయి స్తోత్రప్రార్ధనలు చేయనారంభించారట. 
ఆ పరిస్థితులలో అక్కడికి పూర్వం ఏ సాధువు చెన్నా రెడ్డికి పొలం దున్నడానికి ముహర్తం పెట్టారో ఆయన వచ్చారట. 
తరుణోపాయం చెప్పమని అర్ధించిన గ్రామస్థులకు ఊరట కలిగిస్తూ " మూడు రోజులపాటు నాగేంద్ర స్వామి విగ్రహానికి నిరంతరం పాలాభిషేకం చేయండి. చెన్నా రెడ్డికి దృష్టి వస్తుంది. తరువాత సాయం సంధ్యా సమయంలో మొదలుపెట్టి తొలి కోడి కూడా కూసే లోపల ఆలయం నిర్మించండి. గ్రామానికి మంచి రోజులు వస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంవ్యక్తగా వెలిసిన ఊరు శ్రీ సుబ్బరాయ కొత్తూరుగా ప్రసిద్ధి చెందుతుంది "అని సెలవిచ్చారట. 
మూడురోజుల అఖండ క్షీరాభిషేకం తరువాత చెన్నా రెడ్డికి పోయినా చూపు తిరిగి వచ్చిందట. ఇనుమడించిన భక్తి శ్రద్దలతో విగ్రహం మధ్యలో ఉంచి ఆలయ నిర్మాణం ప్రారంభించారట. 
తొలి కోడి కూసే వేళకు ప్రహరీ గోడలు మాత్రమే సిద్దమయ్యాయట. అలా గోపురం లేకుండానే ఉంటుందీ ఆలయం. పైకప్పు నిర్మిస్తే ఏడుగురు బాలి అవుతారని స్వామి చెప్పారని విశ్వసిస్తారు. 
అనంతర కాలంలో ఆలయ ప్రాముఖ్యం తెలియడంతో అభివృద్ధి చెంది ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 

ఆలయ విశేషాలు 

 తూర్పున చిన్న రాజగోపురం నిర్మించారు. 
ప్రాంగణంలో వేప చెట్టు క్రింద ఎన్నో నాగశిల్పాలు భక్తులు ప్రతిష్టించినవి కనిపిస్తాయి. గోపురం లేని గర్భాలయంలో ద్వాదశ శిరస్సుల నాగ రూపంలో శ్రీ సుబ్బారాయుడు దర్శనమిస్తారు. నిరంతర అభిషేకాల కారణంగా మూర్తి చెదరకుండా ఉండటానికి ప్రస్తుతం కవచం కప్పి ఉంచ్గుతున్నారు. 
ప్రాంగణంలో లింగరాజు, లోకమాత శ్రీ పార్వతీదేవి సన్నిధులు కనిపిస్తాయి. 
కేశఖండన శాల, స్నానాలకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. 
ఆలయ ఆధ్వర్యంలో భక్తులకు నిత్యం ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 

ఆదివారం పూర్తి శలవు 

ఆదివారం శాలవే  కదా అంటారా !
సుబ్బరాయ కొత్తూరులో అన్నిటికీ పూర్తి శలవు. 
ఇలాంటి సంప్రదాయం మరెక్కడా చూడము. 
ఆదివారాలు మద్యమాంసాలకు పూర్తిగా శెలవు సుబ్బరాయ కొత్తూరులో. అసలు గ్రామంలో మాంస విక్రయశాల లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. విడి రోజులలో మాంసం కావాలంటే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం గ్రామానికి వెళ్ళవలసినదే !అలా వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ అని అంటారు. 
అదే విధంగా శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో గ్రామస్తులంతా పూర్తిగా శాఖాహారులుగా ఉంటారు. వీరి ముఖ్యమైన కర్రి పండుగ నాడు మాంసాహారం తినడం ఒక సంప్రదాయం. ఒకవేళ ఆ పండగ ఆదివారం వస్తే మాంసాహారం లేదన్నట్టే !
అనగా ఆది వారాలు,  మూడు మాసాలు అన్నీ కలిపితే సుమారు నాలుగున్నర నెలలు వీరు అసలు మాంసాహారం జోలికే పోరు అంటే నిజంగా వీరికి ఆ స్వామి పట్ల గల భక్తి విశ్వాసాలకు వందనం చేయవలసినదే!
ఒకవేళ శనివారం రాత్రి లేక ఆదివారం గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి పార్ధీవ శరీర దహనం సోమవారం చేస్తారు. ఎందుకంటే ఆదివారం సుబ్బరాస్వామి దర్శనార్ధం వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలుగకూడదు అన్న ఆలోచనతో!







సమస్త సమస్యలను తొలగించే సుబ్బారాయుడు 

శ్రీ సుబ్బరాయ స్వామి అన్ని సమస్యలను తొలిగించేవానిగా భక్తులు విశ్వసిస్తారు. 
ముఖ్యంగా వివాహం కాని వారు, సంతానం లేనివారు ఈ క్షేత్రానికి వస్తుంటారు. భక్తితో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి, నువ్వుల చిమ్మిరి, వడపప్పు నివేదన చేసి, అభిషేకం చేయించుకొని, తమ అభీష్టాలు స్వామికి విన్నవించుకొని వెళతారు. 
తమ కోరిక నెరవేరిన తరువాత కొత్త దంపతులైతే స్వామి వారి దర్శనానికి వచ్చి ముక్కు చెల్లించుకొంటారు. సంతానం పొందిన వారు పిల్లల పుట్టు  వెంట్రుకలు,చెవులు కుట్టించడం  లాంటివి ఇక్కడే జరుపుకొంటారు. 
మంగళ మరియు ఆదివారాలలో భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది. సుమారు పదివేలకు పైగా భక్తులు మన రాష్ట్రం నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు. ఒక్క ఆదివారం మూడువందల నుండి అయిదు వందల అభిషేకాలు స్వామివారికి జరుగుతాయి అంటే ఎంత మంది భక్తులు వస్తారో ఊహించుకోవచ్చును. 
శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి, పంచమి, శివరాత్రి, దసరా నవరాత్రులు విశేషంగా జరుపుతారు. 
 ఆఁధ్రప్రదేశ్ లోని శ్రీ సుబ్రహ్మణ్య క్షేతాలలో ప్రత్యేకత కలిగిన సుబ్బరాయ కొత్తూరు ప్రస్తుత నంద్యాల జిల్లాలో , నంద్యాలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
నంద్యాల, పాణ్యం, కర్నూల్ మరియు బనగానపల్లి నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. 

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః !!!!!   

 
 


 













































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...