విశిష్ట వైష్ణవ దివ్య దేశం కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల
నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో అగ్రస్థానం శ్రీ రంగనాధుడు కొలువైన శ్రీరంగానిది. క్షేత్రానికి ఇరుపక్కలా పావన కావేరి నది పూలదండలా కొల్లిడం మరియు కావేరి పేర్లతో ప్రవహిస్తుంటుంది.
అదే విధిగా పురాణ కాలంలో త్రిలోక పూజ్యులైన ఆదిదంపతులు కొలువైన మదురై పట్టణాన్ని కూడా "వైగై నది"పూల హారం మాదిరిగా ప్రవహించేదట. కాలక్రమంలో ఒక పాయ దాదాపుగా అంతరించి పోయిందట.
ఆ రోజులలో నదిని "కిరత మాలై" అని పిలిచేవారట. పవిత్ర నదీ ప్రవాహం వలన ఆ ప్రాంతమంతా పచ్చని పొలాలతో ముఖ్యంగా అరటి తోటలతో నిండి ఉండేదట. రమణీయ వాతావరణం నెలకొని ఉండేదని పురాతన తమిళ కావ్యాల ఆధారంగా తెలియవస్తోంది.
ఆ అరటి వనాల మధ్య శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల నెలకొని ఉండేదట. ప్రస్తుతం ఎత్తైన భవనాలతో నిండి పోయిన నగరం మధ్యలో ఉన్నది.
అళగర్ పెరుమాళ్ పేరుతొ మదురైలో రెండు ఆలయాలలో పరమాత్మ కొలువై ఉంటారు. మొదటిది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరిన ఆరుపాడై వీడులలో ఒకటైన "పళ మదురై చోళై"పర్వత పాదాల వద్ద నెలకొని ఉన్నది. నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండవది నగరంలోనే కలదు. రెండు చోట్ల స్వామిని " శ్రీ సుందర రాజ పెరుమాళ్" అనే పిలుస్తారు. రెండు ఆలయాలను అళగర్ పెరుమాళ్ కోవెల అనే పిలుస్తారు. కానీ ప్రస్తుతం నగరంలో గతంలో నదుల కూడలిలో ఉన్నందున "కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల " అని పిలుస్తారు.
దివ్య దేశాలలో అరుదైన ప్రత్యేకతలను కలిగిన ఆలయం కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల.
లభిస్తున్న పురాతన గ్రంధాల ఆధారంగా కలి యుగంలోనే కాదు శ్రీ సుందర రాజ పెరుమాళ్ గత మూడు యుగాలలో కూడా ఇక్కడ కొలువై ఉన్నారని తెలుస్తోంది.
శిలప్పాధికారం సహా అనేక పురాతన తమిళ గ్రంధాలలో కూడల్ అళగర్ పెరుమాళ్ ప్రస్థాపన ఉండటం ఈ సందర్బంగా ప్రస్తావించాలి.
ఆలయ పురాణ గాధ
బ్రహ్మ మానస పుత్రులైన సనక సనంద నాదులు శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాలను ఆశించారట. తండ్రి ఆదేశాల ప్రకారం భూలోకానికి వచ్చారట. పరంధాముని దర్శనానికి చేయదలచిన తపస్సుకు కిరత మాలై నదీతీరం అనువైనదిగా తోచింది వారికి. కదళీ వనంలో వారు చేసిన తీవ్రమైన తపస్సుకు సంతుష్టులైన వైకుంఠ వాసుడు సాక్షాత్కరించారట.
ఆయన దర్శనంతో పులకితులైన బ్రహ్మ మానస పుత్రులు స్తోత్ర పాఠాలతో స్తుతించి భావి తరలవారిని అనుగ్రహించడానికి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోమని అర్ధించారట.
అలా శ్శ్రీ సుందర రాజ పెరుమాళ్ కృత యుగంలో ఇక్కడ కొలువుతీరారు.
సనక సనందనాదుల కోరిక మేరకు దేవశిల్పి విశ్వ కర్మ అద్భుతమైన అష్టాంగ విమానంతో ఆలయాన్ని నిర్మించారు అని చెబుతారు.
అష్టాంగ విమానం కలిగిన ఆలయాలు చాలా కొద్ది. ఇందులో గర్భాలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. క్రింద పెరుమాళ్ ఉపస్థితి భంగిమలో, మధ్యలో స్థానిక భంగిమలో , పై భాగాన శయన భంగిమలో దర్శనం అనుగ్రహిస్తారు. అష్టాంగ విమానం కలిగిన శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ కొలువైన తిరుగోష్ఠియూర్(మదురై దగ్గర), శ్రీ వైకుంఠ పెరుమాళ్ కోవెల, కంచి దివ్య దేశాలలో ఉన్నాయి. శ్రీ రాజ గోపాల స్వామి ఆలయం, మన్నార్ కోయిల్, శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయం, చేరమహాదేవి కూడా అష్టాంగ విమానం కలిగి ఉన్నా దివ్యదేశాల జాబితాలో లేవు.
మూడు అంతస్తులుగా ఉన్నా ఆలయ నీడ ఏ సమయంలోనూ పడక పోవడం నాటి నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
త్రేతాయుగంలో భృగు చక్రవర్తి, అంబరీష చక్రవర్తి శ్రీ సుందర రాజ పెరుమాళ్ ని సేవించుకొన్నారని ఆలయాభివృద్దికి కృషి చేశారని తెలుస్తోంది. ద్వాపర యుగంలో పురూరవ చక్రవర్తి, ఆయన కుమారుడు ఇంద్రదుమ్యుడు, మనుమడు మలయ ధ్వజ పాండ్యుడు కూడా భక్తి ప్రపత్తులతో శ్రీ సుందర రాజ పెరుమాళ్ ని సేవించుకొన్నారని తెలుస్తోంది.
ఈ విధంగా కలియుగంలో కలిపి పెరుమాళ్ అన్ని యుగాలలోనూ భక్తుల సేవలు అందుకొంటూ వారిని ఆదుకొనేవారని తెలుస్తోంది.
పాండ్య రాజుల చిహ్నం
పాండ్య రాజుల రాజ చిహ్నం మత్స్యం. అది కొన్ని చోట్ల ఒకటిగా మరికొన్ని చోట్ల రెండుగా కనపడుతుంది. దానికి సంబందించిన గాధలు ఇలా ఉన్నాయి.
సత్య వ్రత పాండ్య రాజు ఒకనాడు కిరత మాలై నదిలో ప్రత్యక్ష నారాయణునికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిటి లోనికి చిన్న చేపపిల్ల వచ్చి క్షణాలలో అదృశ్యమైనదట. విష్ణు భక్తుడైన పాండ్యుడు మనకి మహావిష్ణువు తొలి అవతారమైన మత్స్యం కనిపించడం శుభశకునంగా భావించి రాజ చిహ్నంగా ఏర్పాటు చేసుకున్నాడట. అనంతర కాలంలో లోకేశ్వరి పాండ్య వంశంలో మీనాక్షి ( మీనం అన్నా కూడా మత్స్యమే కదా)దేవిగా జన్మించినది. ఆమె మీద అనురాగంతో తండ్రి రెండు చేపలను రాజ చిహ్నంలో ఉంచడం మొదలుపెట్టారు అన్నది కొందరి అభిప్రాయం.
పెరియాళ్వార్ ఉదంతం
శ్రీ సుందర రాజ పెరుమాళ్ భక్తవత్సలత పెరియాళ్వార్ ఉదంతంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది.
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. పూర్వ నామం విష్ణు చిత్తుడు. నివాసం శ్రీవిల్లి పుత్తూరు. భూదేవి అవతారంగా పేర్కొనే శ్రీ ఆండాళ్ కు పెంపుడు తండ్రి. సకల శాస్త్రాలను అభ్యసించారు. నిరంతరం విష్ణు నామం జపిస్తూ, శ్రీ వటపత్రసాయి సేవలో నిమగ్నమై ఉండేవారు.
మదురైని పాలించే వల్లభ దేవ పాండ్య రాజుకు మోక్షం పొందడానికి ఉచితమైన మార్గం ఏది అన్న సందేహం తలెత్తినదిట. ఎందరో పండితులు ఎన్నో చెప్పారట. కానీ రాజుకు సంతృప్తి కలగలేదట
తన సందేహం తీర్చి మార్గోపదేశం చేసినవారికి నిలువెత్తు ధనం బహూకరిస్తానని చాటింపు వేయించారట. నాటి రాత్రి శ్రీ వటపత్రశాయి పెరియాళ్వార్ కి స్వప్నంలో కనిపించి ఆయనను రాజ సభకు వెళ్లి మహారాజు సందేహం తీర్చమని ఆఙ్ఞాపించారట. ఇష్టదైవం ఆజ్ఞను తలదాల్చి మదురై వెళ్లిన పెరియాళ్వార్ పాండ్యరాజు సందేహం తీర్చి శ్రీ హరి నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని సవివరంగా తెలియచేసి ఆయన నుండి యెనలేని కానుకలను స్వీకరించారట. అంతటితో తృప్తి చెందని రాజు పెరియాళ్వారును పట్టపుటేనుఁగు మీద కూర్చోపెట్టి తాను వినయంగా ముందు నడుస్తూ నగర వీధులలో ఊరేగించసాగారట.
తన ప్రియా భక్తుడు అందుకొంటున్న సత్కారాన్ని వీక్షిద్దామని గరుడ వాహనం మీద శ్రీదేవి, భూదేవిలతో కలిసి శ్రీమన్నారాయణుడు మదురై గగనతలానికి విచ్చేశారట.
అత్యంత సుందరుడు, మనోహరరూపి ప్రజల మనోభీష్టాలను తీర్చేవాడైన శ్రీ లక్ష్మీపతిని కనుల ఎదుట చూసిన పెరియాళ్వారుకు అంతులేని ఆనందంతో పాటు యెనలేని బాధ కూడా కలిగిందట. కారణం ఏమిటంటే ఊరేగింపులో పాల్గొంటున్న వేలాదిమంది చూపులు నీలమేఘ శ్యాముని మీద పడితే స్వామికి దృష్టి దోషం తగులుతుందేమోనని భయపడి పన్నెండు పాశురాలు సంకలమైన "తిరు పల్లాండు"( దీర్ఘాయుష్మాన్ భవ / స్వామి నీవు కలకాలం వర్ధిల్లాలి)గానం చేశారట.
పన్నెండు మంది ఆళ్వార్ భక్తులు గానం చేసిన నాలుగువేల పాశురాలలో ప్రత్యేకమైనవి తిరు పల్లాండు.
మహారాజు ఇచ్చిన ధనంతో శ్రీవిల్లి పుత్తూరు ఆలయంతో పాటు కూడల్ అళగర్ పెరుమాళ్ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేశారు పెరియాళ్వార్. అది వేరే కధ.
భక్తుని రాజు వద్దకు పంపి, విజేతను చేసి, సన్మానం జరిపించి తానూ చూడటానికి వచ్చి భక్తుని చేత చక్కని పాశురాలు పాడించిన స్వామివారి లీల ఎంత గొప్పది.
అనంతర కాలంలో శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మానవల మహాముని ఆదిగా గల శ్రీ వైష్ణవ గురువులు శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ ను సేవించుకొన్నారు.
ఆలయ విశేషాలు
సుమారు మూడు ఎకరాల స్థలంలో తూర్పుముఖంగా ఉంటుంది ఆలయం. క్రింది భాగంలో శ్రీ సుందర రాజ పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో ఇరుపక్కలా దేవేరులతో నయన మనోహర సుందర అలంకరణలోదర్శనమిస్తారు.
రెండవ అంతస్థులో స్వామి శ్రీ సూర్యనారాయణ మూర్తిగా దేవేరులతో కలిసి స్థానిక భంగిమలో కొలువై ఉంటారు. ఈ గర్భాలయంలో ప్రధాన అర్చనా మూర్తులతో పాటుగా సహజ వర్ణాలతో తీర్చిదిద్దిన చిత్రాలు నేత్రపర్వంగా కనపడతాయి.
పై అంతస్థులో సహజ వర్ణాలతో తీర్చిదిద్దిన శ్రీ క్షీరాబ్దినాథర్ శయన భంగిమలో దర్శనమిస్తారు.
ఆలయ అంతర భాగంలో దశావతారాలను రమణీయంగా చిత్రీకరించారు.
క్షేత్ర తాయారు శ్రీ మధుర వల్లి తాయారు విడిగా సన్నిధిలో కొలువై దర్శనమిస్తారు. ఇక్కడ అరుదైన సంగీత స్తంభాలుంటాయి. శ్రీ ఆండాళ్ కూడా మరొక సన్నిధిలో ఉంటారు.
ఉపాలయాలలో శ్రీ నారసింహ, శ్రీ రామ, శ్రీ కృష్ణ, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ ఆంజనేయ, శ్రీ గరుడ, శ్రీ రామానుజాచార్య, శ్రీ వేదాంత దేశిక, శ్రీ మానవల ముని, ఆళ్వార్లు కొలువై ఉంటారు.
గరుడ గర్వభంగం
ముల్లోకాలలో తానే అమిత బలశాలినని, నిత్యం పరంధాముని సేవలో గడిపే తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వాతిశయాలతో విర్రవీగసాగాడు గరుత్మంతుడు. గ్రహించిన గదాధరుడు అతనిని హనుమంతుని వద్దకు పంపారు. జరిగిన పోరులో చిత్తుగా ఓడిపోయిన వినతాసుతుడు అంజనా తనయుని శరణు కోరాడు. ఆ సన్నివేశాన్ని సూచించే పంచలోహ విగ్రహం శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెలలో కనిపిస్తుంది. తన ముందు మోకాళ్ళ మీద మోకరిల్లిన గరుత్మంతుని ఓదారుస్తున్న శ్రీ ఆంజనేయుని విగ్రహం అత్యంత అరుదైనది. విగ్రహంలో కనిపించే జీవకళ గొప్పగా ఉంటుంది. తప్పనిసరిగా చూడవలసినది.
ఈ ఉదంతంతో ముడిపడి ఉన్న ఒక విశేష ఆలయం నెల్లూరు జిల్లాలోని "మన్నార్ పోలూరు "లో ఉన్నది.
నవ గ్రహ మండపం
మానవ జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఇంతని చెప్పలేము. జాతకరీత్యా ఇబ్బందులు పడుతున్నవారు నవగ్రహ పూజలు మరియు మహేశ్వరునికి అభిషేకాలు చేయించుకొంటుంటారు.
ఈ కారణంగా ప్రతి శివాలయంలో నవగ్రహ మండపం తప్పనిసరిగా నెలకొని ఉంటుంది. నవగ్రహాలకు అధిపతి కైలాసనాథుడు అంటారు. అందుకే విష్ణు ఆలయాలలో నవగ్రహ మండపం ఉండదు. చిత్రంగా శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెలలో నవగ్రహ మండపం ఉంటుంది. ఇలా నవగ్రహ మండపం ఉండే మరో దివ్య దేశం తూత్తుకుడి జిల్లాలోని శ్రీ మాయాకూతన్ ఆలయం, పేరుంకుళం. ఇది శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలలో శని స్థానంగా ప్రసిద్ధి.
శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెలలో కనిపించే విశేషం ఈ నవగ్రహ మండపం.
పూజలు - ఉత్సవాలు
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో రోజుకు ఆరు పూజలు నియమంగాజరుగుతాయి.
వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, జన్మాష్టమి, నృసింహ, వామన, పరశురామ జయంతులు, హనుమజ్జయంతి విశేషంగా జరుపుతారు. స్థానిక పర్వదినాలలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.
వైశాఖ మాసంలో పదహారు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆఖరి రోజున నిర్వహించే రధోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
ఇలా అరుదైన ప్రత్యేకతలు కలిగిన శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల, శ్రీ మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి, రైల్వే స్టేషన్ కు చాలా సమీపంలో ఉన్నది.
చక్కని భోజన వసతి సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి