24, అక్టోబర్ 2022, సోమవారం

                    మానవత్వం మరిచిపోతున్న మనుషులు 

"సోగ్గాడే చిన్ని నాయన " అంటూ బొంగురు గొంతు వినపడగానే పిల్లలమంతా పరిగెత్తేవాళ్ళము. చినిగిపోయిన గళ్ళ లుంగీ, మాసిపోయి ఏ రంగో చెప్పడం కష్టమయ్యే జుబ్బా తో మేడలో ఒక సంచి ధరించిన సాయుబు పై పాట పాడుతుంటే వెనక కాళ్ళ మీద నిలబడి తలా, ముందు చేతులను కదిలిస్తూ ఎగిరే ఎలుగుబంటిని చూడటమే పది సంవత్సరాల వయస్సు లోపల ఉన్నమాకు  ప్రధాన ఆసక్తి. 
దీని తరువాత కోతులను ఆడించేవారు కూడా వచ్చేవారు. మధ్యమధ్యలో గోసాయి ముఠాల వారు తెచ్చే ఏనుగు అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ మాకు. 
ముక్కుల్లో వేసిన ఇనుప కళ్లెం పెట్టే ఇబ్బందిని, మూతికి కట్టిన ఇనుపవల భాధను భరిస్తూ ఆ మూగ ప్రాణి నృత్యం చేస్తోంది అన్న ఆలోచన  మాకు ఆ వయస్సులో కలిగేది కాదు. కోతులను ఆడించేవాడి చేతిలోని  కర్రను చూసిన భయంతో అవి చెప్పినట్లు చేస్తున్నాయి అన్న స్పృహ మాకు ఉండేది కాదు. కాళ్లకు కట్టిన బరువైన ఇనుప గొలుసుల వలన కలిగిన గాయాల నొప్పిని సహిస్తూ, రోజుకు పదుల సంఖ్యలో కిలోమీటర్ల నడుస్తుంటాయి ఏనుగులు అన్న విషయం తెలిసేది  కాదు. 
ఆ వయస్సులో అడవి జంతువులను దగ్గర నుండి చూస్తున్నాము అన్న ఆనందం తప్ప మరొకటి మా పసి మనస్సులలో తలెత్తేది కాదు. మాకే కాదు మా పెద్ద వాళ్లకు కూడా ! ధాన్యం, అన్నం,  పచ్చడో, డబ్బులో ఇచ్చేవారు. 
ఇదంతా 1970 సంవత్సరాల కాలంలో గుంటూరులో మా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు. 
బలపడిన వన్య మృగ సంరక్షణ చట్టాలు, వన్యప్రాణి ప్రేమికుల పోరాటం వలన పైవన్నీ క్రమేపీ కనుమరుగయ్యాయి. కానీ కొన్ని మాత్రం ఇంకా కనపడుతున్నాయి. అవే చిలక జోశ్యం మరియు పావురాల పందేలు. 
వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే రామ చిలక పట్టుపడి చిన్న పంజరంలో ఉంటూ తన భవిష్యత్తు ఏమిటో తెలియక బాధ పడుతూ  మన భవిష్యత్తును చెబుతుంది అంటే నమ్మడం మనలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలకు నిదర్శనం. లోపించిన ఆత్మ విశ్వాసానికి మరో రూపం. 
మండుటెండలో మనం నడవడానికే భయపడతాము. కానీ ఆ చిన్ని పావురం నిప్పులు చెరిగే సూర్య తాపంలో ఉదయం నుండి సాయంత్రం దాకా  ఎక్కడా వాలకుండా ఎగరాలి. నీరు తిండి లేకుండా అన్ని గంటలు నిండు వేసవిలో ఎగిరి తిన్నగా యజమాని ఇంటి ముందు వాలితే అప్పుడు గెలిచినట్లు ! ఎవరు విజేత ? కపోతామా ? కాదు. దాని యజమాని. 
మానవుడు ఎంత కర్కోటకుడు !
తాను బుద్ది జీవి అన్న ఒక్క కారణంతో తన కన్నా ముందు నుండి ఉన్న జంతువుల, పక్షుల, అన్నింటికీ మించి తాను జీవించడానికి కావలసిన ప్రాణ వాయువును అందించే చెట్ల, దాహార్తిని తీర్చే నదుల, బ్రతకడానికి అవసరమైన ఆహారాన్ని ఆపండించుకోడానికి అవసరమైన భూమి పట్ల ఇంతటి కాఠిన్యాన్ని ఎలా చూపగలుగుతున్నాడు ?
తాను నాటిన మొక్క తన తరువాత కూడా ఉంటుంది తన వారికి కూడా రక్షణగా ఉంటుంది అన్న విషయాన్నీ ఎందుకు గ్రహించడం లేదు ?
తాను నిల్వచేసిన నీరు ముందు తరాలవారికి జీవ జలం అవుతుంది అన్న కఠోర వాస్తవాన్ని ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నాడు ?
తాను పరిరక్షించిన భూమి భావి తరాల వారికెందరికో అన్నపూర్ణ అవుతుందన్న నగ్న సత్యాన్ని ఎందుకు పరిగణలోనికి తీసుకోలేక పోతున్నాడు ?
తాను ఎముకల కోసం, చర్మాల కోసం, అదనపు రుచి కోసం సంహరిస్తున్న జంతువులూ, పక్షులు తన మనుమలకే కాదు వారి మనుమలు కూడా ఆహ్లదాన్ని కలిగిస్తాయన్న నిజాన్ని ఎందుకు 
గుర్తించలేక పోతున్నాడు ?
బుద్ది జీవి కావడం వలననా ? లేక తాను సంపాదించిన హోదా, ఇల్లు, కార్లు,నగలు, డబ్బు వారికి ఇవన్నీ ఇస్తాయన్న అహంకారమా ?
ఖచ్చితంగా రెండోదే అన్న అనుమానం కలుగుతోంది. కానీ అది అసాధ్యం. 
బాష గురించి, కులాల గురించి, మతాల గురించి,  ప్రాంతాల గురించి, హోదాల గురించి, పదవుల కోసం ఇలా అన్నింటి కోసం ఘర్షణలకు దిగే వారు మనందరికి తల్లి అయిన ప్రకృతి పట్ల ఇంతటి నిర్లక్ష్య ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారు ? 
ఇదంతా మా పిల్లల కోసం అనేవారు అవి అందరి పిల్లలకు అత్యంత ఆవశ్యకం అన్న విషయాన్నీ ఎందుకు పరిగణ లోనికి తీసుకోవడం లేదు ? అవి లేని నాడు ఇవన్నీ వృధా అన్న గ్రహింపు ఎందుకు ఉండటం లేదు ?
పిల్లలకు హాని చేసే పదార్ధాలను పెడతామా ! పెట్టము కదా ! అదే సూత్రం పై వాటికి వర్తించదా !
మనం ఎందుకు గుర్తించడం లేదు. 
మన  ముందు తరాల వారు ప్రకృతి పట్ల  తగినంత గౌరవం చూపడం వలన మనం రోజు కొంత వరకు ఇబ్బందులు లేని జీవితాన్ని గడప గలుగుతున్నాము. మనకు వారసత్వంగా లభించిన దానిని మన తరవాత వారికి అందించడం మన భాద్యత కాదా ! మందిరాలు, ఆకాశాన్ని తాకే విగ్రహాలు కాదు ప్రస్తుతం మనకు కావలసినది. స్వచ్ఛమైన వాతావరణం. బాధల నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి. పరిశుద్ధమైన నీరు. హానికర అణువులు లేని గాలి. 
ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయం దాటిపోయింది. ఇప్పుడు బాగు చేయవలసిన సమయం వచ్చేసింది. 
పనికి రాని విభేదాలను పక్కన పెడదాం. జలం మన జీవం, నేల మన కన్నతల్లి, ప్రకృతి మా దేవత, గాలి మా తండ్రి. ఈ ఒక్కటే నినాదం దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగక్కరలేదు. 
కార్యాచరణలో చూపిస్తే చాలు. 
అందరం గుంపులు గుంపులుగా రానక్కరలేదు. ఎవరి పరిధిలో వారు కార్యసాధనకు ఉపక్రమిస్తే చాలు. మనవారికి హాని చేసే (మనకి మనం సృష్టించుకొన్న) వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూతాపం, శబ్ద కాలుష్యం మీద అదే ఒక తిరుగుబాటు. అదే ఒక విప్లవం. అదే ఒక దండయాత్ర. కాలుష్యం పైన ప్రకటిద్దాం కదనం. 
సీసాల నీరు కాదు దోసిళ్ళతో తాగగలిగిన నీరు, మాస్కు లేకుండా ఊపిరితిత్తుల నిండా పీల్చుకో గలిగిన శుభ్రమైన గాలి అందిద్దాము. కంటికి వంటికి మనస్సుకు హానిచేసే టాబ్లు కాదు. నేత్రానందం కలిగించే ప్రకృతి పచ్చదనాన్ని ఇద్దాము. 
సంఘటిత పోరులో గెలుద్దాం ! భావి తరాలకు వారిదైన సుందర స్వచ్ఛ లోకాన్ని అందిద్దాం !
కడుపున పుట్టిన వారికి ఇంతకన్నా పెద్ద ఆస్తి ఏమి ఇవ్వగలం !

విజయం మనదే !!!!
 



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Only One Brahma Temple, Chebrolu

  శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం       లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోక...