అయిదు సన్నిధుల అంజుమూర్తి కోవెల
నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో అధిక శాతం తమిళనాడులోనే ఉన్నాయి. ఆ రాష్ట్రం తరువాత ఎక్కువ దివ్య తిరుపతులు ఉన్నది కేరళ రాష్ట్రంలోనే ! గతంలో ఈ ప్రాంతాన్ని "మలైనాడు" పిలిచేవారు. స్వాతంత్రానంతరం దేశం బాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసినదే!
అయినా ప్రస్తుతం తమిళనాడులోని నాగర్కోయిల్ జిల్లాలో ఉన్నరెండు క్షేత్రాలతో కలిపి మొత్తం పదమూడు పుణ్య క్షేత్రాలను మలై నాడు దివ్యదేశాలుగా నేటికీ పిలుస్తారు. అంటే వీటిల్లో పదకొండు మాత్రమే భౌగోళికంగా దేవతల స్వస్థలంలో ఉన్నాయి.
కేరళ రాష్ట్రం అంటే ప్రత్యేక ఆలయాల ప్రాంతంగా ప్రసిద్ధి. ఈ దివ్యదేశాలు కూడా ఎంతో విశేషంగా ఉంటాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే వీటిల్లో ఆలయాలను పాండవులు స్థాపించినట్లుగా పురాణ గాధలు తెలియజేస్తున్నాయి.కాకపోతే చెంగన్నూర్ పరిసరాలలో ఉన్న అయిదు ఆలయాలైన తిరుచెంగన్నూర్ (ధర్మరాజు), తిరుప్పులియూర్ (భీముడు), ఆరన్మూల(అర్జనుడు), తిరుక్కోడిత్తానం(సహదేవ), తిరువాంవండూరు(నకులుడు)నిర్మించారు. కానీ అంజుమూర్తి కోవెలలో ఉన్న నాలుగు శ్రీ మహా విష్ణు మూర్తులను పంచపాండవులు ఒకేసారి ప్రతిష్ట చేశారని ఆలయ గాధ తెలుపుతోంది. ఈ క్షేత్రంలోని మరో విశేషం ఏమిటంటే నాలుగు శ్రీమన్నారాయణుని ఆలయాల మధ్య కైలాసనాధుడు స్వయంభూ లింగ రూపంలో దర్శనమివ్వడం. ఈ కారణంగా అయిదు సన్నిధులున్న ఆలయంగా " అంజు మూర్తి కోవెల "అని అంటారు.
హరిహరులిద్దరూ ఒకే ప్రాంగణంలో కొలువై దర్శనమిచ్చే మరో దివ్యదేశం మరెక్కడా కనపడదు.
ఆలయ పురాణ గాధ
కేరళ రాష్ట్ర గంగానదిగా పిలవబడే "భరత్ పుళ" తీరంలో ఉన్న ఈ ప్రాంతం ద్వాపర యుగంలో ఒక మునివాటికగా పేరొందినది. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించినా తాత, గురువులు, సోదరులు, పుత్రులతో పాటు మరెందరో బంధువుల మరణాల కారణంగా కలుగుతున్న బాధ నుండి ఉపశమనం పొందడానికి శ్రీ కృష్ణుడు పాండవులను కొంత కాలం తీర్ధయాత్రలు చేయమన్నారట. తమ భాంధవుడు అయిన మాధవుని సలహా మేరకు అనేక క్షేత్రాలను సందర్శించిన పాండు నందనులు ఇక్కడికి చేరుకొన్నారట.
సతీ సమేతంగా పవిత్ర జలాలలో స్నానమాచరించి అక్కడ మహర్షుల పూజలు అందుకొంటున్న వైకుంఠుని నాలుగు రూపాలను, కైలాసవాసుని సేవించుకొన్నారట. అనంతరం మహర్షుల ఆశీర్వాదం తీసుకొన్న వారు మునులను క్షేత్ర విశేషాల గురించి అడిగారట.
సత్యయుగంలో ఈ ప్రాంతాన్నిఅంబరీష చక్రవర్తి పాలించేవారట. ఆయన ధర్మ పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారట. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకొనే చక్రవర్తికి వారసులు లేరన్న చింత వేధించేదట.
చివరికి పండితుల సలహాను అనుసరించి పవిత్ర భరత్ పుళ నదీ తీరంలో పుత్రకామేష్టీ యజ్ఞం చేసి ఒక కుమార్తెను, ముగ్గురు కుమారులను పొందారట. వార్ధక్యం సమీపించిన తరువాత రాజ్య భారం పుత్రులకు అప్పగించి తాను తిరిగి ఇక్కడికి చేరుకొని శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం కొరకు తపమాచరించారట.
సంతుస్థుడైన గరుడ వాహనుడు దర్శనమిచ్చారట. స్తోత్రపాఠాలతో స్తుతించిన అంబరీషుడు స్వామిని ఆయన వ్యూహా రూపాలలో దర్శనమివ్వమని అర్ధించాడట. భక్తుని మనోభీష్టం నెరవేర్చిన నారాయణుడు అవే రూపాలలో కొలువు తీరారట. నాటి నుండి ఋషి పుంగవులు ఆ మూర్తులకు పూజాదులు నిర్వర్తిస్తున్నారట.
క్షేత్ర పురాణ గాధ విని ఆనందించిన పాండవులు ఆ మూర్తులను సేవించుకొని, ఆలయాలను నిర్మించారట.
కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి
అనంతర కాలంలో
ఈ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణోత్తముడు ఒకరు కాశీ యాత్ర సంకల్పించుకొన్నారట. తల్లితండ్రుల అనుమతి తీసుకొని బయలుదేరారట. వారణాసి చేరుకొని కొన్ని సంవత్సరాల పాటు శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వార్ల సేవలో గడిపారట. ఒకనాటి రాత్రి సర్వేశ్వరుడు ఆయనకు స్వప్నములో కనపడి స్వగ్రామం వృద్ధులైన మాతాపితరలను సేవించుకోమని ఆఙ్ఞాపించారట.
స్వామి వారి ప్రకారం తిరుగు ప్రయాణమైన బ్రాహ్మణుడు ఒకనాటి సంధ్యా సమయానికి ఇక్కడికి చేరుకొన్నారట. తన తాటిఆకుల ఛత్రాన్ని, సామానులను ఉంచి స్నానమాచరించి, సంధ్యా వందనం చేసుకొన్నారట. తిరిగి ప్రయాణం ప్రారంభిస్తూ గొడుగును తీసుకోడానికి ప్రయత్నించగా అది రాకపోగా శివలింగముగా మారిపోయినదట.విశ్వేశ్వరుడు తనతో పాటు ఇక్కడిదాకా వచ్చారు సత్యం అర్థమైనది విప్రునకు. పట్ల ఆయనకు అవాజ్య అనురాగానికి పోయిన అతను, తల్లితండ్రులతో పాటు జీవితాంతం గడిపారట. అలా కాశీ నుండి విచ్చేసిన స్వామి కాశీ విశ్వేశ్వరుడు అని పిలవసాగారు.
అలా నాలుగు రూపాల శ్రీమన్నారాయణునితో పాటు శ్రీ మహేశ్వరుడు కూడా కొలువైన క్షేత్రమిది.
ఆలయ విశేషాలు
నది ఒడ్డున ఉన్న ఈ \పురాతన క్షేత్రంలోని అయిదు ప్రధాన అర్చనామూర్తులతో పాటు పరివార దేవతల సన్నిధుల నిర్మాణం కూడా ప్రత్యేకంగా కనపడుతుంది. ప్రధాన ఆలయం తప్ప మిగిలిన వాటిని పునఃనిర్మించారు .
ఎటువంటి విరాట్ నిర్మాణాలు లేకుండా సాధారణ కేరళ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయానికి పడమర చిన్న ప్రవేశ ద్వారం ఉంటుంది. దక్షిణ దిశగా ఒక ద్వారం ఉంటుంది. ఇక్కడే దీప స్థంభం మరియు బలి పీఠం ఉంటాయి.
పడమర ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశించగానే కనపడేది మాద్రి తనయులైన సహదేవులు అర్చించిన "అనిరుద్ధుని" సన్నిధి. పక్కనే పాండవాగ్రజుడు ధర్మరాజు పూజించిన "ప్రద్యుమ్న" సన్నిధి ఉంటుంది. ఈ రెండు ఆలయాలకు ప్రధాన ఆలయానికి మధ్యన క్షేత్ర రక్షకుడైన శ్రీ ధర్మశాస్త ఉపాలయం ఏర్పాటు చేయబడినది. ఈ మూడూ కూడా పాత వాటి స్థానంలో నిర్మించబడిన నూతన నిర్మాణాలే !
ప్రధాన ఆలయానికి తూర్పు వైపున భీమసేనుడు కొలిచిన " సంఘర్షుణి" సన్నిధి కలదు. కూడా నూతన నిర్మాణమే!
ఈ నాలుగు ఆలయాలను సందర్శించుకొని పురాతన ఆలయం లోనికి ప్రవేశిస్తే ముఖమండపం దాటగానే ఉన్న నలుచదరపు గర్భాలయంలో చందన కుంకుమ పుష్పాలంకరణలో దివ్యంగా దర్శనమిస్తారు శ్రీ విశ్వేశ్వర స్వామి. ముఖమండపానికి గర్భాలయానికి మధ్యన శిలాద ముని తనయుడైన నందీశ్వరుడు ప్రభువు ఆజ్ఞకై నిరీక్షిస్తున్నట్లుగా ఉపస్థితుడై ఉంటాడు.
గర్భాలయ వెలుపలి గోడల పైన దశావతార, కంస వధ, పూతన సంహారం శ్రీ కృష్ణ లీలావిన్యాసాలను తెలిపే వర్ణ చిత్రాలు కనపడతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించబడిన ఆ చిత్రాలు నేటికీ చెక్కు చెదరక పోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి.
ఈ గర్భాలయం వెనక పక్క ఉన్న చిన్న ద్వారం గుండా వెళితే వర్తులాకార గర్భాలయంలో స్థానిక భంగిమలో చతుర్భుజాలలో శంఖు, చక్ర, గద మరియు పద్మధారిగా రమణీయ పుష్పాలంకరణలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ ఉయ్యవింద పెరుమాళ్ (పర వాసుదేవుడు)దర్శనమిస్తారు.
పూజలు - ఉత్సవాలు
ఉదయం అయిదు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండే ఈ ఆలయంలో నిత్యం నియమంగా నాలుగు పూజలు జరుపుతారు. ఎన్నో అభిషేకాలు, అలంకరణలు,అర్చనలు మరియు ఆరగింపులు చేస్తారు.
కార్తీక, ధనుర్మాసాలలో, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి,శ్రీ రామ నవమి పర్వదినాలతో సహా స్థానిక పర్వదినాలైన ఓనం, విషు రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. చైత్ర మాసంలో పది రోజుల పాటు జరిగే ఆలయ ప్రతిష్టా దినోత్సవ ఉత్సవాల సందర్బంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. అమావాస్య,పౌర్ణమి దినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
భరత్ పుళ నదిలో స్నానం చేసి అయిదు ఆలయాలలో నేతి దీపాలను వెలిగిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నది స్థానిక నమ్మకం.
శత్రు, అపమృత్యు భయం తొలగిపోవడానికి, అనారోగ్య సమస్యలు సమసిపోవడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఒకరైన శ్రీ కుల శేఖర ఆళ్వార్ శ్రీ ఉయ్యవింద పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. ఈ కారణంగా అంజుమూర్తి కోవెల నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా శాశ్విత కీర్తిని సొంతం చేసుకొన్నది.
అంజుమూర్తి కోవెల ఉన్న "తిరువిత్తక్కోడ్" గ్రామం భౌగోళికంగా పాలక్కాడ్ జిల్లాలో ఉన్నా ప్రముఖ కృష్ణ క్షేత్రమైన గురువాయూర్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేరుగా చేరుకోడానికి తగిన బస్సు సౌకర్యం ఉన్నది. తగిన వసతి సౌకర్యాలు గురువాయూర్ లో లభిస్తాయి.
బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం. నలుదిక్కులా పచ్చని పొలాలు, మరో పక్క గలగలా ప్రవహించే భరత్ పుళ నది తో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సౌరభాలతో పాటు ఆహ్లాదకర పరిమళాలను వెదజల్లుతుంటుంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి